సాహిత్యము సౌహిత్యము – 6 : సీసపద్యం – 2

శ్రీశారదా దయా దీప్తిః :—

క్రితం వారం ఒక సీసపద్యం ద్వారా కొన్ని మనోరంజకమైన విషయాలు తెలుసుకున్నాం. వినోదమూ, వివేకమూ, విద్య పెంపొందింప చేయడమే ఈ సాహిత్యక్రీడయొక్క ముఖ్య ధ్యేయం.

ఈవారం ఇంకొక సీసపద్యం పరిశీలిద్దాం:

రాముడెవ్వరిగూడిరావణుమర్దించె?
పరవాసుదేవుని పట్ణమేది?
రాజమన్నారుచేరంజిల్లుశరమేది?
వెలయ నాలుగువంటివిత్తదేది?
సీతనుచేకొన చెరచినధనువేది?
సభవారినవ్వించు జాణయెవడు?
అల రంభ తురుములో అలరు మాలిక యేది?
శ్రీకృష్ణుడేయింట చెలగు చుండె?

అన్నిటికి చూడ ఐదేసి అక్షరములు
ఒనర ఇరుదెస ౘదివిన ఒక్కతీరె;
చెప్పకలిగినవారిల గొప్పవారు
చెప్పలేనివారలు కారు చిన్నవారు“.

ఈ పద్యంలోకూడా ముందుపద్యంలో ఉన్నట్లే 4×2=8 ప్రశ్నలు ఉన్నాయి. ఐతే ఈసారి క్రీడ అంత్యాక్షరి కాదు. ఇది అనులోమవిలోమపదక్రీడ. దీనిని “మురజబంధం” అనికూడా అంటారు. ఈ క్రీడలోని మాటలన్నీ ముందునుంచి చదివినా/పలికినా వెనుకనుంచైనా ఒకేవిధంగా ఉండాలి/ఉంటాయి. ఆంగ్లభాషలో ఈ ప్రక్రియని “PALINDROME” అంటారు. ఉదాహరణకి “MADAM” అటు-ఇటు రెండువైపులనుంచి ఒకలాగే పలుకు తుంది. అలాగే “RADAR” అనే మాట కూడా!

ఇప్పుడు మనం అలాంటి మాటలతో ఈ 8 ప్రశ్నలకి జవాబు చెప్పాలి.

1.రాముడు ఎవరి సహాయంతో రావణుడిని జయించాడు? దానికి సమాధానంగా అనులోమ విలోమపదం ఆలోచించి చెప్పాలి: అది ఐదు అక్షరాలకి పరిమితమై ఉండాలి. ఈ షరతులకిలోబడి సమాధానం చెప్పాలంటే అది ఇలా ఉంటుంది. “తోకమూకతో” అని జవాబు చెప్పాలి.
2. శ్రీరంగనాథుడి పట్టణం పేరేది? జవాబు: రంగనగరం.
3. ఆ రాజాధిరాజు(రంగనాథుడు-శ్రీహరి) చేతిలో ప్రకాశించే బాణమేది?”లకోరికోల” అంటే తీవ్రమైన బాణం.
4. నాలుగులాగ ఉన్న(తెలుగుభాషలోఉన్న నాలుగు అంకెలాగ) విత్తనమేది?జవాబు: జంబీరబీజం(నిమ్మవిత్తనం)
5. సీతాదేవి స్వయంవరంలో రాముడు విరిచిన విల్లేది?జవాబు: పంచాస్యచాపం(శివధనువు)
6. సభలో అందరినీ నవ్వించేవాడెవడు? జవాబు: వికటకవి.
7. స్వర్గంలో ఉన్న రంభ కొప్పులోఉండే పూదండ ఏది? జవాబు: మందారదామం.
8. శ్రీకృష్ణుడు (బాల్యంలో) ఎవరి యింట్లో ఆడుకున్నాడు? జవాబు: నందసదనం.

ఇది ఇంత చక్కగా పరిష్కరించబడింది. వచ్చేవారం మరొకటి చూద్దాం.

స్వస్తి||

You may also like...

1 Response

  1. G. Suryanarayana says:

    మీ సంకలన పటిమకు వందలాది వందనాలు.
    అనూహ్య ప్రతిభావంతులకు సహస్ర కోట్లాది నమస్కారములు.

    G. Suryanarayana
    (Retd., Engineer, L.I.C. of India).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *