సాహిత్యము సౌహిత్యము – 12 : గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ
29—07—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము.
ఈ రోజు కొప్పరపు సోదరకవులకి ఒక అవధానంలో ఇవ్వబడిన ఒక జటిలసమస్యని మహాప్రతిభావంతులైన ఆ సోదరకవులు ఎంతబాగా పూరించేరో గ్రహించి ఆనందిద్దాం!
సమస్య కందపద్యపాదం. కందం చిన్నపద్యాలకోవకి చెందినదని మనకి తెలుసు. ఇంతకీ సమస్య యిది:—
“గరుడుడు గణపతికి తండ్రి కావలె సుమ్మీ“!
అర్థం తేటతెల్లంగానేవుంది. గరుత్మంతుడు గణపతికి తండ్రి కదా! అని ఈ సమస్యభావం.
ఏ పురాణ కథలలోను ఇటువంటి వృత్తాంతం ఏమాత్రమూలేదు. మరి ఈ అసంబద్ధమైన సమస్యని ఎలాగ సమన్వయించాలి? సమస్యలో యివ్వబడిన మాటలని అవధానులు తమపూరణలోని
“హరుడు గణపతికి పోలెన్
సరసీజాక్షుండు నాభిజన్మునకు వలెన్
గురుకీర్తి కన్న ఆ సా
గరు డుడుగణ పతికి తండ్రి కావలె సుమ్మీ“!
గణపతికి హరుడు(శివుడు)లాగ,
బ్రహ్మ(నాభిజన్ముడు)కి విష్ణువు (సరసీజాక్షుండు)లాగ,
ప్రసిద్ధి(గురుకీర్తి)పొందిన సముద్రుడు (సాగరుడు) నక్షత్రాధిపతి(ఉడుగణపతి అంటే ఉడు=నక్షత్ర, గణ=సమూహం, నక్షత్రాలసమూహానికి పతి=రాజు, అంటే మొత్తంమీద “చంద్రుడు” అని అర్థం. చంద్రుడు లక్ష్మీదేవితోబాటు పాలకడలిలోనించి పుట్టేడుకదా! ) తండ్రి ఔతాడు. అని ఆ విధంగా సమస్యని అర్థవంతంగా పూరించేరు.
స్వస్తి|| (సశేషం).
What a wonderful solution to the seemingly impossible statement ! I bow with respect to the Kavi.