సాహిత్యము సౌహిత్యము – 7: సీసపద్యం – 3 – పనసపండుమాటల ఆట
24-06-2017, శనివారం.
ఈ వారాంత సాహిత్యక్రీడ సీసపద్యంలోనే మరొక విధమైన వినోదమూ, విజ్ఞానమూ కలిగించే ౘక్కని ఆట. ముందుగా పద్యం తెలుసుకుందాం!
“ఆద్యంత మధ్యమాంతాదివర్ణంబుల
తేటి, రక్కసిరాజు, తెలియ తల్లి;
ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల
శివునిల్లు, వరిచేను, క్షీరధార;
ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల
భార్యయు, ఖడ్గంబు, పాదపంబు
ఆద్యంతమధ్యమాంతాదివర్ణంబుల
మార్వన్నె, యీటె, ధూమంబుతనరుఅన్నిటికిచూడ మూడేసి అక్షరములు,
మొదలుతుదలును,నడితుది, మొదలు నడుము,
ప్రాణరక్షను, లతలను, పాదపముల పరికరములందు యీపదాలమరవలయు“.
చివరి గీతపద్యంలోను, సీసంలోని 1,3,5,&7వ పాదాలలోను ఈ ఆటకి సంబంధించిన విధి-విధానాలు వివరించారు. అవన్నీ ౘక్కగా తెలుసుకుందాం!
1. ప్రతి ఒక ప్రశ్నకి ఒక్కొక్క జవాబుఉంటుంది.
2. ప్రతి జవాబు మూడు అక్షరాలతో ఉంటుంది.
3. ఈ విధంగా మొత్తం నాలుగు జవాబులుంటాయి.
4. ప్రతి మూడక్షరాల జవాబులోంచి రెండేసి అక్షరాల మూడు జవాబులుంటాయి. ఒకమాటలోని అక్షరాలతో మరికొన్ని మాటలు పుట్టించే ఆటని ఆంగ్లంలో Kangroo-word-play అంటారు. మనం దానిని “సంతాన పద క్రీడ” లేక, “పనసపండుమాటల ఆట” అని పిలవ వచ్చు.
ఇప్పుడు పద్యంలో యిచ్చిన సమస్యలను చూద్దాం!
మధ్యమ-అంత(మధ్యమాట-చివరిమాట)అక్షరాలు కలిపితే రాక్షసరాజు పేరు. మొదటి-రెండవ మాటల కలయికతో అమ్మ పేరు వస్తుంది.ఇంతటితో కథ పూర్తికాలేదు. గీతపద్యంలో మరికొన్ని వివరాలున్నాయి. ఈ నాలుగు ప్రధానపదాలు
1. ప్రాణరక్షణ కలిగించేది(గాలి, నీరు,ఆహారం వంటిది.).
2. లత ఐనది;
3. పరికరము అంటే ఇక్కడ సంబారం అంటే రుచులను కలిగించే ఇంగువ/జీలకర్ర/ఆవాలు వంటివి. మన సందర్భానికి సరపడే ద్రవ్యం: “ఆవాలు”.
4. పాదపం=చెట్టు. ఇప్పుడు జవాబు లన్నీ చక్కగా రాబట్టవచ్చు:1. అంబలి: 1.అలి=తుమ్మెద(తేటి)2.బలి(రాక్షసరాజు) 3.అంబ(అమ్మ)
2.గుమ్మడి: 1.గుడి(శివునిల్లు) 2.మడి 3.గుమ్మ(పాలధార)
3.ఆవాలు: 1.ఆలు(భార్య) 2.వాలు (ఖడ్గం). 3. ఆవ.
4. పొగడ: 1.పొడ(మారువన్నె-రంగు) 2.గడ(యీటె) 3.పొగ(ధూమం).ఈ వివరాలన్నీ సరిగ్గా సరిపోతాయి. మళ్ళీ వారం మరొక పద్యోపాయనం మీ ముందుకి వస్తుంది.
స్వస్తి||