సంగీతం—నాదవేదం—75

04—12—2021; శనివారం

“దక్షిణభారత సభాసంగీత రసజ్ఞతకి పరిచయం~కొన్ని ముఖ్య విషయాలు. — Introduction to Appreciation of South Indian Concert-Music~A few Important Aspects.”

దక్షిణభారత ప్రౌఢ (శాస్త్రీయ) సంగీతం పుష్కలమైన వివిధప్రక్రియావైవిధ్య వైభవంతో కూడిన గేయ నిధితో, లేక ౘాలారకాలైన పాటల పూల గుబాళింపుల రంగురంగుల రమ్యమైన రంగవల్లికలతో సుసంపన్నం అయి ఉంది. మన ఈ సంగీతమే కర్ణాటక సంగీత పద్ధతి అనే పేరుతో సంగీతలోకంలో సుప్రసిద్ధమై ఉంది. కర్ణాటక సంగీతంలో (I) అభ్యాస సంగీతం (Learners’ Music); మరియు, (II) సభా సంగీతం లేక కచేరీ సంగీతం (Concert Music) అనే రెండు విభాగాలు ఉన్నాయి

(I) అభ్యాస సంగీతం:—శాస్త్రీయ సంగీతం నేర్పడానికి, నేర్చుకోవడానికి వినియోగపడే వివిధ సంగీతప్రక్రిలు ఈ అభ్యాస సంగీత శాఖలోకి చేరిన సంగీతాంశాలు. సరళీస్వరాలు, జంటస్వరాలు, దాటుస్వరాలు, పై(హెచ్చు) స్థాయి స్వరాలు, మధ్యస్థాయి స్వరాలు, క్రింది(దిగువ)స్థాయి స్వరాలు, (సప్తతాళ)అలంకారాలు — కేవలం స్వరసంపుటీకరణలతో కూడుకొని, సంగీతాభ్యాసానికి మాత్రమే పరిమితమైన సంగీత ప్రక్రియలు ఈ అభ్యాస సంగీత విభాగంలో ముఖ్యభూమికని కలిగి ఉంటాయి. వీటి తరువాత గీతాలు, జతిస్వరాలు, స్వరజతులు, వర్ణాలు స్వర-సాహిత్య సంమేళనంతో విలసిల్లుతూ ఉంటాయి.

(II) సభాసంగీతం:—సభాసంగీతంలో స్వరజతులు, వర్ణాలు, కృతులు, కీర్తనలు, రాగం-తానం-పల్లవి గానం, రాగమాలికలు, రాగ-తాళమాలికలు, పదాలు, జావళీలు, దరువులు, తిల్లానాలు, అష్టపదులు, తరంగాలు, భజనలు మొదలైన అనేకానేక ప్రక్రియారూపాలు ఉన్నాయి.

స్వరజతులు, వర్ణాలు అభ్యాససంగీతంలోను, సభాసంగీతంలోను రెండింటిలోను వినియోగంలో ఉండడంవలన ఇవి అటు అభ్యాససంగీతానికి, ఇటు సభాసంగీతానికి వారధి వంటివి.

1) స్వరజతులు:—ఇవి స్వర-సాహిత్యాలుతో కూడుకొని రాగప్రధానంగా ఉంటాయి. జతులు తాళప్రధానమైన ప్రక్రియాపరంగా ఉంటాయి. అందువలన ఇవి సంగీతసభలలోనేకాక, నృత్యసభలలోకూడా ప్రయోగించబడతాయి. శ్యామాశాస్త్రివర్యుల తోడి, భైరవి, యదుకులకాంభోజి స్వరజతులు అన్నీ 8-10 చరణాలలో రాగభావపరిపుష్టితో, తాళగతుల గమనస్ఫూర్తితో, సాహిత్యభావవైభవదీప్తితో సమగ్రసంగీతకాంతిని వెదజల్లుతూంటాయి.

2) వర్ణాలు:—వర్ణం అంటే రంగు అనీ, వర్ణన అనీ అర్థం చెప్పవచ్చు. ఆయా రాగాలలోని సంగీత సంప్రదాయసిద్ధమైన వైయక్తిక వైలక్షణ్యాలని ప్రకాశవంతం చేస్తూ, వాటిలోని రాగస్వరూప నిర్వచనాత్మక స్వరసంపుటులు, ప్రత్యేకస్వరసమూహ ప్రయోగాలు (Usage of Specific Raga-delineating Musical Phrases), రాగభావం, రసం, శ్రవ్యసౌందర్యం వంటి రాగాంతర్గత జీవలక్షణాలు అన్ని రంగులలోను లేక “సర్వవర్ణాలలోను” సవిపులంగాను, పరిపుష్టంగాను వర్ణాలలో నిక్షిప్తంచేయబడి ఉంటాయి. ఏ రాగవర్ణమైనా ఆ రాగ సంపూర్ణ ప్రాసాద నిర్మాణ దక్షతకి అవసరమైన మౌలిక ద్రవ్య సముదాయాన్ని మంచి పకడ్బందీగా దాని సర్వాంగీన ప్రణాళిక (The Fully-detailed Musical Blue Print of the Raga)రూపంలో తనలో భద్రపరచుకుని, సంగీతకళాకారుని సృజనాత్మక శక్తికి కావలసిన మూల ఇంధనాన్ని ౘక్కగా సమకూరుస్తుంది. అందువలన, ఒక రాగంయొక్క వర్ణం, ఆ రాగంయొక్క సంపూర్ణ స్వరప్రయోగ స్వరూప వివరణాత్మక ప్రణాళికా నిర్మితిని, రసాత్మక వైపుల్యాన్ని సమగ్రంగాను, సముజ్జ్వలంగాను సంగీతోపాసకుల హృదయాలలో ఆవిష్కరింపజేస్తుంది. రాగ ఆలాపనకి, స్వరప్రస్తారానికి కావలసిన అన్ని ఆదర్శప్రాయమైన సంగీతసంబంధమైన నమూనాలన్నీ (Matrices of Complete Melodic Patterns) వర్ణాలలోనే లభ్యమౌతాయి. అందుకనే సంగీతకళాకారులందరూ వర్ణాలని అంత అనన్యమైన అంకితభావంతో అర్చిస్తూ ఆరాధిస్తారు.

వర్ణం మొదటి విభాగమైన పూర్వాంగం, రెండవ విభాగమైన ఉత్తరాంగం కలిగి ఉంటుంది. వర్ణం యొక్క పూర్వాంగం పల్లవి, అనుపల్లవి, చిట్టస్వరం లేక ముక్తాయిస్వరం కలిగి ఉంటుంది. ఉత్తరాంగంలో చరణం (ఎత్తుగడ పల్లవి), చరణస్వరాలు (ఎత్తుగడ స్వరాలు) ఉంటాయి. మిగిలిన వివరాలు పెద్దల సన్నిధిలో తెలుసుకోవాలి.

తానవర్ణాలు, పదవర్ణాలు, దరువర్ణాలు, రాగమాలికావర్ణాలు, గ్రహభేదవర్ణాలు అని వివిధరకాలుగా వర్ణాలు ఉన్నాయి.

తానవర్ణంలో స్వరప్రయోగాలు మధ్యమకాలవిన్యాసంలో తానపద్ధతిలో ౘక్కని పొంకంతో నిండిన నడకతో ఉత్తేజవంతంగా ఉంటాయి. పదవర్ణాలు నాట్య అభినయ ప్రదర్శనకి అనువుగా ఉంటాయి. ఇవి చౌకకాలంలో, అంటే, విలంబితకాలంలో ఉంటాయి. దరువర్ణాలు శీఘ్రగతితో, ఉత్సాహ భరితంగా జతులతో కూడుకొని ఉంటాయి. రాగమాలికా వర్ణం పై మూడు రకాల వర్ణాలవలె కాకుండా కొన్ని రాగాలకి సంబంధించిన స్వరాల కూర్పుతో విలసిల్లుతూ ఉంటాయి. గ్రహభేదమనే క్లిష్ట సంగీత సాంకేతిక ప్రక్రియని అనుసరించి, ఒకరాగంనుండి మరొక అనువైన స్వరసంపుటిగల రాగంలోకి అలవోకగా మార్పుచెందగలిగిన స్వరసంపుటులలో కూర్చబడిన వర్ణాలు, సంగీత శాస్త్ర పరిభాషలో గ్రహభేదవర్ణాలుగా వర్గీకరించబడ్డాయి.

3) కృతులు:—”కృతి” సభాసంగీతానికి హృదయస్థానీయమైనది. “యత్ కృతం తత్ కృతిః” అని సంగీతశాస్త్ర నిర్వచనం. ఏది తాళబద్ధ సంగీత స్వర నిర్మితి (అంటే “ధాతువు” లేక ధాతుకల్పన), భావ పరిపుష్టమైన సరళ సాహిత్య రచన (అంటే “మాతువు” లేక మాతునిర్మితి) కలిగి ఉంటుందో అది కృతి అని ప్రసిద్ధికెక్కింది. సంగీతం మహారాజచక్రవర్తిగాను, సాహిత్యం మహారాణిగాను రాజ్యమేలే మహావ్యవస్థకి ప్రతీకయే “కృతి”. అనేకానేక వాగ్గేయకారుల అపురూపమైన “ధాతు~మాతు కల్పనా దక్షత” నుండి జనించిన సంగీత సృజనాత్మక మహనీయ ప్రక్రియే కృతిగా సంగీతలోకంలో విరాజిల్లుతోంది. కృతి పల్లవి, అనుపల్లవి, కనీసం ఒకచరణం కలిగి, పొంకమైన సరళభాషలో విలసిల్లుతూంది. కృతి సభాసంగీతాన్ని బహుముఖీనంగా ఇనుమడింపజేస్తుంది. సభాసంగీతంలో కృతిస్థానం, సౌరకుటుంబుంలో సూర్యుడి స్థితితో పోల్చతగినది. రాగసౌందర్యమహిమని రసనిర్భరసామర్ధ్యంతో విస్తృతపరిధిలో వికసింపచేయగలిగిన అమేయశక్తి అద్వితీయకృతినిర్మాణకౌశలంలోనే ఉంటుంది. సంగతులు, గమకాలు, మధ్యమకాలసాహిత్యం, చిట్టస్వరాలు, స్వరసాహిత్య సంవిధాన రచన, స్వరాక్షరప్రయోగాలు మొదలైన అనేక సంగీత అలంకరణలు కృతినిర్మాణంలో తగిన స్థానం పొంది రసజ్ఞశేఖరుల హృదయాలని దోచుకుంటాయి. విలంబకాలకృతులు, మధ్యమకాలకృతులు, ద్రుతకాలకృతులు ఉంటాయి. సర్వసాధారణంగా సంగీతసభలలో రసజ్ఞులని రంజింపజేసే వివిధరాగాలలో కూర్చబడిన కృతులు ఉంటాయి. సభాసంగీతంలో ప్రధానరాగంలో నిర్వహించబడే ముఖ్యమైన కృతి ఒకటి ఉంటుంది. సభాసంగీతంలోని మిగిలిన పాటలన్నీ ప్రధానకృతి అంతటి ప్రాముఖ్యతని కలిగి ఉండవు. ప్రధానకృతియొక్క రాగంలో కళాకారులు విస్తృతమైన ఆలాపాన చేసి, కృతిని సంపూర్ణమనోధర్మరసభరితంగా శ్రోతలకి అందించి సంగీతసభకి వన్నెలు చేకూర్చడం జరుగుతుంది. కృతి సంగీతశాస్త్రానికి లక్షణ-లక్ష్య సమన్వితంగా ఉంటుంది. కృతిలో సాహిత్యభావగంగ, సంగీతరసయమున, సంగీతకళాపారంపర్యసిద్ధ సంప్రదాయ బద్ధ అంతర్వాహినీస్వరూప సరస్వతుల రూపంలో పుణ్యమయసంగమం చెంది సభాసంగీతానికి అసలైన ఆయువుపట్టుగా ఉంటుంది. దైవ భక్తిరసప్రాధాన్యత కృతిసాహిత్యంలో విరివిగా చోటుచేసుకుని ఉంటుంది. త్యాగరాజ, శ్యామాశాస్త్రి, ముద్దు(త్తు)స్వామి దీక్షితులు మొదలైన మహావాగ్గేయకారుల కృతులలో అజరామరమైన కృతినిర్మాణవైభవదీప్తిపుంజాలు అలౌకికమైన ధాగధగ్యంతో విరాజిల్లుతూ ఉంటాయి.

4) కీర్తనలు/సంకీర్తనలు:—వైదికసాహిత్యసంస్కృతినుండి ప్రత్యక్షంగా ఆవిర్భవించిన సంగీతకళాస్వరూపమే “కీర్తన లేక సంకీర్తన” అని చెప్పవచ్చు. ఋగ్వేదాంతర్గత శ్రీసూక్త, పురుషసూక్త, భూసూక్త, నీలాసూక్త, రాత్రిసూక్త, నక్షత్రసూక్త, మేధాసూక్త, నారాయణసూక్త, సూర్యసూక్త, ఉషస్సూక్తాదులలోని వైదిక దైవతాల స్తుతులనుండి ఈ (సం)కీర్తన సాహిత్యం రూపుదిద్దుకుందని ఊహించవచ్చు. కీర్తనలు స్తుతిప్రధానమైనవి కనుక సభా సంగీతవిభాగంలో ద్వితీయప్రాధాన్యతని కలిగి ఉంటాయి. చారిత్రకదృష్టితో గమనిస్తే, కీర్తన కృతికి అక్కగారు వంటిది. ఇష్టదైవం లేక ఉపాస్యదైవం లేక క్షేత్రదైవం యొక్క నామ-రూప-గుణ-లీలా వైభవాదుల కమనీయవర్ణన కీర్తనల ఇతివృత్తమై ఉటుంది. భక్తుడు తన అలౌకిక ఆనందానుభూతిని, ఉత్తమశ్రేణి పదప్రయోగ వైదగ్ధ్యంతో, ఉదాత్తశైలిలో, ద్రాక్షాపాకంలో తన కీర్తనలద్వారా రసజ్ఞులతో పంచుకోవడం కీర్తనల ప్రధాన లక్షణమై ఉంటుంది. కీర్తనలలో కూడా నిర్మాణపరంగా పల్లవి, అనుపల్లవి, అనేకచరణాలు అనే విభాగాలు ఉంటాయి. త్యాగయ్యగారి ఉత్సవసంప్రదాయ కీర్తనలు, అన్నమయ్యగారి సంకీర్తనలు, భద్రాద్రి రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనులు, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి అధ్యాత్మరామాయణ కీర్తనలు మొదలైనవి సంకీర్తనాసాహిత్య సరస్వతీదేవికి నిలువెత్తు నిత్యనీరాజనాలు సమర్పిస్తూంటాయి.

5) రాగం-తానం-పల్లవి:—విశుద్ధసంగీత తత్త్వ విశ్వరూపసందర్శనయోగానికి పెట్టిపుట్టిన సంగీతరసజ్ఞశేఖరుల వినిర్మల రసమయతపఃఫలంగా దక్షిణభారతసభాసంగీతంలో “రాగం-తానం-పల్లవి” ఆవిర్భవించింది అని చెప్పవచ్చు! ఈ రాగం-తానం-పల్లవి ప్రక్రియలో విపుల పుష్కల రాగాలాపన, రమణీయ తానప్రక్రియా పరిణతాత్మక ప్రయోగ కౌశలం, సంగతుల ప్రయోగ పౌష్కల్యం, పుష్టిపూర్ణమైన నెరవల్ ప్రయోగాలు, మొదలైన సంపూర్ణ మనోధర్మ సంగీత పరిపూర్ణమైన పల్లవి గానం సత్సంప్రదాయ సిద్ధంగా, శాస్త్రీయపరంపరాబద్ధంగా, సంపూర్ణరసమయప్రధానభావంతో తొణికిసలాడుతూ ఉంటాయి.

6) రాగమాలిక:—సభారంజకత్వంలో రాగమాలికకిగల రమణీయ రక్తిభావం అనన్యసామాన్యమైనది. సంగీత సభలోని సరసహృదయులని మెప్పించడంలో దానికి అదే సాటి. అనేకరాగాలలో ఈ రాగమాలికయొక్క “ధాతు-మాతు” రచన చేయబడుతుంది. ఈ రాగమాలికలు తాళమాలికలుగా కూడా ఉండవచ్చు. సభాసంగీతచారిమని ఇనుమడింపజేసిన రాగ-తాళ మాలికా కర్తలు అనేకులు ఉన్నారు. వారందరిలో 72~మేళకర్తరాగమాలిక రచించిన కారణజన్ములు, వరపుత్రులు అయిన మహావైద్యనాథ అయ్యరు గారి అజరామరయశస్సు చరిత్రప్రసిద్ధమైనది.

7) పదాలు:—సభాసంగీతప్రపంచంలో క్షేత్రయ్యగారి పదాలు, సారంగపాణి పదాలు, ఘనం శీనయ్య పదాలు, శహాజీ మహారాజు పదాలు మొదలైనవి సుప్రసిద్ధమైనవి. శృంగారరసప్రధానంగా ఉండే పదాలు నాట్యవేదికపై అభినయప్రాధాన్యతని కలిగినవి. నిర్మాణపరంగా పదాలలో కూడా పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉంటాయి.

8) జావళీలు:—జావళీలుకూడా శృంగారరసప్రధానమై, నాట్యవేదికలపై అభినయవిశేషరంజకత్వతతో సభ్యుల మన్ననలు పొందుతూంటాయి. నాయక-నాయకీ శృంగారవర్ణన బాహ్యంగా కనిపించినా, అంతర్లీనంగా దేవుడికి, జీవుడికి ఉండే రమ్యరక్తిభావాలు జావళిలో స్ఫురణమాత్రంగా సూచించబడుతూంటాయి. పల్లవి, అనుపల్లవి, చరణాల నిర్మితి జావళీలలో కూడా ఉంటుంది. ధర్మపురి సుబ్బరాయరు, పట్టాభిరామయ్యరు, తంజావూరు చిన్నయ్య మొదలైన మహామహులు సుప్రసిద్ధ జావళీలు రచించేరు.

9) తిల్లానాలు:—తిల్లానాలు కూడా నాట్యవేదికలపైన, సంగీతసభలలోను ఇంచు-మించు సమప్రాధాన్యత కలిగిన ప్రక్రియాభేదాలు. సాధారణంగా పల్లవి, అనుపల్లవి, చరణంతో ఇవి ఉంటాయి. ఇవికూడా ఒక్కొక్క సందర్భంలో రాగమాలికలలోను, తాళమాలికలలోను ఉండవచ్చు. మధ్యమకాలంలోను, ద్రుతకాలం లోను ఉంటూ అందమైన గతులలో ఉంటాయి. స్వరసంపుటులు, జతిసంపుటులు ఉంటూ, తగుమాత్రంగా సాహిత్యం ఉంటూ తిల్లానాలు సభలని రక్తి కట్టిస్తూంటాయి. రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్, పట్నం సుబ్రమణియ అయ్యర్, కుండ్రక్కుడి కృష్ణయ్యరు, బాలమురళీకృష్ణ, లాల్గుడి జయరామన్ మొదలైన మహామహులు పరిణతి పొందిన తిల్లానా కర్తలలో అగ్రగణ్యులు.

10) దరువులు, అష్టపదులు, తరంగాలు, తిరుప్పుగళ్, విరుత్తం, భజన్ మొదలైనవి:—పైన ఉదహరించబడిన ప్రక్రియలే కాక ఇంకా అనేక విధాలైన పాటలు, పద్యాలు, నాట్య-నాటక సంగీత ప్రక్రియలు సభాసంగీతంలో చోటుచేసుకోవడం సంగీతరసజ్ఞుల అనుభవంలో ఉన్న విషయమే! వీటి అన్నింటి గురించి ఆచార్యసన్నిధిలో అధ్యయనం చెయ్యాలి.

లోకాః సమస్తాః సుఖినో భవంతు॥సర్వం అనాహతనాద-ఆహతనాద యోగమయం జగత్॥స్వస్తి॥

ఈ వ్యాసంతో దక్షిణభారతసంగీత సంక్షిప్త పరిచయం స్థాలీపులాకన్యాయంగా ముచ్చటించుకోవడం జరిగింది. ఉత్తరభారతసంగీతసంప్రదాయాల సంక్షిప్తపరిచయం వీలు వెంబడి పరిచయం చేసుకుందాం! అంతవరకు సెలవు. అందరికీ హార్దధన్యవాదాలు.

###############################################################

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *