సంగీతం—నాదవేదం—74
27—11—2021; శనివారము.
ॐ
దక్షిణభారతీయ సభాసంగీతంలో ప్రాముఖ్యత కలిగి, తరచుగా వినబడే ప్రధాన తాళాల పరిచయం ఇప్పుడు చేసుకుందాం.
నాదమయకళ అయిన సంగీతంలో స్వరవైభవం అర్థనారీశ్వరమూర్తిలో ప్రకాశించే ఉజ్జ్వల కామేశ్వరీమాత అయితే, మహాతేజోమయమూర్తి కామేశ్వరుడు లయాధీనమైన తాళక్రమశిక్షణా స్వరూపుడు. సంగీతమయ కాలప్రమాణ గమనగతిని నిర్దేశించగలిగిన తాళప్రక్రియాతత్త్వం మహాకాలుడైన శంకరభగవానుని అధీనంలో ఉంటుంది అని మనం గ్రహించగలగాలి.
దక్షిణభారతసంగీతశాస్త్రగ్రంథాలలో ప్రాచీనకాలం నుండీ తాళం యొక్క వివరణ విపులంగానూ, విశేషంగానూ చేయబడింది. తాళశాస్త్రగ్రంథాలు కాలక్రమంలో అనేకం వెలిసేయి. 108 తాళాలు ఉన్నాయని, 175 తాళాలు ఉన్నాయని, 700 తాళాలు ఉన్నాయని ఇలాగ విభిన్న తాళసంఖ్యని గురించి ప్రాచీనగ్రంథాలలో ప్రస్తావన ఉంది. అయితే దక్షిణభారత సభాసంగీతంలో 5 లేక 6 తాళాలు మనకి విరివిగా వినియోగంలో ఉన్నట్లు మనం గమనించవచ్చు. అందువల్ల మనం ఆ ఐదారు తాళాల వివరాలు పరిచయం చేసుకుంటే, మన ప్రస్తుత అవసరాలకి అది సరిపోతుంది.
మన వర్తమాన సంగీతసభలలో తాళవాద్య విద్వాంసులు వివిధ తాళాలని తమ తమ తాళవాద్యాలపై వైదుష్యంతో రమణీయంగా ప్రదర్శించడం మన అనుభవంలో ఉన్న విషయమే! అంతేకాక సభలలో ప్రధాన కళాకారుడు (గాయకుడు/వాద్యవాదన కుశలుడు) తాను పాడే/వాయించే సంగీతకృతి ఏ తాళంలో ఉందో ఆ తాళాన్ని తన చేతి లెక్కతో (లేక వేరే విధంగా గణించడం ద్వారా) ప్రదర్శించడం పరిపాటి. తాళజ్ఞానం ఉన్న రసజ్ఞులైన సభ్యులు కూడా వివిధ తాళాలని వేదికపై ఉన్న కళాకారులని అనుసరించి చేతితో తాళం వేయడంకూడా మనం చూస్తూంటాం! ఆ లెక్క యొక్క విధానం ఎలావుంటుందో మనం ఇక్కడ ఒక్కసారి స్మరణకి తెచ్చుకుందాం.
ఎడమ అరచేయి (కరతలం=palm) లో కుడి అరచేయితో సుతారంగా తట్టడం, కుడి చేతి వ్రేళ్ళతో లెక్కించడం, ఎడమ అరచేయిలో కుడి అరచేయి వెనుకభాగం (కరపృష్ఠం=back of the palm) తో మరల సుతారంగా తట్టడం అనే ఈ మూడు ప్రక్రియలద్వారా తాళం గణించడం (తాళంయొక్క కాలాప్రమాణ విభాగ గణనం లేక మాత్రల లెక్కింపు) జరుగుతుంది.
(1) అ = ఎడమ అరచేయిలో కుడి అరచేతితో సుతారం(మృదువు)గా కొట్టడం
(2) ఇ = కుడిచేతి వ్రేళ్ళతో లెక్కించడం.
(3) ఉ = ఎడమ అరచేయిలో కుడి అరచేయి వెనుకభాగంతో నెమ్మదిగా తట్టడం.
పై మూడు సంకేతాలద్వారా మనం ఇప్పుడు సభాసంగీతంలో విరివిగా వినియోగాంచబడే ఐదారు ముఖ్యతాళాల ముఖపరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం:—
(1) ఆదితాళం = అ ఇ ఇ ఇ అ ఉ అ ఉ.
(2) త్రిపుటతాళం = అ ఇ ఇ అ ఉ అ ఉ.
(3) అటతాళం = అ ఇ ఇ ఇ ఇ అ ఇ ఇ ఇ ఇ అ ఉ అ ఉ.
(4) ఝెంపె(జంప)తాళం = అ ఇ ఇ ఇ ఇ ఇ ఇ అ అ ఉ.
(5) రూపకతాళం = అ ఇ ఇ ఇ అ ఉ.
(6) ఏకతాళం = అ ఇ ఇ ఇ.
అన్ని మూడు లయలు (విలంబిత + మధ్య + ద్రుత లయలు) లేక త్రికాలలోను పాడవచ్చు. షట్కాల గాన-వాద్యవాద కౌశలం కలిగిన మేధావులైన మహాకళాకారులు ఉంటారు.
(సశేషం)