సంగీతం—నాదవేదం—71

06—11—2021; శనివారము.

72 మేళకర్తరాగాలు, వాటి జన్యరాగాలు కొన్ని వాౘవిగా పరిచయం చేసుకున్నాక యిప్పుడు సంగీత శాస్త్ర సంబంధమైన కొన్ని ప్రధాన విషయాల గురించి లఘువుగా పరిచయం చేసుకుందాం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో వినియోగించబడెడి కొన్ని ప్రధాన సాంకేతిక అంశాలగురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వివరించబడిన రాగాల పరిచయం తరుణంలో ఆయా సందర్భాలని అనుసరించి సంగీతశాస్త్ర సంబంధమైన కొన్ని సాంకేతిక పదాలని ఉపయోగించడం జరిగింది. వాటిని గురించి, మరికొన్ని అత్యావశ్యక ఇతరవిషయాలని గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం.

ఉపాంగ రాగాలు:

————————

జనకరాగం / మేళకర్త రాగం లో వినియోగించబడిన స్వరాలని మాత్రమే కలిగిన జన్యరాగాలని “ఉపాంగరాగాలు” అని అంటారు.

భాషాంగ రాగాలు:

————————

జనకరాగం / మేళకర్త రాగం లో ఉన్న స్వరాలని మాత్రమేకాక, అన్యస్వరం లేక స్వరాలు కలిగిన జన్యరాగాలని “భాషాంగరాగాలు” అంటారు.

వక్రసంచార రాగాలు:

——————————

ఆరోహణలోనో లేక అవరోహణలోనో లేక రెండింటిలోనూ ఉండే స్వరాలు క్రమమైన వరుసలోకాక, వెనక-ముందులుగా అంటే వక్రంగా ఉపయోగించబడితే అటువంటి రాగాలని “వక్రసంచారరాగాలు” అని అంటారు. కేవలం ఆరోహణలో వక్రసంచారాలు ఉంటే, “వక్ర ఆరోహణ రాగం” అంటారు. కేవలం అవరోహణలో వక్రసంచారం ఉంటే, “వక్ర అవరోహణ రాగం” అంటారు. రెండింటిలోను వక్రసంచారాలుంటే, “ఉభయ వక్ర సంచార రాగం” అంటారు.

రాగాలలో “ఆలాపన(ఆలాప్)”; “తానం(తాన్)” అనే ప్రక్రియలు, గానం లో కాని, వాద్యవాదనం లో కాని కళాకారులచేత నిర్వహించబడతాయి. “రాగ ఆలాపన” అంటే కళాకారులు తాము సభలో పాడబోయే రాగంలో కృతిని పాడడానికి ముందు ఆ కృతికి సంబంధించిన రాగంలో వారి వ్యక్తిగత సంగీతవిద్యావైదుష్యం, ఆ రాగభావసంబంధిత వైయక్తిక సృజనాత్మక శక్తిని వ్యక్తీకరించి, సభాసరస్వతిని సంగీతంతో అర్చిస్తూ, సృజనాత్మకతో కూడిన అనిబద్ధ రాగ సంగీతం (uncomposed, but tersely well-structured, musical improvisation the heart and soul of which is divinely inspired spontaneity)లో తమ గానం లేక వాద్యవాదనం ద్వారా త్రికాలప్రమాణాలలో, త్రిస్థాయిలలో ౘక్కగా సంచారంచేసి రసజ్ఞశ్రోతల మనస్సులను రంజింపజేసే ప్రక్రియ అని చెప్పవచ్చు. అలాగే అనిబద్ధసంగీతంలో భాగంగా మధ్యమకాలంలో “తన్నకారం” తో చేసే సొగసులూరే ప్రక్రియని “తానం” అంటారు.

ఘనరాగాలు:

———————

తానాన్ని “ఘనం” అనికూడా పిలుస్తారు. ఇది “మధ్యమకాలప్రక్రియ”. ఏ రాగంయొక్క సంగీతమయ స్వరూప-స్వభావాలు (Musical personality and nature) ఈ తానప్రక్రియ లేక ఘనప్రక్రియ ద్వారా సుస్పష్టం అవుతాయో అటువంటి రాగాన్ని “ఘనరాగం” అని శాస్త్రకారులు నిర్వచించేరు. ఈ ఘనరాగాలలో (1) నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి రాగాలు ఐదింటిని కలిపి ప్రథమ ఘనరాగ పంచకం అంటారని, (2) కేదారం, నారాయణగౌళ, సారంగనాట, భౌళి, రీతిగౌళ అనే మరొక ఐదు రాగాలని కలిపి ద్వితీయ ఘనరాగ పంచకం అంటారని ఇంతకి ముందు తెలుసుకున్నాం.

నయరాగాలు:

————————

ఏ రాగం యొక్క ఆలాపనని, తానాన్ని పాడడం లేదా వాద్యంపై వాయించడం ద్వారా రాగం యొక్క స్వరూప-స్వభావాలు విశదం చేయబడతాయో అటువంటి రాగాన్ని “నయరాగం” అని శాస్త్రకారులు నిర్వచించేరు. ఉదాహరణకి తోడి, కల్యాణి, ఖరహరప్రియ, కీరవాణి, చక్రవాకం, భైరవి, కాంభోజి, శంకరాభరణం, సావేరి, షణ్ముఖప్రియ, పూర్వికల్యాణి, సిమ్హేంద్రమధ్యమం, మోహన మాయామాళవగౌళ, మధ్యమావతి మొదలైన రాగాలెన్నో ఈ కోవలోకి చేరుతాయి.

దేశ్యరాగాలు:

———————

కేవలం ఆలాపన ద్వారా మాత్రమే స్వరూప-స్వభావాలు వ్యక్తమయ్యే రాగాలని “దేశ్యరాగాలు” అంటారు. ఉదాహరణకి కానడ, హమీర్ కల్యాణి, హిందుస్తానీ బేహాగ్ మొదలైన రాగాలు దేశ్యరాగాలుగా చెప్పబడతాయి.

పూర్వాంగం ~ ఉత్తరాంగం:

————————————

సంపూర్ణరాగంలోని ఆరోహణక్రమంలో ఉండే “స—రి—గ—మ” అనే నాలుగు స్వరాలని కలిపి రాగంయొక్క “పూర్వాంగం” (Lower Tetrachord) అని పిలుస్తారు. అదే రాగంలోని మిగిలిన “ప—ధ—ని—స” అనే నాలుగుస్వరాలని కలిపి ఆ రాగంయొక్క “ఉత్తరాంగం” (Upper Tetrachord) అంటారు.

శ్రుతి:

————

ఒక కృతిని పాడడానికి, లేక, వాద్యంపై వాయించడానికి ఒక ఆధారస్వరం అత్యావశ్యకం. ఈ ఆధారస్వరాన్నే “శ్రుతి” అంటారు. సర్వసాధారణంగా మధ్యస్థాయిలోని మంద్రషడ్జాన్ని (మంద్ర “స”) తంబూరా తంత్రులమీద మ్రోగించి దానిని శ్రుతిగా స్వీకరించడం జరుగుతుంది.

స్థాయి:

—————

స్థాయి అంటే ఆధారషడ్జం నుండి తారాషడ్జం వరకు, అంటే, “స-రి-గ-మ-ప-ధ-ని-స” అనే స్వారాల కూర్పుని ఒక “స్థాయి” గా పరిగణిస్తారు. ఈ “స్వరసప్తకం” (పై “స” తో కలిపి అష్టకం) ఆంగ్లంలో “OCTAVE” అని పిలవబడుతూంది. మంద్ర-మధ్యమ-తారా స్థాయిలు మూడూ కలిపితే త్రిస్థాయి సప్తకం ఔతుంది. మంద్రానికి అనుమంద్రం, అన్వనుమంద్రం కూడా ఉంటాయి. అలాగే తారాస్థాయికి పైన అతి(తీవ్ర)తారాస్థాయి ఒకటి ఉంటుంది. అప్పుడు ఐదు లేక ఆరు స్థాయిలలో “స్వరసప్తకం(OCTAVE)” ఉండడానికి శాస్త్రసిద్ధాంతపరంగా అవకాశం ఉంటుంది.

లయ:

—————

“శ్రుతిః మాతా లయః పితా” అని భారతీయసంగీతశాస్త్రం విశదీకరించింది. సంగీతవిద్యాభ్యాసం, సంగీతవిద్యాప్రావీణ్యప్రయోగం నిర్వహించడానికి సంగీతానికి తల్లి ఐన “శ్రుతి”, సంగీతానికి తండ్రి ఐన “లయ” — ఈ రెండింటియొక్క సంపూర్ణజ్ఞానం అత్యావశ్యకం అని మనం గ్రహించాలి. “శ్రుతి” రాగంలోని స్వరాలకి పరిపక్వతని ప్రసాదిస్తే, “లయ” తాళంయొక్క వినియోగానికి సంపూర్ణతని సంక్రమింపజేస్తుంది. ఈ లయ తాళం యొక్క కాలప్రమాణాన్ని క్రమబద్ధం చేస్తుంది (“Laya” perfectly regulates the time-cycle of a “Thala”). ఈ లయ ప్రధానంగా మూడు కాలాలలో ఉంటుంది. విలంబితలయ (మెల్లిగా నడిచే కాలప్రమాణం or “slow tempo”), మధ్యలయ (మధ్యరకమైన వేగంతో నడిచే కాలప్రమాణం or “medium tempo”), ద్రుతలయ (త్వరితగతిలో లేక వేగంగా నడిచే కాలప్రమాణం or “fast tempo”) అని వీటిని మూడు కాలాలు లేక లయలు గా విభజించేరు. ఈ మూడు లయలు లేక కాలాలు మాత్రమేకాక ఆరు కాలాలు కూడా ప్రాచీన సంగీత శాస్త్రాలలో ప్రస్తావించ బడ్డాయి. అతి-అతి విలంబిత కాలం లేక లయ (very very slow tempo). అతి విలంబిత కాలం లేక లయ (very slow tempo). విలంబిత కాలం లేక లయ (slow tempo). మధ్యమకాలం లేక మధ్యలయ (medium tempo). ద్రుతకాలం లేక ద్రుతలయ (fast tempo). అతి ద్రుతకాలం లేక లయ (very fast tempo). ఈ ఆరు విధాలైన కాలాలని కలిపి “షట్కాలాలు” అని అంటారు. వాటిలో సంపూర్ణప్రావీణ్యం పొందిన మహాకళాకారులు ఉండేవారు. “షట్కాల చక్రవర్తి వీణ వెంకటరమణదాసుగారు”, “షట్కాలప్రవీణ గోవింమారార్” వంటి మహానుభావులు గతంలో తమ షట్కాలకౌశలంతో చరిత్రని సృష్టించేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *