సాహిత్యము సౌహిత్యము – 3 : అనిరుద్ధుడు నెమిలి నెక్కి అంబుధి దాటెన్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :-

దీనికిముందు ప్రేషణం(Post)లో పరస్పర విరుద్ధంగా కనిపించే “మృగాత్ సింహః పలాయనమ్ “|| అనే సమస్యని కవి ఎంత చాతుర్యంతో పూరించేడో గ్రహించి ఆయన ప్రజ్ఞకి ఆనందించాం! ఇప్పుడు అటువంటి తెలుగు సమస్యాపూరణం ఒకటి చూద్దాం!

అనిరుద్ధుడు నెమిలి నెక్కి అంబుధి దాటెన్“.

అనిరుద్ధుడు నెమిలివాహనం ఎక్కి సముద్రందాటేడు అని ఈ కందపద్యపాదానికి అర్థం.

అనిరుద్ధుడు అంటే ప్రద్యుమ్నుడి కొడుకుకదా! ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడికి, రుక్మిణీదేవికి కొడుకు. అంటే అనిరుద్ధుడు కృష్ణుడి మనుమడు. మరి అనిరుద్ధుడేమిటి, నెమిలినెక్కడమేమిటి, ఆపైన సముద్రం దాటడమేమిటి? అని అనేకసందేహాలు వస్తాయి.  ఆ సమస్యలన్నింటినీ సమన్వయించే విధంగా సమస్యాపూరణం ఇలా జరిగింది.

మనసిజనందను డెవ్వడు?
అని షణ్ముఖుడేమి ఎక్కి అరుల జయించెన్ ?
హనుమంతు డేమి చేసెను?
అనిరుద్ధుడు, నెమిలినెక్కి,  అంబుధిదాటెన్ “.

మనసిజనందనుడు=ప్రద్యుమ్న పుత్రుడు=అనిరుద్ధుడు
రెండవపాదంలో “అని” అంటే యుద్ధం. అలాగే ఆ పాదంలోనే “అరులు” అంటే శత్రువులు అని అర్థం. ఇక్కడ శత్రువులంటే దేవతలకి శత్రువులైన రాక్షసులన్నమాట. మిగిలిన మాటలన్నీమనకి తెలిసినవే!

మన్మథుడి(ప్రద్యుమ్నుడి) కొడుకు ఎవరు? అంటే అనిరుద్ధుడు అని సమాధానం. అలాగే, దేవాసుర యుద్ధంలో కుమారస్వామి దేనినెక్కి తన శత్రువులని జయించాడు? అంటే “నెమిలి నెక్కి” అని సమాధానం. హనుమంతుడు ఏమి చేసేడు? అని అడిగితే “సముద్రం దాటేడు” అని సమాధానం. క్రమాలంకారాన్ని ఆలంబనగా చేసుకుని సమస్యాపూరణం జరిగింది.

సర్వం శ్రీశారదార్పణమ్ ||

స్వస్తి||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *