సంగీతం—నాదవేదం—56

24—07—2021; శనివారం.

“శంకరాభరణం” జన్యరాగాలలో మరొక బహుళ రసికజనాదరణ పొందినది “బిలహరి రాగం”. బిలహరిరాగం “ఔడవ—సంపూర్ణ” రాగం. ఆరోహణలో “మధ్యమం(మ)”, “నిషాదం(ని)” వర్జితస్వరాలు. అవరోహణ సప్తస్వరసంయుతమై ఉంటుంది. “షడ్జం-చతుశ్శ్రుతి రిషభం-అంతర గాంధారం-శుద్ధమధ్యమం-పంచమం-చతుశ్శ్రుతి ధైవతం-కాకలి నిషాదం” అనే స్వరాల ప్రయోగం ఈ రాగంలో ఉంటుంది. కొన్ని ప్రయోగాలలో, అవరోహణలో కాకలి నిషాదంతోబాటు, వక్రస్వరగతిలో, కైశికి నిషాదం ప్రయోగించబడడంవలన ఈ రాగం భాషాంగరాగంగా పరిగణించబడుతుంది. ౙంట లేక యుగళ స్వరప్రయోగాలు, దాటు లేక లంఘిత స్వరప్రయోగాలు బిలహరిరాగ స్వరూపస్వభావాలని తేటతెల్లంచేసే అందమైన ప్రయోగాలు. ఆరోహణలో మోహనరాగం, అవరోహణలో శంకరాభరణరాగం బిలహరిరాగంయొక్క మౌలికరూపమై భాసిస్తాయి. “బిలహరి” అంటే తన గుహలో ఉన్న మృగరాజు సింహం అని అర్థం. దీనిని, అర్థవిస్తృతి చేయడం (by extension of meaning) ద్వారా (సాధారణంగా) కొండగుహలలో కొలువై ఉండే “ప్రహ్లాదభక్తరక్షకుడైన నృసింహభగవానుని స్ఫురింపజేసే రాగం” గాను, నరసింహరూపంలోని శ్రీహరికి ప్రియమైనరాగంగాను బిలహరిరాగాన్ని భక్తయోగులు సంభావన చేస్తారు. గ్రహభేదప్రక్రియద్వారా, బిలహరిరాగంలోని పంచమాన్ని షడ్జం చేసి, పంచమమూర్ఛనని ప్రయోగిస్తే, “యదుకుల కాంభోజి” అనే మహారమ్యరాగం ఆవిర్భవిస్తుంది. బిలహరి ఆరోహణని అవరోహణగాను, అవరోహణని ఆరోహణగాను విపర్యయం (reversal) చేస్తే మనం ఇంతకు ముందు పరిచయం చేసుకున్న “గరుడధ్వని రాగం” ఆవిర్భవిస్తుంది. శంకరాభరణరాగజన్యమైన మరొక రాగం, “దేశాక్షి రాగం”. దేశాక్షి, బిలహరి రాగాల ఆరోహణ-అవరోహణలు ఒకే విధంగా ఉంటాయి. ఐతే, బిలహరిరాగ స్వరసంచారాలు మూడు స్థాయిలలోను ఉంటాయి. దేశాక్షిరాగ సంచారాలు ఉత్తరాంగప్రధానంగా ఉంటాయి. మధ్య-తారా స్థాయిలలో సంచారాలు దేశాక్షి రూపాన్ని భాసింపచేస్తే, త్రిస్థాయి స్వరసంచార స్వభావం బిలహరిని సుద్యోతకం చేస్తుంది.

త్యాగరాజస్వామి బిలహరి రాగంలో — “ఇంతకన్నానందమేమి? ~ ఓ రామ! రామ! ॥ఇంతకన్న॥ (రూపకతాళం); కనుగొంటిని శ్రీరాముని నేడు ~ (కనులార నా కామితంబు దీర) ॥కనుగొంటిని॥ (దేశాదితాళం); కోరి వచ్చితినయ్య! ~ కోదండపాణి! నిన్ను (లేక నిను నే) ॥కోరి – – -॥ (ఆదితాళం); తొలిజన్మమున జేయు ~ దుడుకు తెలిసేను రామ! ॥తొలిజన్మ॥ (ఖండచాపుతాళం); దొరకునా? యిటువంటి సేవ! ॥దొరకునా?॥ (ఆదితాళం); నరసింహ! నను బ్రోవవే! శ్రీలక్ష్మీ ॥నరసింహ!॥ (మిశ్రచాపుతాళం); నా జీవాధార! ~ నా నోము ఫలమా! ॥నా జీవాధార!॥ (ఆదితాళం); నీవేగాని నన్నెవరు గాతురురా? ~ నీరజదళనయన! ॥నీవేగాని॥ (మిశ్రచాపుతాళం); వాసుదేవ! వరగుణ! ~ మామవ ॥వాసుదేవ!॥ (ఏకతాళం); సరసీరుహనయన! నీ కటాక్షమే ~ ౘాలు సజ్జనజీవన! ॥సరసీరుహనయన!॥ (మిశ్రచాపుతాళం)” అనే కృతులను వెలయించేరు.

దీక్షితస్వామివారు బిలహరిరాగంలో — “ఏకదంతం భజేsహం ~ ఏకానేకఫలప్రదం ॥ఏకదంతం॥ (మిశ్రచాపుతాళం); హాటకేశ్వర! సంరక్ష మాం ~ తప్త హాటకమయ లింగమూర్తే! త్రయాత్మక! ॥హాటకేశ్వర!॥ (రూపకతాళం); కామాక్షి! వరలక్ష్మి! ~ కమలాక్షి! జయలక్ష్మి! శ్రీ ॥కామాక్షి!॥(ఆదితాళం); శ్రీబాలసుబ్రహ్మణ్య! ఆగచ్ఛ! అగ్రగణ్య! ~ శ్రీచిదానంనాథవరేణ్య! ॥శ్రీబాలసుబ్రహ్మణ్య॥ (మిశ్రచాపుతాళం); శ్రీమధురాపురి విహారిణి! ~ శ్రీరాజమాతంగి! మాం పాహి॥శ్రీమధురాపురి విహారిణి!॥ (రూపకతాళం); శ్రీసాంబశివం చింతయామ్యహం ~ గణేశ గురుగుహాది వందిత ॥శ్రీసాంబశివం॥ (ఆదితాళం)” అను వివిధకృతులను స్వరపరిచేరు.

సర్వశ్రీ భద్రాచల రామదాసు, కవికుంజరభారతి, కోటీశ్వర అయ్యర్, క్షేత్రయ్య, లక్ష్మణన్ పిళ్ళై, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, మైసూర్ సదాశివరావు, నారాయణతీర్థ యతీంద్రులు, పాపనాశం శివన్, పెరియసామి తూరన్, స్వాతితిరునాళ్ మహారాజా, పురందర దాసర్, ఉపనిషద్బ్రహ్మ యోగి, మైసూర్ వాసుదేవాచార్, వీణ కుప్పయ్యరు మొదలైన వాగ్గేయకార మహోదయులు బిలహరిరాగంలో కృతులను విరచించేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *