సంగీతం—నాదవేదం—55

17—07—2021; శనివారం.

“శంకరాభరణరాగం” జనకరాగంలోకి వర్గీకరించబడిన మరొక రాగం, “పూర్ణచంద్రిక రాగం”. పూర్ణచంద్రిక ఉభయవక్ర షాడవ—షాడవ రాగం. ఆరోహణలో నిషాదం, అవరోహణలో ధైవతం వర్జితస్వరాలు. ఇది రసికజన మనోరంజక రాగం.

త్యాగయ్యగారు పూర్ణచంద్రికరాగంలో — “తెలిసి రామచింతనతో నామము — సేయవే! ఓ మనసా! ॥తెలిసి॥ (ఆదితాళం); పలుకవేమి? నా దైవమా! — పరులు నవ్వేది న్యాయమా? ॥పలుకవేమి?॥ (ఆదితాళం); శ్రీరామ! రామ! జగదాత్మ! — శ్రీరామ! రఘురామ! పాహి పరమాత్మ! ॥శ్రీరామ!॥ (ఖండచాపుతాళం)” అను కృతులను కూర్పు చేసేరు.

దీక్షితస్వామి పూర్ణచంద్రికరాగంలో — “శంఖ చక్ర గదా పాణిమహం వందే! శ్రీ — శార్ఙ్గ నందక కౌస్తుభ ధారిణం వందే! ॥శంఖచక్రగదాపాణిం॥ (రూపకతాళం); శ్రీరాజరాజేశ్వరి! త్రిపురసుందరి! — శివే! పాహి మాం వరదే! ॥శ్రీరాజరాజేశ్వరి!॥ (ఆదితాళం)” అనెడి కృతులు రచించేరు.

పూర్ణచంద్రికరాగంలో కొందరు వాగ్గేయకార మహనీయ మూర్తులు కృతులను చేసేరు.

తరువాత మహామధుర సుకుమార హృదయరంజక రాగం “బేగడ రాగం”. “బేగడ రాగం దైవానికి మీగడ భోగం వంటిది” అనే నానుడి సంగీతప్రియుల మనోమందిరాలలో జనించి లోకంలో బాగా ప్రచారం పొందింది. బేగడ “వక్రసంపూర్ణ — సంపూర్ణ” రాగంగానే పరిగణింపబడుతోంది. జనకరాగం అయిన “శంకరాభరణరాగం”లో స్వరాలే బేగడరాగంలో ఉంటాయి. కాని కొన్ని స్వరప్రయోగాలలో “శుద్ధమధ్యమం కన్న కాస్త హెచ్చుగాను, ప్రతిమధ్యమం కన్న కొంచెం తక్కువగాను” మధ్యమం యొక్క స్వరస్థాయి ఉంటుంది. దీనిని “బేగడ మధ్యమం” అని వ్యవహరిస్తారు. అదేవిధంగా కొన్ని ప్రయోగాలలోని నిషాదం, “కైశికి నిషాదం కన్న హెచ్చు స్థాయిలోను, కాకలి నిషాదం కన్న తక్కువ స్థాయిలోను” ఉండడంవలన ఈ నిషాదాన్ని “బేగడ నిషాదం” అని అంటారు. ఇవి గురుముఖతః నేర్చుకోవలసినదే!

బేగడరాగం “రాగం ~ తానం ~ పల్లవి” పాడడానికి, వాయించడానికి వీలైన విస్కృతమైన, విపులమైన స్వర ప్రయోగ సంపద యొక్క వైవిధ్యం కలిగిన ఒక మహారాగం.

త్యాగరాజుగారు బేగడరాగంలో సమకూర్చిన సుందర సరస సంగీత రచనలని పరిచయం చేసుకుందాం:— “గట్టిగాను నన్ను చేయి — పట్టేదెన్నటికో? ॥గట్టిగాను॥ (రూపకతాళం); తనవారితనము లేదా? — తారకాధిపాననా! రామ! ॥తనవారితనము॥ (దేశాదితాళం); నాదోపాసనచే శంకర, — నారాయణ, విధులు వెలిసిరి ఓ మనసా! ॥నాదోపాసనచే॥ (ఆదితాళం); నీకు తనకు ఋణ — ఋణీభావము లేదనేరు ॥నీకు తనకు॥ (మిశ్రచాపుతాళం); నీ పదపంకజములను — నే నెర నమ్మినాను ॥నీ పదపంకజములను॥ (ఆదితాళం); నీవే రా! కులధనము సంతతము — నీవే రా జీవనము ॥నీవే రా!॥ (మిశ్రచాపుతాళం); భక్తుని చారిత్రము వినవే! — మనసా! సీతారామ ॥భక్తుని॥ (ఆదితాళం); లోకావనచతుర! — పాహి మాం ॥లోకావన- – -॥ (ఆదితాళం); సామికి సరి జెప్ప — జాల వేల్పుల రామ ॥సామికి॥ (రూపకతాళం); సుందరి! నన్నిందరిలో — జూచి బ్రోవవమ్మ! ॥సుందరి!॥ (రూపకతాళం)”.

దీక్షితస్వామి బేగడరాగంలో సంగీతసరస్వతికి చేసిన మంగళమయ అలంకారాలని పరికిద్దాం!:— “మధురాంబాయాః తవ దాసోsహం — మరకత మణి భూషణాయాః శ్రీ ॥మధురాంబాయాః॥ (మిశ్రచాపుతాళం); శ్రీమాతః! శివవామాంకే — శ్రీచక్రరూప తాటంకే! మామవ ॥శ్రీమాతః!॥ (ఆదితాళం); త్యాగరాజాయ నమస్తే నమస్తే, కా—త్యాయనీ పతే పశుపతే సింహాసనపతే శ్రీ ॥త్యాగరాజాయ॥ (రూపకతాళం); వల్లభా నాయకస్య భక్తో భవామి — వాంఛితార్థదాయకస్య వరమూషిక వాహనస్య ॥వల్లభానాయకస్య॥ (రూపకతాళం)”.

శ్యామాశాస్త్రిగారి బేగడరాగ స్వరరచనతో దీప్తిమయమైన కృతులు యివి:— “దయానిధే! మామవ స—దా శ్యామకృష్ణపూజితే! ॥దయానిధే॥ (ఆదితాళం) ~ “వర్ణం”; కామాక్షీ! నాతో వాదా? దయ లేదా? — కమలాక్షీ! నన్నొకని బ్రోచుట భారమా? బంగారు ॥కామాక్షీ!॥ (ఆదితాళం); సామీ! నిన్నే నమ్మితి — రా! రా! రా! ముద్దుకుమారా! ॥సామీ!॥ (ఆదితాళం)”.

సర్వశ్రీ అంబుజం కృష్ణ, కృష్ణమాచారియర్, క్షేత్రయ్య, లక్ష్మణన్ పిళ్ళై, ఎం.డి.రామనాథన్, మధురకవి, ముత్తయ్య భాగవతర్, పాపనాశం శివన్, పట్నం సుబ్రమణ్య అయ్యర్, స్వాతి తిరునాళ్ మహారాజా, ఉపనిషద్ బ్రహ్మయోగి, వేదనాయకం పిళ్ళై, R.వేణుగోపాల్, వీణ కుప్పయ్యర్, వీణ శేషన్న మొదలైన మహామహులైన వాగ్గేయకారులు బేగడరాగంలో తమ, తమ సంగీతరచనలని చేసేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *