సంగీతం—నాదవేదం—53
03—07—2021; శనివారం.
ॐ
(ధీర)శంకరాభరణ మేళకర్తరాగంలోకి వర్గీకరించబడిన ముఖ్యరాగాలలో “కన్నడరాగం” ఒకటి. (ఖరహరప్రియ జన్యరాగమైన సుప్రసిద్ధ సుమనోహర “కానడరాగం” వేరు. ఆ రాగం గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం). “కన్నడరాగం” యొక్క ఆరోహణ—అవరోహణ మొదలైన వివరాలు గురుముఖతః తెలుసుకోవడం అభిలషణీయం.
త్యాగారాజులవారు కన్నడరాగంలో — “ఇదే భాగ్యము గాక – యేమి యున్నదిరా? రామ! ॥ఇదే॥ (మిశ్రచాపుతాళం); నిన్నాడనేల? నీరజాక్ష! ॥నిన్నాడనేల?॥ (ఆదితాళం); భజ! రే భజ! మానస! రామంం ॥భజ!॥ (మిశ్రచాపుతాళం); సాకేతనికేతన! – సాకేననగలేదా? ॥సాకేతనికేతన!॥ (రూపక తాళం)” అనే కృతులను రచించేరు.
దీక్షితస్వామివారు కన్నడరాగం (దీక్షితసంప్రదాయంప్రకారం కన్నడరాగం హరికాంభోజి జన్యంగా పరిగణింపబడుతోంది) లో — “గీతిచక్రరథస్థితాయై గురుగుహనుత శ్యామలాయై – నమస్తే నమస్తే ॥గీతిచక్రరథస్థితాయై॥ (మిశ్రచాపుతాళం); పాలయ మాం పార్వతీశ! – భక్తజనావన! జగదీశ! ॥పాలయ మాం॥ (రూపకతాళం); శ్రీమాతృభూతం త్రిశిరగిరినాథం – హృది చింతయే సుగంధి కుంతలాంబా సమేతం ॥శ్రీమాతృభూతం॥ (మిశ్రచాపుతాళం)” అనే కృతులని కూర్పు చేసేరు.
కన్నడరాగంలో కొందరు వాగ్గేయకారుల రచనలు జనాదరణని పొందేయి.
తరువాత రాగం మనం “ద్వితీయఘనరాగపంచకం” లో ఒకటిగా ఇంతకి ముందు తెలుసుకున్న “కేదారం” (కేదారం, నారాయణగౌళ, రీతిగౌళ, సారంగనాట, భౌళి రాగాలు) కూడా శంకరాభరణ రాగ జన్యమే! కేదారరాగంలో వక్ర ఔడవ – షాడవ స్వర ఆరోహణ – అవరోహణ ఉంటాయి. ఆరోహణలో “రి, ధ” స్వరాలు వర్జ్యమైతే, అవరోహణలో “ధ” మాత్రమే వర్జ్యం. కేదారం యొక్క ఆరోహణలో “స-మ-గ-మ-ప-ని-స” ప్రయోగం ఉంటే, అవరోహణలో “స-ని-ప-మ-గ-రి-స” అనే స్వరప్రయోగ నిర్మాణం ఉంటుంది. కేదారం ఉపాంగరాగం. ఈ రాగంలో మధ్యమకాల స్వరసముదాయ ప్రయోగాలు రాగస్వరూస్వభావారని నిర్వచిస్తాయి.
త్యాగరాజస్వామి కేదారం రాగంలో “ఓ రమారమణ! రామ! రామ! నే – నోర్వజాల రఘురామ! ॥ఓ రమారమణ॥ (ఆదితాళం); మరచేవాడనా? రామ! నిను – మదనజనక! ॥మరచేవాడనా॥ (ఆదితాళం); రామ! నీ పై తనకు – ప్రేమపోదు సీతా ॥రామ!॥ (ఆదితాళం)” అనే కృతుల రచనని చేసేరు.
దీక్షితస్వామివారు కేదారం రాగంలో “అంబికాయాః అభయాంబికాయాః తవదాసోsహం ఆది – జగదంబికాయాః ॥అంబికాయాః॥ (ఆదితాళం); ఆనంద నటనప్రకాశం చిత్సభేశం – ఆశ్రయామి శివకామవల్లీశం ॥ఆనంద నటనప్రకాశం॥ (మిశ్రచాపుతాళం); చిదంబర నటరాజమాశ్రయేsహం – శివకామీపతిం చిత్సభాపతిం ॥చిదంబరనటరాజం॥ (ఆదితాళం)” అనే సంగీతరచనలని రసజ్ఞలోకానికి అందించేరు.
కేదారంలో అనేకవాగ్గేయకారులు అందమైన కృతులని, కీర్తనలని రచించేరు.
తరువాత, “కోలాహలం” అనే అపూర్వరాగం శంకరాభరణజన్యరాగం! కోలాహలంరాగం వక్రషాడవ – సంపూర్ణ రాగం. ఆరోహణలో “రి” వర్జ్యస్వరం. ఆరోహణలో “స-ప-మ-గ” అనే వక్రసంచారస్వరప్రయోగంతో ఉండే రాగంయొక్క ఎత్తుగడ రాగస్వరూపాన్ని నిర్వచిస్తుంది. అవరోహణ శంకరాభరణంరాగంలో వలెనే ఉంటుంది. ఈ రాగంలో త్యాగయ్యగారి “మదిలోన యోచన పుట్టలేదా? – మహరాజ రాజేశ్వరా! ॥మదిలోన॥ (దేశాదితాళం)” అనే ఏకైకకృతి లభ్యం అవుతోంది.
ఆ తరువాత “గరుడధ్వనిరాగం” శంకరాభరణజన్యరాగాలలో చెప్పుకోవలసినది. గరుడధ్వని రాగం, “సంపూర్ణ — ఔడవ” రాగం. అంటే, ఆరోహణలో సప్తస్వరాలు (శంకరాభరణరాగ ఆరోహణే!) ఉంటూ, అవరోహణలో “మ – ని” వర్జ్యస్వారాలుగా ఉంటాయి. “స-రి-గ-మ-ప-ధ-ని-స” ఆరోహణలో ఉండగా, “స-ధ-ప-గ-రి-స-” అవరోహణలో ఉంటాయి.
త్యాగరాజుగారు గరుధ్వనిరాగంలో — “ఆనంద సాగరమీదని దే – హము భూభారము రామ! ॥ఆనంద – – – ॥ (దేశాదితాళం); తత్త్వమెరుగ తరమా? – పర ॥తత్త్వమెరుగ॥ (రూపకతాళం)” అనే రెండు కృతులని కూర్పు చేసేరు.
(ఇక్కడ ఒక మనోరంజకమైన విషయం సంగీతరసజ్ఞులతో పంచుకోవలసింది ఉంది. “మానాపమాన్” అనే సుప్రసిద్ధ మరాఠీ నాటకంలో మిక్కిలి జనాదరణని పొందిన పాట – “బింబాధరా మధురా”(అనే నాట్యసంగీత్ గీతం), త్యాగరాజస్వామివారి ఈ గరుడధ్వనిరాగంలోని “ఆనందసాగరమీదని దేహము, భూభారము రామ!” అనే కృతి యొక్క స్వరసంపుటీకరణలోనే కూర్చబడడం ఒక రమణీయమైన సత్యం).
ఈ గరుడధ్వనిరాగంలో హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్ కృతులు నాలుగు లభ్యం ఔతున్నాయి.
శంకరాభరణజన్యరాగాలలో “జనరంజనిరాగం” ఒకటి ఉంది. ఇది కూడా “సంపూర్ణ—ఔడవ” రాగమే! అవరోహణలో “గ – ని” వర్జ్యస్వరాలు. “స-రి-గ-మ-ప-ధ-ని-స” ఆరోహణలో ఉంటాయి. అవరోహణలో, “స-ధ-ప-మ-రి-స” ఉంటాయి.
త్యాగయ్యగారు జనరంజనిరాగంలో — “నాడాడిన మాట నేడు – తప్పవలదు నా తండ్రి! శ్రీరామ! ॥నాడాడిన మాట॥ (మిశ్రచాపుతాళం); విడజాలదురా! నా మనసు – వినరా! ॥విడజాలదురా!॥ (ఆదితాళం); స్మరణే సుఖము శ్రీరామనామ – నరుడై పుట్టినందుకు, నామ ॥స్మరణే సుఖము॥ (దేశాదితాళం)” అనే కృతులను రచించేరు.
జనరంజనిరాగంలోకూడా ముత్తయ్యభాగవతుల కృతులు రెండు లభ్యం ఔతున్నాయి.
(సశేషం)