సంగీతం—నాదవేదం—52

26—06—2021; శనివారం.

29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క జన్యరాగంగా వర్గీకరించబడిన మహామనోహరమైన ఒక గొప్పరాగం “ఆరభి రాగం”. ఇది “ఘనరాగాలు” గా సుప్రసిద్ధమైన రాగాలలో అద్భుతమైన మనోరంజక సంచారాలు కలిగిన మహనీయరాగం.

“ఆరభి రాగం” ఔడవ — సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం(గ) — నిషాదం(ని) వర్జిత స్వరాలు. షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—అంతర గాంధారం—శుద్ధమధ్యమం—పంచమం— చతుశ్శ్రుతి ధైవతం—కాకలి నిషాదం స్వరాల ప్రయోగం ఆరభిరాగంలో ఉంటాయి. ఇది ఆది ఘనరాగ పంచకంలో మూడవ ఘనరాగం (నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి, రాగాలు ఐదు ఆది ఘనపంచకంగా సంగీతశాస్త్రజ్ఞులు చెపుతారు. కేదారం, నారాయణగౌళ, రీతిగౌళ, సారంగనాట, భౌళి ద్వితీయ ఘనపంచకంగా శాస్త్రకారుల నిర్ణయం.). తానప్రస్తారప్రయోగం లేక మధ్యమకాల సంచార ప్రక్రియ ఘనరాగాలలో పుష్కలంగా ఉండడంవలన ఈ రాగాలు విద్వాంసుల సంగీతభావ సృజనాత్మకతకా నెలవైన మనోధర్మానికి, శ్రవణపేయంగా ఉండడంవలన రసజ్ఞశేఖరుల రాసిక్యానికి నిరంతరంగా ఆలవాలమై సుప్రసిద్ధమయ్యేయి. అందువలన ఇవి రాగం—తానం—పల్లవి ప్రక్రియకి అనువైన రాగాలు. ఆరభిరాగంలో జంటస్వరప్రయోగాల మనోరంజకత్వం మహామధురంగా ఉంటుంది. కౌశలంతోకూడిన గ్రహభేదప్రక్రియద్వారా, ఆరభిరాగం, అభేరి, మోహనకల్యాణి, కేదారగౌళ రాగాలు ఏర్పడడానికి అవకాశం కలిగి ఉంది.

త్యాగరాజస్వామివారు ఆరభిరాగంలో చేసిన కృతులని ఇప్పుడు పరిచయం చేసుకుందాం:—

“అడుగు వరములిచ్చేను ॥అడుగు॥ (మిశ్రచాపుతాళం); అంబ! నిను నమ్మితినంటే నీ — కనుమానమేమమ్మ? ॥అంబ!॥ (ఆదితాళం); ఇపుడైన నను తలచినార! స్వామి! ॥ఇపుడైన॥ (మిశ్రచాపుతాళం); ఓ రాజీవాక్ష! ఓరజూపుల జూచే — వేరా! నే నీకు వేరా? ॥ఓ రాజీవాక్ష!॥ (మిశ్రచాపుతాళం); ఓ రామ! ఓ రామ! ఓంకారధామ! — ఓ రామ! ఓ రామ! ఒనరించు ప్రేమ ॥ఓ రామ!॥ (ఆదితాళం); ౘాల కల్లలాడుకొన్న — సౌఖ్యమేమిరా? ॥ౘాల॥ (ఆదితాళం); చూతాము రారే! — సుదతులార! రంగపతిని ॥చూతాము॥ (రూపకతాళం); (చూర్ణిక : జయతు! జయతు! సకల నిగమాగమ కుశల! – – – – -); నాదసుధారసంబిలను నరాకృతాయ మనసా! ॥నాదసుధా॥ (రూపకతాళం); నా మొరలను విని ఏమరవలెనా! — పామర మనుజులలో ఓ రామ! ॥నా మొరలను॥ (ఆదితాళం); నిన్నే నెర నమ్మినాను — నీరజాక్ష! నను బ్రోవుము! ॥నిన్నే॥ (మిశ్రచాపుతాళం); పలుకవేమి? పతితపావన! — కరుణజిల్కవేమి? సుజనజీవన! ॥పలుకవేమి?॥ (రూపకతాళం); పతికి మంగళహారతీరే! — భామలార! నేడు సాకేత ॥పతికి॥ (ఆదితాళం); సాధించెనే ఓ మనసా ॥సాధించెనే॥ (ఆదితాళం); సుందరి! నిన్ను వర్ణింప బ్రహ్మాది — సురలకైన తరమా? ॥సుందరి!॥ (మిశ్రచాపుతాళం)” అనే కృతులు బాగా ప్రజాదరణని పొందేయి.

దీక్షితస్వామివారి “ఆరభిరాగం” లోని కృతులు యివి:—”అఖిలాండేశ్వర్యై నమస్తే! అణిమాది సిద్ధీశ్వర్యై నమస్తే! ॥అఖిలాండేశ్వర్యై॥ (ఆదితాళం); ఆదిపురీశ్వరం సదా భజేsహం త్రిపురసుందరీసమేత వర గురు-గుహజనకం వందిత మునిసమూహం ॥ఆదిపురీశ్వరం॥ (ఆదితాళం); గణరాజేన రక్షితోsహం- గుణిజననుత పల్లవపదేన ॥గణరాజేన॥ (మిశ్రచాపుతాళం); గౌరీశాయ నమస్తే! శ్రీ — గురుగుహాది సన్నుత వరాయ ॥గౌరీశాయ॥ (త్రిపుటతాళం); మారకోటిలావణ్య! మాం పాలయ! — ధీరాగ్రగణ్య! వాసుకీవలయ! ॥మారకోటిలావణ్య!॥ (ఝంపతాళం); శివకామేశ్వరం చింతయామ్యహం — చిదానందపూజితాంభోరుహం ॥శివకామేశ్వరం॥ (ఆదితాళం); శ్రీసరస్వతీ! నమోsస్తు తే! వరదే! పరదేవతే! — శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే! విధియుతే! ॥శ్రీసరస్వతీ!॥ (రూపకతాళం); శ్వేతారణ్యేశ్వరం భజేsహం సదా — బ్రహ్మవిద్యానాయకీ సమేతం ॥శ్వేతారణ్యేశ్వరం॥ (ఆదితాళం) మొదలైన రచనలు దీక్షితులవారివి బాగా ప్రచారంలో ఉన్నాయి.

శ్యామాశాస్త్రులవారి “పాలయాశు మాం — పరదేవతే! ॥పాలయాశు॥ (త్రిపుటతాళం)” అనే ఒక కృతి “ఆరభిరాగం”లో లభ్యమౌతోంది.

సర్వశ్రీ కనకదాస, కవికుంజర భారతి, ముత్తయ్య భాగవతర్, పాపనాశం శివన్, పురందరదాస, రామలింగసేతుపతి, స్వాతితిరునాళ్ మహారాజా, ఉపనిషద్ బ్రహ్మయోగి, పెరియసామి తూరన్, గోపాలదాస మొదలైన మహామహులైన వాగ్గేయకారులు తమ సంగీతరచనలని “ఆరభిరాగం” లో కూర్చేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *