సాహిత్యము సౌహిత్యము – 2 : మృగాత్ సింహః పలాయనమ్
శ్రీశారదా దయా స్ఫూర్తి:
హరిహరదేశాన్ని కాలికానగరం ముఖ్యపట్టణంగా చేసుకుని నరేంద్రవర్మ పాలించేవాడు. ఆయన సంగీతసాహిత్యశిల్పాది వివిధ కళలలోను, సకలశాస్త్రాలలోను పారంగతుడు. ఆయన రాజ్యాన్నిఅనేక కవులు, పండితులు సందర్శించి నరేంద్రవర్మనిమెప్పించి అమూల్య బహుమానాలని, గౌరవాన్ని పొంది రాజుని, ప్రజలని ఆశీర్వదించి వెళ్ళడం పరిపాటి. ఒకసారి ఒక గొప్ప పండితకవి నరేంద్రవర్మగారి ఆస్థానానికి విచ్చేసాడు. ఆయన ప్రజ్ఞని చూడగానే పసిగట్టిన రాజుగారు ఒక క్లిష్టమైన సమస్యని కవిగారికి యిచ్చి పూరించమన్నాడు.
ఆ సమస్య యిది:
” మృగాత్ సింహః పలాయనమ్ “||
ఈ సమస్య భావం యిది:
“లేడినిచూసి(దాని నుండి) సింహం పారిపోతోంది”.
ఇటువంటి సందర్భం సత్యదూరం కదా! పండితుడైన కవి ఎక్కువ సమయం తీసుకోకుండానే ఆ సమస్యని అర్థవంతంగా ఉండేటట్లు యిలా పూరించాడు:
” కస్తూరీ జాయతే కస్మాత్ |
కో హన్తి కరిణాం శతమ్ |
కిం కుర్యాత్ కాతరో యుద్ధే |
మృగాత్ సింహః పలాయనమ్ “||
ఈ శ్లోకానికి భావం తెలుసుకునే ముందు కవిగారు చేసిన చమత్కారం గురించి ముచ్చటించుకుందాం! సమస్యగా యివ్వబడిన నాలుగవ పాదం భావం తెలుసుకున్నాం కదా! కాని మరొక విషయం యిక్కడ
మొదటిపదం పంచమీవిభక్తిలో ఉంది. అంటే మృగం(లేడి లేక అదేజాతికి చెందిన కస్తూరిలేడి) నుంచి అని అర్థం.
రెండవపదం, మూడవపదం కూడా ప్రథమావిభక్తి లోనే ఉన్నాయి. కవిగారు ఈ మూడుమాటలని మూడు జవాబులుగా గ్రహించి, ఆ జవాబులకి అనుగుణమైన మూడు ప్రశ్నలని పై మూడు
శ్లోకపాదాలలో కూర్చారు.
ఇప్పుడు శ్లోకభావం ౘక్కగా అర్థం ఔతుంది.
1. కస్తూరీ జాయతే కస్మాత్ = కస్తూరి దేనినుంచి పుడుతుంది?(మృగాత్ )— కస్తూరి లేడినుంచి(పుడుతుంది).్ =
2. కో హంతి కరిణాం శతమ్ ? నూరు యేనుగులని ఎవరు ౘంపుతారు? (సింహః) సింహం ౘంపుతుంది.
3. కిం కుర్యాత్ కతరో యుద్ధే?=పిరికిపంద యుద్ధంలో ఏంచేస్తాడు?—పారిపోతాడు(పలాయనమ్ |).
ఇటువంటి ౘక్కని శ్లోకాన్ని చెప్పి రాజుగారినుంచి కవిగారు భూరి సత్కారాలు అందుకున్నారు.
శ్రీశారదార్పణమస్తు||
మిత్రమా కృష్ణా,
అద్భుతం.
“లేడిని చూసి సింహం పారిపోతుంది”
ఇది అసంభవం.
ఇంతటి క్లిష్టమయిన సమస్యను అతి తక్కువ సమయంలో పూరించి, మెప్పించిన ఆ కవిగారి మేధోసంపత్తినీ, సమయస్ఫూర్తినీ ఎంతగా మెచ్చుకున్నా తక్కువే!
ఈ సమస్యాపూరకానికి సంబంధించిన వివరాలు చక్కగా విశ్లేషించిన తీరు కూడా మెచ్చుకోదగ్గదే; ఇలా విశ్లేషించిన నిన్ను అభినందిస్తూ- ఈ ‘పోస్టింగ్’ ని నాతో పంచుకున్న నీకు ధన్యవాదాలు కూడా చెబుతున్నాను.