సంగీతం—నాదవేదం—47

22—05—2021; శనివారము.

29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణ రాగ జన్యమైన శంకరాభరణరాగం” ఆరోహణలో సప్తస్వరాలు, అవరోహణలో సప్తస్వరాలు కలిగిన “సంపూర్ణ—సంపూర్ణ” రాగం. ఈ రాగంలో — “షడ్జం ~ చతుశ్శ్రుతి రిషభం ~ అన్తర గాంధారం ~ శుద్ధ మధ్యమం ~ పఞ్చమం ~ చతుశ్శ్రుతి ధైవతం ~ కాకలి నిషాదం” ఉంటాయి.

ఉత్తరభారత సంగీత పద్ధతిలో దీనిని “రాగ్ బిలావల్” అని పిలుస్తారు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఇది, “Diatonic Major Scale” గా వ్యవహరించబడుతుంది.

శంకరాభరణరాగం మూర్ఛనకారక రాగం. అంటే, గ్రహ (స్వర) భేదం (Modal Shift of the Tonic) ద్వారా అన్యరాగాలు ఉత్పత్తి ఔతాయి. అంటే, ఈ ప్రక్రియద్వారా, “రి, గ, మ, ప, ధ” ల యొక్క గ్రహభేదం వలన “ఖరహరప్రియ — తోడి — కల్యాణి — హరికాంభోజి — నర(ఠ) భైరవి” రాగాలు వరుసగా ఏర్పడతాయి.

శంకరాభరణరాగంయొక్క మరొక ప్రధాన లక్షణం ఏమిటంటే, ఈ రాగం యొక్క “పూర్వాంగం — ఉత్తరాంగం” సంపూర్ణ సమతౌల్యం కలిగి ఉంటాయి. One of the fundamental special features of this Parent Mode is that it has “perfectly symmetrical tetrachords”.

ఈ రాగం విస్తృతమైన ఆలాపన (detailed imrovisation) కి, శ్రవణపేయమైన తానప్రక్రియ యొక్క నిర్వహణకి, మృదుమధురమైన పల్లవి గానానికి అనువైన ఒకానొక మహారాగం. ఈ రాగంలో మహానుభావులైన అనేక వాగ్గేయకారులు స్వర రచన చేసిన లెక్కకి మిక్కుటమైన కృతులు విశేష రసికజనాదరణని పొందేయి. ఈ రాగంలో త్రాగరాజస్వామివారు మహనీయకృతులని రచించి, శంకరాభరణరాగ స్వరూపస్వభావాలని మనోహరవైవిధ్యంతో, మహనీయ మార్గదర్శక మనోధర్మభరితంగా స్వరపరచబడిన తమ రచనలద్వారా నిరూపించి, రాగంయొక్క రమణీయాకృతిని సువ్యవస్థితం చేసేరు. అప్పటివరకు లోకవ్యవహారంలో ఉన్న “పెండ్లి పాటలు”, “నలుగు సేవ పాటలు”, “పవ్వళింపు సేవ (జోల/ఉయ్యాల) పాటలు” మొదలైన “శంకరాభరణరాగలక్షణాలకి సన్నిహితమైన గీతాలు” తమ దృష్టిలో పెట్టుకుని, తమ “ఉత్సవ సంప్రదాయ సంకీర్తనలు” లో ఉన్న కొన్ని రమణీయకృతులని “శంకరాభరణరాగం” లో సర్వతోముఖ సౌందర్య శోభతో కూర్చడంలో త్యాగయ్యగారి సమగ్ర భారతీయ సంగీత దర్శనానుభవ దివ్యదీప్తివైభవం రసజ్ఙహృదయులకి సాక్షాత్కరిస్తుంది.

కేవలం కృతులు మాత్రమేకాక, “శంకరాభరణం రాగం” లో, తిరుప్పుగళ్, గీతాలు, వర్ణాలు, అష్టపదులు, తరంగాలు, పద్యాలు, శ్లోకాలు, విరుత్తంలు, భజనలు మొదలైన అనేక ఇతర ప్రౌఢ శాస్త్రీయ, ఉపశాస్త్రీయ, లలితసంగీత, నాట్యసంగీత, చలనచిత్ర సంగీత రచనల గానం సభాసంగీతంలోను, నాట్యప్రదర్శలలోను మనం వినవచ్చు. ఈ సందర్భంలో ఒక విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకోవడం సముచితంగా ఉటుంది. దూరదర్శన్ — మలయాళం ప్రసారవిభాగంలోని “చెంబై సంగీతోత్సవం” అనే దైనిక శాస్త్రీయసంగీతసభల ప్రసార కార్యక్రమంలో “శాస్త్రీయసంగీతం మీద ఆధారపడిన పాటల కచ్చేరీ చోటుచేసుకోవడం, ఆ కార్యక్రమంలో పాడిన కళాకారుడు “శంకరాభరణం” తెలుగు చలనచిత్రంలోని పాటలు పాడడం, సంగీతప్రియులు ౘాలాసార్లు వినేవుంటారు.

(సశేషము)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *