సంగీతం—నాదవేదం—45

8—5—20201; శనివారం

(ఈ వృత్తాంతం జరిగే సమయానికి మా చిన్నాన్నగారికి సుమారు 28 సంవత్సరాల వయస్సు ఉండి ఉంటుందని చెప్పేను కదా! ఇంక, వారిగురించి సంక్షిప్తపరిచయం చేసుకుందాం! వారు కాళిదాసు రచించిన “మేఘసందేశమ్॥” సంస్కృతకావ్యకథకి పూర్వరంగమైన మూలకథని తెలుగులో “హేమమాలి” అనే పద్యకావ్యంగా విరచించి బుధజన గౌరవాదరాలని చూరగొన్నవారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు, శ్రీ మల్లంపల్లి శరభయ్యగారు, శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులవారు మొదలైనవారి అభిమానానికి పాత్రులైనవారు. మహామంత్రశాస్త్రవేత్త, సంస్కృతాంధ్రకవివరులు, శ్రీవిద్యా సంప్రదాయ సర్వజ్ఞ స్వరూపులు , శ్రీ శ్రియానందనాథ దీక్షానామధేయులు ఐన శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మ పూజ్యపాదుల అనుగ్రహం పొందినవారు.

వారు స్ఫురద్రూపి, గొప్ప ముఖ వర్చస్సు కలవారు. ఆంతరిక పారమార్థిక జప-తపాలయందు లీనమై ఉండే మహాఅధ్యయన శీలి. అంతర్ముఖప్రియులు. మౌన స్వభావులు. అలతి పలుకులలో అనల్ప బోధ చేయగలిగిన సహజ సమర్ధులు.

వారు చెప్పిన వృత్తాంతం సంక్షిప్తంగా ఇప్పుడు, ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను.)

“అయ్యా! మీరు పెద్దలు. మీ మాట కాదనలేను. అందుకని వస్తున్నాను” అని వారితో అని సంగీతసభామందిరంలోకి ఆయనతోకలిసి అడుగు పెట్టేను. మా ఇద్దరికి నిర్వాహకులు మొదటి వరసలో, నడవకి ఎడమవైపు, మొదటి రెండు కుర్చీల లోను కూర్చోబెట్టేరు. “ఈ ముందు వరసలో ఆ మహానుభావుడికి ఎదురుగా కూర్చోవడంకన్న, వెనుకవరసలలో కూర్చుని ఉంటే మనకి బాగుండేదేమో!” అన్నాను నేను సంకోచంగా! వెంటనే ఆయన “లేదు, నేనే ఇలాగ కావాలని ఏర్పాటు చేయించేను. వీరి కచేరీకి ముందువరసలోనే కూర్చుని, వారు పాడుతూంటే వారి ముఖాన్ని తప్పక దగ్గరనుండి చూస్తూ వింటేనే మనకి పూర్తిగా ఆనందం కలుగుతుంది. మధ్యలో ఆయనకి-మనకి మధ్య ఇతరుల తలకాయలు అడ్డం పడకూడదంటే ఇదొక్కటే మార్గం మరి!” అన్నారు. “ఇంతకీ ఈ రోజు పాడబోయే ఆ గాయకులు ఎవరు?” అని ఉత్సుకతతో అడిగేను. “ఇప్పుడు మీరు అసలు విషయానికి వచ్చేరు. పాడబోయేవారు సాక్షాత్తు సంగీతపుంభావసరస్వతి, నాదయోగి అయిన అరవై సంవత్సరాలు దాటిన శ్రీమాన్ అరియక్కుడి రామానుజ అయ్యంగార్. వీరు శ్రీ త్యాగరాజ ప్రత్యక్ష గురు-శిష్య పరంపర (Direct teacher & disciple tradition) లోని వారు. త్యాగరాజస్వామివారి ప్రత్యక్ష శిష్యవరులైన శ్రీ మానాంబుచావడి (ఆకుమళ్ళ) వేంకట సుబ్బయ్యగారికి ప్రియ శిష్యులు శ్రీ పట్ణం సుబ్రమణియ అయ్యర్. వీరి శిష్యులు శ్రీ రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ లేక పూచ్చి అయ్యంగార్. వారికి ఆత్మీయశిష్యులు శ్రీ అరియక్కుడి రామానుజ అయ్యంగార్. వీరు పాడే త్యాగరాజకీర్తనలన్నీ సప్రమాణమైన సరస పాఠాంతరాలతో వరలుతూంటాయి. అదిగో! తెర తొలగి పోతోంది. ఇంక వారు మనలనందరినీ నాదమయ సరస్వతీ తత్త్వంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. మనం సంసిద్ధంగా ఉందాం!” అంటూ వారు ముగించడం, తెర తీయడం ఏకకాలంలో జరిగిపోయేయి. వేదికమీద శ్రీ అరియక్కుడివారు మధ్యలో దీపాల కాంతులలో పచ్చని దబ్బపండు దేహచ్ఛాయలో, నుదుట దివ్యమైన తిరునామంతో, చెవులకి సువర్ణ కుండలాలతో, తెల్లని పట్టుపంచ, తెల్లని పొడుగు చేతుల పట్టు చొక్కా, ఆ పైన ఉత్తరీయంతో ధగ-ధగలాడిపోతున్నారు. ఎరుపు-ఆకుపచ్చ రంగుల అంచులున్న తెల్లని పట్టుతలపాగా ఠీవిగా వెలుగులీనుతూ వారి శిరస్సును అలంకరించింది. వారి కుడివైపు మృదంగవిద్వాంసులు, ఎడమవైపు వయొలిన్ విద్వాంసులు, వెనుకవైపు ఘటం, కంజీరా, తంబూరా కళాకారులు తో వేదిక మహాశోభాయమానంగా వెలిగిపోతోంది. సహకారవాద్యకళాకారులందరూ పాలనురుగు వంటి తెల్లని దుస్తులలో సభాసౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నారు. శ్రీ అరియక్కుడి సభని అంతటిని ఒక్కసారి చిరునవ్వుల వెన్నెల వెలుగులతో ఆహ్లాదపరిచేరు. అందరి గౌరవనమస్కారాలని సాదరంగా నవ్వుతూ ప్రణమిల్లి స్వీకరించేరు. నా మిత్రుల నమస్కారానికి మందహాసంతో తల పంకించేరు. గొంతు సవరించుకుని ముందు ఏదో పాడేరు. అందరూ చప్పట్లు కొట్టేరు. నేనూ అలాగ చెయ్యాలేమోనని అనుకుని సభామర్యాదని పాటిస్తూ వారందరిని అనుసరించేను.

ఆ పిమ్మట ఏవో నాకు వినికిడి వలన పరిచయమున్న “వాతాపి గణపతిం భజేsహం”; “ఎందరో మహానుభావులు” వంటి రెండు-మూడు పాటలు విన్నాను. ఇంక నాకు తెలియకపోవడం వలన నాకు ఏ మాత్రమూ రుచించని అపరిచిత కృతులని ఆయన పాడడంతో నా కష్టాలు ప్రారంభం అయ్యేయి. అప్పుడప్పుడు కరతాళధ్వనులు సభలోనుండి వినవస్తున్నాయి. నా మిత్రుల వైపు చూస్తే, ఆయన పూర్తిగా సంగీతంలో లీనమైపోయి మహానందంలో ములిగిపోయి ఉన్నారు. నా పరిస్థితి మరీ దీనంగా తయారయ్యింది. అందరిలోను ఏకాకిని ఐపోయేను. ఏమీ చేయలేని ఆ నిస్సహాయస్థితిలో కుర్చీలో అస్థిరంగా అటూ-ఇటూ కదలడం ప్రారంభించేను. (I started monkeying in my chair restlessly and helplessly. —అని మా చిన్నాన్నగారు ఆ సందర్భంలో చెప్పిన ఒక వాక్యం యథాతథంగా నాకు గుర్తుండి పోయింది).

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *