సంగీతం—నాదవేదం—44
01—05—02021; శనివారం
ॐ
మనం ఐదవది ఐన బాణచక్రం లోని నాలుగవ మేళకర్త అంటే మొత్తంమీద 28వ మేళకర్త ఐన హరికాంభోజిరాగం, ఆ రాగంయొక్క కొన్ని ముఖ్యజన్యరాగాలు గురించి సంక్షిప్త పరిచయం, ఇతర విశేషాలు తెలుసుకున్నాం.
ఇప్పుడు బాణచక్రంలోని ఐదవ మేళకర్తరాగం లేక మొత్తంమీద, “కటపయాది సంకేత శాస్త్ర నిర్ణయం” ప్రకారం 29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణ రాగం”, ఈ రాగంయొక్క కొన్ని ప్రధాన జన్యరాగాల పరిచయాదికాలు ఇక్కడినుండి గ్రహించే ప్రయత్నం చేద్దాం. పరిచయానికిముందు విలక్షణమైన ఒక అద్భుత వృత్తాంతాన్ని ఈ సందర్భంలో మీతో పంచుకోవాలి.
అది 1954—1955 సంవత్సరాల కాలం. అది మదరాసు (ఇప్పటి చెన్నై) మహానగరం. మార్గశీర్షమాసంలో (ధనుర్మాసంలో) వార్షిక “సంగీత—నాట్య మహోత్సవాలు” పండుగలు జరుగుతున్న రోజులు, అవి. సుమారు 28 సంవత్సరాల వయస్సు ఉన్న కవి, సంస్కృతాంధ్ర పండితులు ఐన మా డాడాయి చిన్నాన్నగారు (శ్రీ చాగంటి గోపాలకృష్ణమూర్తి గారు, M.A., —> “ఆంధ్రకవితరంగిణి” గ్రంథకర్త ఐన శ్రీ చాగంటి శేషయ్యగారి మూడవ కుమారుడు) మదరాసు Presidency Collegeలో తెలుగు విభాగంలో ఉపన్యాసకులుగా పని చేస్తున్నారు. ఆయన సకుటుంబంగా తిరువళ్ళిక్కేణి (Triplicane) లో నివాసం ఉండేవారు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత సాహిత్యాలయందు అపార గాఢ అభిరుచి ఉండడం వలన వాటిని లోతుగా అధ్యయనం చేసేవారు. అయితే, అప్పటికి సంగీత,నాట్యాలపట్ల ఆయనకి ఏమాత్రమూ అభిరుచి కలగలేదని ఆయన నాతో చెప్పేరు.
వయస్సులోను ఉద్యోగానుభవంలోను అధికులైన ఒక సహోద్యోగి (Senior Colleague) సంగీత-నాట్యాలలో అమితప్రీతి కలిగినవారు. అందువలన వారు రోజూ విడవకుండా వివిధ సంగీతసభలలోని సంగీతకార్యక్రమాలకి వెళ్ళివచ్చి ఎప్పటికప్పుడు మా చిన్నాన్నగారితో విశేషాలు ముచ్చటించేవారు. మా చిన్నాన్నగారు మౌనశ్రోతగా వింటూండేవారు. ఇలాగ కొన్ని రోజులు గడిచేక వారు మా చిన్నాన్నగారిని ఒక ప్రత్యేకసంగీతసభకి రావలసినదిగా కోరేరు. అప్పుడు చిన్నాన్నగారు వారి మిత్రులతో తనకు సంగీతంలో ఏమాత్రమూ కనీసపరిచయం లేదని, దానియందు అభిరుచి బొత్తిగా శూన్యమని, రోజూ వారి మిత్రులు చెప్పే సంగీతసభల వివరాలు ఏ రుచీ లేకపోయినా, మొహమాటం వలన వినడం జరుగుతోందని,అందువలన సంగీతసభలకి రాలేనని చెప్పేసేరు. అప్పుడు వారి మిత్రులు, “ఆ విషయాలు మీ ముఖకవళికలనిబట్టి నేనూ గ్రహించేను. కాని మిగిలిన అన్ని సంగీతసభలు వేరు. ఈ రోజు మనం వెళ్ళబోయే ఈ సంగీతసభ విలక్షణంగా ఉంటుంది. అందువలన మీరు ఈ ఒక్క సంగీతసభకి మారుమాట్లాడకుండా రావలసిందే! నేను నా మిత్రులైన సంగీతసభానిర్వాహకులకి చెప్పి మన ఇద్దరికి రెండు సీట్లు ప్రత్యేకంగా రిజర్వు చేయించేను. మీకు మరీ నచ్చకపోతే మధ్యలో వచ్చేద్దాం!” అన్నారు. అప్పుడు మా చిన్నాన్నగారు తప్పించుకునే దారిలేక మొహమాటపడి (సభామధ్యంలో వచ్చేయవచ్చుకదా, అనుకొని) ఆ సంగీతం కచేరీకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మిగిలిన వివరాలు ఆయన మాటలలోనే (నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు) చెప్పే ప్రయత్నం చేస్తాను.
(సశేషం)