సంగీతం—నాదవేదం—43
24—4—2021; శనివారం.
ॐ
హరికాంభోజికి తరువాయి జన్యరాగం సరస్వతీమనోహరి రాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి “ఎంత వేడుకొందు రాఘవా! ~ పంతమేలరా? ఓ రాఘవా! (దేశాదితాళం)” అనే ఒక కృతిని రచించేరు.
దీక్షితస్వామి “సరస్వతీమనోహరి! శంకరి! సదానందలహరి! గౌరి! శంకరి! ॥సరస్వతీమనోహరి॥ (ఆదితాళం)” అనే ఒక కృతిని ఈ రాగంలో కూర్చడం జరిగింది.
ఆ పిమ్మట, మరొక జన్యరాగమైన స్వరావళిరాగంలో త్యాగరాజస్వామి “ప్రారబ్ధమిట్లుండగా ఒరులనన ~ పనిలేదు నీవుండగ ॥ప్రారబ్ధమిట్లుండగా॥ (ఝంపెతాళం)” అనే ఒక కృతిని కడు రమ్యంగా చేసేరు. ఈ రాగంలో ఈ ఒక్క కృతి మాత్రమే లభ్యం అవుతోంది. ఈ రాగాన్ని ఇతరవాగ్గేయకారులెవ్వరూ తమ-తమ రచనలలో వినియోగించినట్లు కనబడదు.
ఆ తర్వాత జన్యరాగం సుప్రసిద్ధ జనరంజకమైన సా(శ్యా)మరాగం. త్యాగరాజస్వామివారు, “ఎటులైన భక్తి వచ్చుటకే యత్నముసేయవే ఓ మనసా! ॥ఎటులైన॥ (చాపుతాళం); శాంతములేక సౌఖ్యము లేదు ~ సారసదళనయన! ॥శాంతములేక॥ (దేశాదితాళం); శివాపరాధము సేయరాదు (ఆదితాళం)” అనే మూడు కృతులని సామరాగంలో స్వరపరిచేరు.
దీక్షితస్వామి సామరాగంలో “అన్నపూర్ణే! విశాలాక్షి! అఖిలభువనసాక్షి! కటాక్షి! ॥అన్నపూర్ణే!॥ (ఆదితాళం); గురుగుహాయ భక్తానుగ్రహాయ కుమారాయ నమో నమస్తే ॥గురుగుహాయ॥ (ఆదితాళం); పర్వతవర్ధని! పాహి మాం ~ పరశివతత్త్వస్వరూపిణి! శ్రీ ॥పర్వతవర్ధని!॥ (ఆదితాళం); త్రిపురసుందరి! శంకరి! గురుగుహజనని! మామవ ॥త్రిపురసుందరి॥ (రూపకతాళం)” అనే కృతులని రచించేరు.
కర్ణాటక సంగీత వాగ్గేయకార మూర్తిత్రయం అనంతరం సంగీతరచనలు చేసిన వాగ్గేయకారులలో గోపాలకృష్ణభారతి, హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్, పాపనాశం శివన్, మైసూర్ వాసుదేవాచార్, వేదనాయకం పిళ్ళై మొదలైన మహామహులు సామరాగం లో రచనలు చేసేరు.
ఆ తదుపరి చెప్పవలసినది సురటిరాగం. ఇది ఔడవ (ఐదుస్వరాలు) ~ సంపూర్ణ (సప్తస్వరాలు) కలిగిన రాగం. అవరోహణలో వక్రసంచారం ఉన్న రాగం. ఇది ఉపాంగరాగం. తమిళనాడులో సంగీతసభాప్రపంచంలో “ఆది నాట్టై ~ అంత్య సురటి” అనే సామెతలో చెప్పబడినరాగం. అంటే, సంగీతసభలని “నాటరాగం” తో ప్రారంభించి, “సురటిరాగం” తో ముగించాలి అని ఈ నానుడికి అర్థం. మంగళమయమైన రాగం కావడం వలన “సురటిరాగం” మంగళహారతులకి, ముఖ్యంగా సంగీతసభాసమాప్తికి అనూచానంగా వినియోగించబడుతున్న గొప్ప రాగం. “మధ్యమావతిరాగం”, “సురటిరాగం” సభానిర్వహణలో సంభవించిన దోషాలనన్నింటినీ పరిహరింపజేసి, సర్వశుభాలని సమకూర్చ గలిగిన దివ్యప్రభావం సహజంగానే కలిగివున్న రాగాలు. “సురటిరాగం” ద్వారా ప్రధానంగా భక్తి, ప్రేమాతిశయం, వేడికోలు, శరణాగతి, శుభాభిలాషావ్యక్తీకరణ మొదలైన భావాలని తెలియజేయవచ్చు. ఈ రాగాన్ని కొందరు శాస్త్రకారులు, “ధీరశంకరాభరణరాగం (29వ మేళకర్త)” జన్యరాగంగా పరిగణించేరు. తమిళభాషలో ఈ రాగాన్ని “సురుట్టి రాగం” అంటారు.
త్యాగరాజస్వామివారు, సురటిరాగంలో, “గీతార్థము సంగీతానందము ~ నీ తావున చూడరా! ఓ మనసా! (దేశాదితాళం); పతికి హారతీరె, సీతా ॥పతికి॥ (ఆదితాళం); భజనపరుల కేల దండ~పాణి భయము మనసా! (రూపకతాళం); మా కులమున కిహ-పరమొసగిన ~ నీకు మంగళం, శుభమంగళం (చాపుతాళం); రామచంద్ర! నీ దయ ~ రామ! ఏల రాదయ? ॥రామచంద్ర!॥ (దేశాదితాళం); రామదైవమా! రాగ-రాగ లోభమా? (రూపకతాళం); వేరెవ్వరే గతి? ~ వేమారులకు సీతాపతి (దేశాదితాళం); శృంగారించుకొని వెడలిరి శ్రీకృష్ణునితోను (ఆదితాళం); పరాముఖమేలరా? రామయ్య (ఆదితాళం); భిక్షాటనవేష! (మిశ్రచాపుతాళం)” అనే వివిధ కృతులని విరచించేరు.
దీక్షితస్వామి సురటి రాగం లో, “అంగారకమాశ్రయామ్యహం వినతాశ్రితజన ~ మందారం మంగళవారం భూమికుమారం వారం వారం (రూపకతాళం); బాలకుచాంబికే! మామవ వరదాయికే! శ్రీ ॥బాలకుచాంబికే!॥ (రూపకతాళం); బాలసుబ్రహ్మణ్యం భజేsహం ~ భక్తకల్పభూరుహం (ఆదితాళం); గోవిందరాజాయ నమస్తే ~ నమస్తే (రూపకతాళం); లలితాపరమేశ్వరీ జయతి ~ లక్ష్మీ వాణీ నుత జగదంబా (ఆదితాళం); శ్రీవాంఛనాథం భజేsహం ~ శ్రీమంగళాంబాసమేతం (ఆదితాళం); శ్రీవేంకటగిరీశమాలోకయే ~ వినాయకతురగారూఢం (ఆదితాళం)” అనే కృతులని రచించేరు.
మూర్తిత్రయం తరువాత కాలంలో, సురటిరాగంలో కృతులను కూర్చిన మహానుభావులలో సర్వశ్రీ గోపాలకృష్ణభారతి, పల్లవి శేషయ్యర్, పాపనాశం శివన్, పొన్నయ్యాపిళ్ళై, రామలింగసేతుపతి, సదాశివ బ్రహ్మేంద్రులు, శుద్ధానందభారతి, ఉపనిషద్బ్రహ్మేంద్రయోగి వరులు, మైసూర్ వాసుదేవాచార్య, వాలాజాపేట వెంకటరమణ భాగవతులు మొదలైనవారు కొందరు ఉన్నారు.
ఈ విధంగా సురటిరాగంతో 28వ మేళకర్త అయిన హరికాంభోజిరాగం, ఆ రాగజన్యమైన కొన్ని ముఖ్యరాగాలు గురించిన పరిచయానికి ఇంతటితో మంగళం పలుకుదాం. స్వస్తి! తథాsస్తు!
(సశేషం)