సంగీతం—నాదవేదం—37
13—03—2021; శనివారము.
ॐ
తరువాయి “హరికాంభోజి” నుండి జన్యరాగం ఒక అపూర్వరాగం. దీనిపేరు ప్రతాపవరాళి రాగం. ఇది చతుస్స్వరి—షాడవ రాగం. ఆరోహణలో గ—ధ—ని స్వరాలు, అవరోహణలో ని స్వరమూ వర్జ్యస్వరాలు. ఈ రాగంలో త్యాగరాజస్వామి విననాసకొని యున్నానురా / విశ్వరూపుడనే ॥విననాస॥ (ఆదితాళం) అనే కృతిని రచించేరు.
ఆ పిదప ఫలరంజని రాగం లో, ఆదితాళం లో, త్యాగయ్యగారు రచించిన కృతి, “శ్రీనారసింహ! మాం పాహి క్షీరాబ్ధికన్యకారమణ!” లభిస్తోంది. (ఫలరంజనిరాగం కాకుండా, ఫలమంజరిరాగం అనేది వేరేగా ఉంది. ఇది 22వ మేళకర్త అయిన “ఖరహరప్రియరాగం” నుండి జన్యరాగం. ఈ రాగంలో, దేశాదితాళంలో, “సనాతన! పరమపావన! / ఘనాఘనవర్ణ! కమలానన! ॥సనాతన! ॥ అనే కృతిని త్యాగరాజస్వామి రచించేరు.).
ఆ పిమ్మట బలహంసరాగం గురించి చెప్పుకోవాలి. ఇది “ఔడవ—సంపూర్ణ” రాగం. గాంధారం(గ); నిషాదం(ని) ఆరోహణంలో వర్జ్యస్వరాలు. ఈ రాగంలో, “ఇక కావలసినదేమి? మనసా! సుఖమున నుండవదేమి? (ఆదితాళం); తలిదండ్రులు గల పేరుగాని / ఇల నీ సరిదైవము లెవరే? (ఆదితాళం); దండము పెట్టేనురా కోదండపాణి! చూడరా! (ఆదితాళం); నినుబాసి యెట్లు యుందురో! నిర్మలాత్ములౌ జనులు (ఆదితాళం); రామ ఏవ దైవతమ్ రఘుకులతిలకో మే ॥రామ ఏవ॥ (రూపకతాళం); రామ! సీతారామ! రామ! రాజతనయ! రామ! దశరథరామ! సీతారామ! రఘుకులాబ్ధిసోమ! (ఆదితాళం); విరాజతురగ! రాజరాజేశ్వర! నిరామయుని జేయవే! (ఆదితాళం); పరులను వేడను, పతితపావనుడ! (ఆదితాళం)” అనే కృతులని త్యాగరాజస్వామి రచించేరు.
దీక్షితవర్యులు “గురుగుహాదన్యమ్ — ఝంపతాళం” అనే కృతిని బలహంసరాగంలో రచించేరు.
బలహంసరాగంలో పట్టణం సుబ్రమణియఅయ్యరువారు, మైసూరు వాసుదేవాచార్య, పాపనాశం శివన్ వర్యులు మొదలైన మహామహులు కృతులను రచించేరు.
తదుపరి రాగం బహుదా(ధా)రి రాగం. త్యాగరాజస్వామి రచించిన సుప్రసిద్ధ మహామనోహరకృతి బ్రోవభారమా! రఘురామ! భువనమెల్ల నీవై నన్నొకని—ఆదితాళం వలన ఈ అపూర్వరాగం లోకప్రశస్తిని పొందింది.
బహుదా(ధా)రి రాగంలో శ్రీ మైసూరు వాసుదేవాచార్య, శ్రీ జి.ఎన్. బాలసుబ్రమణియం, శ్రీ టి. చౌడయ్య, శ్రీ ఎన్.ఎస్. చిదంబరం, శ్రీమతి నీలా రామమూర్తి మొదలైన వాగ్గేయకర్తలు రచనలను చేసేరు.
బంగాళరాగం మరొక హరికాంభోజిజన్యరాగం. “గిరిరాజసుతాతనయ! సదయ! (దేశాదితాళం); మునుపే తెలియకపోయెనా? మునినుత! దయలేదాయెనా? (ఆదితాళం); సాక్షి లేదనుచు సాధింపకే! సత్యసంధ! సద్భక్తపాలక! (దేశాదితాళం)” అనే మూడు కృతులని త్యాగరాజస్వామి ఈ బంగాళరాగంలో విరచించేరు.
మరొక హరికాంభోజి జన్యమైన రాగం, మాళవిరాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి “నెనరుంచినాను అన్నిటికి నిదానుడని నేను నీదుపై (ఆదితాళం) అనే ఒక కృతిని కూర్చేరు.
సర్వశ్రీ ముత్తయ్య భాగవతులు, పట్ణం సుబ్రమణియఅయ్యరు, జి.ఎన్. బాలసుబ్రమణియం, శుద్ధానందభారతి, ఉపనిషద్బ్రహ్మేంద్రయోగి, స్పెన్సర్ వేణుగోపాల్ మొదలైన వాగ్గేయకారులు ఈ మాళవిరాగంలో కృతులను రచించేరు.
(సశేషం)