సంగీతం—నాదవేదం—36
06—03—2021; శనివారము.
ॐ
హరికాంభోజి రాగం నుండి వచ్చిన మరొక జన్యరాగం నారాయణగౌళ రాగం! నారాయణగౌళ రాగం, షాడవ—సంపూర్ణ రాగం. ఆరోహణలో గాంధారం వర్జ్యస్వరం. ఆరోహణ—అవరోహణ రెండింటిలోను వక్రసంచారాలు ఉంటాయి. ఇది ఒక అపూర్వ (అరుదైన) రాగం.
త్యాగరాజస్వామివారు, నారాయణగౌళ రాగంలో — ఇంక దయ రాకుంటే ఎంతని సైరింతురా! (ఆది తాళం); ఇన్నాళ్ళు దయరాకున్న వైనమేమి? / ఇప్పుడైన తెలుపవయ్యా! (చాపు తాళం); కదలేవాడు కాడే, రాముడు కథలెన్నో కలవాడె! (ఆది తాళం); దర్శనము సేయ నా తరమా? (ఝంప తాళం) అనే నాలుగు కృతులు చేసినట్లు తెలియవస్తోంది.
దీక్షితస్వామివారు నీలోత్పలాంబా జయతి / నిత్య శుద్ధశుభదాయికా (మిశ్రచాపు తాళం); శ్రీరామం రవికులాబ్ధిసోమం / శ్రితకల్పభూరుహం భజేsహం (ఆది తాళం) అనే రెండు కృతులని నారాయణగౌళరాగం లో విరచించేరు.
తరువాత హరికాంభోజినుండి జన్యరాగం నారాయణి రాగం. ఈ రాగంలో త్యాగరాజస్వామి భజనసేయు మార్గమునుజూపవే / పరమభాగవత భాగధేయ సద్ ॥భజన సేయు॥ (దేశాది తాళం); రామా! నీవేగాని నన్ను / రక్షించేవారెవరే? ॥రామా!॥ (ఆది తాళం) అనే రెండు కృతులని కూర్పు చేసేరు.
దీక్షితస్వామి, నారాయణిరాగంలో, మిశ్రచాపుతాళంలో, “మహిషాసురమర్ద్దినీం నమామి / మహనీయ కపర్ద్దినీం ॥మహిషాసురమర్ద్దినీం॥ అనే ఏకైకకృతిని రచించినట్లుగా ఆధారాలు తెలియజేస్తున్నాయి.
ఆ పిమ్మట హరికాంభోజి రాగంనుండి జన్యరాగమైన పండిత-పామర ప్రజారంజకమైన ప్రసిద్ధరాగం, నీలాంబరి గురించి తెలుసుకోవాలి. నీలాంబరిరాగం సంపూర్ణ—షాడవ రాగం. ఆరోహణలో పూర్తిగా సప్తస్వరాలు ఉండగా, అవరోహణలో “ధైవతం” వర్జ్యస్వరం కనుక ఆరు స్వరాలే ఉంటాయి. ఆరోహణ—అవరోహణ రెండింటిలోను వక్రసంచారాలు ఉంటాయి. అంతేకాదు! నీలాంబరిరాగంలో “కైశికి నిషాదంతోబాటు, కాకలి నిషాదం” కూడా ప్రయోగింపబడుతుంది. అందువలన ఇది “భాషాంగరాగం”! అయితే కైశికినిషాదం సహజస్వరంగాను, కాకలినిషాదం అన్యస్వరంగాను తీసుకుంటే, దీనిని “హరికాంభోజినుండి జన్యరాగం” గా వర్గీకరించడం జరుగుతుంది. అలాగ కాకండా కాకలినిషాదం సహజస్వరంగాను, కైశికినిషాదం అన్యస్వరంగాను భావిస్తే, నీలాంబరిని “ధీరశంకరాభరణరాగ జన్యం” గా విభజించవలసివస్తుంది. అందువలన కొందరు శాస్త్రకారులు “నీలాంబరి” రాగాన్ని 28వ మేళకర్త హరికాంభోజి జన్యరాగంగా పరిగణిస్తే, మరికొందరు విద్వాంసులు “నీలాంబరి” రాగాన్ని 29వ మేళకర్త ఐన ధీరశంకరాభరణరాగజన్యంగా భావించేరు. ఆ విధంగా పరిగణించడానికి శాస్త్రసమ్మతహేతువు ఉంది. రెండు వర్గీకరణలు సమంజసమైనవే!
నీలాంబరి రాగం చౌకకాలప్రయోగాలలో ౘాలా రమణీయంగాను, కమనీయంగాను ఉంటుంది.
త్యాగరాజస్వామి — “ఉయ్యాలలూగవయ్యా! శ్రీరామ! (ఖండచాపు తాళం); ఎన్నగ మనసుకురాని పన్నగశాయి సొగసు / పన్నుగ కనుగొనని కన్నులేలె? కంటి మిన్న లేలె? (ఆదితాళం); నీకే దయరాక నే చేయు పనులెల్ల / నెరవేరునా? రామ! (చాపుతాళం); మాటాడవేమి? నాతో మాధుర్య పూర్ణాధర! (ఆదితాళం); లాలి యూగవే మా పాలి దైవమా! (రూపక తాళం); శ్రీరామ! రామ! రామ! శ్రీమానసాబ్ధిసోమ! నారాయణాప్తకామ! నళినాక్ష! పవ్వళించు (ఖండచాపు తాళం); నీజేసిన విచిత్రము (మిశ్రచాపు తాళం) అనే కృతులను “నీలాంబరి రాగం” లో విరచించేరు.
దీక్షితులవారు — అంబ! నీలయతాక్షి! కరుణాకటాక్షి! అఖిలలోకసాక్షి! కటాక్షి! (ఆది తాళం); నీలాంగం హరిం నిత్యం స్మరామి (ఖండ ఏక తాళం); సిద్ధీశ్వరాయ నమస్తే! జగత్ప్రసిద్ధేశ్వరాయ నమస్తే! (మిశ్ర ఏక తాళం); త్యాగరాజం భజేsహం సతతం అహం సతతం త్యాగరాజం భజేsహం (రూపక తాళం) అనే నాలుగు కృతులని “నీలాంబరి రాగం” లో నిర్మించేరు.
నీలాంబరి రాగంలో లాలిపాటలు (Lullabies) ౘాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాగంలో ప్రేమ, భక్తి, విన్నపం, వేడుకోలు మొదలైన భావాలు పరిపక్వంగా పలుకుతాయి. అనేకసుప్రసిద్ధ వాగ్గేయకారులు నీలాంబరిరాగంలో నవరసభరితమైన వివిధ రచనలని సొగసులూరేటట్లు చేసేరు.
(సశేషం).7:07 AM