సంగీతం—నాదవేదం—35
27—02—2021; శనివారము.
ॐ
జనకరాగమైన హరికాంభోజి యొక్క జన్యరాగాలలో “నాటకురంజీరాగం” ౘాలా ముఖ్యమైనది. ఈ రాగం అనేకవిధాల విలక్షణమైనది. గ్రంథాలలో పరిశీలిస్తే ఇది అత్యంతప్రాచీనతమరాగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
ఆరోహణావరోహణాత్మక స్వరనిర్మాణ పరంగా “నాటకురంజి రాగం” ౘాలా సంక్లిష్టస్వరూపం కలిగినది. ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం గాను; సంపూర్ణ—షాడవ రాగం గాను; షాడవ—షాడవ రాగం గాను; షాడవ—ఔడవ రాగం గాను అనేకవిధాల స్వరూపం లక్షణగ్రంథాలలో వివరించబడింది. కాని ప్రయోగంలో ఈ లక్షణాలనన్నీ పుణికి పుచ్చుకుని ఈ హరికాంభోజి జన్యమైన నాటకురంజి రాగం వాగ్గేయకారుల చేతులలో వివిధలక్షణశోభితమై విలసిల్లుతోంది. అంతేకాదు, నాటకురంజి రాగం ఆరోహణ—అవరోహణలలో వక్రసంచారాలు చోటు చేసుకుంటున్నాయి.
ఒకానొకకాలంలో మహావైభవంతో ఒక అబ్బురమైన వెలుగు వెలిగిన ఈ మహారాగంలో అనేక రకాలైన సంగీతరచనలని మహావాగ్గేయకారులందరూ చేసేరు. ఆ పైన ఈ రాగం సభాసంగీతంలో ప్రధానరాగగౌరవాన్ని, అద్భుతమైన సంపూర్ణ మనోధర్మంతో నిండిన రాగం—తానం—పల్లవి ప్రయోగపూజ్యతనికూడా విరివిగా పొందిన మహనీయచరిత్రని కలిగి ఉంది. విస్తృతమైన ప్రయోగాలు, విపులమైన సంచారాలు విరివిగా ఉండడంవలన సంగీతకళాకారుల సృజనాత్మకవిద్యావైభవం ఈ నాటకురంజి రాగంలో సర్వకళాత్మకశోభలతో సరసజ్ఞుల రసహృదయాలని ఆనందమయం చేస్తుంది.
నాటకురంజి రాగంలో త్యాగరాజస్వామివారు — “కువలయ దళ నయన! బ్రోవవే / కుంద కుట్మల రదన! (ఆది తాళం); మనసు విషయ నట-విటులకొసగితే / మా రాముని కృప కల్గునో? మనసా (ఆది తాళం);” (?ఓదవనేశ! పరాత్పరా! ఆది తాళం?) అనే కృతులను రచించేరు.
ముద్దు(త్తు)స్వామి దీక్షితవర్యులు — “బాలాంబికాయై నమస్తే / వరదాయై శ్రీ ॥బాలాంబికాయై॥ (రూపక తాళం); బుధమాశ్రయామి సతతం / సురవినుతం చంద్రతారాసుతం ॥బుధమాశ్రయామి॥ (మిశ్రఝంప తాళం); గజాధీశాదన్యం న జానేsహం / గురుస్వరూపావతారిణో ॥గజాధీశాదన్యం॥ (మిశ్రచాపు తాళం); పార్వతీకుమారం భావయే సతతం / శరవణభవ గురుగుహం శ్రీ ॥పార్వతీకుమారం॥ (రూపక తాళం); శివకామీపతిం చింతయేsహం / శ్రీగురుగుహపూజిత పదాంభోరుహం ॥శివకామీపతిం॥ (ఆది తాళం)” అనే కృతులను నాటకురంజి రాగంలో రచించేరు.
“మాయమ్మ నన్ను బ్రోవవమ్మ! / మహామాయ! ఉమా! ॥మాయమ్మ॥ (ఆదితాళం)” అనే అందమైన కృతిని శ్రీశ్యామాశాస్త్రివర్యులు నాటకురంజి రాగంలో రచించి శ్రీమాతపాదారవిందాలని అలంకరించేరు.
మూర్తిత్రయంవారి ముందు కాలంలోని భద్రాద్రి రామదాసుగారి కృతి “ఏడనున్నాడో భద్రాద్రివాసుడేడనున్నాడో / నా పాలి రాముడేడనున్నాడో” (ఆది తాళం) అనే కృతి నాటకురంజి రాగంలో కూర్చబడింది.
సర్వశ్రీ మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, ఎం.డి.రామనాథన్, పాపనాశం శివన్, పట్ణం సుబ్రమణ్య ఐయ్యర్, పొన్నయ్యా పిళ్ళై, స్వాతి తిరునాళ్ మహారాజా, ఉపనిషద్ బ్రహ్మేంద్రయోగి, మైసూర్ వాసుదేవాచార్య, వీణ కుప్పయ్యర్, వీణ శేషన్న మొదలైన వాగ్గేయకారుల కృతులు నాటకురంజి రాగంలో కూర్చబడినవి.
(సశేషము)