సంగీతం—నాదవేదం—31

30—01—2021; శనివారము.

కొన్ని రాగాలు వాటికి అవిగా పేరు పొందినవి కావు. అటువంటి రాగాలలో సుప్రసిద్ధమైన కొన్ని కృతులు కూర్చబడి ఉండడం వలన ఆ రాగాలకి గుర్తింపు వస్తుంది. ఉదాహరణకి కాపినారాయణి రాగం అటువంటిది. త్యాగరాజస్వామివారు మహారాజుగా శ్రీరామచంద్రుని గుణగణాలని కీర్తిస్తూ, క్షాత్రధర్మనియతి కలిగిన ఆయన సౌశీల్యంగురించి సరస సామ-దాన-భేద-దండ చతుర!/ సాటి దైవమెవరే? బ్రోవవే! (— దేశాది తాళంలో) అని వర్ణించి, ఆ వర్ణనకు అనుగుణమైన ౘక్కనైన ఉదాహరణలను శ్రీరామకథ నుండి రుజువుగా చూపినారు. అయ్యవారికి ముందువారు కాని, ఆయన సమకాలికులు కాని ఈ రాగం వినియోగించిన జాడ తెలియరాలేదు. త్యాగరాజస్వామివారి ప్రత్యక్ష గురు~శిష్య పరంపరలోనే వచ్చిన శ్రీ పట్ణం సుబ్రమణియ అయ్యర్ గారు తరువాత కాలంలో కాపీనారాయణి రాగంలో ఒక కృతిని చేసేరు.

హరికాంభోజికి జన్యం అయిన కాంభోజి రాగం విశ్వవిఖ్యాతిని పొందిన సరస, రమణీయ మహారాగం అని చెప్పి తీరవలసినదే! ఈ రాగానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో యివి కొన్ని:—

1) ఇది షాఢవ—సంపూర్ణ రాగం. కాంభోజిరాగం ఆరోహణలో “నిషాదం/ని” వర్జ్యస్వరం. అందువలన దీనిలో ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో సప్తస్వరాలు ఉంటాయి.

2) సాంకేతికంగా దీని జనకరాగమైన హరికాంభోజి లో లేని అన్యస్వరం దీనిలో ప్రయోగించ బడుతుంది. జనకరాగమైన హరికాంభోజిలోని అరోహణ/అవరోహణలలో కైశికి నిషాదం మాత్రమే వినియోగించబడుతుందని తెలుసుకున్నాం. కాని “కాంభోజి రాగం” లో ఆరోహణలో నిషాదం ఉండనేవుండదు. అవరోహణలో కైశికి నిషాదంతోపాటు, “కాకలినిషాదం” కూడా ప్రయోగించ బడుతుంది. అయితే, “అన్యస్వరమైన కాకలినిషాదం” కొన్ని ప్రత్యేక స్వరప్రయోగాలలో (in certain specific notational phrases only) మాత్రమే చోటు చేసుకుంటుంది. ఈ విధంగా జనకరాగంలో లేని “అన్యస్వరప్రయోగం” కలిగిన రాగాన్ని కర్ణాటకసంగీత సాంకేతిక పరిభాషలో, “భాషాంగరాగం” అంటారు. హిందూస్థానీ సంగీతంలో ఇలాగ అన్యస్వరప్రయోగం ఉన్న రాగాన్ని “ఠుమ్రీ అంగ్ రాగం” అంటారు.

3) కాంభోజి సంప్రదాయసిద్ధంగా “మహామంగళప్రదమైన రాగసముదాయం”లో ఒకటిగా పరిగణింపబడుతూ వుంది. అందువలన ఇది సార్వకాలికశుభఫలప్రదాయకరాగం. సంగీతసభలు కాంభోజి రాగవర్ణంతో ప్రారంభం కావడం పరిపాటి. దైవకార్యాలలోను, వివాహాది శుభకార్యాలలోను కాంభోజిరాగవినియోగం సర్వసాధారణం.

4) కాంభోజిరాగంలో విస్తృతమైన మధురసంచారాలు, విపులమైన సంగీతభావమయప్రయోగాలు, రసికజనానందదాయకరమైన స్వరవిన్యాసాలు విరివిగా ఉండడం వలన ఈమహారసమయరాగంలో సంగీతవిద్వాంసులు “రాగంతానంపల్లవి” ని చేయడానికి, రసజ్ఞులుఅది విని ఆనందడోలికలలో ఓలలాడడానికి ఔత్సుక్యం కలిగి ఉండడం సహజం.

5) అనేకరసనిధానమైన కాంభోజి భక్తి, శాంతం, ప్రణయం, రౌద్రం, పరిహాసం మొదలైన వివిధభావాలాని పలికించడానికి సహజంగానే అనువుగాను, అనుకూలంగాను ఉంటుంది. అందువలన “కాంభోజి విపుల రస నిధానం” అని రసికజనలోకంలో ప్రసిద్ధిని పొందింది.

(సశేషము)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *