సంగీతం—నాదవేదం—30
23—01—2021; శనివారము.
ॐ
28వ మేళకర్త లేక జనకరాగం— “హరికాంభోజి రాగం” నుండి ముఖ్యమైన కొన్ని జన్యరాగాలు, వాటిలో కూర్చబడిన ప్రధానకృతులు యొక్క వివరాలు క్రమంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
ఈశమనోహరిరాగంలో “మనసా! శ్రీరామచంద్రుని మరవకే ఏమరకే ఓ (మనసా!)—(ఆదితాళం); శ్రీజానకీమనోహర! శ్రీరాఘవ! (దేశాదితాళం)” అనే రెండు కృతులు త్యాగరాజస్వామి కూర్చేరు. దీక్షితస్వామివారు ఈ రాగంలో, అనంతబాలకృష్ణ! మామవ ముకుంద! శ్రీహరే! (ఆదితాళం); జగదీశమనోహరి జయ కరుణాలహరి — జయకరి త్రిపురసుందరి (రూపకతాళం); శ్రీగణనాథం భజ రే చిత్తపరాశక్తియుతం (రూపకతాళం) అనే మూడు కృతులని రచించేరు. గోపాలకృష్ణ భారతి, ముత్తయ్యభాగవతులు, వేదనాయకం పిళ్ళై మొదలైన వాగ్గేయకారులుకూడా ఈశమనోహరి రాగం లో కృతులను కూర్చేరు.
మరొక జన్యరాగమైన ఉమాభరణం రాగంలో “నిజమర్మములను దెలిసినవారిని — నీ వలయించే దేమొకో రామ!” (ఆదితాళం) అనే త్యాగరాజస్వామివారి కృతి ఒక్కటే రసజ్ఞులు వినగలిగిన కృతి లభ్యమౌతోంది.
మరొక జన్యరాగం, కమాసు/ఖమాస్ అనే రాగం. ఈ రాగం బాగా జనప్రియమైన రాగం! ఈ రాగంలో త్యాగరాజస్వామి రెండు కృతులు రచించేరు. సీతాపతీ! నా మనసున — సిద్ధాంతమని యున్నాను రా (దేశాది); సుజనజీవన! సుగుణభూషణ! రామ! (రూపకతాళం) అనేవే ఆ రెండు కృతులూను. దీక్షితస్వామివారు, ఈ రాగంలో, దండనాథయా రక్ష మాం — దైత్యకులాది జిత చతురయా శ్రీ (ఆదితాళం); శ్రీస్వామినాథాయ నమస్తే, నమస్తే (త్రిస్ర ఏక తాళం); సంతానగోపాలకృష్ణం ఉపాస్మహే శ్రీ (రూపకతాళం); సారసదళనయన సంకటహరణ హరే! — గోవింద! మాం పాహి (త్రిపుటతాళం); షడాననే సకలం అర్పయామి — సదా త్వత్పాదభక్తిం యామి (ఆదితాళం) అనే కృతులని కూర్చడం జరిగింది.
ఖమాస్ రాగం రసికజనమనోరంజకమైన రాగం కావడం వలన ౘాలామంది వాగ్గేయకారులు ఈ రాగంలో అనేకకీర్తనలని రచించేరు. సర్వశ్రీ ఘనం కృష్ణయ్యరు, గోపాలకృష్ణభారతి, ముత్తయ్యభాగవతులు, మైసూర్ సదాశివరావ్, మైసూర్ వాసుదేవాచార్ (సుప్రసిద్ధమైన “బ్రోచేవారెవరురా! నిను వినా రఘువరా! నను” అనే కృతి వీరిదే!), పాపనాశం శివన్ (వీరు ఖమాసులో ౘాలా కృతులను రచించినట్లున్నారు), పురందరదాసు, స్వాతి తిరునాళ్ మహారాజా, వేదనాయకం పిళ్ళై, వీణ కుప్పయ్యరు మొదలైన మహామహుల కృతులు ఈ రాగంలోనే రూపు దిద్దుకున్నాయి.
కేవలం భక్తిరసప్రధానమైన భావాలేకాక ఈ రాగంలో ప్రజ్ఞావంతులైన వాగ్గేయకారులు విరహ, శృంగారాది భావాలనికూడా విలక్షణకౌశలంతో ప్రభావవంతంగా పలికించేరు. అందువలననే ఖమాసు రాగం దరువులు, పదాలు, జావళీలు, తిల్లానాలు, రాగమాలికలు మొదలైన అనేక రసవంతమైన సంగీతప్రక్రియలకి ఆలవాలమయ్యింది. పట్ణం సుబ్రమణియ అయ్యర్ గారి జావళీ “అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటిమాట! (రూపకతాళం)”; ధర్మపురి సబ్బరాయర్/సుబ్బారావు గారు రచించిన “ఏరా! రారా! చెయి తేరా! యీ — మరుబారికి తాళగలేరా (ఆదితాళం); మరుబారి తాళలేనురా! నాసామి! (ఆదితాళం); నారీమణి నీకైనదిరా! జార! చోర! మా (ఆదితాళం); కొమ్మరో! వాని కెంతబిగువే — పిలచిన పలుకకున్నాడేమి సేయుదునే? (ఆదితాళం)”; తంజావూరు చిన్నయ్య రచించిన “జాన(ణ)రో ఈ మోహము సహింపలేనే (రూపకతాళం); పొమ్మనవే! వాని దానింటికి (ఆదితాళం)” మొదలైన అనేకానేక జావళీలు ఆయా జావళీకర్తలని “ఖమాస్ రాగం” ఎంతగా మోహపరవశులని చేసిందో రసజ్ఞజనైకవేద్యంగా నిరూపిస్తున్నాయి.
(సశేషం)