సంగీతం—నాదవేదం—29
16—01—2021; శనివారము.
ॐ
27వ మేళకర్త లేక జనకరాగం పేరు “సరసాంగి” (రి – గు – మ – ధ – ను). ఈ రాగం సంపూర్ణ — సంపూర్ణ రాగమే కదా! దీనిలోని స్వరసంపుటీకరణం ఈ విధంగా ఉంటుంది.
ఆధార స – చతుశ్శ్రుతి రి – అంతర గ – శుద్ధ మ – ప – శుద్ధ ధ – కాకలి ని – తారా స.
త్యాగరాజస్వామివారు సరసాంగి రాగం లో, దేశాదితాళంలో, “మేను జూచి మోసబోకుమీ (మోసబోకవే) మనసా / లోని జాడ లీలాగు గాదా!” అనే సరసమైన కృతిని రచించేరు.
దీక్షితస్వామివారి పద్ధతిలో ఈ రాగాన్ని సౌరసేన రాగం అని పిలుస్తారు. వారు ఈ రాగంలో సౌరసేనేశం వల్లీశం సుబ్రహ్మణ్యం భజేsహమనిశమ్ అనే కృతిని ఆదితాళంలో రచించేరు.
త్రిమూర్తుల తరువాత, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, గోపాలకృష్ణభారతి, వేదనాయగం పిళ్ళై, అంబుజం కృష్ణన్, హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతర్ మొదలైన వాగ్గేయకారులు సరసాంగి రాగం లో కృతులను కూర్చేరు.
28 వ మేళకర్త లేక జనకరాగం పేరు సుప్రసిద్ధమైన “హరికాంభోజి రాగం” (రి – గు – మ – ధి – ని). ఈ సంపూర్ణ — సంపూర్ణ రాగంలో స్వరావళి సంవిధానం ఈ విధంగా ఉంటుంది:—
ఆధార స – చతుశ్శ్రుతి రి – అంతర గ – శుద్ధ మ – ప – చతుశ్శ్రుతి ధ – కైశికి ని – తారా స.
ఒక్క గాంధారస్వరం మినహాయిస్తే, మిగిలిన రిషభం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం — ఈ ఐదుస్వరాల “గ్రహభేదప్రక్రియ” ద్వారా హరికాంభోజి, సంపూర్ణ మూర్ఛనకారకరాగం అని చెప్పాలి. “గ్రహభేదం” ద్వారా హరికాంభోజిరాగం నుండి, నర(ఠ)భైరవి, (ధీర) శంకరాభరణం, ఖరహరప్రియ, (హనుమ) తోడి, (మేచ) కల్యాణి అనే ఐదు రాగాలు ఏర్పడతాయి.
అత్యధిక “జన్యరాగాలు” కలిగిన జనకరాగాలలో హరికాంభోజి కూడా ఒక ప్రధానరాగం అని విస్తృతంగా పేరును సంపాదించింది.
దక్షిణభారతసంగీతపద్ధతిలోని హరికాంభోజి మేళకర్త * — ఉత్తరభారతసంగీతపద్ధతిలో *ఖమాజ్ ఠా(థా)ట్ గా పిలువబడుతోంది.
త్యాగరాజస్వామివారు జనకరాగమైన హరికాంభోజి లో రచించిన కృతులలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం:—
ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా (రూపకతాళం); ఎంత రాని తనకెంత పోని నీ చింత విడువజాల శ్రీరామ (దేశాదితాళం); ఎందుకు నిర్దయ ఎవరున్నారురా (దేశాదితాళం); ఒకమాట ఒకబాణము ఒకపత్నీవ్రతుడే మనసా! (రూపకతాళం); ౘని తోడి తేవే ఓ మనసా (ఆదితాళం); దినమణివంశ తిలకలావణ్య! దీనశరణ్య! (ఆదితాళం); నేనెందు వెతుకుదురా? హరి (ఆదితాళం); రామ! నన్ను బ్రోవరావేమొకో! లోకాభి(రామ!) (రూపకతాళం); వల్ల గాదనక సీతా — వల్లభా! బ్రోవు నా (వల్ల గాదనక) (రూపకతాళం); లాలి లాలీయని యూచేరావన / మాలి మాలిమితో జూచేరా (దేశాది).
త్యాగయ్యగారి తరువాత వాగ్గేయకారులలో సర్వశ్రీ గోపాలకృష్ణ భారతి, హరికేశనల్లూర్ ముత్తయ్యభాగవతులు, పాపనాశం శివన్, మైసూర్ సదాశివరావు, అరుణగిరి నాదర్, పల్లవి శేషయ్యర్ మొదలైన మహామహులైన వాగ్గేయకారులు హరికాంభోజి రాగం లో కృతులని రచించేరు.
హరికాంభోజి రాగానికి ప్రతిమధ్యమరాగం, 64వ మేళకర్తరాగం అయిన “వాచస్పతి రాగం”.
(సశేషము)