సంగీతం—నాదవేదం—28
09—01—2021; శనివారము.
ॐ
ఇప్పుడు 25వ—మేళకర్త లేక జనకరాగం మారరంజని రాగాన్ని పరిచయం చేసుకుందాం! ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి కూర్పు ఈ దిగువ యివ్వబడిన విధంగా ఉంటుంది.:—
ఆధార స. – చతుశ్శ్రుతి రి. – అంతర గ. – శు.మ.- ప. – శు.ధ. – శు.ని. – పై స.
మారరంజని రాగంలో, ఆదితాళంలో, త్యాగయ్యగారు మనసా! శ్రీరాముని దయలేక / మాయమైన వితమేమే? అనే ఒకే ఒక కృతిని చేసినట్లు తోచుచున్నది. ఇదికాక ఈ జనకరాగంలో శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి రమాపతినా—అనే సంస్కృతకృతిని, త్రిపుటతాళం లో మరొక రచన మనకి అందుబాటులో ఉంది.
ఈ రాగ జన్యం అయిన కేసరి రాగం, దేశాదితాళంలో “నన్ను కన్న తల్లీ! నా భాగ్యమా” అనే కృతి కొన్ని ప్రతులలో ఉంది. అయితే ఈ కృతిని మరికొన్ని ప్రతులలో 28వ మేళకర్త—హరికాంభోజి జన్యమైన సింధుకన్నడరాగం కీర్తనగా పేర్కొనడం జరిగింది.
తరువాత, లోకోత్తరమైన ఒక పరమాద్భుతరాగం, 26వ—మేళకర్త లేక జనకరాగం అయిన చారుకేశి గురించి చర్చించుకుందాం! ఈ రాగాన్ని ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారి అసంపూర్ణమేళరాగపద్ధతి లో తరంగిణి రాగం గా పేర్కొనడం జరిగింది. ఈ రాగం యొక్క స్వరస్వరూపం ఈ విధంగా ఉంటుంది:—
ఆధార స. – చతుశ్శ్రుతి రి. – అంతర గ. – శు.మ. – ప. – శు.ధ. – కై.ని. – తారా స.॥
ఈ రాగంలో విశేషం ఏమిటంటే, పూర్వాంగం అంటే స.- రి. – గ. – మ. — అనే నాలుగుస్వరాలు శంకరాభరణరాగం(హిందూస్థాని రాగ్ బిలావల్) లోని స్వరాలు; ఉత్తరాంగం అంటే ప. – ధ. – ని. – స. —అనే నాలుగు స్వరాలు తోడి (హిందూస్థానీ రాగ్ భైరవి) లోని స్వరాలు ఉంటాయి.
చారుకేశి “మూర్ఛనకారక మేళకర్త రాగం”. ఈ రాగంలోని మధ్యమం – పంచమం – నిషాదం”గ్రహభేద ప్రక్రియ” ద్వారా క్రమంగా గౌరీమనోహరి (23); నాటకప్రియ(10); వాచస్పతి (64) రాగాలని ఏర్పరుపజేస్తాయి.
చారుకేశి/తరంగిణి రాగం లో త్యాగరాజస్వామి వారి ఆడ మోడి గలదే! రామయ్య! మాట లాడ మోడి గలదే!—ఆదితాళం రచన లోకప్రసిద్ధిని పొందినది.
దీక్షితస్వామివారు తరంగిణి(చారుకేశి)రాగం లో మాయే! త్వం యాహి మాం బాధితుం కాహి (ఆది తాళం); పాలయ! మాం పరమేశ్వరి! కృపాకరి! శంకరి! (రూపక తాళం) అనే రెండు మహారమణీయకృతులు కూర్చేరు.
స్వాతి తిరునాళ్ మహారాజా వారి కృతి కృపయా పాలయ శౌరే! కరణారసావాస! కలుషార్తి విరామ! పాహి శౌరే! (మిశ్రచాపు తాళం) చారుకేశి రాగంలోనే స్వరరచన చేయబడింది.
వాయులీనమహావిద్వాంసులైన శ్రీ లాల్గుడి జయరామన్ గారు చారుకేశి రాగ వర్ణం రచించి, సంగీతశారదాంబికకి అపురూపమైన అలంకారం కైంకర్యం చేసేరు. అనేక గాన సభలలో విశ్వవిఖ్యాత గాయకశ్రీష్ఠులైన మహారాజపురం సంతానం గారు తరుచుగా తమ సంగీతసభా ప్రారంభాన్ని ఈ రాగవర్ణంతో చేసేవారు.
గజల్ గానంలోను, భావ/లలిత గీతాలలోను, భక్తి గీతాలలోను, నాటకరంగంలోను, వివిధ భారతీయ భాషా చలనచిత్రాలలోను చారుకేశి రాగం యొక్క ప్రయోగం అనేక సంగీతదర్శకులు చేసేరు. (ఉదాహరణకి దస్తక్ (1967) హిందీ చిత్రంలో సంగీతదర్శకులైన మదన్ మోహన్ జీ “చారుకేశి” లో బైయ్యా నా ధరో బలుమా పాటని స్వరపరిచగా లతాజీ అద్భుతంగా పాడి ఆ పాటని అజరామరం చేసేరు.)
చారుకేశిరాగం ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల సంగీతసంస్కృతులులో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అంశలోనో, ఛాయారూపంలోనో సాక్షాత్కరిస్తూండడం సంగీతప్రియులకి ఆరాధనీయమైన విషయం. Franz Schubert సువిఖ్యాతమైన “Impromptu C Minor Allegro molto moderato” లో చారుకేశి ఛాయాసంచారసుస్వనాలు రసజ్ఞులకి స్ఫురించడం అరుదు కాదు.
(సశేషం)