సంగీతం—నాదవేదం—26
26—12—2020; శనివారము.
ॐ
తరువాత, 23—వ మేళకర్తరాగం–గౌరీమనోహరి. ఈ రాగం 4వ చక్రమైన వేదచక్రం లో 5వ రాగం. అందువలన ఈ రాగం సంపూర్ణ–సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి ఈ విధంగా ఉంటుంది:—
ఆధార స-చతుశ్శ్రుతి రి-సాధారణ గ-శుద్ధ మ-ప-చతుశ్శ్రుతి ధ-కాకలి ని-తారా షడ్జం(స)
అనే స్వరాలు ఉంటాయి. ఇది మూర్ఛనకారక రాగం. గ్రహభేద సంగీత ప్రక్రియ ద్వారా ఈ రాగం లోని రి—మ—ప స్వరాలని ఆధార షడ్జంగా చేస్తే, వరుసగా, నాటకప్రియ(10); వాచస్పతి(64); చారుకేశి(26) మేళకర్త రాగాలు ఏర్పడతాయి.
గౌరీమనోహరి జనకరాగం లో త్యాగరాజస్వామివారు గురులేక యెటువంటి గుణికి తెలియగబోదు (ఝంపతాళం); * అనే ఒక సుప్రసిద్ధకృతిని, *పంచనదీశ! పాహి మాం (ఆదితాళం) అనే మరొక కృతిని రచించేరు. దీక్షితులవారి సంగీత సంప్రదాయ పద్ధతిలో ఈ రాగాన్ని గౌరీవేలావలీ రాగం అని పిలుస్తారు. కౌమారీ! గౌరీవేలావలీ! గానలోలే! సుశీలే! బాలే! (ఆదితాళం); పరాశక్తి! ఈశ్వరి! జగజ్జనని! (ఆదితాళం) అనే రెండు కృతులని రచించేరు. మూర్తిత్రయంవారి తరువాత ముత్తయ్య భాగవతులు, స్వాతి తిరునాళ్ మహారాజా, పాపనాశం శివన్, మైసూర్ వాసుదేవాచార్ మొదలైన మహానుభావులైన వాగ్గేయకారులు గౌరీమనోహరి రాగం లో రచనలు చేసేరు.
నాలుగవదైన వేదచక్రం లోని ఆఖరు రాగమైన 24వ—మేళకర్త వరుణప్రియ లేక వీరవసంత రాగం గురించి తెలుసుకుందాం! ఈ రాగం సంపూర్ణ–సంపూర్ణ రాగం. ఈ రాగంలో స్వరావళి ఈ విధంగా ఉంటుంది:—
ఆధార స-చతుశ్శ్రుతి రి-సాధారణ గ-శుద్ధ మ-ప-షట్ శ్రుతి ధ-కాకలి ని-తారా స
త్యాగరాజస్వామివారు వీరవసంత/వరుణప్రియ జనకరాగం లో రచించినఔ ఏమని పొగడుదురా? శ్రీరామ! (ఆదితాళం) అనే ఒక కృతి తరచుగా సంగీతలోకంలో వినవస్తుంది. దీక్షితస్వామి వీరవసంత రాగం లో, ఏకామ్రనాథాయ నమస్తే, ఏకానేక ఫలదాయ (రూపకతాళం); వీరవసంత త్యాగరాజ తారయాశు కరుణానిధే జయ (ఆదితాళం) అనే రెండు కృతులు ఈ రాగంలో కూర్చేరు.
ఈ రెండు జనకరాగాలలోనే కృతులు రచింపబడినట్లుగా కనిపిస్తోంది.
(సశేషము)