సంగీతం—నాదవేదం—23

05—12—2020; శనివారము.

22వ జనకరాగం ఖరహరప్రియ కి చెందిన మహారాగం అనదగ్గది మధ్యమావతి రాగం. ఇది ఔఢవ—ఔఢవ రాగం. అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఐదుస్వరాలు ఉంటాయి. రెండింటిలోను గాంధారం – ధైవతం వర్జ్యస్వరాలు.

షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—శుద్ధమధ్యమం—పంచమం—కైశికి నిషాదం మధ్యమావతిరాగం లోని స్వరాలు. ఇది ఉపాంగరాగం. అంతేకాక ఇది సంపూర్ణ మూర్ఛనకారక రాగం. అంటే దీనిలోని రి—మ—ప—ని స్వరాలని గ్రహభేదప్రక్రియద్వారా షడ్జంగా మార్చి, 5—5 రాగాలుగా పునర్వ్యవస్థీకరిస్తే వరుసగా హిందోళరాగం, శుద్ధసావేరిరాగం, ఉదయరవిచంద్రికరాగం, మోహనరాగం వరుసగా ఏర్పడుతాయి.

ఇది ప్రాచీనరాగాలలో ఒకటి. అంతేకాక ఇది సంపూర్ణమంగళమయమైన, కల్యాణప్రదమైన రాగంగా కర్ణాటకసంగీతసంప్రదాయంలో సుప్రసిద్ధమయ్యింది. సంగీతసభలలో తెలిసి–తెలియక ఏవైనా పొరపాట్లు లేక దోషాలు జరిగితే వాటివలన ఏర్పడే దుష్పరిణామాలని నిర్మూలింపచేయకలిగిన శుభప్రదమైన రాగంగా దీనికి లోకప్రతీతి ఉందని అనుభవజ్ఞులైన పెద్దలు చెపుతారు. అందువలనే ప్రతిదక్షిణభారతసంగీతసభాసమాప్తిని మధ్యమావతి రాగంతోనే చేయడం లోకాచారంగా అనూచానంగా వస్తోంది.

ఇటువంటి మహామంగళమయ సౌందర్యసంపూర్ణరాగమైన మధ్యమావతిరాగంలో త్యాగరాజ స్వామివారు ౘాలా ౘాలా గొప్ప కృతులని రచించేరు. అడిగి సుఖము లెవ్వరనుభవించిరిరా? ఆదిమూలమా! రామ! (చాపు/రూపక తాళం); అలక లల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనొ (రూపకతాళం); ఎవరిచ్చిరిరా? శరచాపములు నీ కినకులాబ్ధి చంద్ర! (ఆదితాళం); దేవ! శ్రీతపస్తీర్థ పురనివాస! దేహి! భక్తిమధునా (త్రిపుటతాళం); నగుమోముగలవాని నా మనోహరుని – జగమేలు శూరుని జానకీవరుని (ఆదితాళం); నళినలోచన! నీవుగాక అన్యుల నమ్మ – నరజన్మమీడేరునా! (చాపుతాళం); ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా? – ముదితలార! జూతాము రారె! (ఆదితాళం); రామకథాసుధారసపానమొక – రాజ్యము చేసునే! (మధ్యాదితాళం); రామనామం భజరే! మానస! (ఆదితాళం); రామ! సమయము బ్రోవ – రా! నా పాలిదైవమా! (ఆదితాళం); వినాయకునివలెను బ్రోవవే! నిను – వినా వేల్పులెవరమ్మా! (ఆదితాళం); వేంకటేశ! నిను సేవింపను పది – వేల కనులు కావలెనయ్య! (ఆదితాళం); శరణు శరణనుచు మొరలిడిన నా – గిరములన్ని పరియాచకమౌనా! (ఆదితాళం); శ్రీరామ! జయరామ! – శృంగారరామ! (ఆదితాళం); నాదుపైబలికేరు నరులు (ఝంపతాళం) అనే కృతులనన్నింటిని త్యాగయ్యగారు మధ్యమావతిరాగం లోనే కూర్చేరు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *