సంగీతం—నాదవేదం—16
17—10—2020; శనివారము.
ఇప్పుడు 19—వ మేళకర్త రాగం అయిన జనకరాగం ఝంకారధ్వని లో కూర్చబడిన సంగీతకృతులని పరిచయం చేసుకుందాం. ఈ రాగంలో త్యాగరాజస్వామివారు స్వరరచన చేసిన కృతి ఫణిపతిశాయి మాం పాతు(ఆదితాళం) కృతి అప్పుడప్పుడు వినిపిస్తుంది! దీక్షితులవారి పద్ధతిలో ఇదే రాగాన్ని ఝంకారభ్రమరి అని పిలుస్తారు. ఈ రెండింటికీ ఒకే ఆరోహణ–అవరోహణ ఉన్నప్పటికీ, దీక్షితులవారి ఝంకారభ్రమరిలో ఆరోహణలో స్వరాలకి వక్రసంచారం ఉంటుంది. ఈ తేడాని గమనించాలి. ఝంకారభ్రమరిరాగంలో, ఆదితాళంలో, దీక్షితులవారు హిమాచలకుమారీం భజే త్రిపురసుందరీం—హ్రీంకార సరసీరుహ భ్రమరీం అనే అందమైన కృతిని రచించేరు.
ఈ జనకరాగం నుండి వచ్చిన జన్యరాగం చిత్తరంజని అరుదైనదైనా, దీనిలో సంస్కృత భాషలో రచించబడిన కృతి నాదతనుం అనిశం శంకరం—నమామి మే మనసా శిరసా (ఆదితాళం) బాగా లోకప్రసిద్ధమైనది. ఈ రాగంలోని జన్యరాగం పూర్ణలలిత లో కూర్చబడిన కలుగునా? పదనీరజ సేవ! గంధవాహ తనయ! (ఆది తాళం) అని ఒక మహామనోహర కృతి ఉంది.
20—వ మేళకర్త రాగం అయిన నఠ(ర)భైరవి జనకరాగం లో సాంకేతికంగా త్యాగయ్యగారి కృతులు ఏవీ లేవు. ఈ జనకరాగం లో నుండి ఏర్పడిన జన్యరాగం భైరవి లోనే అయ్యవారు కృతులని రచించేరు. జన్యరాగమైన భైరవి సంపూర్ణరాగమే అయినా ఇది భాషాంగరాగ జాతి కి చెందినది. భాషాంగరాగంలో జనకరాగస్వరాలకి అన్యమైన స్వరం/స్వరాలు జన్యరాగంలో ఉంటాయి. ఉదాహరణకి ఈ మేళకర్తరాగంలో—
షడ్జం-చతుశ్శ్రుతి రిషభం-సాధారణ గాంధారం-శుద్ధమధ్యమం-పంచమం- శుద్ధ ధైవతం-కైశికి నిషాదం-(తారా)షడ్జం ఉంటాయి.
కాని ఈ జనకరాగం నుండి జన్యరాగమైన భైరవి రాగం జాతి ప్రకారం సంపూర్ణ-సంపూర్ణ రాగమే ఐనా దీనిలోని కూర్పు ఈ విధంగా ఉంటుంది.
ఆరోహణ:– స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—శుద్ధ మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—(పై)స
అవరోహణ:–(పై)స—కైశికి ని—శుద్ధ ధ—ప—శుద్ధ మ—సాధారణ గ—చతుశ్శ్రుతి రి—స
భైరవి రాగం లోని ఈ ఆరోహణ—అవరోహణ లని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. ఆరోహణలో చతుశ్శ్రుతి ధైవతం—అవరోహణలో శుద్ధధైవతం అనే ప్రత్యేకలక్షణం ఈ రాగంలో గోచరిస్తోంది. ఈ వైలక్షణ్యం వలననే ఇది భాషాంగరాగం గా పరిగణింపబడుతోంది. 20-వ మేళకర్త లో శుద్ధ ధైవత ప్రయోగం మాత్రమే ఉంటుంది. చతుశ్శ్రుతి ధైవతం యొక్క ప్రయోగానికి ఇక్కడ శాస్త్రం ప్రకారం తావు లేదు. కాని సంగీతలోక వ్యవహారంలో ఇది భాషాంగరాగవర్గం లో ఉండడంవలన దీనిలో మేళకర్తరాగస్వభావానికి అన్యస్వరం ఐన చతుశ్శ్రుతి ధైవతం యొక్క ప్రయోగం ఈ రాగంలో చోటుచేసుకుంది. ఇక్కడ భైరవి రాగంయొక్క మరొక వైలక్షణ్యం మనం వివరించుకోవాలి. సర్వసాధారణంగా భాషాంగరాగాలలోని అన్యస్వరాలకి న్యాసస్వరప్రతిపత్తి ఉండదు. కాని భైరవిరాగంలోని చతుశ్శ్రుతి ధైవతం ఒక న్యాసస్వరం గా ఉంటుంది. ఈ భైరవి రాగం వాగ్గేయకారులకి, సంగీతకళాకారులకి, విద్వాంసులకి, సంగీతరసికులకి కూడా మహాప్రీతిపాత్రమైన రాగం. దీనిలో సంగీతత్రిమూర్తులు ౘాలా గొప్ప-గొప్ప రసభావభరితమైన కృతులు విరివిగా విరచించేరు. కృతుల విషయం సరేసరి. శ్యామాశాస్త్రి మహోదయులు అత్యద్భుతమైన భైరవి స్వరజతి ని కూర్చేరు. శ్యామాశాస్త్రులవారికి ఆత్మీయమిత్రులైన పచ్చిమిరియం ఆదియప్పయ్య వర్యులు లోకప్రశస్తిపొందిన భైరవి అటతాళవర్ణం లో ఆ రాగం యొక్క సకల సౌందర్య సంపూర్ణ సంచారాలని సరస సంగీత ప్రజ్ఞాసామర్థ్య కౌశలంతో నిక్షిప్తం చేసేరు.
(సశేషం)