సంగీతం—నాదవేదం—12

19—09—2020; శనివారం.

ధక్షిణభారత శాస్త్రీయసంగీతవిద్యలో 72~మేళకర్తరాగాలు వివరించ బడినాయి అని తెలుసుకున్నాం. అంతేకాక, స—మ—ప లని మినహాయించి మిగిలిన రిషభం—గాంధారం ధైవతం—నిషాదం స్వరాలలోని మార్పులవలన శుద్ధమధ్యమంతో 36 మేళకర్త రాగాలు, అదే పద్ధతిలో ప్రతిమధ్యమంతో మరొక 36 మేళకర్త రాగాలు, ఆ పైన, రెండూ కలిపి 72 మేళకర్తరాగాలు ఏర్పడతాయనికూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మేళకర్త రాగాల పేరులు అన్నీ ఒక క్రమంలో తెలుసుకుందాం

I~ఇందుచక్రం
1) కనకాంగి———ర—గ—ధ—న.
2) రత్నాంగి———ర—గ—ధ—ని.
3) గానమూర్తి——ర—గ—ధ—ను.
4) వనస్పతి——–ర—గ—ధి—ని.
5) మానవతి——-ర—గ—ధి—ను.
6) తానరూపి——ర—గ—ధు—ను.

II~నేత్రచక్రం
7) సేనాపతి——–ర—గి—ధ—న.
8) హనుమతోడి—-ర—గి—ధ—ని.
9) ధేనుక———–ర—గి—ధ—ను.
10)నాటకప్రియ—-ర—గి—ధి—ని.
11)కోకిలప్రియ—–ర—గి—ధి—ను.
12)రూపావతి——ర—గి—ధు—ను.

III~అగ్నిచక్రం
13)గాయకప్రియ—-ర—గు—ధ—న.
14)వకుళాభరణం—ర—గు—ధ—ని.
15)మాయా మాళవ
గౌళ———-ర—గు—ధ—ను.
16)చక్రవాకం———ర—గు—ధి—ని.
17)సూర్యకాంతం—-ర—గు—ధి—ను.
18)హాటకాంబరి——ర—గు—ధు—ను.

IV~వేదచక్రం
19)ఝంకారధ్వని—-—రి—గి—ధ—న.
20)నర(ఠ)భైరవి———రి—గి—ధ—ని.
21)కీరవాణి————-రి—గి—ధ—ను.
22)ఖరహరప్రియ——-రి—గి—ధి—ని.
23)గౌరీమనోహరి——-రి—గి—ధి—ను.
24)వరుణప్రియ———రి—గి—ధు—ను.
(20వ మేళకర్తని కొందరు నటభైరవి అని పిలుస్తారు. అలాగ పిలిస్తే కటపయాది సంజ్ఞ ప్రకారం నట=10 అని వస్తుంది. కాని మనం ఏర్పరచుకున్న ప్రణాళికలో 10వ మేళకర్త రాగం నాటకప్రియ. ఆ రకంగా చూస్తే నటభైరవి పేరు ఇక్కడ వీలుపడదు. అలాగ వీలు కలగజేయడానికి నఠభైరవి అని పిలుస్తున్నారు. అది మన కటపయాది సంజ్ఞ ప్రకారం “నఠ=20” గా పరిగణించడానికి అవకాశం ఇచ్చినా, దాని వలన మరొక తీవ్రమైన తప్పిదం జరుగుతుంది. “నఠ” అనేది ఏ భాషలోనూ లేని అర్థరహితమై అసాధు శబ్దం(Non-existent word). శాస్త్రంలో అసాధుశబ్దప్రయోగం(usage of non-existent words) నిషిద్ధం. అందువలన 20 వ మేళకర్త రాగాన్ని నరభైరవి అని పిలవవచ్చు. లేదా నారీభైరవి అని కూడా అనవచ్చు. ఈ మేళకర్త రాగాన్ని పూర్వం నారీ రీతిగౌళ అని పిలిచేవారు. అందువలన ఈ విషయమై పెద్దలు, సంగీత పరిషత్తులు చర్చించి ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అని మనవి. ఈ విషయమై చర్చ పెద్దలలో ఇప్పటికే జరుగుతూ ఉండి ఉండవచ్చు.)

V~బాణచక్రం
25)మారరంజని———రి—గు—ధ—న.
26)చారుకేశి————-రి—గు—ధ—ని.
27)సరసాంగి————రి—గు—ధ—ను.
28)హరికాంభోజి———రి—గు—ధి—ని.
29)ధీరశంకరాభరణం—రి—గు—ధి—ను.
30)నాగానందిని——–రి—గు—ధు—ను.

VI~ఋతుచక్రం
31)యాగప్రియ———రు—గు—ధ—న.
32)రాగవర్ధని————రు—గు—ధ—ని.
33)గాంగేయభూషణి—-రు—గు—ధ—ను.
34)వాగధీశ్వరి———-రు—గు—ధి—ని.
35)శూలిని————-రు—గు—ధి—ను.
36)చలనాట———–రు—గు—ధు—ను.

ఈ 36 రాగాల పట్టికలోని 1 నుండి 36 వరకు ఉన్న రాగాల స్వరవైవిధ్యం యొక్క కూర్పులని జాగ్రత్తగా పరిశీలిస్తే, 1వ రాగం కనకాంగి లోని ర—గ—ధ—న స్వరసంపుటితో ప్రారంభం అయ్యి, 36 వ రాగం అయన చలనాట లోని రు—గు—ధు—ను స్వరసంపుటితో ముగిసింది. అంటే గణితశాస్త్రపరంగా ఏర్పడే అన్ని విధాలైన స్వరసంపుటీకరణలు ఈ ప్రణాళికలో పూర్తిగా చోటుచేసుకున్నాయి అని మనం గ్రహించగలుగుతాం. ఇదే చతుర్దండి ప్రకాశిక గ్రంథం యొక్క సమగ్ర సంగీత సిద్ధాంత శాస్త్ర వైభవం అని తెలుసుకోవడం జరిగింది.

పై 36 రాగాలలోను కేవలం శుద్ధ మధ్యమం మాత్రమే ప్రయోగించ బడింది. ఇప్పుడు ఈ పై స్వరాల కూర్పులో ప్రతి మధ్యమం స్వరం ప్రయోగించబడితే ఇంకొక 36 సరిక్రొత్త రాగాలు ఏర్పడతాయి. అందువలన అవే స్వరాలని మరల ఇక్కడ సూచించడం లేదు. మిగిలిన 36 మేళకర్త రాగాల పేరులను మాత్రమే వరుసగా ఈ దిగువ ఇవ్వడం జరుగుతోంది.

VII~ఋషిచక్రం
(37)సాలగం; (38)జలార్ణవం; (39)ఝాలవరాళి; (40)నవనీతం;
(41)పావని; (42)రఘుప్రియ.

VIII~వసుచక్రం
(43)గవాంభోధి; (44)భవప్రియ; (45)శుభపంతువరాళి; (46)షడ్విధమార్గిణి; (47)సువర్ణాంగి; (48)దివ్యమణి.

IX~బ్రహ్మచక్రం
(49)ధవళాంబరి; (50)నామనారాయణి; (51)కామవర్ధి(ర్ధ)ని; (52)రామప్రియ; (53)గమనశ్రమ; (54)విశ్వంభరి.

X~దిశా(దిక్)చక్రం
(55)శ్యామలాంగి; (56)షణ్ముఖప్రియ; (57)సిమ్హేన్ద్రమధ్యమం;
(58)హే(హై)మవతి; (59)ధర్మవతి; (60)నీతిమతి.

XI~రుద్రచక్రం
(61)కాంతామణి; (62)రిషభప్రియ; (63)లతాంగి; (64)వాచస్పతి;
(65)మేచకల్యాణి; (66)చిత్రాంబరి.

XII~ఆదిత్యచక్రం
(67)సుచరిత్ర; (68)జ్యోతిస్వరూపిణి; (69)ధాతువర్ధని; (70)నాసికాభూషణం; (71)కోసలం; (72)రసికప్రియ.

72 మేళకర్తరాగాలు శాస్త్రీయ ప్రణాళిక పైన ఆధారపడి వర్గీకరించబడినాయి. వీటిని జనక రాగాలు అని పిలుస్తారు. ఈ రాగాలు అన్నీ సంపూర్ణ—సంపూర్ణ రాగాలే. వీటి అన్నింటిలో ఆరోహణ—అవరోహణలలో సప్తస్వరాలప్రయోగం క్రమపద్ధతిలో ఉంటుంది. మిగిలిని అనేకరాగాలు అన్నీ వాటిలో ఉన్న స్వరప్రయోగాల మీద ఆధారపడి ఈ 72—జనక రాగాలు నుండి ఏర్పడిన జన్య రాగాలు గా విలక్షణ ప్రతిపత్తి (special identity)ని పొందుతున్నాయి. మనకి సుపరిచితమైన, మనకి నచ్చిన అనేక రాగాలు ఈ 72 రాగాలలోను కనబడక పోవచ్చు. అయినా మనం చింతించవలసిన అవసరం లేదు. అటువంటి రాగాలు అన్నీ పై జనకరాగాలలో ఏదో ఒక రాగం లోకి వర్గీకరించబడిన జన్యరాగాలుగా తెలుసుకోవాలి. ఈ జనక రాగాలలోని విశేష ప్రజాదరణని పొందిన జన్య రాగాల వివరాలు క్రమంగా మనం సందర్భోచితంగా తెలుసుకుంటూ ఉండవచ్చు.

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *