సంగీతం—నాదవేదం—11

12—09—2020; శనివారం.

సంస్కృత శాస్త్ర సారస్వతంలో “కటపయాది సంజ్ఞ” వంటి అనేక సాంకేతిక అంశాలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి. వీటియొక్క పరిచయగాఢత, వీటిగురించిన మన అవగాహనాగాంభీర్యం ఏ స్థాయిలో ఉంటే, అదే స్థాయిలో మనం అధ్యయనం చేసే భారతీయ ప్రాచీన శాస్త్రాల గురించి మనకి కలిగే జ్ఞానంయొక్క నాణ్యత(the quality of the knowledge we acquire) ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడు, ఏది, ఎంతవరకు అవసరం అవుతుందో దానినిబట్టి ఆ యా విషయాలను గురించిన సిద్ధాంత జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. అసలు విషయం ఏదో దానికి పరిపూర్ణ ప్రాధాన్యతని ఇవ్వడం పరిపాటి. మిగిలిన అవసరమైన అంశాలని ఆయా సందర్భానుసారం, తగిన మేరకి విషయపరిచయం చేయడం జరుగుతుంది. అప్పుడే అసలు విషయం యొక్క (Main Subject) బోధనకి తగినంత న్యాయం జరుగుతుంది.

మొదటి ఆరు రాగాల సముదాయాన్ని “ఇందుచక్రం” అంటారని మనం తెలుసుకున్నాం. సంస్కృతంలో ఒకటి కి సంకేతంగా ఇందుః=చంద్రః అనే మాట ఇక్కడ వాడబడింది. ఎందుకంటే మనకి ఆకాశంలో నక్షత్రాలు లెక్కకి మిక్కుటంగా ఉన్నా, చంద్రుడు ఒక్కడే ఉన్నాడుకదా! అందుకని అలాగ ఒకటికి లేక మొదటిది అనే సూచనని చేయడానికి ఇందు(చంద్ర) అనే సాంకేతిక శబ్దాన్ని (symbolical wordని) ఇక్కడ శాస్త్రకారులు వాడడం జరిగింది. ఇది సంస్కృత శాస్త్రాధ్యయనంలో పరంపరగా వస్తున్న సంప్రదాయ బోధనపద్ధతులలో పాటించబడే సాంకేతిక శిక్షణ రీతి. మన మేళకర్త రాగ బోధనలో ప్రస్తుతసందర్భాన్ని అనుసరించి ఏ సాంకేతిక పదాలు వాడబడినవో, వాటికి అర్థాలు ఏమిటో, సంక్షిప్త వివరాలతోసహా ఇప్పుడు తెలుసుకుందాం.

1) మొదటి ఆరు రాగాల చక్రం = ఇందుచక్రం (చంద్రుడు ఒకడే కనుక)
2) రెండవ ఆరు రాగాల చక్రం = నేత్రచక్రం (మనకి కళ్ళు రెండే కనుక)
3) మూడవ ఆరు రాగాల చక్రం = అగ్నిచక్రం (గార్హపత్య, దక్షిణ, ఆహవనీయ అగ్నులు మూడు)
4) నాలుగవ ఆరు రాగాల చక్రం = వేదచక్రం (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ(ణ)వేదం——>>>> వేదాలు నాలుగు)
5) ఐదవ ఆరు రాగాల చక్రం = బాణచక్రం (అరవిందం, అశోకం, చూతం,
నవమల్లిక, నీలోత్పలం అనేవి ఐదు బాణాలు)
6) ఆరవ ఆరు రాగాల చక్రం = ఋతుచక్రం (వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అని ప్రతి సంవత్సరంలో ఋతువులు ఆరు)
7) ఏడవ ఆరు రాగాల చక్రం = ఋషిచక్రం (వశిష్ఠుడు, గౌతముడు, అత్రి, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు— అను ఏడుగురు ఋషులు మన వైవస్వతమన్వంతరంలోని వారు)
8) ఎనిమిదవ ఆరు రాగాల చక్రం = వసుచక్రం (ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అను ఎనిదిమంది అష్టవసువులు)
9) తొమ్మిదవ ఆరు రాగాల చక్రం = బ్రహ్మచక్రం (భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరసుడు, దక్షుడు, అత్రి, మరీచి, వసిష్ఠుడు అను తొమ్మండుగురు నవబ్రహ్మలు)
10) పదవ ఆరు రాగాల చక్రం = దిక్చక్రం లేక దిశాచక్రం (తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరృతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఊర్ధ్వదిశ, అధోదిశ అని దిక్కులు లేక దిశలు మొత్తం పది—దశదిశలు)
11) పదకొండవ ఆరు రాగాల చక్రం = రుద్రచక్రం (అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అను పదకొండుమంది ఏకాదశరుద్రులు)
12) పన్నెండవ ఆరు రాగాల చక్రం = ఆదిత్యచక్రం (ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అను పన్నిండుగురు కలిసి ద్వాదశాదిత్యులు అగుదురు).

(కుండలీకరణాలలో ఉదహరించబడిన వివరాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉదాహరణకి పంచబాణాలు తీసుకుందాం. పంచశరుడు ఐన మన్మథుడికి గల ఐదు బాణాలు, ఉన్మాదనం, తాపనం, శోషణం, స్తంభనం, సమ్మోహనం అనే పేర్లుగలవి అనికూడా శాస్త్రాలలో ఉంది. అలాగే సప్తర్షులవిషయంలో కూడా భేదాలు ఉన్నాయి. ఇక్కడ అవి అప్రస్తుతవిషయాలు కనుక అటువంటి తేడా-పాడాలని విస్మరించి భారతీయ సంగీత సిద్ధాంత శాస్త్రం మాత్రమే ఇక్కడ ప్రసక్తమైన విషయం కనుక మనం ఆ శాస్త్రఅధ్యయనానికి పరిమతమౌదాం! తథాsస్తు)

12 చక్రాలు x 6 రాగాలు = 72 మేళకర్త రాగాలు సంగీతశాస్త్రంలో విశదం చేయబడ్డాయి.

మొదటి ఆరు రాగాలలో ర—గ జంట స్వరాలతో కలిసి ధైవత-నిషాదాల యొక్క ఆరు విధాలైన కూర్పులవలన ఆ ఆరు రాగాలు ఏర్పడడం గమనించేం!

ఇప్పుడు ర—గి జంటతో ధైవత-నిషాదాల ఆరు విధాలైన కూర్పు వలన రెండవ 6 రాగాలు ఏర్పడతాయి.

అలాగే ర—గు జంటతో మూడవ 6 రాగాలు, రి—గి జంటతో నాలుగవ 6 రాగాలు, రి—గు జంటతో ఐదవ 6 రాగాలు, రు—గు జంటతో ఆరవ 6 రాగాలు ఏర్పడతాయి. ఈ విధంగా శుద్ధమధ్యమం తో 6×6=36 రాగాలు ఏర్పడతాయి. ఇదే రీతిగా ప్రతిమధ్యమం తో కూడా మరొక 6×6=36 రాగాలు ఏర్పడతాయి. అంటే 36+36=72 మేళకర్త రాగాలు ఉనికిలోకి ఆ విధంగా వచ్చేయి అన్నమాట!

(సశేషం)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *