సంగీతం—నాదవేదం—10
05—09—2020; శనివారం.
క్రితం వారం ఆరేసి రాగాలని కలిపి ఒకచక్రం(ఒక తరగతికి చెందిన రాగాలు) గా ఏర్పరచడం జరిగిందని తెలుసుకున్నాం. మనం చూసిన స్వరాల కూర్పులు ఆరేసి ఉన్నాయి కనకే ఆరేసి రాగాలు కలిసి ఒక చక్రంగా ఏర్పరచడం జరిగింది. ప్రతి మేళకర్త రాగానికి తప్పనిసరిగా ఉండే కూర్పు గురించి ముందు తెలుసుకుందాం:—
సప్తస్వరాల ఆరోహణ—సప్తస్వరాల అవరోహణ|
1) ఇప్పుడు ర—గ కూర్పుతో వచ్చే మొదటి చక్రంలోని మొట్టమొదటి రాగం యొక్క ఆరోహణ—అవరోహణలు చూద్దాం:—
స—ర—గ—మ—ప—ధ—న—స (రి-గ-ధ-ని ల యొక్క మౌలికమైన
స—న—ధ—ప—మ—గ—ర—స మొట్టమొదటి రూపాలు)
ఇది మన దక్షిణభారతశాస్త్రీయసంగీతపద్ధతిలో కనకాంగి రాగం యొక్క స్వరమూర్ఛన స్వరూపం అన్నమాట! ఈ కనకాంగి రాగంలోని మొదటి రెండు అక్షరాలు తీసుకుంటే అవి క — న ఔతాయి కదా! మనకి తెలుసున్న కటపయాది సంజ్ఞ ప్రకారం, క=1; న=0. అంటే 10 (పది). దానిని తిరగేస్తే 01 అంటే 1 ఔతుంది. పై ఆరోహణ – అవరోహణలో స—మ—ప అనేస్వరాలు మూడూ మార్పు లేనివి కనుక వాటిని మినహాయించి చూస్తే, ర—గ—ధ—న అనే నాలుగుస్వరాలూ ఆరోహణ, అవరోహణ క్రమాలలో తేడాలే తప్ప, అవే స్వరాలు అటూ—ఇటూ వస్తాయి. అంటే, ర-గ-ధ-న—న-ధ-గ-ర అని ఎగువకి, దిగువకి ప్రయోగించబడతాయి అని వివరిచుకుంటే మనకి బాగా అర్థం ఔతుంది. ఇది, అంటే కనకాంగి అనే రాగం మొదటి మేళకర్త రాగం అన్నమాట!
ఈ విధంగా సరళీకృతం చేసిన విధానంలో మిగిలిన రాగాలని శాస్త్రీయమైన ఒక క్రమంలో పరిశీలన చేద్దాం!
2) ఇప్పుడు రెండవ మేళకర్త రాగం గురించి వివరించుకుందాం. (స—మ—ప లను మినహాయించగా) ర—గ—ధ—ని (అంటే స-ర-గ-మ-ప-ధ-ని అన్నమాట!) స్వరాలు ఉంటాయి. రెండవ మేళకర్త రాగం కనుక దీనిపేరు రత్నాంగి రాగం. కటపయాది సంకేతాల ప్రకారం, ముందు రెండక్షరాలలో ఉన్న ర(త్)న లలో యవర్గం లోని రెండవ అక్షరం ర కనుక, ర=2; త్న లో ఇక్కడ న తీసుకుంటాం కనుక న=0 కనుక రత్న=20 ఔతుంది. తిరగవేస్తే 02 అంటే 2 ఔతుంది.
(గమనిక :—
(అ) మేళకర్త రాగాల పేరులలో సంయుక్తాక్షరాలు ఉంటే, ఆ సంయుక్తాక్షరంలోని ఏ విభాగం తీసుకుంటే మన అవసరానికి సరిపోతుందో గమనించి, ఆ అక్షరాన్నే పరిగ్రహించాలి. ఉదాహరణకి “రత్న” లో పై సందర్భంలో “న” సరిపోయింది కనక “న” ని తీసుకున్నాం. ఒకవేళ “త” సరిపోతే దానినే గ్రహించవలసివచ్చేది.
(ఆ) మరొక వివరంకూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. కటపయాది సంజ్ఞలో, క మొదలైన ఏ అక్షరాలకైనా ఆ గుణింతంలోని ఏ అక్షరం వచ్చినా మూలాక్షరానికి ఉన్న విలువే ఉంటుంది తప్ప వేరేగా మారదు. అంటే క, కా, కి, కీ మొదలు కై, కౌ = 1 గానే ఉంటుంది. మారదు).
3) ర—గ—ధ—ను మూడవ మేళకర్త రాగం కూర్పు ఔతుంది. ఈ మేళకర్తని గానమూర్తి రాగం అంటారు. కటపయాది సంకేతాల ప్రకారం గాన=30. దీనిని తిరగవేస్తే 03=3.
4) ర—గ—ధి—ని అను కూర్పుకి నాలుగవ మేళకర్త వస్తుంది. దీనిని వనస్పతి రాగం అంటారు. కటపయాది సంజ్ఞ ప్రకారం, వన=40. తిరగవేస్తే 4 ఔతుంది.
5) ర—గ—ధి—ను అను కూర్పు ఐదవ మేళకర్తకి వర్తిస్తుంది. దీనికి మానవతి రాగం అని పేరు. మాన=50. తిరగవేస్తే 5 ఔతుంది.
6) ర—గ—ధు—ను అనే కూర్పుని ఆరవ మేళకర్తలో చూస్తాము. దీనిని తానరూపి రాగం అంటాము. తాన=60. తిరగేస్తే 6 ఔతుంది.
ఈ పై రాగాలలోని ధైవతం—నిషాదం యొక్క ఆరు రకాల కూర్పులనీ ర—గ కూర్పుతో అనుసంధానంచేసి చూస్తే మొదటి ఆరు రాగాల స్వర స్వరూపాలు మనకి ఇక్కడ వచ్చేయి. ఈ మొదటి ఆరు రాగాల సముదాయాన్ని కలిపి ఇందుచక్రం అని పిలుస్తారు. మనకి ఆకాశంలో చంద్రుడు ఒక్కడే ఉంటాడు కనక ఒకటవ చక్రం అయిన దీనిని ఇందుచక్రం అనే సంకేతనామంతో పిలుస్తారు. ఈ సంకేతం, అంటే గుర్తు వలన పై ఆరు రాగాలలో ఏ ఒక్క రాగం పేరు చెప్పినా అది ఇందుచక్ర అంటే మొదటి రాగసముదాయం కి చెందిన రాగంగా గుర్తించవచ్చు. ఈ విధంగా తెలియడం వలన ఆ రాగంలో ఉండే రిషభం-గాంధారం-ధైవతం నిషాదం యొక్క రూపాలు తేటతెల్లం ఐపోతాయి. ఇదీ ఈ వివిధ చక్రాల వ్యవస్థ యొక్క నామకరణం వలన కలిగే వినియోగ ప్రయోజనం అంటే practical utiliyity అని మనకి తెలుస్తుంది.
(సశేషం)