సంగీతం—నాదవేదం—6
08—08—2020; శనివారం.
కేవలం ఒకే ఒక్క స్వరం ఎంత మధురమైన గళంలోనుండి విన్నా, లేక వీణ, వేణువు వంటి నాదపూర్ణమైన సంగీతవాద్యంనుండి విన్నా ఆ ఒక్క స్వరమే మనకి నిరంతర ఆహ్లాదకరమైన సంగీతం కాలేదు. కొన్ని స్వరాల సముదాయం మాత్రమే మనం సంగీతం అని భావించే నాదప్రక్రియకి చెందిన రసజ్ఞహృదయరంజకమైన మధురానుభవాన్ని, దానినుండి స్వాదురసానుభూతిని కలిగించగలుగుతుంది. అటువంటి కొన్ని స్వరాల సముదాయానికి సంగీతశాస్త్రం లో, రాగం అని పేరు. అయితే, కొన్ని స్వరాలు అంటే ఎన్ని? అని ప్రశ్న!
సర్వసాధారణంగా రాగాలలోని స్వరాలని ఔఢవస్వరప్రయోగసంపుటి అంటే ఐదు స్వరాల కూర్పు గాను, షాఢవస్వరప్రయోగసంపుటి అంటే ఆరు స్వరాల కూర్పు గాను, ఆ పైన, సంపూర్ణస్వరప్రయోగసంపుటి అంటే పూర్తిగా సప్తస్వరాల కూర్పు గాను శాస్త్రమర్యాదని అనుసరించి లోకంలో వ్యవహారం ఉంది.
అంటే ఈ స్వరాలు 5—5; 6—6; 7—7; స్వరసముదాయాలతో మాత్రమేకాక ఇతరవిధానంలో కూడా కూర్పులు ఉండవచ్చు. అంటే, 5—6, 5—7; 6—5, 6—7; 7—5, 7—6; ఈ విధంగా అన్నమాట! అప్పుడు ఆ రాగాలని ఔఢవ-ఔఢవ, ఔఢవ-షాఢవ, ఔఢవ-సంపూర్ణ;
షాఢవ-ఔఢవ, షాఢవ-షాఢవ, షాఢవ-సంపూర్ణ; సంపూర్ణ-ఔఢవ, సంపూర్ణ-షాఢవ, సంపూర్ణ-సంపూర్ణ మొదలైన వర్గీకరణలతో ౘాలా రాగాలు లోకంలో సుప్రసిద్ధంగా ఉన్నాయి. సర్వసాధారణంగా రాగం ఏర్పడడానికి కనీసం ఐదు స్వరాలు ఉండాలని శాస్త్రనియమం ఉంది.
ఐనా శాస్త్రం ప్రకారం, లోకరీతిననుసరించి ఐదు కంటె తక్కువ స్వరాలున్న రాగాలని, మూడుస్వరాల ఆరోహణ-అవరోహణ కలిగిన రాగాలని త్రిస్వరి రాగాలని, నాలుగుస్వరాల ఆరోహణ-అవరోహణ కలిగిన రాగాలని చతుస్స్వరి రాగాలని అంటారు. ఉత్తరభారత సంగీత పద్ధతిలో, జలధరసారంగ్, మాలాశ్రీ (కల్యాణ్ థాట్ – అంటే దక్షిణభారత సంగీతంలో 65వ మేళకర్త ఐన మేచకల్యాణి రాగం); దక్షిణభారత సంగీత పద్ధతిలో లవంగి(డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు); స్వయంభూస్వరరాగం (మైసూరుకి చెందిన శ్రీ వి.పి. శివరామయ్యగారు); ఈ త్రిస్వరి రాగాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే చతుస్స్వరి రాగానికి ఉదాహరణగా భవానీ రాగం ఉంది. ఇది బిలావల్ థాట్ (29వ మేళకర్త *ధీరశంకరాభరణం) కి చెందినది. ౘాలా ప్రాచుర్యంలో ఉన్న దుర్గ్ రాగంలోని పంచమస్వరం తొలగిస్తే ఈ భవానీ రాగం ఏర్పడుతుంది.
(సశేషం)