సాహిత్యము—సౌహిత్యము ~ 71 | భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
22—09—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~71″| “భక్తియోగమార్గము—మంత్ర ఉపాసనా ఆవశ్యకత”|

భగవానుడు సర్వాంతర్యామిగాను, సర్వవ్యాపకుడిగాను సదా ఉన్నాడని పెద్దలు చెపుతున్నారుకదా! ఇంక అటువంటప్పుడు ఈ ఇష్టదేవతలు, ఈ పూజలూ, జపాలూ, పర్వదినాలలో ప్రత్యేక అర్చనలు, నిత్య – నైమిత్తిక ఆరాధనలు ఇవన్నీ ఎందుకు? ఇష్టదేవతా మంత్రదీక్షలు, ఉపాసనలు వీటి ప్రయోజనం ఏమిటి? మొదలైన సందేహాలు, ప్రశ్నలు తరచుగా వీటిని ఆచరిస్తూన్న మనలో మనకి, లేకపోతే, వీటిని ఆచరించని ఎదుటివారినుంచి మనకి, ఎదురౌతూనే ఉంటాయి. వీటికి మన పెద్దలు చెప్పిన సమాధానాలు శాస్త్రరూపంలో మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి.

“గవాం సర్పిః శరీరస్థం న కరోత్యంగ పోషణమ్ |
నిఃసృతం కర్మ సంయుక్తం పునః తాసాం తత్ ఔషధమ్ ||

“ఏవం స హి శరీరస్థ సర్పివత్ పరమేశ్వరః |
వినాచోపాసనాదేవ న కరోతి హితం నృషు”||

“ఆవుల శరీరంలోనే ఆవునెయ్యి ఉంటుంది. అయినా అది ఆ ఆవుల శరీరంలోని వివిధ అవయవాలకి అవసరమైనప్పుడు తగిన చికిత్సాత్మకసేవని చెయ్యలేదు. ఆవుల పాలలోనే ఆవునెయ్యివుంటుంది. ఆవుపాలని బయటకి తీసి, వాటిని ౘక్కగా కాచి, తోడుపెట్టి, మీగడతోవున్న పెరుగుని బాగా చిలికి, వచ్చిన వెన్నని, మళ్ళీకాచి, దానినుంచి బయటకి వచ్చిన సారభూతమైన ఆవునెయ్యిని ఆ ఆవులచేత సేవింపచెయ్యడంద్వారా ఆ నెయ్యి ఔషధమహిమనిపొంది, ఆ ఆవుల వ్యాధులకి చికిత్స చేయగలుగుతుంది.

“అదేవిధంగా, ఆవులయందలి ఆవునెయ్యిలాగే, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు, సాధకులలో హృదయస్థుడై సదా ఉన్నాడు. అలాగ హృదయంలో ఉన్న పరమేశ్వరుడిని, ఇష్టదేవతామంత్రోపాసన అనే దీక్షాప్రక్రియద్వారా (బాహ్య ప్రతీకాత్మక ప్రతిమాది రూపంలో) అర్చించి, ఆరాధించడంద్వారానే జనన-మరణాలనే జీవత్వవ్యాధికి సరైన చికిత్స జరిగి (సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య స్వరూపాత్మకమైన) వ్యాధినిర్మూలనం జరుగుతుంది”.

పైన చెప్పబడిన ఉపమానం జంతువైద్యశాస్త్రం(Veterinary Medical  Science)యొక్క ప్రమేయంకలిగినది. ఆవులకి అనేక వ్యాధులు కలుగుతాయి. వాటికి మన ప్రాచీన సంప్రదాయ పశుచికిత్సాశాస్త్రంద్వారాను. ఆధునిక పాశ్చాత్య వెటరనరీ చికిత్సావిధానం ద్వారాను వైద్యం చేయడం పరిపాటి.

నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయం నా బాల్యంలో కనీసం అరవై సంవత్సరాలక్రితం జరిగింది. 1955 1956ప్రాంతాలలో ఇది జరిగివుంటుందని నా అంౘనా! మా మాతామహులైన శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణారావుగారి ఇంట్లో, రామచంద్రపురంలో, ఆవుపాడివుండేది. మా తాతగారి ఇంటి అవసరాలన్నీ తాతగారు, అమ్మమ్మగారు అనుజ్ఞలని అనుసరించే మా పెంటయ్య దక్షతలో మహావైభవంగా నిర్వహించబడుతూ, హాయిగా సాగుతున్న రోజులవి.

ఆ రోజులలో లేగదూడతోవున్న పాలిచ్చే మా ఆవుకి ఏదో వ్యాధిసోకింది. అది మేత మెయ్యలేకపోయేది. పాలు పితకనిచ్చేదికాదు. లేగదూడకికూడా పాలిచ్చేది కాదు. పెంటయ్య వెటరనరీ ఆసుపత్రినుంచి మందుబిళ్ళలుతెచ్చి రెండురోజులు వాడేడు. ఏ మాత్రమూ గుణం కనిపించలేదు. అప్పుడు అమ్మమ్మ పెంటయ్యతో కబురుచేసి బుల్లబ్బాయి అనే ఆనువంశిక పశువైద్యుడిని రప్పించింది. అతను ఆవుని, లేగని జాగ్రత్తగాచూసి, ఆ వ్యాధి పేరు ఏదో చెప్పి దానికి ఔషధం తయారు చేసేడు. ఆ ఆవుదే పేరిన ఆవునెయ్యిముద్దని అమ్మమ్మగారి ఇంట్లోంచి తీసుకున్నాడు. కొంత పసుపుని తీసుకున్నాడు. ఒక చిన్న నారదబ్బ పిందెని పెంటయ్యద్వారా సంపాదించేడు. పసుపు-నారదబ్బపిందె రెండింటినీ పెద్దకల్వంలో వేసి, నూరి ఒక ముద్దగాచేసేడు. ఆ ముద్ద అనుపానం అని వివరించేడు. పేరుకున్న ఆవునేతిముద్ద అసలు మందు అని చెప్పేడు. ఆ ఆవునేతిముద్దలో అనుపానం ముద్ద బాగా కలిపి బత్తియికాయంత పరిమాణం కలిగాన ఒక గట్టి కబళంలాగ దానిని తయారు చేసేడు. అది ఆ ఆవు మోరని పెంటయ్య రెండుచేతులతోను, తాను తన ఎడమచేతితోను కలిసి పైకి ఎత్తి పట్టుకుని, బుల్లబ్బాయి సులువుగా తన కుడిచేతితో ఆ మందుముద్దని ఆవు గొంతుకలోకి జొనిపి పెట్టి, తన చెయ్యిని బయటకితీసి, ఆవుచేత మింగించేడు. అలాగ మూడు ఉదయాల వైద్యానికి ఆవుకి వ్యాధి పూర్తిగా తగ్గిపోయి, మామూలుగా మేత మేసి, లేగదూడకి పాలిచ్చి, పెంటయ్యని పాలుపితకనిచ్చింది. ఈ సంఘటన, పై శ్లోకాన్ని నేను ౘదివిన తరవాత నాకు ఒక స్పష్టమైన అవగాహనకొచ్చింది. లేకపోతే “ఆవునెయ్యే ఆవుకు అలాగ ఎలాగ మందయ్యింది?“, “అది దాని శరీరంలో అంతకు ముందే దాని పాలలోనే ఉన్నదేకదా!” అనే సందేహాలు నన్ను ౘాలా కాలం వేధించుకుని తిన్నాయి. ఈ శ్లోకభావాన్ని సమగ్రంగా అర్థంచేసుకోవడంద్వారా నా బాల్యంలో నేను గమనించిన పశువైద్యశాస్త్రసంబంధమైన సందేహాలకి సమన్వయాలు సమకూడడంతోబాటు, “భక్తియోగం“లో ఋషులచేత ఉపదేశించబడే “ఉపాసనామార్గం“లోని మర్మం సుబోధకమయ్యింది.

మరొక ఉదాహరణకూడావుంది. ఇదికూడా రామచంద్రపురంలోనే జరిగింది. ఇది నాకు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు జరిగింది. ఏదో ఒక ప్రమాదంలో దెబ్బలు తగలడంవలన నేను వైద్యం చేయించుకుంటే, ఆ చికిత్సకి సంబంధించిన మందులని వాడడం వలన నాలో ౘాలా తీవ్రమైన చర్మ-ప్రతిచర్య అంటే skin-allergy, ప్రధానంగా “Urticaria” అనే వ్యాధి రూపంలో వచ్చింది.  ఆ కాలంనాటి Avil, Polaramine వంటి అనేక Anti-histamines ఎన్ని వాడినా, వాడినంతకాలం తగ్గి మళ్ళీ మామూలుగా వచ్చేసేది. రామచంద్రపురంలో మా కుటుంబానికి ఆత్మీయమిత్రులైన డా॥ కే. రామారావుగారు అనేక రకాల వైద్యం చేసేరు. ఏ మాత్రమూ గుణం కనిపించలేదు. ఆయన సలహామీద alternative medicine పద్ధతులైన హోమియోపతి వంటి అనేక వైద్యవిధానాలద్వారాకూడా చికిత్సని చేయించుకున్నాను. ఏమీ తగ్గలేదు. అల్లోపతి, హోమియోపతి, మూలికావైద్యం, ప్రకృతి చికిత్స వంటి అనేక వైద్యవిధానాలన్నీ ఎంతకాలం ప్రయత్నించినా ఆ వ్యాధి తీవ్రత పిసరంతైనా ఉపశమించలేదు. చివరకి,  డా. రామారావుగారు ఒక ప్రాచీన ప్రత్యేక వైద్యవిధానం సూచించేరు.  Auto-haemo-therapy అని దాని పేరుట. I.V. ద్వారా నా శరీరంలోని రక్తాన్ని సిరంజిలోకి తీసి, I.M.ద్వారా నా శరీరంలోకి అదే రక్తాన్ని ఎక్కించడమే ఆ వైద్యం! దానికి నేను “స్వరుచి” అని పేరు పెట్టేను. అంటే ఏమిటని నా వైద్యమిత్రవరులు అడిగేరు. “స్వ రుధిర చికిత్స” అని చెప్పేను. ఆయన నవ్వి “మీరు కవి, పండితుడు కూడా కనక ఏమైనా అనొచ్చు” అన్నారు ఆప్యాయంగా! అలాగ నెలకి ఐదు రోజులచొప్పున ఐదుసార్లు ఆ చికిత్స చేసేరు. వ్యాధి తీవ్రత బాగా తగ్గినా, పూర్తిగా నిర్మూలం అవ్వలేదు. ఇప్పటికీ, అనేక ఇతర వ్యాధులతోబాటు, ఆ ఎలర్జీ వ్యాధితోకూడా ఈ దేహం సహజీవనం చేస్తోంది. అదికూడా బంధంలేని మైత్రి.

మన మౌలికసందేహానికి యుక్తియుక్తంగా సమాధానం చెప్పవచ్చు. మానవ లోకంలో లౌకికవిద్యాభ్యాసానికి, ధనసముపార్జనకి, మనకోరికలు తీర్చుకోవడాని అనేకమార్గాలున్నా, మనం ధర్మబద్ధంగాను, చట్టబద్ధంగాను, మానవసమాజ హితానుకూలంగాను మన మార్గాలని ఎంచుకుని, ఆ మార్గాలలో మన స్పష్ట ఆదర్శాలని నిర్దేశించుకుని, ౘక్కని క్రమశిక్షణతో, అనుభవజ్ఞుల  మార్గదర్శకత్వంలో అనేకసంవత్సరాలు అంకితభావంతో మనశక్తియుక్తులనన్నీ ఏకాగ్రంచేసి బాగా కృషిచేసి, మనం అనుకున్న ఐ.ఏ.ఎస్ ./ఐ.పి.ఎస్ . అధికారిగానో, డాక్టరు లేక ఇంజనీరుగానో, రాజకీయనాయకుడిగానో, వ్యాపారిగానో, కార్పొరేట్  సంస్థలలో ఉన్నతాధికారిగానో మనం అవ్వగలుగుతున్నాం! ఇహలోకంలోని లౌకికప్రయోజనాలు సాధించడానికి మన శక్తి-యుక్తులని, మన పెద్దల ధన- సంపదలని, మన అమూల్యసమయాన్ని, మన బాల్య-యౌవనాలకి సంబంధించిన వనరులని, ఇంకా ౘాలా ఇంధనాలని వినియోగించి మనం కాదలచినది అయ్యి, పొందదలచినది పొందుతున్నాం! అలాగే పరమార్థసంబంధమైన రంగంలోకూడా కనీసం ఆపాటి కృషిని చేయకుండా దానిని పొందడానికి హేతుబద్ధమైన మార్గం లేదు కదా! అందువలన అయినా పారమార్థికవిషయంలో మనం శాస్త్రవిధిగా, పెద్దల మార్గదర్శకత్వంలో ఇష్టదేవతోపాసనని చేయాలి.

మొత్తంమీద మనలో అంతర్యామిగా కొలువైవున్న ఆ దివ్యతత్త్వాన్ని సాకార, సగుణమూర్తిగా మంత్రోపాసనని చేసుకోవడంవలన భక్తియోగగామి ఇష్టదేవతానుగ్రహరూపంలోని హితాన్నిపొంది తప్పక తరించడం తథ్యం!

స్వస్తి||

You may also like...

7 Responses

  1. Dakshina Murthy says:

    Excellent

  2. Sampathkumar says:

    Chala baagundi guruvugaru.

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    పెదనాన్నగారి స్మృతికీ
    వెదకిన కనిపించనట్టి పెంటయ్యతకీ
    మది నంజలి సేతు శుభ
    ప్రద మా దొడ్డమ్మగార్కి బాలాంత్రపురే!

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      “స్వరుచి” బావుంది. కమ్మగా.

      వరములు కోరునె, తా నీ
      శ్వరపూజల వ్రతము నోముపట్టునె, మదిలో
      పరతంత్రుడై తపించునె,
      స్వరుచిని మరిగిన మనీషి బాలాంత్రపురే!

  4. బాగుంది. బాగా ఆస్వాదించాను

  5. Nishanth says:

    Pranams. Please elaborate more next week on mantra deeksha,do s and don’t s and concept of Ishta nishta and guru nishta. Pranams.

  6. సి.యస్ says:

    ఎంతో హేతుబద్ధతతో , సోదాహరణంగా
    వివరించిన ఈ వారం వ్యాసం చాలా సందేశాత్మకంగా
    ఉండి, కొత్త ఆలోచనలవేపు మళ్లించింది.
    మళ్ళీ ఒకసారి రామచంద్రపురంలో తాతయ్యగారి ఇల్లు,
    పెరట్లో ఆవుపాడి, వాటిని సాకే పెంటయ్య…. అరోజులు
    గుర్తుకొచ్చాయి.
    అందరి హృదయాలలోనూ దైవం కొలువై ఉంటాడు.
    మనిషి సదా లౌకికవ్యవహారాలలో ములిగి తేలుతూ ,
    ఆ సంగతి గ్రహించుకొలేడు. ఎక్కడికో పోయి, ఎవర్నో ఆశ్రయించి
    వారి ద్వారా దైవాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అలా కాకుండా
    స్వహృదయాన్ని మేలుకొలుపి అందులో ఉన్న దైవాన్ని
    దర్శించాలనీ, ఆ ” స్వరుచి”ని మించింది లేదనీ యిచ్చిన సందేశం గొప్పగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *