సాహిత్యము—సౌహిత్యము ~ 70 | భక్తియోగ సాధకుల దైనిక ఇష్టదేవతార్చన — ఆర్షసంప్రదాయసాధనలోని మహనీయ భావనలైన శుభ్రము, శుద్ధము, శౌచము — ఒక వివేచన

ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
15—09—2018; శనివారము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“సాహిత్యము—సౌహిత్యము ~ 70″| “భక్తియోగ సాధకుల దైనిక ఇష్టదేవతార్చన — ఆర్షసంప్రదాయసాధనలోని మహనీయ భావనలైన శుభ్రము, శుద్ధము, శౌచము — ఒక వివేచన”|

తరతరాలుగా కుటుంబపరంపరలో నిరవధికసంప్రదాయనిష్ఠతో ఇప్పటికీ ౘాలా కుటుంబాలలో “దేవతార్చన“కి అనువైన దేవుడి సింహాసనం, దానిలోవున్న కులదైవం, మరికొన్ని దేవతామూర్తులు, తాత-ముత్తాతలద్వారా తల్లితండ్రులకి, వారిద్వారా తరువాతతరం పిల్లలకి, అలాగే మనుమలకి-మునిమనుమలకి కొనసాగుతూవస్తున్నాయి. అవి అసలు-సిసలు స్థిరసంపదలుగా విరాజిల్లుతూ  మన దేవుడిగదులలో మనకి సూక్ష్మరూపంలో ఇహ-పర మార్గదర్శనం చేస్తూ మనలని తరింపజేస్తూ ఉన్నాయి.

మనదేవుడిగదిని, దేవుడి మందిరాన్ని, దానిలోని సింహాసనాన్ని, ఆ  సింహాసనంలో పారంపర్యంగా మన కుటుంబపెద్దలందరిచేత శ్రద్ధాభక్తులతో అర్చించబడిన సంపూర్ణచైతన్యవిశిష్టమైన దేవతామూర్తులని, మన ఇంటిని, ఇంటి పరిసరాలని అన్నింటినీ ఎల్లప్పుడూ శుభ్రంగాను, శుద్ధంగాను, శుచిగాను ఉండేటట్లు సర్వాత్మనా చూచుకోవాలి. ఇవి మూడూ పర్యాయపదాలు కాదు. ఆ మాటల అర్థవ్యాప్తిగరిమని, భావదీప్తి వైభవాన్ని, ప్రక్రియాత్మక వైవిధ్యాన్ని, ప్రయోగాత్మక వైలక్షణ్యాన్ని, పారంపరిక ఔచిత్యాన్ని మనం ఈ వారం సంక్షిప్తంగా కొన్ని పరిధులకిలోబడి చర్చించుకుందాం!

పై మూడు మాటలూ సదాచారానికి, శిష్టజనానుష్ఠాన పరంపరకి అద్దం పడుతున్నాయి. “సదాచారం” అంటే “సత్ + ఆచారం”, అంటే ‘ౘక్కని ఆచరణ‘ అని అర్థం. ఈ సదాచారం కుటుంబాలలో పరంపరగా వస్తుంది. అటువంటి సదాచారాన్ని ఏ మాత్రమూ విడిచిపెట్టకుండా శ్రద్ధాసక్తులతో ఆచరించేవారు శిష్టజనులు లేక శిష్టాచార సంప్రదాయ పరాయణులు.

“యేనాస్య పితరోయాతాః, యేన యాతాః పితామహాః|
తేన యాయాత్ సతాం మార్గం, తేన గచ్ఛన్ న రిష్యతే”||

“పరంపరాగతంగా ఏ మార్గంలో తన తల్లి-తండ్రులు, తన తాత-ముత్తాతలు పయనించేరో అదే మార్గంలో ప్రయాణం చేసేవాడు నాశనం పొందడు”.

ఆచారహీనం న పునంతి వేదాః” అని శాస్త్రవాక్యం!
“పరంపరాగత సదాచార అనుష్ఠానాన్ని విడిచిపెట్టినవాడిని వేదాలు పవిత్రీకరించవు”, అని దీని భావం!

ఇప్పుడు “శుభ్రము“, “శుద్ధము“, “శౌచము” అనే మూడు భావనలలోని విశేషాలు గమనించే ప్రయత్నం చేద్దాం!

(I) “శుభ్రము” అంటే స్వచ్ఛంగావుండడం అని ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు.  మన దేవుడిగది, మందిరం, సింహాసనం, దైవవిగ్రహాలు, దేవుడి పటాలు శుభ్రంగా- అంటే- స్వచ్ఛంగా లేక నిత్యనూతనంగా ఉండేలాగ చూసుకోవాలి. “శుభ్రం” అనేది కేవలం బాహ్యప్రక్రియ. అలాగే సాధకుడు/సాధకురాలు కూడా సర్వదా శుభ్రంగానేవుండాలి. సాధకులు సదా గుర్తుంచుకుని, మనస్సులో ఎప్పుడూ మననంచేసుకోవలసిన విషయం ఏమిటంటే తాము ప్రప్రథమంగాను, నిరంతరంగాను అధ్యాత్మవిద్యాసాధకులైవుంటూ, ఆయాసందర్భాలననుసరించి లౌకిక క్రియాకలాపాలు నిర్వహిస్తున్నామని, అంతేకాని, తాము లౌకికులైవుండి, అప్పుడప్పుడు సాధననిచేసుకునే సాంసారికులు కాదని తెలుసుకుని  ఆ గ్రహింపుద్వారా తమ జీవనయానాన్ని కొనసాగించుకోవాలి.

(II) “శుద్ధము” అంటే మాలిన్యరహితంగావుండడం. ఈ మాలిన్యం బాహ్యంగాను, అంతర్గతంగాను వివిధస్థాయిలలోవుంటుంది. దేహమాలిన్యం, మనోమాలిన్యం, బుద్ధిమాలిన్యం, జీవమాలిన్యం – ఈ విధంగా రకరకాలైన మలినాలు మనలని లోపల-బయట ఆశ్రయించుకుని ఉంటాయి. ఈ మలినాలని ఏ విధంగా నిర్మూలించుకుంటూవుండాలో మనువు మనకి తమ ధర్మశాస్త్రంలో బోధించేరు.

“అద్భిః గాత్రాణి శుద్ధ్యంతి, మనః సత్యేన శుద్ధ్యతి|
విద్యా తపోభ్యాం భూతాత్మా, బుద్ధిః జ్ఞానేన శుద్ధ్యతి”||

“శరీరాలు జలపవిత్రీకరణశక్తిచేత నిర్మలం ఔతాయి. సత్యదీక్షచేత మనస్సు పవిత్రం ఔతుంది. అధ్యాత్మవిద్యాధ్యయనమూ, తపస్సుల రెండింటి చేత జీవుడు పునీతుడౌతాడు. జ్ఞానదీప్తిచేత బుద్ధి శుద్ధం ఔతుంది”.

సాధకుడు భక్తి-జ్ఞాన-రాజ యోగాదులలో భగవదనుగ్రహంతోను, గురు-ఆచార్య మార్గదర్శకత్వంలోను తన శక్తి యుక్తులనన్నీ అధ్యాత్మవిద్యాభ్యాసంలో కేంద్రీకరించి పరిణతిని సాధించే పర్యంతమూ ఈ మాలిన్యాలని వదిలించుకుంటూ, పవిత్రతని ఎప్పటికప్పుడు ౘాలా తరచుగా సంపాదించుకుంటూనేవుండాలి.

(III) “శౌచము” అంటే కేవలం బాహ్యమైన “శుభ్రము” కంటె, బాహ్యాభ్యంతరాలకి సంబంధించిన “శుధ్ధము” కంటె కూడా భిన్నమైనది. ఇది కేవల వేద-స్మార్త విహిత పవిత్రీకరణ ప్రక్రియ. శుభ్ర-శుద్ధాలు రెండూ అందరికీ సామాన్యమైన విషయాలే! మానవశరీరంలో అనేక రక్తకణాలు, శ్వేతకణాలు నిరంతరమూ శిథిలస్థితికి వచ్చినవి మరణిస్తూంటాయి, వెనువెంటనే క్రొత్తవి పుడుతూనూ ఉంటాయి. దీనివలన మన దేహంలో అనుక్షణమూ జాతాశౌచమూ, మృతాశౌచమూ కొనసాగుతూనేవుంటాయి. ఈ “అశౌచస్థితి”(మామూలు భాషలో ‘మైల’ పడడం)నుంచి మనశరీరాన్ని పవిత్రీకరించి దైవార్చనకి యోగ్యమైన స్థాయిని కల్పించడంకోసమే మన నిత్య-నైమిత్తిక దైవారాధనలలో శ్రౌతాచమనం, స్మార్తాచమనం, మంత్రాచమనం, పురాణాచమనం, ప్రాణాయామం  మొదలైన ప్రక్రియలు మన శౌచాన్ని కాపాడడానికి ఆచరించడం జరుగుతుంది. ఇటువంటి ప్రక్రియాపరమైన శౌచవిధులేకాక “ఆర్యధర్మాలు” లో “పంచకోశశౌచం” కూడా విధించబడింది:—

“సత్యం శౌచం, తపః శౌచం, శౌచం ఇంద్రియ నిగ్రహః|
సర్వభూతదయా శౌచం, జలశౌచం తు పంచమమ్ “||

“సత్యం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, సర్వభూతదయ, జలస్నానం – ఈ ఐదూ,  మానవుడికి ఐదు శౌచాలని కలిగిస్తాయి”.

తైత్తిరీయోపనిషత్ ” లో వివరించబడిన పంచ(ఐదు)కోశాల పవిత్రీకరణ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అన్నమయకోశం అంటే బాహ్యశరీరం, ప్రాణమయకోశం  అంటే పంచప్రాణాల వ్యవస్థ, మనోమయకోశం అంటే సంకల్ప వికల్పాత్మక వ్యవస్థ, విజ్ఞానమయకోశం అంటే నిశ్చయాత్మక బుద్ధివ్యవస్థ, ఆనందమశకోశం అంటే, పరమాత్మతత్త్వానికి అత్యంతసన్నిహితవ్యవస్థ ఈ ఐదు వ్యవస్థలని ఏ విధంగా పునీతం చెయ్యాలో ఇక్కడ వివరించబడింది. ఐతే, ఉపనిషత్తులో, ఆరోహణక్రమం(ascending order)లో చెప్పబడిన విషయం, పై శ్లోకంలో అవరోహణక్రమం(descending order)లో చెప్పబడింది. అంటే ఉపనిషత్తు మనలని సాపేక్షసత్యం(relative reality)వైపునుంచి, నిరపేక్షసత్యం(absolute reality)వైపుకి తీసుకువెడితే, పైశ్లోకం దానికి వ్యతిరేకదిశలో మనలని తీసుకువెడుతోంది.

ఏకం నుంచి అనేకానికి వెళ్ళినా, అనేకం నుంచి ఏకానికి వచ్చినా ఫలితం ఒకటేకదా! ఐతే ఉపనిషత్తు బోధించిన ఆరోహణమార్గం అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుకని అలాగే వివరించుకుందాం! అంటే, శ్లోకభావాన్ని ఆలంబనగా చేసుకుని, వెనుకనుండి క్రమంగా ముందుకి మనం పయనిద్దాం!

(1) “జలశౌచం” – అంటే నీటితో శరీరాన్ని శుచిర్భూతంగా చెయ్యడం. ఉంటే గంగాజలలేశంతోను, లేకపోతే సంప్రదాయశుద్ధమైన “గంగే చ యమునే కృష్ణే, గోదావరి సరస్వతీ” ఇత్యాది సంకల్పోక్తవిధిగా భావనచేసి ఆ జలంతో స్నానం చేస్తే ఆ స్నానానికి తీర్థస్నానఫలం లభిస్తుంది అని మన శిష్టాచార సంప్రదాయం బోధిస్తోంది. దీని వలన “అన్నమయకోశం/శరీరం” శౌచాన్ని పొందుతుంది.

(2) “సర్వభూతదయా శౌచం” – అంటే ప్రాణులన్నీ ఒకటేకనుక, కష్ట-సుఖాలు ప్రాణులన్నింటికీ సమానమే అనేభావంతో సర్వప్రాణులనీ “ఆత్మవత్ సర్వభూతాని” అనినవిధంగా చూడడంవలన “సర్వభూతదయ” మనలో మేల్కొని “ప్రాణమయకోశం” శుచిర్భూతం ఔతుంది.

(3) “శౌచం ఇంద్రియనిగ్రహః” – అంటే సత్త్వగుణమయ ఆదర్శ చోదితమైన ఇంద్రియప్రజ్ఞావ్యాపారం వలన, ఇంద్రియాలు విచ్చలవిడిగా ప్రకోపించి హీనవిషయవాంఛలతో బహిర్గత ప్రయాణంచేసే వృత్తులు నిగ్రహించబడడం జరుగుతుంది. ఈ నిగ్రహం, సంకల్ప-వికల్పాత్మకమైన మనస్సుని ౘక్కగా అదుపులో పెట్టగలగడంద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. అప్పుడు క్షుద్ర విషయ  వాంఛలపట్ల విముఖమైన స్వచ్ఛ”మనోమయకోశం” శుచిమయం ఔతుంది.

(4) “తపః శౌచం” – అంటే శాస్త్రబోధ-గురూపదేశాలద్వారా మేల్కొనే  అధ్యాత్మవిద్యాజ్ఞానాగ్నిద్వారా నిర్వహించబడే తపస్సుద్వారా  నిశ్చయాత్మకశక్తియుక్తబుద్ధి, అనగా, “విజ్ఞానమయకోశం” శౌచవంతం ఔతుంది.

(5) “సత్యం శౌచం” – అంటే, పైన విపులీకరించబడిన నాలుగు శౌచాలు సాధించబడినతరువాత, సాధకుడి సత్త్వగుణపూర్ణ చైతన్యమూర్తికి,  మౌలిక ఏకైక సత్యంయొక్క స్వరూపంతో అత్యంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సత్యం చిన్మయమూ, ఆనందమయమూ కూడాను! అందువలన ఆ స్థితిలో, సాధకుడి సాధన పరిణతిపొంది, “ఆనందమయకోశం” శౌచకాంతితో పునీతమయ్యి, సాధకుడు సంపూర్ణశౌచనైర్మల్యంతో భాసిస్తాడు.

మనోవాక్కాయాలు – అంటే – మనస్సు, మాట, శరీరం అని శాస్త్రం నిర్దేశించిన త్రికరణాలు లేక మూడు పనిముట్లుయొక్క శౌచం కూడా శాస్త్రంలో ఇలాగ ప్రస్తావించబడింది:—

“మనః శౌచం, వాక్ శౌచం చ, దేహశౌచం జలాత్మకమ్ |
త్రిభిః శౌచైః ఉపేతో యః, సః స్వర్గీ నాత్ర సంశయః”||

“మానసికశుచి, వాఙ్మయశుచి, దైహికశుచి అనే మూడు శౌచాలు కలిగిన సాధకుడు పునరాగమనంలేని పూర్ణదివ్యస్థితిని సాధిస్తాడు”.

ఆర్ష ఆదర్శభావ పరిపూతమై, సంయమదీప్తివంతమైన మనస్సు, అటువంటి పరిణత పరిపక్వ మనస్సునుండి పుట్టే అనుద్వేగకరమైన మాటలు, పవిత్ర మందాకినీ మాహాత్మ్యం కలిగిన జలస్నానంతో పునీతమైన శరీము, ఈ మూడూ కలిగిన సాధకుడు సంపూర్ణ ధన్యాత్ముడు.

స్వస్తి|

You may also like...

11 Responses

  1. సి.యస్ says:

    పూజార్చనలకి అత్యంత ఆవశ్యకమైన శుచి,శుభ్రతల
    గురించి,. తద్వారా మనః శరీరాలని ఎలా పవిత్రీకరణ
    చేసుకోవాలి అనే దానిమీద చేసిన లోతైన పరిశీలన,
    అందించిన సమాచారం సాధక జనులకి చాలా
    ఉపయోగపడుతుంది.
    శుభ్రము, శుద్ధము, శౌచము అనే మాటల మధ్య
    ఉన్న అంతరం…వాటి ప్రాధాన్యత ఇది చదివేకా ఒక
    అవగాహనకొచ్చింది.
    మన పెద్దలు ఎత్తైన దండెంమీద ఆరేసుకునే మడిబట్టలూ,
    నిత్యం చేసే స్నానాలూ, బయటినుంచి వచ్చి నేరుగా దేముడి
    గదిలోకి రానివ్వకపోవడాలూ…అలాగే తరచుగా దేముడి విగ్రహాలూ,
    పటాలూ, గది పరిసరాలూ శుభ్ర పరుచుకోవడాలూ ఎందుకు
    ఏర్పాటు చేశారో.. ఆ సదాచారం ఈ తరం వారికి తెలియాలంటే
    ఇలాంటి ఆర్టికల్స్ చదవడం చాలా అవసరం.

  2. Srvalliseshasai says:

    Chala chakkaganu,vipulamganu..teliyachesinandhuku dhanyavadhamulu

  3. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    “ఆత్మవత్ సర్వభూతేషు”

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్
      ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పండితః ||

      • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

        ఆత్మవత్ సర్వభూతేషు అన్న చాణక్య నీతిని ఆత్మవత్ సర్వభూతాని అని కొందరు quote చేసేస్తూఉంటారు. అలాగ మనం కూడా చేసేయ్యకూడదనీ, పై article లో శౌచం కింద ఆత్మవత్ సర్వభూతాని అన్నదాన్ని (grammatical గా తప్పుకాకపోయినా, మరొకరి quote కాబట్టి) ఆత్మవత్ సర్వభూతేషు అని మార్చాలనీ నా అభిప్రాయం.

        • v.v.krishnarao says:

          వీటిని ఒక ప్రణాళికని అనుసరించి పుస్తకరూపంలో ప్రచురించాలని కొందరు మిత్రులు ప్రయత్నం చేస్తున్నారు.
          అప్పుడు తప్పుల సవరణచేసి ప్రచురణ చేయాలని
          సంకల్పం. అందుకని వెంటనే సవరణలు చేయడంలేదు
          కిరణ్ ! ఇవి కాక ఇంకా కొన్ని తప్పులు నా దృష్టికి, నా
          బంధు-మిత్రుల దృష్టికి వచ్చేయి. అన్నీ కలిపి ఒకేసారి
          సవరణ చేయించి, ముద్రణకి పంపాలని అభిప్రాయం.

  4. V.V.Krishnarao. says:

    “దేవాః శౌచ ప్రియాః” అని శాస్త్రవాక్యం. దేవతలకి శౌచమందు
    ప్రీతిభావం ఉంటుంది. శౌచంతోకూడిన జప-పూజాదులని
    దేవతలు సప్రసన్నంగా స్వీకరిస్తారు. పితృదేవతలుకూడా
    దేవతాస్వరూపులే! అందువలన
    “వసుః సత్యః క్రతుః దక్షః కాలః కామః ధృతిః కురుః|
    పురూరవాం ఆద్రవః చ విశ్వేదేవాః ప్రకీర్తితాః”||
    అని వర్ణించబడిన పితృదేవతా విభాగాధిపతులైన దేవతలు,
    ఆశ్వినులు, వసు-రుద్ర-ఆదిత్య స్వరూపులైన స్వకుటుంబ
    పురుషత్రయ పితృదేవతలు అందరూ శౌచప్రియులు.
    అందుకే ఆబ్దికాదులని మడి-తడి-ఆచారాలతో మన పెద్దలు
    నిర్వహించేవారు.

  5. సి.యస్ says:

    భక్తు లెల్ల వేళ పాటించి యున్నచో
    శౌచ శుభ్రములను సమము గాను
    మలిన రహితమైన మనసు కలిగియుండి
    పరమ పథము చేరు పదిలముగను.

  6. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    పరమపదము

  7. Dr nishanth says:

    Request everybody reading this to share widely.ithis is a treatise written for sadhakas by holy mother herself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *