శారదా సంతతి ~ 52 : సురుచిర సంగీత గానకళాసరస్వతి ~ గానవిదుషీమణి హీరాబాయి బరోడేకర్

ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
22—07—2018; ఆదిత్యవాసరము|

“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|

“శారదా సంతతి ~ 52″| సురుచిర సంగీత గానకళాసరస్వతి ~ గానవిదుషీమణి హీరాబాయి బరోడేకర్ | (29—05—1905 నుండి 20—11—1989 వరకు)

అది 1921వ సంవత్సరం. బొంబాయి నగరం. “గాంధర్వ మహావిద్యాలయ” సంస్థాపక-ఆచార్యవరిష్ఠులైన సంగీతవిద్యామహర్షి, గాయనబ్రహ్మ, నిత్యసదాచార గరిష్ఠులు ఐన
శ్రీ విష్ణుదిగంబర పలూస్కరుగారు తమ సంగీతవిశ్వవిద్యాలయ వార్షికోత్సవాలని మహావైభవంగా జరుపుతున్నారు. ఆ ఉత్సవాలలో పాల్గొన వలసినదిగా 19 సంవత్సరాల వయస్సున్న సురేష్ బాబు మానేకి, ఆయన చెల్లెలు 16 ఏళ్ళ ప్రాయమున్న హీరాబాయి బరోడ్కర్ లేక బరోడేకర్ కి, ఆహ్వానం వచ్చింది. సురేష్ బాబు ౘక్కని కిరానా ఘరానా సంప్రదాయశుద్ధమైన గానంతోను, చెల్లెలికి హార్మోనియంతో సహకారం అందిచడంలోను అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఆ ఉత్సవాలకన్నింటికీ కలికితురాయి హీరాబాయి! ఆమెగానం రసజ్ఞులని ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. మిగిలిన మహామహుల కళాప్రదర్శనలన్నీ ఆమె గానవిద్యావైశారద్యంముందు వెల-వెల పోయేయి. ఆ రోజు ఆ రసమయ సాయంత్ర మహాశోభని దివ్యిదీప్తితో అజరామరంచేసిన ఆమె “పటదీప్ రాగం” విని ఆ నాటి శ్రోతలు మంత్రముగ్ధులైపోయేరు. ఆ రోజులలో ఆమెని సంగీతప్రియులు “పటదీపరాగసుందరి” హీరాబాయి అని కొనియాడేవారు. “పటదీపరాగం” మనందరికీ చిరపరిచితమైన, మనందరిమనసులని దోచుకున్న “కాఫీ థాట“రాగజన్యమైన(కర్ణాటక “ఖరహరప్రియ“కి ఉత్తరభారత సంగీత సంప్రదాయంలోని రాగం) “భీంపలాస్ “రాగానికి ౘాలా సన్నిహితమైన రాగం! ఆ “భీంపలాస్ ” రాగం, ఈ కాలంలో పాడ బడుతున్న త్యాగరాజస్వామివారి “నగుమోము గనలేని నా ౙాలి తెలిసి” అనే కృతియొక్క “అభేరి“రాగానికి సన్నిహితమైనది. బహుళజనాదరణని పొందిన “నీలిమేఘాలలో“, “నీవుండేదా కొండపై, నేనుండేదీ నేలపై“, “నీ లీల పాడెద దేవా!” వంటి పాతతెలుగు చలనచిత్రగీతాలలోను, “యహ్ జిందగీ ఉసీకి హై“, “ఆ నీలె గగన్ తలే, ప్యార్ హం
కరే“, “నయ్నోcమేc బదరాఛాయే“, “ఖిల్తేహై గుల్ యహాc” వంటి పాత హిందీ చలనచిత్రగీతాలు జనబాహుళ్యంలో శాశ్వత ఆరాధ్యగీతాలుగా శ్రోతల హృదయాలని దోచుకున్నాయి అని మనకి తెలుసు. ఈ పాటలన్నీ మహామధురమైన భీంపలాస్ రాగంమీద ఆధారపడి స్వరరచన చేయబడిన ఆల్ టైం హిట్స్ !

హీరాబాయి తనమొదటి సంగీతసభతోనే మహారాష్ట్ర సంగీతరసజ్ఞుల గొప్ప మన్ననని పొంది, ఆ మహనీయ గౌరవ-ఆదరాలని ఆజన్మాంతమూ నిలుపుకుంది. ఆమె పట్ల మహారాష్ట్ర ప్రజల ఆరాధనాభావం ఏ మాత్రమూ తరగకుండా పెరుగుతూనేవుంది. అందుకు ప్రధానకారణాలలో మొదటిది ఆమె సహజ ప్రతిభ. రెండవది ఆమె అంకితభావంతో సంగీత రంగస్థల క్షేత్రాలకి తనశక్తి-యుక్తులన్నీ ధారాదత్తంచేసింది. ముఖ్యంగా సంగీతరంగానికి ఆమెచేసిన సేవలు ఖయాలు సంగీతప్రపంచంలో, అందునా కిరానా ఘరానా రంగంలో చిరస్మరణీయాలు, శాశ్వతప్రభావయుతమైనవి. కిరానా ఘరానా సంప్రదాయానికి, శ్రీమతి హీరాబాయి, ఆమె తరవాత శ్రీమతి గంగూబాయి హంగల్ చేసిన అపార సేవ, జైపూరు అట్రౌలీ ఘరానాకి శ్రీమతి కేసర్బాయి కేర్కర్ ,శ్రీమతి మోగూబాయి కురుడీకర్ చేసిన అమేయ భాగదానంతో మాత్రమే పోల్చదగినది.

= ॥ = ॥ = ॥ = ॥ = ॥ = ॥ =

కాలం 1937వ సంవత్సరం! వేదిక కలకత్తా మహానగరం! సందర్భం ఏమిటంటే, “అఖిల భారత సంగీత మహాసభలు” నిర్వహించడం జరుగుతోంది! ప్రధాన కార్యకర్తలందరూ జగద్విఖ్యాత సంగీతకళాకారులనందరినీ ఆహ్వానిస్తున్నారు. అందరికందరూ పేరెన్నికగన్న హేమా-హేమీలే! అంతో-ఇంతో పేరున్నవారైనా, యువకళాకారులెవరికీ మహామహులైన కార్యకర్తలు అవకాశాలు కల్పించ దలుచుకోలేదు. 45 సంవత్సరాల పరిణతకళాతపస్విని సుర్శ్రీ శ్రీమతి కేసర్బాయి కేర్కర్జీకి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఏ జాతీయ సంగీత మహోత్సవాలకైనా ఆమె రాకపోతే అటువంటి సభల గౌరవం సన్నగిల్లిపోతుంది. ఆమె ఉనికి సభాగౌరవాల స్థాయిని పెంచుతుంది. అటువంటి మహాకళాకారిణి కేసర్బాయి తనతోబాటుగా 32 సంవత్సరాల హీరాబాయి బరోడేకర్ని తీసుకు రాబోతున్నానని, ఆమెకి తప్పనిసరిగా సభల ప్రధానసమయం(prime time)లో పాడడానికి అవకాశం ఇచ్చితీరాలని ప్రధానకార్యవర్గసభ్యులదగ్గర పట్టు పట్టింది. కార్యవర్గసభ్యులు కేసర్బాయిని ఎలాగైనా సంతోషపెట్టాలనే మొహమాటంతో హీరాబాయి పాటకచేరీకి అవకాశం కల్పించడానికి రాజీ పడ్డారు. అంతవరకు మహారాష్ట్రప్రాంతానికిమాత్రమే పరిమితమైన హీరాబాయి కీర్తి-ప్రతిష్ఠలుకాని, ఆమె గానమాధుర్యంకాని మచ్చుకైనా తెలియని సంగీతోత్సవాల కార్యవర్గ సభ్యులు జాతీయస్థాయిలో పేరు-ప్రఖ్యాతులున్న గొప్ప కళాకారులు-కళాకారిణులు నిర్వహించబోయే సంగీతసభలమధ్య ఈ చిన్న వయస్సువున్న ప్రాంతీయకళాకారిణి తన కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తుందో తెలియక సంకోచంతో భయపడుతున్నారు. సంగీతరంగంలో మహారసజ్ఞకోవిదులైన కలకత్తా సభ్యుల స్థాయికి అనుగుణంగా హీరాబాయి పాడగలగడానికి తగిన పరిణతిపొందిన వయస్సు ఆమెకి లేకపోవడం వలన కార్యవర్గసభ్యుల సందేహాలకీ, సంకోచాలకీ అంతూ-పొంతూ లేకుండా పోయింది. ఈ లోగా “సంగీతసభలు” ప్రారంభం అయ్యేయి. పేరెన్నికగన్నసంగీతమహావిద్వాంసుల సభలన్నీ విజయవంతంగా జరిగిపోతున్నాయి. ఆ సమయంలో కొందరు కార్యనిర్వాహకవర్గం పెద్దలు కేసర్బాయిజీ వద్దకి భయం-భయంగా వెళ్ళి చేతులు కట్టుకుని ఇలాగ అన్నారు:—

“అమ్మా! మీరు తీసుకువచ్చిన గాయని హీరాబాయిగారు ౘాలా సన్నంగా, మహానాజూకుగా ఉన్నారు. ఎంత అందౘందాలతో వెలిగిపోతున్నా, పాట పాడడానికి తగినంత బలంగాను, దృఢంగాను లేరు. సరిగా పాడగలుగుతారా, తల్లీ? ఏ మాత్రం సవ్యంగా పాడలేకపోయినా కార్యక్రమం అంతా అభాసు ఐపోతుంది. యాజమాన్యంవారు మా ప్రాణాలమీదికి వస్తారు”

కేసర్బాయి:—
(పక-పక నవ్వుతూ) “మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డం పెడతాను. మీరేమీ భయపడకండి. మీరు అనుకునేటట్లు జరగదు. అలాగ ఐతే నేనెందుకు పూచీపడి ఆమెని తీసుకువస్తాను. చూడడానికి జాజితీగలాగ అంత అందంగాను, పరమసుకుమారంగాను ఉంటుంది. ఆ పిల్ల మైకు ముందు కంఠం విప్పితే అప్పుడు మీకే తెలుస్తుంది, నేను చెప్పే ఈ మాటలకి అర్థం ఏమిటో!”

“అలాగైతే పరవాలేదు అమ్మా! మా అందరి గౌరవం మాకు దక్కుతుంది” అంటూ, ఇంక ఏమి మాట్లాడాలో ఏమీ తోచక, అందరూ నిష్క్రమించేరు.

హీరాబాయి గాత్రసంగీతసభజరిగే రోజు రానే వచ్చింది. మంచి అందమైన చీరలో దీపాల వెలుగులో అప్సరసలా మెరిసిపోతూ మహనీయ వర్చస్సునిండిన దేహకాంతితో హీరాబాయి వేదికని అలంకరించింది. హార్మోనియం, తబలా వాద్యకళాకారులు, తాన్పురా వాయించేవారు ఎవరి స్థానాలలో వారు ఆసీనులయ్యేరు. సభాసదులందరూ యౌవనంలోవున్న కళాకారిణి హీరాబాయి వైపు ౘాలా కుతూహలంగా కళ్ళప్పగించి, ‘ఈ అమిత సౌందర్యానికి అపఖ్యాతి రాకండా ఈ అప్సరస పాడగలదా’ అన్నట్లు చూస్తున్నారు.

మొట్టమొదట “యమన్ ” రాగంతో హీరాబాయి సభని ప్రారంభించింది. ఖంగుమనే మహామధురమైన ఆమె కోమలకంఠంలో యమన్ రాగం అపూర్వసౌందర్యాలని వెలారుస్తూ, శ్రోతృమనోహరంగా సభాప్రాంగణాన్నంతా రసప్లావితం చేసింది. శ్రోతలు పారవశ్యభావంతో తన్మయులై వింటున్నారు. సుమారు గంటసేపు విలంబిత కాలంలో బడాఖయాల్ , మధ్యలయలో ఛోటా ఖయాల్ , ద్రుతలయలో మరాఠీ భక్తిగీతం వినిపించి ౘక్కని కిరానా ఘరానా సంప్రదాయంలో అలవోకగా హీరాబాయి పాడింది. ఆ పైన “భూపాలీ” రాగం, మధ్యలయకృతిని, దాని వెంట మరొక ద్రుతలయకృతిని అరగంటపైగా హీరాబాయి పాడి వినిపించింది. తదుపరి దేశ్ రాగంలో ఠుమ్రీనిపాడి, చివరగా మిశ్రభైరవిలో భక్తిభావభరిత భజనతో సభని హీరాబాయి ముగించింది. రసజ్ఞుల నిరవధిక కరతాళధ్వనులు మిన్ను ముట్టేయి. కార్యవర్గసభ్యులంతా ఏకకంఠంతో ముందు కేసర్బాయిని, తరవాత హీరాబాయిని పొగడ్తలతో ముంచెత్తేరు. ఆ ఒక్కసభతోనే హీరాబాయి జాతీయస్థాయి కళాకారిణిగా ఘనయశస్సుని అందుకుంది.

© © © © © © © © © © ©

మహారాష్ట్రలోని మీరజ్ లో, వసంత ఋతువులో, 29-5-1905వ తేదీన, హీరాబాయి జన్మించింది. తండ్రి కిరానాఘరానా సంప్రదాయానికి గోత్రర్షివంటి ఖాcసాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాcవర్యులు. తల్లి తారాబాయి మానేగారు కూడా కిరానా ఘరానా సంప్రదాయంలో భర్త దగ్గర సంగీతవిద్యని నేర్చిన విదుషి. వసంతకాలాంతంలో వసంతకోకిలకంఠంతో హీరాబాయి జన్మించింది. పుట్టినవెంటనే ఏడవకపోవడంవల్ల హీరాబాయిని మృతశిశువు(still-born baby) గా పరిగణించి ఆసుపత్రి నర్సింగ్ శాఖవారు, శిశువుని ఒకమూల విడిచిపెట్టి, బాలింతరాలైన తల్లి తారాబాయికి సపర్యలు చేయడంలో నిమగ్నమైపోయివున్నారు. ఆ శిశువు—వైద్యులు, దాదులు అనుకున్నట్లుగా మరణించలేదు. జన్మజన్మాంతర సంగీత తపస్సుకి ఫలరూపమైన దీర్ఘ సంగీతసమాధిస్థితిలో ఆ ప్రాక్తనజన్మవిద్యాకౌశలమహాయోగభూమికలో, ఆ శిశువుయొక్క దశవిధ ప్రాణాలన్నీ లయీభూతమైవున్నాయి. ఇహలోక స్పృహలోకి రావడానికి ఆ గానతపస్వినికి కొంత సమయం అవసరమయ్యింది. ఆ విషయపరిజ్ఞానశూన్యులైన వైద్యాలయ ప్రసూతివిభాగానికి చెందిన వైద్యులు, దాదులు ఆమెని మృతశిశువుగా పరిగణించేరేతప్ప, స్వరమయతపోదీక్షగా ఆ శిశువుయొక్క ఆ గోప్యస్థితి (mystical state) ని గ్రహించలేకపోయేరు. అది వారి తప్పుకాదు! సంగీతశారదాదేవియొక్క అనుపమలీలావిలాసం వారి ధీశక్తి పైన తన దివ్యమాయావిభవాన్ని ఆచ్ఛాదింపజేసింది.

ఆసుపత్రి దాదులందరూ వారి-వారి పనులలో నిమగ్నమై ఉండగా పంచమస్వరంలో గానంచేసే కోకిలగాత్రధ్వనితో ఒక శిశువు రోదన నాదం ఆసుపత్రినంతటినీ మంత్రముగ్ధంచేసింది. తీరా పరుగులతో వెళ్ళి ఆసుపత్రి సిబ్బందివారు తేరి-పారచూడగా, చంపాకలీ(హీరాబాయి మొదటిపేరు) తన మొట్టమొదటి పాటకచేరీని మరీ మధురమైనగానంతో శైశవదశలోనే కర్ణపేయంగా చేసింది.

సురేశ్ బాబు మానే, హీరాబాయి బరోడేకర్ , సరస్వతీబాయి రాణే, కృష్ణరావ్ మానే, కమలాబాయి బరోడేకర్ , ఈ ఐదుగురూ తోబుట్టువులు. తల్లి తారాబాయి మానే హీరాబాయిని వైద్యవిద్యలో విశ్వవిఖ్యాతిగల డాక్టరుగా చెయ్యాలనుకుంది. తండ్రి అబ్దుల్ కరీంఖాcసాహబుకి హీరాబాయి రంగస్థలగాయనిగాకాని, నటిగాకాని కావడం ఇష్టంలేదు. ఆమె ఆదర్శగృహిణిగా అవ్వడమే ఆయనకి ఇష్టం. కాని శారదామాత దివ్యసంకల్పం మరొకవిధంగావుంది. తల్లి తారాబాయి అభిమతం మేరకి హీరాబాయి పాఠశాలకి వెళ్ళినా ఆమె మనసు ౘదువుపైన లగ్నం అయ్యేది కాదు. హీరాబాయి హృదయం సంగీతంకోసం తహతహలాడిపోయేది. తండ్రి కరీంఖాc సాహబు కొడుకు సురేష్ బాబుకి సంగీతం పాఠాలు చెపుతూండగా, హీరాబాయి ౘాటు-మాటుగా ఆ పాఠాలనన్నీ జాగ్రత్తగావిని, ఏకాంతంలో వాటిని మహాశ్రద్ధతో అభ్యాసంచేసేది. ఆమె కోకిలకంఠనాదంలో ఆమె వినిన సంగీతస్వరాలన్నీ సహజసుందరంగా ఒదిగిపోయేవి. అప్పటికి, తల్లి-తండ్రులిద్దరికి తమ కుమార్తె సంగీతగాయనిగా యశస్సుని ఆర్జించబోయే గానగంధర్వవిదుషిగా అవగాహనకలిగిపోయింది. ప్రప్రథమంగా అన్నగారైన సురేశ్ బాబు దగ్గర ప్రాథమికపాఠాలన్నీ నిర్దుష్టంగా నేర్చుకుంది. ఆ తరవాత వారి కుటుంబానికి సన్నిహితబంధువైన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాcసాహబ్ దగ్గర నాలుగైదు సంవత్సరాలపాటు ౘాలా గాఢమైన, గంభీరమైన కిరానా ఘరానా సంప్రదాయానికి చెందిన స్వచ్ఛమైన సంగీతవిద్యని కూలంకషమైన అంకితభావంతో అభ్యసించింది. సంగీతాభ్యాసమే ఆహారమూ, జలమూ, ప్రాణవాయువుగా ఆమె తన సంగీత విద్యాభ్యాసం కొనసాగించింది. ఆ సంగీతవిద్యాభ్యాసానికి తన సంగీతసృజనాత్మక గానవైశారద్యంతో మెరుగులు దిద్దింది. 1922వ సంవత్సరంలో తారాబాయి తన భర్తతో విడిపోయింది. అదే సంవత్సరం ఆమె తన ఐదుగురు బిడ్డలతోను బొంబాయిలో స్థిరపడి సురేశ్ బాబు, హీరాబాయిలతో కలిసి, “నూతన సంగీతవిద్యాలయ” అనే పేరుతో ఒక సంగీతపాఠశాలని స్థాపించింది. ఆ విద్యాలయంలో తారాబాయి, హీరాబాయి, సురేశ్ బాబు మానే సంగీతవిద్యని విద్యార్థులకి బోధించేవారు. ఆ కాలంలో వారి సంగీతవిద్యాలయం మంచి పేరుని సంపాదించుకుంది. ఆ సంగీతవిద్యాలయంవారి అధ్వర్యంలో హీరాబాయి విజయవంతమైన అనేకనాటకాలని ప్రదిర్శించింది. ఆ నాటకాలలో నాయకి భూమికలని తానే ధరించేది. ఆ పాత్రలలో శాస్త్రీయరాగసంగీతవాణిలో ౘక్కని ప్రజాదరణని పొందగలిగిన పాటలనిపాడి ఆ నాటకాలకి అపారమైన జనాదరణ కలిగేటట్లు వాటిని నిర్వహించేది. “సంగీత సౌభద్ర“, “సాధ్వి మీరాబాయి“, “యుగాంతర” మొదలైన అనేక జనామోదయోగ్యమైన నాటకాలని ఆమె నిర్మించి నాటకరంగరసజ్ఞలోకంలో శాశ్వతస్థానాన్ని సాధించింది. అదే సమయంలో మూకీసినమాలకి కాలం చెల్లిపోయి, టాకీ చిత్రాలు ప్రచారంలోకి రావడంవలన మరాఠీ రంగస్థలానికి కోలుకోలేని దెబ్బతగిలింది. కాలానుగుణమైన మార్పులని అనుసరించి హీరాబాయి చలనచిత్రరంగప్రవేశంచేసి, “ప్రతిభ“, “సువర్ణ మందిర్ “, “జానాబాయి“, “మునిసిపాలిటీ” అనే సినిమాలలో నాయికగా నటించింది. ఐతే ఆ చిత్రాలు బాక్సాఫీసు హిట్స్ కాలేకపోయేయి. ఆ కారణంగా ఆమె కేవలం శాస్త్రీయసంగీతగాయనిగానే శేషజీవితంలో స్థిరపడిపోయింది. సంగీతకచేరీలని నిరవధికంగాచేస్తూ, ఆ కాలంలో 40 రేడియోకేంద్రాలద్వారా సంగీతం పాడుతూ, 175 నుంచి 200 గ్రామఫోను డిస్కులకి సంగీతం పాడి, ఔత్సాహిక కళాకారులు, కళాకారిణులు, శిష్యబృందాలకి సంగీతం నేర్పుతూ పూర్ణసంగీతకళాఫలవంతమైన ఆదర్శజీవితాన్ని హీరాబాయి గడిపేరు. 1989, నవంబరు, 20వ తారీకున హీరాబాయి పూనాలోని తమ స్వగృహంలో, వారి కుటుంబసభ్యులమధ్య భౌతికకాయాన్ని త్యజించేరు.

చంపాకలీ అంటే మన సంగీతసరస్వతి అయిన హీరాబాయియొక్క జననం నుంచీ రకరకాల కష్ట-సుఖాల మేళవింపుతో ఆమె జీవితమంతా గడిచింది. ఆమె లోకోత్తర శాస్త్రీయసంగీత మహాగాయని, మహారాష్ట్ర రంగస్థల ప్రప్రథమ మహానటి అయ్యి విశ్వవిఖ్యాతిని ఆర్జించినా, అటువంటి పేరు-ప్రఖ్యాతులని పొందడానికి హీరాబాయి తగిన మూల్యం చెల్లించవలసివచ్చింది. మరాఠీ నాటకాలు, రంగస్థలము గొప్ప వెలుగు వెలిగిన కాలంలో హీరాబాయి ఎదురులేని మహాకళాకారిణిగా పేరు, ప్రఖ్యాతులు పొందింది. 1965లో శ్రీమతి హీరాబాయి బరోడేకర్ కి, సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. 1970లో భారతప్రభుత్వం ఆమెని పద్మభూషణ్ బిరుదంతో సత్కరించింది. ఆమె మరాఠీనాటకరంగసేవకి గుర్తింపుగా “విష్ణుదాస్ భావే అవార్డు” ప్రదానం చేయబడింది. 1947, ఆగస్టు, 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభసందర్భంలో హీరాబాయిజీ “వందేమాతరం” గీతాన్ని ప్రభుత్వలాంఛనంగా ఢిల్లీలోని ఎర్రకోటలో గానంచేసేరు. శ్రీమతి సరోజినీనాయుడు హీరాబాయికి “గాన కోకిల” బిరుదుని ఇచ్చేరు. మహారాష్ట్రులు హీరాబాయిని “గాన హీరా” అని పిలిచేవారు. ఆమె చైనా, తూర్పు ఆఫ్రికా దేశాలు పర్యటించేరు.

ఆమె చెల్లెలైన శ్రీమతి సరస్వతీ రాణే, శ్రీమతి ప్రభా అత్రే, శ్రీమతి మాలతీ పాండే, శ్రీమతి శైలా పండిత్ , శ్రీమతి జానకీ అయ్యర్ , శ్రీమతి సువర్ణా చంద్రశేఖరన్ మొదలైనవారు ఆమె శిష్యబృంద సభ్యురాండ్రు.

పండిత్ రామకృష్ణబువా వఝే, పండిత్ భాస్కరబువా బాఖ్లే వంటి గంధర్వ గాయక మహాపురుషులు బాలికగావున్న హీరాబాయి పాటలు వినాలని కుతూహలం చూపేవారట! మహాసంగీతావిద్యాతపస్వి అయిన పండిత్ రామకృష్ణబువా వఝే శ్రీమతి హీరాబాయి బరోడేకర్ గంధర్వగానవైశారద్యం గురించి మాట్లాడుతూ ఇలాగ అన్నారట:—

“మనస్సు తన సహజశాంతిని కోల్పోయి అతలాకుతలం ఔతూంటే, హీరాబాయి సంగీతాన్ని వినడంతప్ప ఇంక చెయ్యగలిగినదేమీలేదు. ఆమె గానమాధుర్యం అటువంటి మనస్సుకి, మాటలకందని విలక్షణ శాంతిని ప్రసాదిస్తుంది”!

ఆధునిక మరాఠీకవి, సుప్రసిద్ధ ఆంగ్లరచయిత శ్రీ బి.ఎస్ . మార్దేకర్ శాస్త్రీయ సంగీతాన్ని, సామాన్యజనప్రియసంగీతాన్ని అర్థంచేసుకుని, రసజ్ఞతతో విమర్శించడంలో నిపుణులు. ఆయన మొదటిసారి హీరాబాయిజీని వినడం తటస్థించిన తరుణంలో ఆయన భావనలని ఇలాగ వ్యక్తపరిచేరు:—

“హీరాబాయి గానాన్ని వినడం అంటే ఒక విహంగంయొక్క వినువీధిలోని సంచారాన్ని పరికించడంవంటిది. ఆమె సంగీతం అటువంటి పక్షియొక్క ఆకాశవిహారంలోవుండే సౌకుమార్యాన్ని, సమతౌల్యతా సౌందర్యాన్నికలిగివుంటుంది. విహంగం యొక్క రెక్కలు మెల్లిగా విచ్చుకుంటూ, తమ మెత్తని స్పర్శతో చుట్టూవున్న గాలితరగలని ముద్దాడడానికి యత్నిస్తాయి. అంతేకాని వాయుతరంగాలని సంక్షోభానికి గురి చెయ్యవు”!

ఒక సాయంత్రం ఆచార్య ఎన్ . ఎస్ . ఫాడ్కేగారి కవితామయ భావలోకాన్ని హీరాబాయిగారి “మార్వారాగం” ఉద్దీపింపజేయగా, వారు ఇలాగ అన్నారు:—

“ఆమె సంగీతాన్ని సృజించదు. నక్షత్రదీప్తిమయవిభావరిలోకి లోకం ఏ విధంగా విచ్చుకుంటుందో, అదేవిధంగా ఆమె(గానం) సంగీతంలోకి వికసిస్తుంది”! (పై మూడు విషయాలు శ్రీ మోహన నాదకర్ణిగారి పుస్తకంలో ఉదహరించబడిన ఆంగ్ల భావాలకి స్వేచ్ఛానువాదం).

శ్రీమతి హీరాబాయి బరోడ్కర్ గారి గానమాధుర్యమహిమని వర్ణించే ఈ పద్యాన్ని వారి పవిత్ర చరణ సన్నిధిలో సమర్పించుకుందాం:—

కం.
హీరాబాయి బరోడ్కర్
చారుతమామోఘ గాన సంగీతానం
దారామ విహారము, బృం
దారక సేవిత సుధా నిధానము పోలున్ ||

శ్రీశారదాజనని అపూర్వ సంగీతవిద్యా తనయ శ్రీమతి హీరాబాయి బరోడేకర్జీకి, మన సాష్టాంగదండప్రణామం సమర్పించుకుందాం.

స్వస్తి|

You may also like...

9 Responses

  1. Dakshinamurthy M says:

    హీరాబాయ్ గారి పేరు ఎప్పుడో విన్నా గాని, ఆవిడ గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ వ్యాసం ద్వారా చాలా విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు. సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావుల్లో ఈవిడ కూడా ఒకరు అనటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

  2. సంగీతం పై మక్కువ ఉండి…. సంగీత ప్రపంచంగూర్చి పెద్దగా అవగాహన లేనివారిని సైతం… ఆకట్టుకునే విధంగా ఉంది వ్యాసం. సంగీత సామ్రాజ్గికి ప్రమాణాలు.

  3. సి.యస్ says:

    ‘ భారత కోకిల’ శ్రీమతి సరోజినీ నాయుడు
    చేతులమీదుగా ‘గానకోకిల’ బిరుదునందుకున్న
    ‘ పద్మభూషణ్ ‘: శ్రీమతి హీరాబాయి బరోడ్కర్ గారి
    సప్తవర్ణ జీవిత చిత్రం ఇంద్రధనుస్సులా పలకరించింది.
    ఆమె గురించి చదివినంతసేపూ ఓ గంధర్వ గాయని తన
    అనంత సౌందర్య రూపలావణ్యాలతో ఈ సంగీత లోకంలో
    తిరిగాడుతూ రసిక శ్రోతలకు గానామృతధారలతో విందు
    చేసినట్టనిపించింది. ఆకాలంలో ఆమె సంగీతం ప్రత్యక్షంగా
    విన్న శ్రోతలు అదృష్టవంతులు!
    ఆజన్మాంతం సంగీత కేదారంలో సుస్వరాలు పండించిన
    శ్రీమతి హీరాబాయి బరోడ్కర్ గురించి చక్కటి పరిచయం చేసిన
    నికివే ధన్యవాదాలు.

  4. సి.యస్ says:

    గాన మధురిమ లొలికించు గళము లోన
    రాగ ధారలు కురిపించు రసిక రాజ్ఞి!
    ఇలకు దిగినట్టి సురకాంత హీరబాయి
    రూపమందున తనకెవరు సరి సాటి!

  5. V.V.Krishna Rao says:

    మన “sriaim.com”లోని “శారదా సంతతి” శీర్షికని 27-5-2017వ తేదీ
    నుంచి ప్రారంభించేం! ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరకాలంలో 52 మంది వివిధ రంగాలలో అనంతయశస్సుని ఆర్జించిన మహామహులైన స్త్రీ-పురుషుల జీవిత చరిత్రల రేఖాచిత్రాలు,
    ఆ-యా రంగాలలో వారు చేసిన సేవలు, సాధించిన ఆదర్శవంతమైన
    ధ్యేయాలు మొదలైనవి వాౘవిగా తెలుసుకున్నాం. ఈ శీర్షికయొక్క
    నిరాఘాటనిర్వహణకి మీ అందరి స్పందనలు, ప్రోత్సాహం నేను మరువలేనివి. మీ అందరికీ పేరు-పేరునా నా ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఇలాగే ముందుకి కొనసాగుతున్నాను. –కృష్ణ, కాకినాడ.

  6. V.V.Krishna Rao says:

    తే.గీ.॥
    తమరి ప్రోత్సాహయుతమైన తగిన పలుకు,
    కనగ, కరదీప కమనీయ కాంతి వోలె,
    నాదు వివిధమౌ రచనల స్వాదుగతికి
    శారదాంబికా సంకల్ప సారమాయె!

  7. V.V.Krishna Rao says:

    తే.గీ.॥
    తమరి ప్రోత్సాహయుతమైన తగిన పలుకు,
    కనగ, కరదీప కమనీయ కాంతి వోలె,
    నాదు వివిధమౌ రచనల స్వాదుగతికిఝ
    శారదాంబికా సంకల్ప సారమాయె!

  8. V.V.Krishna Rao says:

    తే.గీ.॥
    తమరి ప్రోత్సాహయుతమైన తగిన పలుకు,
    కనగ, కరదీప కమనీయ కాంతి వోలె,
    నాదు వివిధమౌ రచనల స్వాదుగతికిఝ
    శారదాంబికా సంకల్ప సారమాయె!

  9. వాసుదేవరావు says:

    సామవేద సారము సంగీతము – నవ విధ భక్తులలో కీర్తనము ద్వారా భగవదారాధన లో తరించారు ఎందరో మహాభానువులు – వాసుదేవరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *