శారదా సంతతి ~ 50 : దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి – Part 2

ప్రభాకరశాస్త్రివర్యుల యోగచికిత్సావిధానప్రజ్ఞద్వారా ప్రయోజనాన్ని పొంది, రోగవిముక్తులైన కొందరు వ్యాధిగ్రస్తుల (గ్రంథస్థం చేయబడిన) వివరాలని ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది:—

(1) ఒకసారి ఒక రిక్షావాడు ఏ వైద్యానికీ అంతుపట్టని ఒక విచిత్రవ్యాధితో బాధపడుతున్న తన పిల్లవాడిని శాస్త్రిగారివద్దకి తీసుకెళ్ళేడు. రోగికి స్పృహవుందికాని నోరువంకరపోయి మాట్లాడలేని స్థితిలోవున్నాడు. మెడ ప్రక్కకి వాలిపోయివుంది. వెర్రిచూపులు చూస్తున్నాడు. చేతులు, కాళ్ళు ముడుచుకుపోయి ముద్దకట్టుకుపోయివుంటే, మోసుకువచ్చేరు. శాస్త్రిగారు ఇంటిలోనుంచి చిన్నగ్లాసులో కాఫీ రప్పించి, చిన్నచెంచాతో పిల్లవాడి నోటిలో స్వయంగా కొంచెం కొంచెంగా పోసేరు. ఆ తరవాత శాస్త్రిగారు ఆ బాలుడి స్వాస్థ్యంకోసం కొంతసేపు ధ్యానంచేసేరు. అటుపిమ్మట శాస్త్రిగారు తమ యోగశక్తిపూరిత దివ్యహస్తాలతో రోగి ఐన బాలుడి శరీరాన్నంతటినీ ప్రేమతో నిమిరేరు. వెనువెంటనే ఆ బాలుడు ౘక్కగా లేచి కూర్చున్నాడు. అతడిని నిలబడి నడవవలసినదిగా శాస్త్రిగారు చెప్పేరు. వెంటనే ఆ  బాలుడు నవ్వుతూలేచి నడవడంజరిగింది. పూర్తిగా రోగవిముక్తుడై ఆ బాలుడు స్వగృహానికి నడిచి వెళ్ళడం అక్కడి జనులు పరికించి, ఆనందంతో ఆశ్చర్యచకితులయ్యేరు.

(2) ఈ యోగచికిత్సావిధానంలో ఇసుమంతైనా నమ్మకంలేని తిరుపతి – ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాలైన పి.వి.రామానుజస్వామిగారి భార్యగారికి ఏదో అనారోగ్యముకలిగి అనేకచికిత్సాపద్ధతులలో ఎంత వైద్యం చేయించినా ఆమెకి ఆరోగ్యం కుదుట పడలేదు. చివరికి శాస్త్రిగారి యోగచికిత్సావిధానం ద్వారా ఆమెకు స్వాస్థ్యం చేకూరడం జరిగింది.

(3) బందరు వాస్తవ్యులైన డా.॥ వేమూరి దుర్గానాగేశ్వరరావుగారు తీవ్రమైన మూత్రపిండములలోని రాళ్ళసమస్యతో తగని బాధపడుతూ, వివిధవైద్య రీతులలో సరైన చికిత్సనిపొందలేక శాస్త్రిమహోదయుల యోగచికిత్సని ఆశ్రయించేరు. స్వయంగా అల్లోపతి వైద్యులైవుండి నాగేశ్వరరావుగారు ఈ యోగచికిత్సాపద్ధతిని అనుసరించడం వారి వైద్యమిత్రులకి సరిపడక డా. రావుగారిని “మంత్రాలకి చింతకాయలు రాలుతాయా?” అని హేళన చేసేవారు. డాక్టరుగారు ఏ విధమైన మందులు తీసుకున్నా యోగచికిత్స అనవసరం అని శాస్త్రిగారు నిర్దేశించేరు. యోగచికిత్సమీద నమ్మకం లేకపోయినా శాస్త్రిగారిమీద అపారవిశ్వాసంవున్న డాక్టరుగారు శాస్త్రిగారి యోగచికిత్సద్వారా రోగవిముక్తులై సుఖజీవనం గడిపేరు.

(4) శాస్త్రిగారు తిరుపతి వచ్చేసినతరవాత చెన్నైలో ఉన్న మిత్రునిభార్యకి హఠాత్తుగా అస్వస్థతచేసి, రాత్రి మామూలుగా పడుకున్నవ్యక్తి, తెల్లవారేక ఎంతకీలేవలేదు. ప్రాణప్రక్రియ సాధారణంగానేసాగుతున్నా, స్పృహమాత్రం లేదు. ఎందరు వైద్యులొచ్చి ఎంత ప్రయత్నించినా ఏమీ ఫలితంకలగలేదు. అసలు సమస్య ఏమిటోకూడా ఎవరికీ బోధపడలేదు. మధ్యాహ్నం దాటిన పిమ్మట ఆయనకి శాస్త్రిగారు స్ఫురణకివచ్చేరు. వెంటనే శాస్త్రిగారికి తంతి వార్త పంపించేరు. శాస్త్రిగారు తంతి అందినవెంటనే ధ్యానయోగం ప్రారంభించి మిత్రునిభార్య త్వరలోనే కొంత కోలుకుంటుందని, వెంటనే కొంచెం కాఫీ పట్టించమని శాస్త్రిగారు తిరిగి తంతిలో తమ సందేశం పంపించేరు. అది అందిన సమయానికి మెల్లిగా ఆమెకి కొంత స్పృహరావడం, ఆ వెంటనే కొంచెం కాఫీని పట్టించగా వారు పూర్తిగా కోలుకుని స్పృహలోకివచ్చి,  మెలి-మెల్లిగా లేచికూర్చోవడం జరిగింది. ఆ పైన కాసేపటికి ఆమెకి స్వాస్థ్యం చేకూరింది.

(5) శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రివర్యులకి ఆత్మీయ అంతేవాసి ఐన మా డా.॥ పోచిరాజు శేషగిరిరావుబాబయ్యగారు 1945-1946లో విద్వత్ కక్ష్యలో చివరి సంవత్సరం ౘదువుతున్నారు. 1945, అక్టోబరులో, ఒకనెలపాటు తీవ్రజ్వరవ్యాధి వారిని బాధించింది. ఏ మందుకి, వైద్యానికి గుణమివ్వకుండా మొండిజబ్బుగా తయారయ్యింది. దేహస్వాస్థ్యం కుంటుపడడంవలన మానసికదృఢత్వంకూడా సన్నగిల్లడం ప్రారంభించింది. “అన్యథా శరణం నాస్తి! త్వమేవ శరణం మమ!” అన్నట్లుగా మా బాబయ్యగారు గురుచరణాలని ఆశ్రయించేరు.శాస్త్రిగారి ఆదేశాన్ని అనుసరించి బాబయ్యగారు ప్రతిదినము ప్రార్థనలకి గురుసమక్షానికి వెళ్ళేవారు. ఒకరోజు ఉన్నట్లుండి శాస్త్రిగారు మా బాబయ్యగారిని “నీకు ఏమి కావాలి, కరణం?(మా బాబయ్యగారిని వారి గురువుగారు ‘కరణం’ అని సంబోధించేవారు)” అని అడిగేరు. అప్పటికి అనేకదినాలుగా ఆయన శరీరం జ్వరంతో సలసలకాగిపోతోంది. అందువలన దానికి జవాబుగా మా బాబయ్యగారు ఇలాగ అన్నారు:—

నా శరీరమును హిమానీగృహము(మంచు ఇల్లు)లో ఉంచవలెను. అది సౌధోపరిభాగమై(ఇంటి పై అంతస్థు) ఉండవలెను. ఏకాంతముగ ఉండవలెను. నిస్తరంగ నీరధి(అలలులేని సముద్రం)వలె నిశ్శబ్దము రాజ్యము చేయవలెను. నన్నెవ్వరూ నిద్ర లేపరాదు” అంటూ ౘాలా కోరికలు కోరేరట! వెంటనే  శాస్త్రిమహోదయులు చిరునవ్వుతో, “మన కరణం కవి ఔతున్నాడే!” అంటూ పరిహాసంగా అని ధ్యానంలోకి వెళ్ళిపోయేరుట! మా బాబయ్యగారితోసహా అక్కడవున్నవారందరూ ప్రార్థనలో లీనమైపోయేరు. అలాగ రమారమి రెండు గంటలు గడిచిపోయేయి. అనంతరం, అత్యాశ్చర్యంగా మా బాబయ్యగారు నోటితో కోరిన “హిమానీగృహవాసం“తోసహా అన్నీ ఆయనకి ధ్యానస్థితిలో అనుభవంలోకి వచ్చేయిట! ధ్యానానంతరం, శరీరతాపమానం చూసుకుంటే సామాన్యంగానే ఉందట! అంతేకాక అంతవరకు ఆయనకి ఏ మాత్రమూ తెలియని ఒక “దివ్యానుభవం” ఆయన, ఆ రోజు పొందేరుట! ఆ అద్భుత అనుభవం విషయంగా తీసుకుని శేషగిరిబాబయ్యగారు, “ఆనందవల్లి” అనే అపూర్వకావ్యం విరచించేరు.

ఇటువంటి యోగచికిత్సకి సంబంధించిన సంఘటనలు లెక్కకి మిక్కుటంగా ఉన్నాయి. ఇవికాక వారికి కొన్ని దివ్యశక్తులుకూడావుండేవని ప్రత్యక్షానుభవం కలిగిన పెద్దలు కొందరు చెప్పగా అటువంటి అబ్బురమైన సంఘటనలు గ్రంథస్థంచేయబడ్డాయి. అటువంటివి ఒకటి-రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించుకుందాం!

(1) ఒకసారి తిరుపతిలో శాస్త్రివర్యుల ఇంటిలో అప్పల్ల సోమేశ్వరశర్మగారు, అయాచితుల హనుమచ్ఛాస్త్రిగారు మొదలైన పండితమిత్రులు గోష్ఠిలో ఉండగా యోగశాస్త్రసంబంధమైన అనుభవాలు, శక్తులు మొదలైనవాటిని గురించినచర్చ జరిగిందట! ఇది 1948-1949 కాలంనాటి మాట! ఆ చర్చలో మిత్రులందరు శాస్త్రిగారిని ఏదో ఒక దివ్యశక్తిని ప్రదర్శించవలసినదిగా అడిగేరట! వెంటనే శాస్త్రిగారు “మీకు అందరికి ఏ పువ్వు పరిమళం ఇష్టం?” అని అడిగేరుట! మిత్రులందరు కలిసి “సంపంగి“పువ్వు పరిమళాన్ని ఎంచుకున్నారు. అది సంపంగి పూసే కాలంకాదు. ఐనా శాస్త్రివర్యుల దివ్యశక్తివలన ఆ ప్రాంతమంతా సంపంగిపూల సువాసనతో నిండిపోయిందట!

(2) ఒకరోజు ఉన్నట్టుండి శాస్త్రిగారు “నాకు అనాసపండు తినాలనివుంది” అన్నారట! కొంతసేపటికి, రాజమండ్రికి చెందిన ఎన్ . పద్మనాభస్వామి అనే శిష్యుడు గురుదర్శనార్థం వస్తూ తనతో అనాసపండ్లబుట్టనితెచ్చి, శాస్త్రిగారి పాదాలవద్ద పెట్టడం జరిగింది.

(3) మదరాసులో, కల్లూరి వీరభద్రశాస్త్రి పండితవర్యులు, ప్రభాకరశాస్త్రి గారితో సంభాషిస్తూ ఉండగా భరించలేని దుర్గంధం ఆ ప్రదేశంలో  వ్యాపించిందట! వెంటనే ప్రభాకరశాస్త్రిగారు “ఈ దుర్గంధాన్ని వెంటనే దూరంచేస్తాను చూడండి” అంటూ నిమీలితనేత్రులై రెండు-మూడు నిమిషాలు ధ్యానంచేసేసరికల్లా దుర్గంధం మటుమాయమై, ఆ స్థానంలో అత్యద్భుతమైన మహాపరిమళం వ్యాపించిందని ప్రత్యక్షసాక్షులైన కల్లూరి వీరభద్రశాస్త్రిగారు స్వయంగా చెప్పేరు.

దేశికోత్తములైన ఆచార్య వేటూరి ప్రభాకరశాస్త్రిగురుదేవుల “ప్రభాకర ప్రవచనములు” గ్రంథంనుండి సాధకలోకానికి ప్రయోజనాన్ని కూర్చే కొన్ని ప్రత్యక్ష దివ్య బోధలని ఈ దిగువ పొందుపరచడం జరిగింది. సాధకోత్తములు తప్పక ప్రయోజనము పొందుదురుగాక! ఈ ప్రజ్ఞామృత ప్రవచనాలు సర్వజనులకి సులువుగా అర్థమయ్యే సరళసుందరభాషలోనే గురువరిష్ఠులచేత బోధించబడ్డాయి:—

(1) “శరీరమనే బ్రహ్మాండాన్ని పరిశోధింపగా తేలిన పరమార్థమే ఈశ్వరుడు. ప్రపంచంలోని ఆనందాల చరమానందమే ఈశ్వరుడు.”

(2) “ఏదికోరితే కోరదగినదుండదో, అదియే బ్రహ్మానందము. అట్టి ఆనందస్వరూపుడే ఈశ్వరుడు. ఈ సృష్టిలో ప్రతిజీవిపైన అట్టి ఆనందాన్ని వర్షించుటకే ఈశ్వరతత్త్వం కోరుచుండును.”

(3) “సత్యము నిత్యమైనది. నిన్న ఉండి నేడు లేకపోలేదు. నేడుండి రేపటికి లేకుండపోదు. అలా పోవునది సత్యము కాదు. నిన్న-నేడు-రేపు అనెడి కాలనియమాలకి అతీతంగా, శాశ్వతంగా ఉండేదే సత్యము. అదియే ఈశ్వరుడు.”

(4) “శరీమనే పుస్తకాన్ని ‘కేర్ ఫుల్ ‘గా ౘదివితే ఎన్నో మంచి సమాధానాలు వస్తాయి. అందువల్ల నేనెప్పుడూ నా శరీరమనే పుస్తకాన్నే ౘదువుతాను. పూర్వగ్రంథాలను ౘదవను. ౘదివినా వానికి ప్రాధాన్యమీయను.”

(వేదవ్యాసభగవానుడి “శ్రీమద్భాగవతమహాపురాణమ్ “లోని ఏకాదశస్కంధం, తొమ్మిదవ అధ్యాయంలోని 25వ శ్లోకం చెప్పిన విషయానికి, శాస్త్రివర్యులబోధకి ఉన్న సారూప్యాన్ని సాధకవరులు గ్రహించగలరని, ఈ దిగువ శ్లోకం, తాత్పర్యం ఇవ్వబడ్డాయి:—

“దేహోగురుః మమ విరక్తి వివేక హేతుః బిభ్రత్స్మ సత్త్వనిధనం సతతార్త్యుదర్కమ్ |

తత్త్వాన్యనేన విమృశామి యథా తథాపి పారక్యమిత్యవసితో విచరామ్యసంగః”||

“నా శరీరమే నాకు గురువు. నా వివేక-వైరాగ్యాలని ఆ నా గురువైన శరీరంనుంచే నేర్చుకున్నాను. ఇది ౘావు-పుట్టుకలనే నిరంతరదుఃఖఫలాన్నిచ్చేదేకదా! దీని ఆధారంగా సృష్టి మూలతత్త్వాలని వివేచనచేస్తాను. ఏదిఏమైనా ఈ శరీరం  ఇతరజీవులకి ఆహారమౌతుందని నాకు తెలుసు. దీనిపట్ల నాకు ప్రమాదాన్ని కలిగించే భ్రమలేమీలేవు”.)

(5) “మన శరీరంలో ఈ ప్రజ్ఞ ఇలా పనిచేయుచుండగనే ఆ ఈశ్వరానుభూతి  పొందకలగాలి. అలా పొందుటకే మనం ఈ ‘ప్రేయరు’ సహాయంతో సర్వదా ప్రయత్నం చేస్తున్నాము.”

(6) “నీవెప్పుడూ నీ శరీరంగురించి ఆలోచించకు! నీ ఆరోగ్యం బాగుండాలని ఎప్పుడూ ప్రార్థన చేయొద్దు. అట్లా కోరటం అంటే నీ ఆరోగ్యం బాగులేదని అంగీకరించటం అవుతుంది. ఎప్పుడూ అలాంటి బీదభావాలను రానీయకు. నీ చుట్టూ ఉన్నవారంతా బాగుపడాలని మాత్రమే ప్రార్థన చేస్తూండు! ( ఇది క్రొత్త రామకోటయ్యగారికి శాస్త్రివర్యులు చేసిన బోధలలో ఒకటి).

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

శాస్త్రిగారికి సాహిత్యశాఖలో లెక్కకి మిక్కిలిగానే గొప్ప శిష్యులున్నారు. డా.పోచిరాజు శేషగిరిరావుగారు, మదరాసు హైకోర్టు విశ్రాంత ప్రధానన్యాయమూర్తి పి.వి.రాజమన్నారుగారు, డా. తిరుమల రామచంద్రగారు, ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు మొదలైన మహామహులెందరో వారి శిష్యవర్గీయులే! యోగచికిత్సకి సంబంధించిన శాఖలో మహాయోగి క్రొత్త రామకోటయ్యగారు, యోగర్షి ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారు సుప్రసిద్ధమైనవారు.

శాస్త్రిగారి యోగదీక్షాశిష్యులైన క్రొత్త రామకోటయ్యగారు వారికి మొదటిసారి శాస్త్రివర్యులతో పరిచయమైన తరువాత, వారి గురువుగారి ప్రథమదర్శనానుభవాన్ని గురించి ఈ విధంగా వ్రాసుకున్నారు.  (ఆ సమయములో రామకోటయ్యగారి మానసికస్థితిని గురించి వారే చెప్పిన మాటలివి: “నిత్యరోగినన్న భావము నన్ను గట్టిగా ఆవేశించి యుండెడిది. వారి సన్నిధికి వెళ్ళగానే నాకు తోచిన తొలి భావము ‘నేను రోగిని కాను. మంచి ఆరోగ్యవంతుడను. నా శరీరము, ప్రాణము బాగుగనేయున్నవి’. అప్పుడు వారిని గురించిన నా భావ మిట్లున్నది.”):—

“నాకేమి భయము లేదిక
నాకేమియు వ్యాధి లేదు; నా లోపలి ము
ల్లోకములనేలు బ్రహ్మము
నా కన్నుల యెదుట నిలిచి నట్లాయెగదే!

“ఏమి యిది! యెంత వింతయొ!
పోమని యన్నంతలోనె పోయెను బాధల్ |
యీ మహిమ యెందు కలదొకొ!
భూమిసురులు వీరనంగ బోలును యేమో!

“భూమిని సురలుందురటం
చీమాదిరి గాగ నాకు యెరుకపరపగా
భూమిసురు శ్రీ ప్రభాకర
స్వామిన్ కనుగొంటి నేను సద్గురుమూర్తిన్ “|

లోక ప్రసిద్ధులైన డా॥ వేటూరి ఆనందమూర్తి, డా.॥ వేటూరి సుందరమూర్తి  శ్రీ శాస్త్రివర్యుల కుమారులే! సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త, సంగీతశాస్త్రకోవిదులు అయిన డా.॥ విస్సా అప్పారావుగారి జ్యేష్ఠపుత్రులు, హ్యూమన్ ఎనాటమీ ప్రొఫెసర్ మరియు వైద్యకళాశాలల ప్రిన్సిపాలుగా ఉద్యోగవిరమణచేసిన డా.॥ విస్సా రామచంద్రరావుగారు ప్రభాకరశాస్త్రివర్యుల పెద్ద అల్లుడు. డా.॥ రామచంద్రరావుగారు, తమమామగారైన శాస్త్రివర్యులవద్ద  “భృక్త రహిత తారక రాజయోగము“నందు ఉపదేశముపొంది, ఆ యోగంలో విశేషకృషిచేసేరు. అంతేకాక “యోగచికిత్సావిధానము” ద్వారా శాస్త్రిగారు నయముచేసిన మొండిజబ్బులు, దీర్ఘవ్యాధులు గురించి వివరిస్తూ వాటిని గ్రంథస్థం చేసేరు.

ఈ విధంగా శాస్త్రిగారు దివ్యయోగపుంగవులై, లోకోత్తర బహుముఖరంగ ప్రజ్ఞామయ పూర్ణజీవితాన్ని గడిపి 29—08—1950వ తేదీన, తిరుపతిలో, తమ భౌతికకాయాన్ని (వ్యాధిగ్రస్తులైన ఒక వ్యక్తికి యోగచికిత్సచేస్తూ) త్యజించేరని చరిత్ర చెపుతోంది. చివరివరకు వారు సంపూర్ణ స్పృహలోనే ఉన్నారు. వారి తుది సందేశం యిది:—

ఆ దివ్యయోగశక్తి ఎట్లా పని చేస్తున్నదో చూడండి(ఆ సమయంలో శాస్త్రిగారు చేయుచున్న యోగచికిత్సని గురించి వారు చెప్పిన మాటలివి)! మీరుమాత్రం మాష్టరును మరచిపోకండి“!

ఆ పూర్ణప్రజ్ఞాప్రభాకరులకి సాష్టాంగ వందనములను సమర్పించుకుంటూ, ఈ విధంగా స్మరించుకుందాం:—

“ప్రభాకర ప్రబుద్ధాయ ప్రజ్ఞానద్యుతి యోగినే|

జీవ శృంఖల ముక్త్యర్థం మమ సద్గురవే నమః”||

“ౘక్కగా మేల్కొనిన అంతర్గత ఆధ్యాత్మికశక్తికలిగిన మౌలిక పారమార్థికజ్ఞాన కాంతిశోభితులైన, నా సద్గురువులైన యోగిపుంగవులు ప్రభాకరశాస్త్రివర్యులకి నా జీవ సంబంధమైన కర్మశృంఖలాల విమోచనమునకై నమస్కారమును సమర్పించుకొనుచున్నాను”.

స్వస్తి|

You may also like...

2 Responses

  1. Dakshinamurthy M says:

    చాలా బాగుంది సర్.. మంచి విషయాలని పొందు పరిచారు ధన్యవాదములు

  2. సి.యస్ says:

    వేటూరి ప్రభాకరశాస్త్రి గారి గురించి రాసిన
    ఈ రెండవ భాగంలో — ఆయన యోగ చికిత్సా
    విధానం ద్వారా ఎందరికో వ్యాధులను నయం
    చేసిన వారి అసాధారణ ప్రజ్ఞ విస్మయం కలగ చేసింది.
    ఆ రంగంలో వారి సాధనకు జోహార్లు.
    ఇక శాస్త్రిగారికి , పోచిరాజు శేషగిరిరావుగారికీ
    జరిగిన సంభాషణ ఎంతో ముచ్చటగా ఉండడమే కాక
    శేషగిరిరావు గారిని ధ్యానస్థితి లోనికి పంపి, వారికి
    కలుగచేసిన అనుభవం అపూర్వం.
    సాహిత్యరంగంలో వారి శిష్యుల పేర్లు చదువుతుంటే
    ఆశ్చర్యం కలుగుతోంది! వాళ్ళంతా పండిత ప్రకాండులు.
    తెలుగు సాహిత్యచరిత్రలో ప్రభాకరశాస్త్రిగారి స్థానం శాశ్వతం!
    శాస్త్రిగారికి శ్లోక రూపంలో అర్పించిన నివాళి
    అర్థవంతంగా ఉంది.

    పండితుండె కాదు పరిశోధకుండును,
    రోగములను మాన్పు యోగి యతడు.
    శిష్య కోటికెల్ల శ్రీరామ రక్షాయె….
    శాస్త్రి వరుని కొలుతు శక్తి కొలది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *