శారదా సంతతి ~ 50 : దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి – Part 1

ఐం శ్రీశారదాపరదేవతాయై నమోనమః|
01—07—2018; ఆదిత్యవారము|

శ్రీశారదాంబికా దయాచంద్రికా|

“శారదా సంతతి ~ 50″| దివ్య – మానుష యోగసమన్వయ స్ఫూర్తిమూర్తి — శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి| (07—02—1888 నుండి 29—08—1950 వరకు)

(ఆచార్యవరిష్ఠులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ శిష్యబృందంతో చేసిన బోధనాత్మక సంభాషణని తెలియజేసే ఒక సన్నివేశకల్పన ఇక్కడ పొందుపరచడం జరిగింది).

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రివర్యులు:—
అబ్బాయిలూ! ఈ పూట పొడుపుకథ ఏమిటంటే, ముక్కులేని “పండు” ఏమిటో చెప్పాలర్రా!

విద్యార్థులైన యువకులు:—
(ఒకరి మొహాలలోకి మరొకరు చూసుకుంటూ) ముక్కులేని పండా? అదేమిటి గురువుగారూ? మా బుర్రలకి ఎంత ఆలోచించినా తట్టడమేలేదు!

వేటూరివారు:—
ఓరి మీ ఇళ్ళు బంగారంగానూ! ఆ మాత్రం తెలియకపోతే ఎలా? అనాసపండు ఉందికదా? అదే ఇది! (“నాసా” అంటే సంస్కృతంలో ముక్కు. వ్యతిరేకార్థం తెలియజేసే “అ” ముందుచేరడంవలన “అనాస” అంటే ముక్కులేనిది అనే అర్థాన్ని అయ్యవారు హాస్యానికి రాబట్టి, ముక్కులేనిపండని “అనాస”కి అర్థంచెప్పి, తమ ప్రత్యేకశైలిలో పిల్లలకి పాఠం బోధించడం మొదలుపెట్టేరన్నమాట).

(విద్యార్థిగావున్న) శ్రీ తిరుమల రామచంద్ర:—
ఇది ౘాలా అన్యాయం గురువుగారూ! ఇతరభాషాపదాన్ని మన మాటలాగ విడమరిచి వివరించడం, ఆ విధంగా దానికి మమ్మల్ని అర్థం చెప్పమనడం న్యాయంగావుందా గురువుగారూ?

వేటూరివారు:—
నాయనా! భాషాంతర శ్లేషలు మనకేమైనా క్రొత్తవిషయమా? ఆ మాటకివస్తే ఏ జీవద్భాషకైనా ఇది అపరిచితమైన ప్రక్రియ కాదు. పైగా బహుభాషాసాదృశ్య శాస్త్రాధ్యయనం(study of comparitive philology) చేసే విద్యార్థులు అలాంటి ఎల్లలు పెట్టుకునికూర్చుంటే అన్నింటిలోకి చొరబడవలసిన బుద్ధి, ఇలాంటి పరిమితుల ౘట్రాలలో బందీ ఐపోదూ? మనకి ఒకమాట చెవిని పడగానే దానికి తుల్యమైన రూపాన్ని, అర్థాన్ని ఇచ్చే మనకి పరిచయమున్న సర్వ భాషాశబ్దప్రపంచంలోకి మన సునిశితధీశక్తి చొచ్చుకుపోవలసిందే కదా? అందువల్ల, “అనాస” పరాయి భాషకి చెందిన మాట ఐనా సరదాగా మన భాషకి సంబంధించినదానిలాగ అర్థం చెప్పుకుని, అసలు విషయంలోకి ప్రవేశించడానికి మనకి ఆక్షేపణ ఉండవలసిన పనిలేదుకదా?

తిరుమలవారు:—
ఈ మాట నాకు మాత్రమేకాదు, మన నిఘంటునిర్మాతలైన కొందరికి పచ్చి వెలక్కాయ, మిరప పండుతోకలిసి గొంతుకలోనేమిటి, నోటిలోనే అడ్డంపడుతుంది. “అనాస” దేశ్యశబ్దంగా, అంటే మన మాటగా కొన్ని నిఘంటువులు చెపుతూంటే, తమరు అన్యదేశ్యపదం అనడం మాకు విషయాన్ని మరింత గందరగోళంచేసేస్తోంది, గురూజీ! అనాస మనమాటగా చెప్పి, దానికి, “మొగలి పనస” అనే అర్థాన్నికూడా మన నిఘంటువులలో చేర్చేరు కదా

వేటూరివారు:—
నాయనా రామచంద్రా! ఆ అర్థం సరైనదే! దానితో పేచీ లేదు! ఎటొచ్చీ “అనాస” శబ్దం మాత్రం విదేశీయమేనని మన వాదం! పొరబాటున కొందరు నైఘంటికులు “అనాస” శబ్దాన్ని దేశీయం అన్నారు. కాని అది సరికాదు. ముద్రితగ్రంథంలో, అది నిఘంటువైనాసరే, ఉన్నంతమాత్రాన ఏ శబ్దానికీ ప్రామాణికతరాదు. “ప్రమాదో ధీమతామపి” అంటే ‘పండితులకికూడా పొరపాట్ల అగౘాట్లు ఉన్నాయి’, అని అర్థం కదా! కాని నా ఉద్దేశ్యంలో, “ప్రమాద ఏవ ధీమతామ్ ” అంటే మరింత సమంజసంగావుంటుందేమో! అంటే ‘పండితులకే తప్పుల ముప్పులు ఉంటాయి’ అని తెలుసుకుంటే బాగుంటుంది. హిమాలయం ఎక్కబోయేవాడికే ఎక్కడాలేని ఇక్కట్లు ఎదురొస్తాయి. ఇంట్లో కూర్చునేవాడికి ఏ ఇబ్బందీ ఉండదుకదా! ఇప్పుడు ప్రస్తుతాంశంలోకి వద్దాం!

“అనాస” శబ్దమేకాదు, అనాసపండుకూడా విదేశీయమైనదే! వృక్షశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రవేత్తలు, మన ప్రాచీన వాఙ్మయము మొదలైనవాటిని పరిశీలిస్తే అసలు బండారం బయటపడుతుంది. సంస్కృతభాషలో దీనికి పేరు కనిపించదు. మన ప్రాచీనగ్రంథాలలో పూర్వరచయితల ప్రయోగాలలో, “అనాస” గురించి ఎంత వెదికినా ఏమాత్రమూ కానరాదు.

ఇంక కొన్ని ఆధునిక భారతీయ ప్రాంతీయభాషలలో ఈ పండునిగురించిన పదపరిచయవిషయంలో ఒక పరామర్శచేద్దాం!

ఈ పండుని, తమిళభాషలో “అనాస్పళం” అంటారు. కన్నడంలో “అనాసహణ్ణు” అని, హిందీలో “అనానస్ లేక అనన్నాస్ “అని, గుజరాతీ, మరాఠీ భాషలలో “అనానస్ ” అని అంటారు. పార్సీ, అరబ్బీ భాషలలో “అయినున్నాస్ ” అంటారు. సింహళభాషలో “అన్నాసీ” అంటారట! బర్మాలో “నన్నా-టీ” అంటారట!

ఈ పండుకి మూలస్ధానం, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశం అని చరిత్ర చెపుతోంది.(దీని Latin name : Ananas comosus. Peruvian భాషనుంచి Spanish లోకి వచ్చిన పదం Ananas.) అక్కడినుంచి అమెరికా, అమెరికాద్వారా 16వ శతాబ్ది ఆరంభంలో ఐరోపా దేశాలకి ఇది ప్రయాణించింది. పోర్చుగీసువారిద్వారా 16వ శతాబ్దం చివరలో భారతదేశంలోకి “అనాస” పండు ప్రవేశించింది.

మొగలుపాదుషా అక్బరు శాహన్శాహ్ పరిపాలనాకాలంలో, మన దేశంలో దీనిని పండిచడం ప్రారంభించినట్లు చరిత్ర చెపుతోంది. అబుల్ ఫజల్ అనే మొగలులకి చెందిన ప్రఖ్యాత రచయిత తన పుస్తకం, “ఆయనే అక్బరీ”లో దీనినిగురించిన ప్రస్తావనని చేసినట్లు చెపుతారు.

(శ్రీ తిరుమల రామచంద్రగారి “నుడి-నానుడి” పుస్తకంలోని వివరణ ఆధారంగా పై సంభాషణ రచించబడింది. శ్రీ వేటూరిప్రభాకరశాస్త్రిమహోదయుల బోధనశైలిని సూచనప్రాయంగా విశదంచెయ్యడానికి ఈ లఘుప్రయత్నం చేయబడింది.

ఈ దిగువ సంగ్రథితమైన శ్రీ ప్రభాకర శాస్త్రివర్యులవారి సంక్షిప్త జీవనరేఖాచిత్రణకి మా డా.॥ పోచిరాజు శేషగిరిరావు బాబయ్యగారి గ్రంథాలు ప్రధాన ఆధారం. కాని కొన్ని ఇతర పుస్తకాలు కూడా ౘాలా ఉపకరించేయి అని చెప్పాలి.

డా.॥ పోచిరాజు శేషగిరిరావు బాబయ్యగారి పుస్తకాలు అడిగిన వెంటనే కొరియరుసర్వీసు ద్వారా శ్రద్ధతో పంపించిన ప్రియసోదరుడు రాంబాబు (డా.॥ చాగంటి రామారావు – హైదరాబాదు)కి నా హార్దిక ధన్యవాదాలు. ఆయన అలాగ పంపించి ఉండకపోతే, ఈ వ్యాసరచన ఇంత వేగంగా జరిగివుండేది కాదు. నా ఆత్మీయమైన మేనల్లుడు శ్రీ తటవర్తి దేవనరాజ్ అంటే మా రాజా కోరిక మేరకి ఈ వ్యాసాన్ని ఇంత తక్కువ సమయంలో అందించగలుగుతున్నాను. ఈ మహాపురుషులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వర్యులగురించి ఇంత వెంటనే వ్రాసే అవకాశం రావడం పూరాకృతపుణ్యంగా భావిస్తున్నాను.)

@ © @ © @ © @ © @ © @ © @ © @ © @

సాహిత్యకారులు, సంగీతకారులు, చిత్రకారులు, శిల్పులు, నటులు, శాస్త్రకారులు వంటి మహాకళాస్రష్టలు-శాస్త్రజ్ఞులుగా పుట్టడమే గొప్ప సుకృతమనుకుంటే, అవన్నీ సమగ్రంగాతెలిసిన పూర్ణయోగపుంగవుడిగా జన్మించడం కేవలం శారదామాత దివ్యానుగ్రహరూప సంకల్పమే! అటువంటి మహాపురుషులు ఉద్భవించిన జాతి, నేల, సంస్కృతి పావనమయమై వినూతన అభ్యుదయమార్గాలలో ఆ జాతి జనులు పురోగమించే పుణ్యపూర్ణకాంతి వెల్లివిరుస్తుంది. అటువంటి పూర్ణదివ్యయోగసత్తములైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మహోదయుల ఉత్తేజకర జీవితచరిత్రలోని కొన్ని ముఖ్యవివరాలని ఈ వారం సంక్షేపంగా పరిచయంచేసుకునే ప్రయత్నంచేద్దాం!

ప్రభాకరశాస్త్రివర్యులు చాంద్రమాన సర్వజిత్ సంవత్సర మాఘబహుల ఏకాదశి రోజున జ్యేష్ఠానక్షత్ర చతుర్థ చరణంలో జన్మించేరు. అంటే, క్రీ.శ. 1888వ సంవత్వరం, ఫిబ్రవరినెల, 7వ తేదీన పుట్టేరు. వారిది శ్రీవత్సగోత్రం. తండ్రిగారు ఆయుర్వేదవైద్యులైన డా. వేటూరి సుందరశాస్త్రిగారు. తల్లిగారు శ్రీమతి శేషమ్మగారు. ఆమె పిసిపాటివారి ఆడపడుచు. సుందరశాస్త్రిగారు వైద్యమందేకాక, శ్రౌత, స్మార్త, జ్యౌతిష, శిల్ప, సంస్కృతాంధ్రసాహిత్య రంగములందు ఆరితేరినవారు. వారు పద్యరచనచేసిన పండితులు. డా.సుందరశాస్త్రిగారికి నలుగురు కుమారులు. (1) వెంకటశివశాస్త్రి, (2) ప్రభాకరశాస్త్రి, (3) చంద్రశేఖర శాస్త్రి, (4) శంకరశాస్త్రి.

కృష్ణాజిల్లా, పెదకళ్ళేపల్లి, ప్రభాకరశాస్త్రిగారి జన్మస్థలం. సుందరశాస్త్రిగారి గృహము ఒక అపూర్వగ్రంథాలయం. వేద-శాస్త్ర-ఇతిహాస-పురాణ-కావ్యాది అనేకవిపులవిషయగోష్ఠులతో వెల్లివిరిసిన సరస్వతీనిత్యోపాసనానిలయమై వారి ఇల్లు శోభించేది. ఆ కాలంలో వివిధప్రాంతాలకి చెందిన కవి,పండితులతో వారి నివాసం కల-కలలాడుతూ ఉండేది. అటువంటి అద్భుత వాతావరణంలో శాస్త్రిగారి బాల్యం గడిచింది. వారింటిలోని గ్రంథాలయంలోవున్న అనేకానేక గ్రంథాలని ప్రభాకరశాస్త్రిగారు బాల్యంనుంచి లోతుగా అధ్యయనంచేసేరు. ఇంటిలో అనునిత్యమూ జరిగే రామాయణ-భారత-భాగవతాది మహాగ్రంథగత విషయచర్చలన్నీ వారి బాల్య ప్రజ్ఞని ప్రభావితంచేసి దిశానిర్దేశానికి దోహదంచేసేయి.

శాస్త్రిగారు ప్రాథమికవిద్యని, పెదకళ్ళేపల్లిలోని కొట్టరువు సుందరరామయ్యపంతులుగారి వీధిబడిలో ౘదువుకున్నారు. ఆ తరవాత, మద్దూరి రామావధానులుగారివద్ద సంస్కృతమూ, ఇంటిలో తెలుగూ ౘదువుకున్నారు. అవధానులుగారివద్ద కాళిదాసు మేఘసందేశం, రఘువంశం, కుమారసంభవం పూర్తిగా ౘదువుకున్నారు. అక్కడికి నాలుగు మైళ్ళదూరంలో ఉన్న ౘల్లపల్లికి చెందిన మహాపండితులైన అద్దేపల్లి సోమనాథశాస్త్రిగారు, డా.సుందరశాస్త్రిగారివద్ద వైద్యమునకు వచ్చెడివారు. ఆ సందర్భములో వారిరువురికి గాఢమైత్రి ఏర్పడి ప్రభాకరశాస్త్రిగారి శాస్త్రాభ్యాసానికి ఆ మైత్రి ఎంతో దోహదపడింది. శాస్త్రిగారు, ౘల్లపల్లిలో సోమనాథులవారివద్ద సంస్కృతవ్యాకరణం, తర్కశాస్త్రం, పతంజలియోగశాస్త్రం, కావ్యాలు, నాటకాలు, అలంకారశాస్త్రం మొదలైనవన్నీ సవ్యాఖ్యానంగా, సంప్రదాయశుద్ధంగా అధ్యయనంచేసేరు. అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, పిసిపాటి వేంకట రామశాస్త్రిగారు, ఆ కాలంలో ప్రభాకరశాస్త్రిగారి సహాధ్యాయులు. పదహారేళ్ళప్రాయం వచ్చేవరకు సోమనాథవర్యులనద్ద శిష్యరికం చేసేరు. ఆ సమయంలో సోమనాథశాస్త్రివర్యుల నిత్యదేవతార్చన, అమేయ అనుష్ఠానవిధి, నిరంతర తపస్సు ప్రభాకరశాస్త్రిగారి కౌమార-నూతనయౌవన దశలని బాగా ప్రభావితం చేసేయి.

1904లో, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, పిసిపాటి వేంకటరామశాస్త్రి గారలతో కలిసి, బందరులోని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారివద్ద అంతేవాసిగా చేరి, రెండేళ్ళ చెళ్ళపిళ్ళవారి శిష్యరికంలో, 18 ఏళ్ళకే, అంటే, 1906వ సంవత్సరానికి ప్రౌఢకవిగాను, అష్టావధాన-శతావధాన ప్రక్రియలలో పరిణత ప్రజ్ఞాప్రభాకరుడిగాను అవతరించేరు. బందరులోవుండగా స్థానికనగరప్రముఖులైన న్యాయవాదులు వల్లూరి సూర్యనారాయణరావుగారు, ‘దేశభక్త’కొండా వెంకటప్పయ్య పంతులుగారు శాస్త్రిగారి బాగోగులు చూసే పెద్దదిక్కుగావుండేవారు. వల్లూరివారు, శాస్త్రిగారు చెన్నై(ఆ కాలంలో “మదరాసు” మహానగరంగా పేరొందిన మన రాజధాని నగరం) చేరడానికి ప్రోత్సహించి, చెన్నై నివాసి ఐన తమ మిత్రుడు రెంటాల వెంకట సుబ్బారావుగారిని ఉద్దేశించి, శాస్త్రిగారికి అవసరమైన పరిచయపత్రం వ్రాసి ఇచ్చి వారిని మదరాసు మహానగరానికి పంపించేరు. ప్రభాకరశాస్త్రిగారు 1906లో చెన్నై చేరుకున్నారు. చెన్నై హైకోర్టులో వేపా రామేశంగారు ప్రముఖన్యాయవాదిగా వుండేవారు. వారి న్యాయవాదకార్యాలయంలో శాస్త్రిగారి బావగారైన కాౙ వెంకటశేషయ్యగారు గుమాస్తాగా పనిచేసేవారు. వారి సహాయ-సహకారాలు శాస్త్రిగారికి అండగావుండేవి.

చెన్నైచేరిన ప్రారంభంలో, “వెస్లీ మిషన్ స్కూల్ (ఇప్పటి కెల్లెట్ హైస్కూల్ )” లో తెలుగు పండితోపాధ్యాయుడిగా శాస్త్రిగారు పని చేసేరు. 1910 వరకు తిరువల్లిక్కేణి ఉన్నతపాఠశాలలో పనిచేస్తూ, మదరాసు ప్రాచ్యలిఖితగ్రంథశాలలో పుస్తకాధ్యయనంద్వారా విరామసమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

1910వ సంవత్సరం వారి జీవితంలో ప్రధానమైన ఘట్టంగా భావించవచ్చు. ఆ సంవత్సరంలో ఓరియంటల్ మేన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అంటే ప్రాచ్యలిఖితగ్రంథాలయంలో ఉద్యోగంలో చేరేరు. అదే సంవత్సరంలో వారి వివాహం జరిగింది. కృష్ణాజిల్లా, ఘంటశాల గ్రామస్థులైన పిసిపాటి జగన్నాథంగారి కుమార్తె అయిన మహాలక్ష్మిగారిని పెండ్లిచేసుకున్నారు.

మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోను, తంజావూరు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోను అనేక సంస్కృత, తెలుగు గ్రంథాలని పరిశీలించి, పరిశోధించి అనేకగ్రంథకర్తల వివిధ రచనలని సంపాదించి, పరిష్కరించి, సమగ్రపీఠికలతో ప్రచురింపజేసేరు. స్వయంగా కొన్ని లఘుకావ్యాలని, ఖండకావ్యాలని, వివిధఅంశాలపైన వ్యాసాలని విరచించేరు. “ఆముక్తమాల్యద” ఆంధ్రప్రబంధకర్త శ్రీ కృష్ణదేవరాయలువారేనని నిరూపించేరు. “లక్ష్మీపురశాసనం”, “పల్లవనరసింహవర్మ ప్రథమశాసనం”, “కపిలేశ్వరపురశాసనం” మొదలైన శాసనాలని బహిర్గతంచేసేరు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోని ప్రాచీనగ్రంథ సముద్ధరణకోసం, అనేక అముద్రిత గ్రంథాల వివరాలని తెలియజేసే 19 (పందొమ్మిది) సంపుటాలని వెలువరింపజేసేరు.

“చాటుపద్యమణిమంజరి”ని విపులపీఠికతో వెలువరించేరు. భాసనాటకాలని వెలుగులోకి తీసుకువచ్చేరు. ప్రతిమాది భాసనాటకాలు కొన్నింటిని తెలుగు చేసేరు. ఆ కాలంలో వివిధరంగాలలో విశేషవిఖ్యాతి పొందిన గిడుగు రామమూర్తి పంతులుగారు, కందుకూరి వీరేశలింగంపంతులుగారు, గురజాడ అప్పారావుగారు, వేపా రామేశంపంతులుగారు, పనప్పాకం అనంతాచార్యులుగారు, వేదం వేంకటరాయశాస్త్రిగారు, డా.ఆచంట లక్ష్మీపతిగారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు, టంగుటూరి ప్రకాశంపంతులుగారు, రెంటాల వెంకటసుబ్బారావు గారు, వేలూరి శివరామశాస్త్రిగారు, తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్యగారు, మానవల్లి రామకృష్ణకవిగారు, అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు మొదలైన మహామహులందరితోను శాస్త్రిగారికి గాఢపరిచయాలు, స్నేహాలు ఉండేవి. తాతా సుబ్బరాయశాస్త్రిగారివంటి మహామనీషులు మదరాసునగరం వెళ్ళినపుడు శాస్త్రిగారింట విడిదిచేసి, మహలక్ష్మమ్మగారు వండిన మహాప్రసాదం స్వీకరించి ఆనందించేవారు.

1910 నుండి 1939 చివరవరకు, అంటే దాదాపు 30 సంవత్సరాలు, శాస్త్రిగారు మదరాసు ప్రాచ్యలిఖితగ్రంథాలయంలో ఉద్యోగంచేస్తూనే, మధ్యలో సెలవు ఖాళీలో ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితపదవిని నిర్వహించేవారు.

పనుల ఒత్తిడివల్ల వారి ఆరోగ్యం బాగా దెబ్బతినడం జరిగింది. ఆయన అనారోగ్యపరిస్థితికి అతీ-గతీ లేకుండాపోయింది. దానితో దారీ-తెన్నూ తోచని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భంలో మదరాసులో పేరున్న ఫిలాసఫీ ప్రొఫెసరైన పోతరాజు నరసింహంగారి ప్రేరణతో, కుంభకోణంలోవున్న మహాయోగి శ్రీ కంచుపాటి వెంకట్రావు వెంకాస్వామిరావు (Master C.V.V. లేక మాస్టర్ సి.వి.వి.గా జగత్ప్రసిద్ధిపొందిన పూర్ణయోగర్షి) వరిష్ఠుల ఆశ్రయంపొంది, వారి “భృక్తరహిత తారకరాజయోగం“ద్వారా వ్యాధినుండి సద్యోవిముక్తిని పొందడం జరిగింది. ఆ యోగాభ్యాసఫలంగా వారు రోగరహితులవ్వడమేకాక అనేకవ్యాధిగ్రస్తులని వారి వ్యాధులనుండి విముక్తులను చేయగలిగేరు. వారి భార్య మహాలక్ష్మిగారుకూడా ఆ యోగంలో ఉపదేశం(Initiation) పొందేరు.

1939—1940లలో వారు తిరుపతి విచ్చేసి, శ్రీవేంకటేశ్వరప్రాచ్య కళాశాలలో ఆంధ్రభాషాశాఖని స్థాపించి దానికి తొలి ప్రధానాచార్యులుగా శాస్త్రిగారు పనిచేసేరు. ఆ సమయంలోనే వారు ప్రాచ్యపరిశోధనాసంస్థలో పరిశోధక పండితులుగా పనిచేస్తూ తాళ్ళపాక అన్నమాచార్యులవారి సంకీర్తనలని వెలికితీసి, వాటి పరిశోధన-ప్రచురణలని చేయించేరు. వాటితోబాటు పావులూరి మల్లన గణితశాస్త్రపరిష్కరణ, రంగనాథరామాయణ పరిష్కరణ, ఉత్తరహరివంశవ్యాఖ్యానం, నన్నెచోడ కుమారసంభవ వ్యాఖ్యానం చేయడం జరిగింది.

తిరుపతి క్షేత్రంలో శ్రీ ప్రభాకరశాస్త్రివర్యుల జీవిత చరమ దశకమైన 1940—1950 అంతా పారమార్థికమైన పరమయోగసేవాదీక్షతో గడిచి పోయింది. ఆ సమయంలోని శాస్త్రిగారి దివ్యజీవనభూమికని వర్ణిస్తూ డా.॥ పోచిరాజు శేషగిరిరావు మహోదయులు ఈ విధంగా వ్రాసేరు:—

“శ్రీ శాస్త్రిగారి తిరుపతి జీవితము 1940—1950. ఇది వారి జీవితమున ఒక మహాదశ. అక్కడ వారెక్కువ కాలము యోగసాధనకు, యోగచికిత్సకు వినియోగపరచిరి. వారు పొమ్మన్నచో రోగములు పోయెడివి. వారొనర్చిన ఆర్తజనసేవకు సంబంధించిన సేవలు కోకొల్లలు. అప్పటి వారి మనస్తత్వమును తెల్పు పద్యమొక్కటి.

“పాండిత్యాభినివేశమున్ కవనతాత్పర్యంబు విత్తార్జనో

చ్చండారంభములున్ క్రమక్రమముగా సన్నంబులౌచుండె, ఓ

తండ్రీ! విశ్వవిభూ! సుఖంపడెద నీతంటాలు నాకేల? నీ

అండన్ నిల్చెద, వ్రీల్చెదన్ , బృహదవిద్యాదోషపాషాణముల్ “||

“సృష్టికంతటికీ ప్రభువువైన ఓ నా తండ్రీ! పాండిత్యం, కవిత్వం, ధనార్జన మొదలైన లౌకిక వ్యవహారాలలో చొరవ క్రమేపీ సన్నగిల్లిపోతోంది. ఈ ప్రాపంచిక ప్రయాసలు నాకెందుకు? నీ ఆశ్రయంలో నేను ఉన్నాను కనక ఈ జగత్తులోని అజ్ఞానమనే దోషంనిండిన బండలని, కొండలని నీ అనుగ్రహంతో పిండిచేసి జనులకి మేలుచేస్తాను, ప్రభూ!”

= ~ = ~ = ~ = ~ = ~ = ~ = ~ = ~ = ~ = ~ =

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రివర్యులు హాస్యరసప్రియులు, చమత్కారభాషణ నిపుణులు, ఎవరినీ ఏ విధంగానూ నొప్పించని పరిహాసప్రసంగచణులు, సద్యస్స్ఫూర్తి పద్యరచనాధురీణులు, బహుముఖవిషయ సంభాషణా ప్రవీణులు. వారి అమేయప్రతిభ మాటల కోటలని తూటులు పడగొట్టజాలినది. అయినా ఇక్కడ కొన్ని సందర్భాలని ఈ సన్నివేశంలో ముచ్చటించుకోవాలి:—

(1) తిరుపతిలో వారు రీడరుగా పనిచేసే సమయంలో జరిగిన విచిత్ర సంఘటన యిది. వారిక్రింద పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు, పై అధికారులకి ఒక “పిటీషను” పెట్టుకున్నారు. దానిలో వారు వ్రాసుకున్న ప్రధాన ఉదంతం యొక్క సారాంశం యిది:—”అయ్యా! నేను సంస్కృతంలో ఎం.ఏ. పట్టభద్రుడిని. నేను రచించిన గ్రంథమునకు ప్రత్యేక బహుమతి పొందితిని. శ్రీ శాస్త్రిగారికి ఎటువంటి “డిగ్రీలు“లేవు. అందువలన రీడరు పదవికి నన్ను అర్హుడినిగా పరిగణించవలెను.” ఆ ‘పిటీషను’, ప్రిన్సిపాలుగారిద్వారా పై అధికారులకి వెళ్ళాలి. ప్రిన్సిపాలుగారు ఆ ‘పిటీషను’మీద ఈ విధంగా తమ “ఎండార్స్ మెంట్ ” వ్రాసి పైకి పంపించేరుట! “ఈ దరఖాస్తుదారు రచనకు బహుమతిప్రదానమును ఇచ్చిన విశ్వవిద్యాలయ న్యాయనిర్ణేత శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారేకనుక ఈ అభ్యర్థనపై ఏ విధమైన నిర్ణయము తీసుకొనవలసిన అవసరములేదు”.

(2) శాస్త్రిగారు తమ విద్యార్థుల నడవడిక విషయంలోను, శీలనిర్మాణవిధానం లోను, మానసిక నైతికస్థితిగతులపట్ల ౘాలా శ్రద్ధ తీసుకునేవారు. తమ విద్యార్థులందరిచేత “అంబికాశతకం”లోని ఈ దిగువ పద్యాన్ని కంఠస్థం చేయించి ఆ పద్యంలోని బోధని నిత్యజీవితంలో పిల్లలచేత ఆచరింపజేసే ప్రయత్నంచేస్తూ ఉండేవారట:—

“లాచి, పరాంగనల్ వరవిలాస మనోహర రూప సంపదల్ ,

చూచిన చూడడుత్తముడు, చూచిన చూచును మధ్యముండు, తా

చూచిన చూడకుండినను చూచును నీచుడు, నన్ను వీరిలో,

చూచిన చూడకుండు గుణిcజూచిన చూపున చూడుమంబికా!”

“ఇష్టంగా ఇతరులైన ఇంతుల ౘక్కని అందౘందాలనన్నింటినీ ఉత్తముడైనవాడు వారు తనని చూసినా, తాను వారివైపు చూడనేచూడడు. మధ్యముడైనవాడు వారు తనని చూస్తే, తానూ వారిని చూస్తాడు(వారు చూడకపోతే, తానుకూడా వారిని చూడడు). నీచుడైనవాడు, వారు తనని చూసినా, చూడకపోయినా, తాను వారిని చూస్తాడు. ఓ జగదంబికా! ఈ మూడు రకాలైన మానవులలో, తనని చూసినా తాను చూడని సుగుణంకలిగేలాగ నీవు అనుగ్రహించిన ఆ ఉత్తముడిని వలె నన్నుకూడా తీర్చిదిద్ది దయచూడు తల్లీ!”

(3) శాస్త్రిగారు అప్పుడప్పుడు ఆశువుగా విద్యార్థులముందు పద్యాలు చెప్పేవారు. తిరుపతిలో తరగతిగదిలో సత్యనారాయణసెట్టి అనే విద్యార్థి ఒకాయన ఉండేవారు. శాస్త్రిగారు విద్యార్థులకి ౘక్కని ౘనువుని ఇచ్చేవారు. సెట్టి, శాస్త్రిగారిని, ఆయా సందర్భాలని అనుసరించి పద్యాలు చెప్పండయ్యా అంటూ కోరేవారట! శాస్త్రిగారు అతడి ముద్దు చెల్లించడం కద్దు! ఒకసారి తరగతిగదికి, అధ్యాపకుల “అటెండెన్సు రిజిస్టరు” వచ్చినపుడు, శాస్త్రిగారు, ఆశువుగా, “దస్కతు చేయలేదనుచు తా కొనివచ్చెను పెట్టుమంచు, నే పుస్కున ఏదొ పల్కితిని ప్యూనును గూరిచి – – – “, అని ఊరుకున్నారుట! వెంటనే సెట్టి ఆ “స్క” ప్రాసతోనే ఆ పద్యం పూర్తి చెయ్యండయ్యా అని అడిగేడట! వెంటనే శాస్త్రిగారు ఆశువుగా ఇలాగ పద్యాన్ని చెప్పేరుట:—

“దస్కతు చేయలేదనుచు తా కొనివచ్చెను పెట్టుమంచు, నే

పుస్కున ఏదొ పల్కితిని ప్యూనును గూరిచి, అంతలోననే

ఈ ‘స్క’ను ప్రాసచేసి రచియింతె యనన్ , నను, సెట్టిశిష్యు డా

రస్కిను కోసమై యిటుల వ్రాసితి పద్యము పూర్తి చేసితిన్ “||

(4) “దోసె” అనే పదానికి వారు ఇచ్చిన హాస్యరసస్ఫోరక వ్యుత్పత్తి ఇక్కడ స్మరణీయం. “దో” అంటే (హిందీ భాష ప్రకారం) “రెండు” అని అర్థం. “సెయ్ ” అంటే చెయ్యి అని అర్థం. అంటే, మొత్తంమీద, “రెండు అరచేతుల పరిమాణంవున్న భక్ష్యవిశేషం” అని ఆయన శబ్దవ్యుత్పత్తిద్వారా ఇచ్చిన ‘దోసె’ నిర్వచనం.

(5) ఒక సందర్భంలో తిరుపతి ప్రాచ్యకళాశాల ప్రిన్సిపాలైన శ్రీమాన్ పరవస్తు రామానుజాచార్యులవారిని గురించి, ప్రాస్తావికంగా,

“మిన్ను విరిగి మేనుమీద వ్రాలిన తొట్రు
పాలుగారు, ప్రిన్సిపాలుగారు!

అంటూ, రామానుజాచార్యులవారి నైజప్రకృతిని విశదంచేసేరట!

(6) మరొక సందర్భంలో మా పోచిరాజు శేషగిరిరావుబాబయ్యగారి కాబోయే అత్తవారిది “ఏ ఊరు?” అని శాస్త్రిగారు అడిగితే, మా బాబయ్యగారు, “గుమ్మలూరు” అండీ, అని జవాబిచ్చేరుట! వెనువెంటనే శాస్త్రిగారినోటినుంచి తూటావంటి ఆశువు, “గుమ్మలూరు, ముద్దుగుమ్మలూరు!” అని అలవోకగా బయటపడిందట!

End of Part 1.

To be continued in Part 2.

ఇతి శమ్ ||

You may also like...

6 Responses

  1. Ravikumar. S says:

    Very good.A legendary person .Unparalell. Praa tah Smara neeyulu.
    Bhaasa ‘s plays were unearthed by Sri Maa na valli. Where is his commentory on Nannechoda’s work?

  2. సి.యస్ says:

    శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వారిని గురించి కష్టపడి సేకరించి,
    అందించిన వివరాలు చదవడం ఆనందదాయకంగా ఉంది.
    తెలుగుజాతి మణిపూసలలో ఒకరైన వేటూరి వారి గురించి
    ప్రస్తుత తరానికైతే అసలు తెలియనే తెలియదు. వారి కాలంలో
    మహా ప్రతిభా సంపన్నులని పేర్గాంచిన శ్రీ శాస్త్రిగారి గురించి ఎక్కడా
    తగినంత సమాచారం దొరకడంలేదు. ఎన్నో వ్యాస సంపుటాలలో
    అనేక మంది మీద వ్యాసాలున్నాయి కానీ వీరిగురించి లభించడం లేదు. అటువంటి సమయంలో వారి జీవిత విశేషాలు ఇలా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    వేటూరివారు తమ శిష్యులకు భాషాశాస్త్రాధ్యయనం అనాయాసంగా
    చెయ్యడానికి అనాస పండు అనే మాటను గురించిన చర్చ రసవంతంగా ఉంది. తిరుమల రామచంద్ర గారి వంటి శిష్యులను
    తీర్చిదిద్దిన వేటూరి వారు నిస్సందేహంగా అసామాన్య ప్రతిభా సంపన్నులు. వారి హాస్య చతురత , ఆశుకవితా ధోరణి, శిష్యులకి
    ధర్మాచరణ మార్గాన్ని బోధించే పద్ధతి… అన్నీ పరమాద్భుతం!

    సరళ హృదయ మూర్తి సారస్వత స్ఫూర్తి
    పరిఢవిల్లు నతడు పసిడి వోలె
    పేర ప్రభలు యున్న వేటూరి శాస్త్రులు
    వేల కవుల లోన మేలు బంతి.

  3. Sahiti says:

    చాలా చాలా ధన్యవాదాలు.వేటూరి ప్రభాకరశాస్త్రి గారి గురించి తెలుసుకోవాలని ఎన్నాళ్ళనించో కోరిక.
    ఇంతమంది మహానుభావుల పరిచయ భాగ్యం నీ దయ వల్లనే.
    ఎంతో శ్రమ తీసుకొని ఈ శీర్షిక నిర్వహిస్తున్న నీకు మేము చాలా ఋణ పడివున్నాం.

  4. Veturi Anandamurthy says:

    Chaalaa baagaa Rashaaru naayanaa. IlaagE inkaa raastuu unDanDi. Aakaraalu sEkaristuu ilaa vishadiikaristuu unTEkaanii telusukOlEni Kaalam lO mii kRShi Chala goppadi. Abhinandanalu.

    • V.V.Krishna Rao says:

      పాదపద్మాల ప్రణమిల్లి భక్తితోడ,
      ధన్యవాదాలనర్పింతు తలను వంచి,
      వ్రాయగల్గితి భవదీయ వత్సలతను
      ముదిత వేటూరి ఆనందమూర్తివర్య!

      • -- says:

        కేవలమ్మైన కృషికాదు కృష్నరాయ! మేలువార్తలు విన్పించి మెరసినారు, పాలు గ్రోలుటె కా దందు మేలు నెంచి, పంచినారలు మించి రాయంచవోలె. శుభమస్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *