సాహిత్యము-సౌహిత్యము – 55 : పెద్ద నై ష్ఠికుడై ఉండెడువాడు నీవగుట, తా చిత్రంబె? సర్వేశ్వరా
ఐం శ్రీశారదా పరదేవతాయై నమోనమః|
26—05—2018; శనివారము|
శ్రీశారదాంబికా స్ఫూర్తిచంద్రికా|
“సాహిత్యము ~ సౌహిత్యము—55″|
క్రితం వారం, యథావాక్కుల అన్నమయ్యకవివరుల “సర్వేశ్వరశతకం” లోని “తరులన్ పూవులు పిందెలై – – – ” ఇత్యాది పద్యం ఉదహరించుకుని ఆ పద్యంలోని కవిగారి భక్తిభావనయొక్క మాధుర్యం ౘవి చూసేం! ఆ పద్యంయొక్క కొనసాగింపుని ఈ వారం పరిశీలించాలి అనుకున్నాం! అదేమిటో చూద్దాం!
కవిగారు కృష్ణానదీతీరంలో నిష్ఠగా కూర్చుని ఈ శతకరచనకి ఉపక్రమించేరు. ప్రతిపద్యమూ తాటాకుమీద వ్రాసి, ఆ పద్య సహిత తాళపత్రాన్ని, నదిలోకి ౙారవిడిచి, ఆ తాటాకు నదీప్రవాహానికి ఎదురీది, వెనకకి వస్తేనే, ఆ తాళపత్రాన్ని సూత్రగ్రథితం చేస్తానని, అంటే, తన శతకగ్రంథంలో చేరుస్తానని, ఒకవేళ ఏ పద్యయుత తాళపత్రమైనా అలాగ తిరిగి రాలేకపోతే, తన తలని దేహంనుంచి వేరుచేసుకుంటానని కవిగారు తీవ్రశపథం పూనేరుట! ఆయన అంతవరకూ వ్రాసిన అన్ని పద్యాలూ ఏటికి ఎదురీదినట్లుగా, నదీప్రవాహ వ్యతిరేకదిశలో పయనించి వెనకకి వచ్చేయట! “తరులన్ పూవులు పిందెలై – – – ” పద్యం మాత్రం వెనుకకి రాలేదట! దానితో కవిగారు శపథానుసారంగా, “గండకత్తెర మెడకి తగిలించుకోబోతూ ఉండగా” ఒక గోపాల బాలకుడు కవిగారివద్దకి వచ్చి, “అయ్యగారూ! ఇదేదో తాటాకు నది ఒడ్డుకి కొట్టుకువచ్చి, నాకు దొరికింది. తమరికి ఏమైనా పనికివస్తుందేమో చూసుకోండి!” అని అన్నమయ్యగారి చేతిలో ఆ తాళపత్రాన్నివుంచి అంతర్ధానమైపోయేడుట! కవిగారు కళవళపడి తాటాకుని పరికించేసరికి దానిలో ఈ పద్యం ఉందట
మ.॥
“ఒక పుష్పంబు భవత్పద ద్వయముపై ఒప్పంగ సద్భక్తి రం
జకుడై పెట్టిన పుణ్యమూర్తికి పునర్జన్మంబు లేదన్న, పా
యక కాల త్రితయోపచారముల నిన్నర్చించుచో, పెద్ద నై
ష్ఠికుడై ఉండెడువాడు నీవగుట, తా చిత్రంబె? సర్వేశ్వరా”||
“ఓ సర్వేశ్వరా! రమణీయభక్తిభావభరితుడైన ఒక భక్తుడు నిన్ను సేవించుకునే తహతహతో ఒక కుసుమంతో పావనకరమైన నీ రెండు పాదాలని పూజిస్తే అటువంటి మహానుభావుడికి మళ్ళీ ౘావు-పుట్టుకలు లేవని భక్తుల చరిత్రలు, ముక్తిశాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. అలాగైతే, ముప్పొద్దులలోనూ నిన్ను ఏమాత్రమూ విడిచిపెట్టక, అనవరత రమ్యభక్తిభావంతో పరమనిష్ఠాగరిష్ఠుడై నిన్ను అర్చిస్తూ, ఆరాధించేవాడు తానే నీవై సాయుజ్యమోక్షస్థితిని పొందడం అనేది ఏమంత ఆశ్చర్యం, ప్రభూ?”
సాహిత్యభావసౌందర్యంలోను, మహాచమత్కారవైభవంలోను గొప్పదైన మొదటిపద్యం, పరమేశ్వరభక్తి ఫలాన్ని కేవలమూ ఐహిక భోగభాగ్యాలకి మాత్రమే పరిమితం చేసేసింది. అది పారమార్థిక సాధనవిషయంలో ఐహికమైన ఒక పార్శ్వానికే పూర్తి ప్రాముఖ్యతని యిచ్చి, పారలౌకికమైన పరమార్థాన్ని నిర్లక్ష్యం చేసింది. ఆ దోషాన్ని పరిహరింపచేస్తూ రెండవ పద్యం పుట్టుకొచ్చింది. పరమేశ్వర ఆరాధన పరమగమ్యం పరాత్పరసాయుజ్యమేనని ఆ పద్యం నిర్ద్వంద్వంగా ప్రతిపాదించి శాస్త్రసార ఔత్కృష్ట్యాన్ని ౘాటి చెప్పింది. సర్వేశ్వరసేవానిరతియొక్క అపార, అమేయ గౌరవాన్ని పునఃప్రతిష్ఠించింది!
స్వస్తి||
యథా(ర్థ )వాక్కుల అన్నమయ్య గారి ఈ పద్యం
మొదటి పద్యానికి పైమెట్టు. మొదటి పద్యం భక్తి మార్గాన్ని
సూచిస్తే , ఈ పద్యం మోక్ష ప్రాప్తికి మార్గం చూపెడుతోంది.
భక్తుడు భగవంతుడితో వేరుకాదు అనే ఎరుక కలిగి అద్వైత
భావనతో తాను సిద్ధి పొందగలిగిన దారి చూపించే తత్త్వం
ఈ పద్యంలో బోధించారు కవి.
పద్యానికి ఇచ్చిన వివరణ అర్థవంతంగా ఉంది.