కదంబకం – 4 : ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation)
23—07—2017; ఆదివారము.
సుమసుందర కదంబకం——4.
ఈ వారం ఈ శీర్షికలో ఒక విలక్షణ విషయంగురించి ప్రస్తావించుకుందాం. ఈ సారి ధ్యానంగురించి కొంత తెలుసుకుందాం. ధ్యానం అనేది అనేకరీతులలో ఆచరించడం జరుగుతూవుంటుంది. ససంకల్పాత్మక ఏకవస్తుకృత ధ్యానం (Volitional singularly focussed meditation) ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation) వంటివి, ఆ పైన నిస్సంకాల్పాత్మక మైన ధ్యానాలు (Non-Volitional meditations) ఇంకా చాలాపద్ధతుల ధ్యానాలు వున్నాయి. వీటిలో ఈ రోజు ససంకల్పాత్మక స్వేచ్ఛాయుత ధ్యానం (Volitional free meditation) గురించి ముచ్చటించుకుందాం.
సి.జి.యూంగ్ (C.G.Jung or Carl Gustav Jung) గురించి మనలో చాలామంది వినేవుంటాం. వారు స్విట్జర్లేండు దేశానికిచెందిన మనస్తత్త్వశాస్త్రదార్శనికుడు. విశ్లేషణాత్మక మనస్తత్త్వశాస్త్రం (Analytical Psychology) అనే నూతనదర్శన ఆవిష్కర్త. ఆయన ససంకల్ప స్వేచ్ఛాధ్యానపద్ధతిని అనుసరించి ఒక వినూత్న అనుభవాన్నిపొంది, ఆ సత్యాన్ని తన ఆత్మకథ (Memories, Dreams, Reflections)లో మనవంటి జన బాహుళ్య ప్రయోజనార్థం పొందుపరిచేరు. ఈ ధ్యానఫలితంగా ఆయనకి వారి సూక్ష్మభావప్రపంచంలో ఫిలిమోను (Philemon) అనే ఒక దివ్యపురుషుడు దర్మనమిచ్చేవాడు. ఫిలిమోను యూంగుకి అనేకవిషయాలు తెలియపరచేవాడు.
యూంగు మాటలలోనే ఆ వివరాలు సంగ్రహంగా తెలుసుకుందాం.
“నేను స్పష్టంగా ఆయన నాతో మాట్లాడడం గ్రహించేను. ఆయన నాతో ఒక సందర్భంలో అన్నారు: ‘నీవు నీలోని ఆలోచనలకి నీవే కర్తవి అనుకుంటున్నావు. అది నిజంకాదు. అడవిలో సంచరించే మృగాలని ఆ అడవి సృష్టించదు. వాటికి అవిగానే మృగాలు వున్నాయి. అలాగే నీ మనోవనంలో ఆలోచనలుకూడా తమకి తాముగానే సంచరిస్తున్నాయి.నీ ఆలోచనలు ఆకాశంలో పక్షులవంటివి; ఒకగదిలోవున్న మనుష్యులవంటివి’. అని నాకు ఫిలిమోను నా అంతట నాకు తెలియని ఎన్నోవిషయాలు నాకు స్పష్టంగా తెలిసేలాగ బోధించేరు”.
దీనివలన నేను నాకు- నా ఆలోచనకి వస్తువు/ విషయము ఐనదానిని విడిగా విశ్లేషించి చూడడం అభ్యాసమయ్యింది…….కొన్నిసందర్భాలలో ఫిలిమోను నాకు నిజంగా ఒక సజీవవ్యక్తిగా అనిపించేవాడు. మా యింటి ముంగిట తోటలో ఆయన, నేను కలిసి అటు-యిటు నడిచేవాళ్ళం. నాకు ఆయన భారతీయులభాషలో(చెప్పబడే) గురువు(వంటివాడు)……. ఈ విధంగా 15 సంవత్సరాలు పైన గడిచిపోయేయి. భారతదేశంనుంచి నన్ను కలవడానికి గాంధీజీ మిత్రుడు, వయోవృద్ధుడు, ఉత్తమసంస్కారి ఐన ఒకవ్యక్తి వచ్చేడు. ఆయన-నేను అనేకవిషయాలు మాట్లాడుకున్న తరవాత మా సంభాషణ గురు-శిష్య
సంబంధంపైకి మళ్ళింది. నేను సంకోచిస్తూనే యిలా అడిగేను:
నేను: మీగురువుగారిగురించి నేను కొంచెం తెలుసుకోవచ్చా? ఆయన యెవరు? మీతో యెలావుండేవారు?
అప్పుడు ఫిలిమోను నాతలపులో నిలిచేరు.”
దీనినిబట్టి అధ్యాత్మవిద్యలో గురువు శుద్ధచైతన్యరూపంలో తన శిష్యకోటికి ఆయా కాలాలలో అవసరాన్నిబట్టి మార్గనిర్దేశంచేసి తరింపచేయడం లోకానుభవంలో అరుదుగా ఐనా వుంది అని రుజువు ఔతోంది.
స్వస్తి || (సశేషం).