శారదా సంతతి — 44 : పరమాత్మ భావరసామృతపాన మత్త శీలి ~ బరూఖ్ స్పినోజా – Part 1

ఐం హ్రీం శ్రీం శ్రీశారదాదేవ్యై నమోనమః|
13—05—2018; ఆదిత్యవాసరము|

శ్రీశారదా కరుణారస మందాకిని|

“శారదా సంతతి ~ 44″| పరమాత్మ భావరసామృతపాన మత్త శీలి ~ బరూఖ్ స్పినోజా| (24-11-1632 నుండి 21-02-1677 వరకు) The God-intoxicated man – Baruch (Benedict) Spinoza|

హాలెండుదేశంలోని అమెస్టరుడాం నగరం. 1650 వ సంవత్సరప్రాంతం.  ఒక సుసంపన్నమైన మధ్యతరగతి యూదుకుటుంబం(jewish family) వారి ఇల్లు. ఆ ఇంటిలోని హాలులో, సుమారు ఏభై ఏళ్ళు పైబడివున్నాయన, ముగ్గురు పిల్లల తండ్రి ఐన ఆ గృహయజమాని, ఒక అందమైన, ఖరీదైన సోఫాలో కూర్చునివున్నాడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు, వారి మధ్య ఒక పుత్రుడు. వారి ఏకైక కుమారుడు, 18 ఏళ్ళ బరూఖ్ స్పినోజా, ఆయన ఎదురు సోఫాలో కూర్చునివున్నాడు. అతడు స్ఫురద్రూపి. ముఖంలో జ్ఞానవర్చస్సు ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. సహజసౌమ్యస్వభావం వదన చిహ్నాలలో స్పష్టంగా ప్రకాశిస్తోంది. బుద్ధి తీక్ష్ణతని తెలియజేసే కళ్ళు, గ్రహించిన సత్యంకోసం ప్రాణాలనైనా పరిత్యజించడానికి వెనకాడని పట్టుదలని సూచించే ౘక్కనిముక్కు, సహజ మేధాశక్తిని స్ఫురింపజేసే విశాల ఫాలభాగం మొదలైన అతడి సువ్యక్త ముఖలక్షణాలన్నీ అతడు కారణజన్ముడేమో అనిపించేటట్లు ఉన్నాయి.

స్పినోజా చిన్నతనంనుంచి సహజతత్త్వాన్వేషి. అనవరత అధ్యయనశీలి. ఏకాంతవాస ప్రియుడు. వినయ-విధేయతలు అతడి విశిష్ట అంకారాలు. మితభాషణం అతడి లక్షణం. మృదుస్వభావం అతడికి నైజగుణం! ప్రాకృతిక బాహ్య శత-సహస్ర వైవిధ్యభరితమైన బాహ్యజగత్తులో అంతర్వాహినిగావున్న ఏకైక ధర్మసూత్రం ఏమిటో తెలుసుకోవాలనే తహ-తహతో బాటు, ఆ తాత్త్విక సమైక్యానుభవాన్ని తాను పొందడమేకాక, సాటి మానవులందరితో పంచుకోవాలనే గాఢాభిలాష కలిగిన ఋషికల్పుడు.

అతడు తన అనంత అధ్యయన క్షుధని తీర్చుకోవడానికి పాశ్చాత్య శాస్త్ర, తత్త్వ గ్రంథాదులనెన్నో అనేకభాషలలో, ౘాలాసార్లు ౘదివేడు. దాంట్లో భాగంగా, ఐదోసారి, ఫ్రెంచి తత్త్వవేత్త దెఖార్త్ (Decartes) రచించిన “తత్త్వశాస్త్ర మౌలిక సిద్ధాంతాలు” (Principia philosophiae – The Principles of Philosophy) గ్రంథాన్ని  ౘాలా శ్రద్ధగాను, ఆసక్తితోను, పరిసరాలని మైమరచిపోయి ౘదువుకుంటున్నాడు. పైపు కాలుస్తున్న తండ్రి, తన కొడుకుయొక్క సునిశితమతిని గమనించి, కొంత సంతోషపడుతూన్నా, అంతకి మించి అనంతమైన భద్రతారాహిత్యంతో భయపడుతున్నాడు. ఇంక ఇలాగ ఉపేక్షచేస్తూను, అడపా-దడపా మృదువుగా సమస్యలని వివరిస్తూను, ఒకటి-రెండుసార్లు కాస్తంత కటువుగా రాబోయే ఆపదలగురించి హెచ్చరిస్తూను, తప్పనిసరి పరిస్థితిలో కుటుంబానికి, యూదుమత-జాతీయుల సంఘానికి, సమాజానికి వాటిల్లబోయే ఉపద్రవాలని విశదపరుస్తూను చెప్పిన మాటలవలన ఒరిగిన ప్రయోజనం పిసరంతైనా ఆ తండ్రికి అనుభవంలోకి రాలేదు. అందువలన, ఆయన, కాస్తంత గళాన్ని సవరించుకుని, తనమాటలలో పారుష్యాన్ని, కంఠధ్వనిలో కాఠిన్యాన్ని, ఏమాత్రమూ ధ్వనింపచెయ్యకుండానే, తాను చెప్పదలచుకున్న విషయంలో దృఢత్వాన్ని, స్పష్టతని, సందర్భంయొక్క తీవ్రతని ఔచిత్యస్ఫూర్తితో వ్యక్తపరుస్తూ, స్పినోజాతో సంభాషణని ప్రారంభించడానికి ఇలాగ ఉద్యుక్తుడయ్యేడు.

తండ్రి:—
నాయనా, స్పినోజా! మా తాతముత్తాతలు బ్రతుకుభయంతో, పెళ్ళాంబిడ్డలని కాపాడుకుంటూ, పొట్ట చేతపట్టుకుని, భద్రమైన స్థిరనివాసంకోసమూ, మన ప్రాచీనతమ మత-సంస్కృతులని కాపాడుకుని, రాబోయే తరాలవారికి ఈ సుసంపన్న సంస్కృతీ సంప్రదాయాలని అందించడంకోసమూ, అనేక ఐరోపీయ దేశాలలో తిరుగుతూ, తిన్నచోట ఉండకుండా, ఉన్నచోట తినకుండా, చిట్టచివరికి, ఈ దేశంలోని ఈ అమెస్టరుడాం నగరం సంరక్షణలో తల దాచుకుని, అనేక భిన్న సంస్కృతులకి శాంతి-భద్రతలని కలిగించడంవల్ల, ఈ స్థానంలో స్థిరపడ్డారు. నేను నా శక్తివంచనలేకండా మన మధ్య-తరగతి సంపన్న జీవిత సౌఖ్యాలకి, సామాజిక భద్రతకి, అన్నింటినీమించి, మన యూదు దేవాలయం (Jewish temple of worship which is called “Synagogue”) “సినగాగ్ ” సంస్కృతి సంరక్షణని, మన రేబై (Rabbi – యూదుమత పూజారి లేక పురోహితుడు)ల సంక్షేమ-పురోగతులని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మనకుటుంబ సర్వతోముఖాభివృద్ధికి ఈ నా జీవితాన్నంతా ధారపోస్తూ వస్తున్నాను. ఇకపైన మన కుటుంబ పురోభివృద్ధిని కొనసాగిస్తూ, కాపాడవలసిన బాధ్యతని నాభుజాలనుంచి, నాలుగైదేళ్ళ తరవాతైనా, నీవు తీసుకోవలసివుంటుంది.

ఆ పైన మరొక ముఖ్యవిషయంవుంది. మన యూదుజాతి సంస్కృతియొక్క అభ్యున్నతి సమీప భవిష్యత్తులో నీ సహాయ-సహకారాలమీద ఆధారపడివుంది. ప్రాచీనతమమైన మన యూదుమత అనుయాయులమందరమూ నీపైన అపారమైన ఆశలు పెట్టుకునివున్నాం. అందుకోసమే నీకు మన పవిత్ర మతగ్రంథాలలో ౘాలా ప్రధానమైన మౌలిక గ్రంథాలలో, విశేష వ్యాఖ్యానాలతోసహా, (Tanakh, Torah, Midrash, Talmud etc.) చిన్న వయస్సునుంచి ౘక్కని అధ్యయన శిక్షణని ఇప్పిస్తూవచ్చేను. నీవు కొంతకాలం, భక్తి-శ్రద్ధలతో అవన్నీ బాగానే అధ్యయనం చేసేవాడివి. నీకు, ఆధునిక విద్యాభ్యాసంలోకూడా శాస్త్రీయమైన, స్పష్టమైన అవగాహన కలగాలని మన ప్రాచీన హీబ్రూ భాషతోబాటు, ఆధునిక భాషలైన ఫ్రెంచి, ఇటాలియను, జర్మను భాషలని బాగా నేర్పించేను. వీటితోబాటు, నీ కుతూహలంతో స్పేనిషు, పోర్చుగీసు, లేటిను భాషలని, రేఖాగణితశాస్త్రం, భౌతికశాస్త్రం, తత్త్వశాస్త్రం మొదలైన విషయాలని, నీకు ప్రత్యేక అభిమానవిషయాలుకనక, నీకు నీవుగా నేర్చుకున్నావు. ఇంతచిన్న వయస్సులోనే, ఇవేవీ ౘాలవన్నట్లు, సామాజికశాస్త్రం, రాజకీయతత్త్వశాస్త్రం, జీవశాస్త్రం మొదలైనవన్నీ అధ్యయనం చేసేసేవు. ఇవన్నీ మన ప్రాచీన మతం-సంస్కృతి- పారంపరిక ఔన్నత్యం మొదలైన వాటి పరిరక్షణ, పురోగతిలకోసం నీవు వినియోగిస్తావని నమ్ముతూ, వినియోగించాలని గాఢంగా ఆశిస్తూ నీ అధ్యన శీలతకి నేను ఆనందిస్తూ వస్తున్నాను. ఇంత చిన్న వయస్సులోనే ఇంతటి మహామేధావిని, నా జీవితంలో, నేను మన కుటుంబాలలోనేకాక, బయట నాకు తెలిసిన కుటుంబాలలో చూడనూలేదు, కనీసం విననైనావినలేదు. అటువంటి నీ అపార, అపూర్వ ప్రజ్ఞాపాటవాలకి గర్వించి సంతోషించాలో, లేకపోతే అనునిత్యం భయపడుతూ బాధపడాలో తెలియని పరిస్థితిలో, నీ తండ్రినైన నేనున్నాను. నీ సవతి అక్క వివాహం మన సంప్రదాయం ప్రకారంచేసినందుకు, ఇంట-బయట మనవారందరూ సంతోషిస్తున్నారు. ఇంక నీవు, నీ చెల్లి, పరమేశ్వరుడైన “నా ప్రభువు(Adonai)” దయతో, మీ-మీ జీవితాలలో స్థిరపడిపోయి, మన మతంలోని పెద్దల అభిమతంమేరకి, హాయిగావుంటే నా బరువు-బాధ్యతలు
తీరిపోతాయి. ఆ తరవాత, నా శేషజీవితాన్ని, కేవలం సినగాగ్ సేవలకి అంకితం చేసుకోవాలని నా మనసులోని నా స్థిరమైన అభిప్రాయం.

కాని, గత రెండు-మూడు సంవత్సరాలుగా నీ ఆలోచనల ధోరణి, మరీ ముఖ్యంగా మన ప్రాచీన మత-సంస్కృతి సంప్రదాయాలగురించి నీవు దాపరికమేమీ లేకుండా, మన కుటుంబ భద్రతకికూడా విఘాతం కలిగించేరీతిలో, మన మతపెద్దల, మన ధర్మశాస్త్ర గ్రంథాల బోధల విలువలనన్నింటిని తిరస్కరించే పద్ధతిలో ౘాలా విపత్కరమైన సంభాషణలని చేస్తున్నావు. ఇది మనందరికీకూడా ప్రమాదాలని తెచ్చిపెడుతుంది. రాను, రాను నీవు దెఖార్త్ , బేకన్ , అరిస్టాటిల్ , గెలిలియో, కెప్లర్ , హాబ్స్ మొదలైనవారి భావజాలాలలో బందీవైపోయి, మన ప్రాచీన వ్యవస్థకి ప్రమాదం తెచ్చిపెడుతున్నావేమోనని భయమేస్తోంది. పూర్వం, మనపెద్దలు “పవిత్రగ్రంథం”(The Holy Bible)లోని, “ప్రాచీన సంహిత” (The Old Testament)ని మాత్రమే అంగీకరించి, “నవీన సంహిత” (The New Testament)ని తిరస్కరించి, తమ ప్రాణాలని బలిగా అర్పించి, మన పరంపరయొక్క ఘనతకి మనకుటుంబాలనన్నింటినీ పునరంకితం చేసేరు. అటువంటి మన పెద్దల బలిదానాలన్నీ వ్యర్థంచేస్తావా నాయనా, స్పినోజా? బాగా ఆలోచించి చెప్పు. మన దేవాలయ పూజారుల మండలిలో ఏదో ఒక రోజు పెద్దలందరూ నన్ను సంజాయిషీ అడగకమానరు. నేను సరైన సమాధానం చెప్పక తప్పదు. పైగా ఆ రోజు దగ్గరపడుతోందని నా భయం! నిన్ను వెనకవేసుకొస్తే, మన కుటుంబం మనుగడకే ప్రమాదం కలగడమేకాక, మన పూర్వుల పరంపర చేసిన బలిదానాలు, నేను-మనకుటుంబం ఇన్ని దశాబ్దాలనుంచి చేస్తున్న అంకితసేవలు అన్నీ నిరర్థకం ఐపోతాయి. ఈ రోజు, ఇంక మనం అన్ని విషయాలు ముఖా-ముఖిగా మాటాడుకొనవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఒక్కసారి, నీవు ౘదువుతోన్న ఆ పుస్తకాన్ని ప్రక్కనపెట్టు. మన సంభాషణ పూర్తైనతరవాత మళ్ళీ ౘదువుకొనవచ్చు!

స్పినోజా:—
నాన్నగారూ! ముందుగా నా వలన మీకు ఇంట-బయట కలుగుతున్న దారుణమైన అసౌకర్యాలకి, మానసిక వేదనకి నేనెంతో బాధపడుతున్నాను. అంతేకాదు. సర్వవ్యాపి ఐన ఆ పరమాత్మ మనందరికి ఇచ్చిన భావస్వేచ్ఛని మీరు నా చిన్నతనంనుంచీ నా నిత్యానుభవంలోవుండేవిధంగా నన్ను పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించేరు. అటువంటి మీకు నా వలన ఇటువంటి వేదనామయ వార్ధక్యం కలగడం నన్ను అమితంగా కలచివేస్తోంది. ఐతే, నేనెందుకోసం పుట్టి, ఈ విధంగా పెరిగి పెద్దవాడినౌతున్నానో నాకు స్పష్టంగా తెలుసు. మిమ్మల్ని బాధించడం అనే భావం నాలో ఏ మూలా లేదు. అసలు ఎవ్వరూ, ఏ జీవీ నా వలన లవలేశమైన బాధనికూడా పొందకూడదు. అదేవిధంగా, నాకు జన్మనిచ్చి, నన్ను పెంచి పెద్దచెయ్యడానికి అవసరమైన అన్ని కష్టాలు పడిన నా తల్లి-తండ్రులు నావలన ఎటువంటి సమస్యలకి గురికాకూడదు. ఇవన్నీ, నా అంతరాంతరాలలో నా జీవనపథనిర్దేశం చేస్తున్న నా ఆదర్శాలలో కొన్ని, మీ కుమారుడిగా మీ ముందు ఉంచుతున్నాను. మీరు చెప్పినట్లు మన మతాధికారులు మిమ్మల్ని ఏదో ఒకరోజు తప్పక పిలిచి, నాగురించి సంజాయషీ అడగకమానరు. మీరంతా దానికి సిద్ధపడివుండాలి. అటువంటిరోజు వచ్చిననాడు మీరు నన్ను పరిత్యజించడానికి ఏమాత్రమూ వెనకాడవద్దు. మన మతాన్ని, ప్రార్థనాలయాన్ని, ఇతర అనుబంధిత మతవ్యవస్థలని సంరక్షించడానికి సువ్యవస్థీకృత మతాధికార పరంపరవుంది. మన కుటుంబ పరిరక్షణకి మీరు ఉన్నారు. నన్ను రక్షించడానికి పూర్ణవిశ్వసంక్షేమప్రదాయకమైన నా తత్త్వదర్శనం ఉంది. ఈ అన్నింటికీ మూలమై, అన్నీ తానై, విశ్వరూపుడై, విశ్వాత్మ ఐన పరమాత్మ మతాధికారులని, మిమ్మల్ని, నన్ను, మిగిలిన సృష్టిని అవ్యాజప్రేమతో అనవరతమూ కాపాడుతూనే ఉంటున్నాడు. మీరు ఏమాత్రమూ చింత పడవద్దు, నాన్నగారూ!

ఈ సందర్భంలో, మీ బిడ్డగా, కొన్ని సత్యాలని నేను తమ సమక్షంలో ఉంచుతున్నాను. తమరు నాయందు దయతో సావధానులై వినండి, నాన్నగారూ! పరమాత్మ వెల్లడిచేసే అనంత నిరపేక్ష సత్యానికి, మనం ఈ మతాలద్వారాను, అభిమతాలద్వారాను, యుగ-యుగాలుగా ఏర్పరుచుకున్న వ్యవస్థీకృత జీవన విధానాల భద్రతా భావనల సాపేక్ష, పాక్షిక దేశ-కాల బాధిత భావనలతో ఏ మాత్రమూ నిమిత్తం లేదు నాన్నగారూ! నేను ఇంత తేట తెల్లంగా మాటలాడి మీ మనసుని గాయపరుస్తున్నానేమోనని నా బాధ! కాని అసలైన విషయమేమిటంటే మనందరమూ తెలిసో, తెలియకో మనకి అనుభవంలోవున్న మూడు కాలాలని తనలో ఇముడ్చుకున్న ఆ అనంత పరాత్పర మహాతత్త్వానికి సర్వదా-సర్వధా లోబడేవున్నాం! అటువంటి అద్భుతసత్యచైతన్యమయ అనంతభావశక్తినిగురించి మనందరమూ పూర్తిగా మరిచిపోవడమేకాక, దేశ-కాల-వ్యక్తి-సమూహాది లౌకిక పరిచ్ఛిన్న మానవీయ ఊహామయమైన మనుగడకి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, అనంతవిశ్వమయ పారమార్థిక తత్త్వాన్ని పూర్తిగా ఉపేక్షించి, మన అసలైన ఆత్మయానానికి ఆపదలని కల్పించుకుంటున్నాం, నాన్నగారూ! మన “పవిత్రగ్రంథం” లోనున్న “ప్రాచీనసంహిత” సత్యశోధనతో ఆత్మయానంచేసే సహజసాధకుడి అధ్యాత్మప్రయాణానికి దుర్వహమూ, అవరోధప్రదమూ తప్ప, సాధకయత్నాన్ని సుకరం చేయగలిగిన ఆధారయానకం కానేరదు నాన్నగారూ!

తండ్రి:—
సరే నాయనా! ఈ విషయంలో మనిద్దరమూ చేయగలిగినదేదీ లేదని నాకు సుస్పష్టంగా అర్థమయ్యింది. నా ప్రభువు సంకల్పం ప్రకారమే అన్నీ జరుగుతాయి. నేను బ్రతికివుండగా ఘోరాలు ఏవైనా ఏర్పడి నా పుత్రుడు నాకు దూరమయ్యే సందర్భం సంభవించకుండావుంటే ౘాలు. అలాగే, నా కళ్ళముందే మన వంశపూర్వులెందరో మనస్ఫూర్తిగా ఆరాధించి, అర్చించిన మన పరమ పవిత్రపరంపరని మనవంశజులెవ్వరైనా తిరస్కరించడంకంటె నా జీవితవైఫల్యం మరేమీవుండదు. ఈ రెండూ జరగకముందే నేను ఈ లోకంనుంచి నిష్క్రమించడంకన్న దైవం నాకు ఇవ్వగలిగిన శ్రేష్ఠవరం ఏమీ లేదు. అంతకంటె నేను మరేమీ కోరుకోవడంలేదు.

నా ప్రభువు నీకు ౘక్కని త్రోవని చూపి, ౘల్లగా నీ బాగోగులు చూస్తాడు. ఐనా, నీ చిన్నతనంలో జరిగిన యూరియల్ అ కోస్టా(Uriel A Costa) గారి సంఘబహిష్కరణకి సంబంధించిన దారుణసంఘటనలన్నీ నీ పసిమనసుని ఎంత తీవ్రంగా గాయపరిచేయో నాకు తెలుసు. ఆ రోజులలో నీ స్వచ్ఛమైన బుద్ధిలో ఆ సంఘటనలు ఎటువంటి ఆలోచనల దుమారాన్నిలేపేయో నేను గ్రహించేను. హేతుప్రమాణబుద్ధితో, మతవిశ్వాసాలని ధిక్కరించిన అ కోస్టాగారి ఆలోచనావిధానాలని గురించి నీకు కలిగిన సంశయాలని నేను తీర్చలేకపోయేను. అప్పటి నీ సందేహాలతోకూడిన ప్రశ్నలకి నా వద్ద ఎటువంటి సహేతుక సమాధానాలూ లేకపోవడం నాకు స్పష్టంగా గుర్తుంది. అలాగే అ కోస్టాగారు సంఘబహిష్కరణకి తట్టుకోలేక ఆత్మహత్యచేసుకోవడం నీ అమాయకహృదయాన్ని అల్లకల్లోలం చేసింది. అందువల్ల, నీ చిన్నతనంలో, మాటి-మాటికీ, శ్మశానానికివెళ్ళి, ఆయన సమాధిని దిగులుగా చూస్తూ అక్కడ ౘాలాసేపు గడిపేవాడివి. వీటినన్నింటినీ గమనిస్తూన్న నాకు మనసులో ఇటువంటిదేదో జరగబోతోందని నాకే తోచి, నా ఒళ్ళు గగుర్పొడిచేది. అదంతా చిట్టచివరికి ఈ విధంగా పరిణమించబోతోందని నా గుండెనిండా తొలగని గుబులు గూడుకట్టుకుంటోంది. ఇంతకన్న నేనేమీ అనలేను, స్పినోజా! నీ గ్రంథాధ్యయనం కొనసాగించుకో నాయనా! నీ గాఢాధ్యయనానికి అడ్డువచ్చినందుకు ఏమనుకోకు.

ఆ విధంగా తండ్రి-కొడుకుల సంభాషణ ఆగిపోయింది. సుమారు 1653లో, అంటే, ఇది జరిగిన మూడేళ్ళతరవాత, స్పినోజా తండ్రి పరమపదించడం జరిగింది. అంటే అప్పటికి స్పినోజాకి 21 సంవత్సరాల వయస్సు పూర్తయ్యింది.

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~

అది 1656వ సంవత్సరం. అమెస్టరుడాంలోని యూదుమత ప్రార్థనాలయమైన “సినగాగ్ ” లోని సువిశాలమైన హాలు. స్పినోజాకి 24 సంవత్సరాల వయస్సు. అతడి తండ్రిగారు గతించి మూడు సంవత్సరాలయ్యింది. స్పినోజాని తమ “యూదుమతసమాజం” నుంచి బహిష్కరిస్తూ మతానికి సంబంధించిన పెద్దలు ప్రజాసమక్షంలో ౘదివిన “బహిష్కరణ పత్రం” లోని ముఖ్యాంశాలు:—

“యూదుమతనిర్వహణాధికారులమైన మేమందరము, మన మతసంరక్షకులైన దేవతల పేరున, మన మతంకోసం సర్వస్వపరిత్యాగంచేసిన మహాపురుషుల పేరున, “బరూఖ్ స్పినోజా” అనబడే యూదువ్యక్తిని మహాపాపాత్ముడిగా పరిగణించి, గర్హించి, శపిస్తున్నాము – – – అతడు రాత్రింబవళ్ళు, ఇంటా-బయటా, కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, ఏ స్థితిలోవున్నా, ఎక్కడవున్నా, అనుక్షణమూ, బ్రతికివున్నన్నిరోజులూ, అన్నిచోట్లా శాపగ్రస్తుడై జీవించుగాక! – – – – – అతడితో మన మతసమాజసభ్యులైనవారెవ్వరైనా, నోటిమాటలద్వారాకాని, వ్రాతద్వారాకాని, ఒకే ప్రాంగణంలో, ఒకే ఇంటికప్పుక్రింద నివసించడంద్వారాకాని, ఏ ఇతర రీతిలోనైనా ఏ విధమైన సంబంధ-బాంధవ్యాలు కొనసాగించరాదు. అట్లు చేసినచో అటువంటివారికికూడా ఈ శిక్ష వర్తింపజేయ బడును – – – ”

ఈ బహిష్కరణవల్ల స్పినోజా అమెస్టరుడాంని వదిలి వెళ్ళవలసివచ్చింది. అతడు ది హేగ్ పట్టణానికి క్రమంగా చేరుకున్నాడు. అక్కడ అతడు కంటి అద్దాలకి మెరుగుపెట్టే “కళ్ళద్దాల నగిషీపని నిపుణుడు”గా తన పొట్టపోసుకుంటూ జీవననిర్వహణని చేసుకున్నాడు. వారి ప్రాచీన యూదు సాధుపుంగవుల దైనిక జీవన విధానశైలిని పరమాదర్శంగా గ్రహించి, ధనాది వస్తుసంపదని సంగ్రహించడాన్ని నిరాకరించే ప్రాచీన యూదుమునుల ఉత్తమాదర్శం, స్పినోజా శిరోధార్యంగా స్వీకరించి ఆ నియతిని, ఆజీవన నైష్ఠిక బ్రహ్మచర్యవ్రతదీక్షతో (life-long vow of celibacy and asceticism) సహా నిరంతరాయంగా నిర్వహించేరు.

అతడి సవతి-అక్కగారు స్పినోజా బహిష్కరణని అవకాశంగా తీసుకుని, ఆయన పిత్రార్జిత సంపదని దురాక్రమణచేసి అనుభవిస్తోందని, వారికి తెలిసింది. ఆమెకి ఆవిధంగా చేయవద్దని స్పినోజా సందేశం పంపితే ఆమె లక్ష్యపెట్టలేదు. అందువల్ల ఆయన న్యాయస్థానంలో ఆ ఆస్తిలోని తన భాగంగురించి వ్యాజ్యం వేసి న్యాయాధికారి తీర్పుద్వారా తన ఆస్తి హక్కుని పరిరక్షించుకుని, దానిని తిరిగి పొందేరు. ఐతే, తాను పొందిన ఆ ఆస్తిని సక్రమమైన దస్తావేజుద్వారా(exercising the right of transferability on his share of paternal property) తిరిగి తన అక్కగారికే సంక్రమింపజేసేరు. ఆ సందర్భంలో వారు తమ అక్కగారికి పంపిన సందేశంయొక్క సారాంశం ఇది:—

“అక్కా! నిన్ను ఇబ్బందికి గురిచేసేనని అనుకోకు. తమ్ముడి ఆస్తిని, అతడి అసహాయస్థితిని ఆసరాగా చేసుకుని అక్కగారు అన్యాయంగా ఆక్రమించుకుందనే లోకాపవాదం నీకు రాకూడదు. సామాజికంగా బాధ్యతాయుతమైన కుటుంబంలో పుట్టినవాళ్ళం మనం! అరాచకత్వాన్ని ఆచరించడంకాని, ఆచరించేవారికి మద్దతుని ఇవ్వడంకాని చెయ్యడం మన దేశచట్టాలకి విరుద్ధమైన పని మాత్రమేకాదు; మన అంతరాత్మ ప్రబోధించే నైతిక సదాచారానికి వినాశకరమైనదికదా!

“పైగా మన తరంవాళ్ళం అందరమూ, మన కుటుంబంలోని తరవాత తరంవారందరికీ, మన నీతి-నియమాలతో నిర్వహించుకునే జీవనసరళిద్వారా ధర్మబద్ధమైన స్వార్థపరత్వ దోషాదులు లేని ఉత్తమ జీవితాదర్శాలని ౘక్కగా నెలకొల్పగలగాలి. మన అమ్మలు- నాన్న మనకి ఆ విధంగానే నేర్పించడం మన బాల్యంనుంచీ మన అనుభవంలోవున్నదేకదా!

“అంతేకాక, నా ఈ శరీరాన్ని నేను ఏ రోజుకి ఆ రోజు కష్టపడి సముపార్జించిన డబ్బు ద్వారా మాత్రమే పోషించాలనే ధర్మానికి కట్టుబడి నా జీవననిర్వహణని చేసుకుంటున్నాను. అందువలన పరార్జితధనం, అది పిత్రార్జితమైనా నాకు స్వీకారయోగ్యంకాదు. అందుకనే జమీందారైన నా ఆప్తమిత్రుడు ఒకాయన, ఇక్కడ నాకు జీవితాంతమూ అవసరమైన ధనానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసే ప్రయత్నంచేస్తే, నేను వారించేను. ఆయన ఉద్దేశ్యం మంచిదే! నేను చేస్తున్న కళ్ళద్దాల నగిషీపనికోసం వెచ్చించే సమయాన్ని, పుస్తకాలని రచించడంకోసం వినియోగిస్తే ఎక్కువ లోకోపకారం జరుగుతుందికదా, అని ఆయన అభిప్రాయం. స్వార్జితమైన సొమ్ముతో కేవలమూ ధర్మబద్ధంగా పోషించబడిన దేహశ్రమద్వారా చేసే రచనలలో సారభూతమై నిలిచే సంవేదనాత్మకత, సందేశాత్మకతలయొక్క నిజాయతీ గుణమే విలక్షణమైనదీ, శౌచనిర్మలమైనదీ కదా అక్కా! అటువంటి పోషణలో సుశిక్షితమైన మన మనోబుద్ధులు, మన భావ జగత్తు అమలిన సత్త్వగుణశోభతో మన నిత్యకర్మాచరణని, మన గ్రంథరచనలోని ఆశయాలని, ఆదర్శాలని ప్రభావవంతంగాను, ప్రతిభాసముజ్జ్వలంగాను తీర్చి దిద్దడం నాకు అనునిత్యమూ అనుభవంలోవున్న సత్యమే! మన అమ్మ-నాన్నల ఆశయమే అది కదా! ఆ విధంగానే మన కుటుంబ పరంపరయొక్క యశస్సు లోకానికి శ్రేయోదాయకంగా ఉంటుంది. నీకు, బావగారికి, చిన్నారులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు!”

© ® © ® © ® © ® © ® © ®

End of Part 1.

To be continued in Part 2.

ఇతి శమ్ ||

You may also like...

2 Responses

  1. Suryanarayana Gorthi says:

    Unperturbed clear ideas and expressions worth emulating.

  2. సి.యస్ says:

    అసాధారణమైన తాత్త్విక చింతన,
    అనితర సాధ్యమైన జీవన శైలి కలిగిన స్పినోజా జీవితచరిత్ర
    చదువుతూంటే , ఒక ఋషీశ్వరుడిని ప్రత్యక్షంగా దర్శిస్తోన్న
    అనుభవం కలుగుతోంది.
    అంతటి ఉదాత్తమైన జీవితం గడపగలగడం,
    అంతకుమించిన దైవోన్మత్తత కలిగివుండటం మహర్షులకు
    తప్ప మరెవరికీ సాధ్యం కాదు.
    ఇందులోని ఒక్కొక్క అంశాన్నీ ఏదో కథ లాగో, లేదా ఏదో
    ఒక గొప్ప సంఘటన లాగానో చదివి ఊరుకుంటే ప్రయోజనం లేదు.
    వారి జీవితం తాత్త్విక చింతనాన్వేషులకి , సాధనా మార్గంలో
    సాగేవారికి గొప్ప మార్గదర్శకత్వం నిర్దేశించగల విషయాలెన్నో వాటిలో
    ఉన్నాయి.
    తనకి ఇస్తానన్న ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించి ,
    అజ్ఞాతంగా, ఏకాంతంలో అతి నిరాడంబరంగా జీవితం
    గడిపిన స్పినోజా…. ధనార్జన కంటే, అనంత నిరపేక్ష సత్యాన్వేషణే
    ఈ జీవితానికి పరమగమ్యమని చెప్పి, చిట్టచివరిదాకా బతికిన
    ఆదర్శమూర్తి.
    ‘ ఈశావాస్యం’ లో ” మా గృథః కస్యస్విద్ధనమ్ “– ఇతరుల ధనాన్ని
    అశించవద్దు అన్నదాన్ని ఆయన జీవనసూత్రంగా బతికిన మనిషి.
    అలాగే ఈ జగమంతా ఈశ్వరమయం అని కూడా సంభావించాడు.
    సాధకులకు ఇవన్నీ పాఠాలు.
    అలాగే సోదరితో న్యాయపోరాటంలో గెలిచిన తరువాత స్పినోజా
    రాసిన లేఖ …. ఆయనలోని ఔన్నత్యానికి, న్యాయనిష్ఠకీ పరాకాష్ఠ.
    అయితే అలాంటి వ్యక్తిని ఈ లోకం ‘ పరమ పాపాత్ముడ’ని
    సంఘబహిష్కరణ చెయ్యడం సత్యాన్వేషకునికి ఎదురయ్యే పరీక్ష.
    ఆ మహానుభావుడి చరిత్ర మనసునిండా నిండింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *