శారదా సంతతి — 41 : హెన్రి రూసో

ఐంశ్రీశారదాదేవ్యై నమోనమః|
22—04—02018; ఆదిత్యవాసరము|

శ్రీశారదా కారుణ్య గంగోత్రి|

“శారదా సంతతి ~ 41″|

ప్రకృతి మాత ఆకుపచ్చని అనంతశోభని అనవరత వ్రతంగా అర్చించి, ఆరాధించిన ఫ్రెంచి వర్ణచిత్రకారుడు – సాధుహృదయుడు హెన్రి రూసో(1844 – 1910)|

అది 1890వ దశకంలోని మధ్యభాగంగా భావించవచ్చు. ఫ్రాన్సు ముఖ్యపట్టణం, పారిసులోని, పేదలు, కార్మికులు, చిన్నపాటి పనివారు నివసించే మురికివాడ – ఆ ప్రాంతమంతా అలాగేవుంటుంది. ఆ ప్రాంతంలో విన్సెంటు వాంగో, అతడి తమ్ముడు థియో వాంగో ప్రోద్బలంతో ఆ సాయంత్రం ఒక చిత్రకారుడిచ్చేవిందుకి వెడుతున్నాడు. విందుకన్న విన్సెంటుకి ఆ కళాకారుడి చిత్రాలు, అతడి కళా వైశద్యమూ, వైలక్షణ్యమూ కుతూహలపరిచే అంశాలు. థియో, విన్సెంటు అనేక రాత్రులుగా వాదోపవాదాలు చేసుకుంటూన్న ఎడతెరిపిలేని విభిన్న కళాంశాలకి సంబంధించిన రకరకాల అభిప్రాయభేదాలకి ఎన్నోకొన్ని లేక ఎంతోకొంతవరకు, పరిష్కారాలు దొరకవచ్చని అన్నదమ్ముల ఆశ! ఆ కళాకారుడి ఇల్లు దగ్గరయ్యేకొద్దీ, ఆ వీధి అంతా, రకరకాల వంటల వాసనలతోను, మాసిన బట్టలుతికే కంపులతోను, లెట్రిన్ల దుర్గంధాలతోను, వీధుల్లో ఆడుకుంటున్నపేదపిల్లల అరుపులతోను, పెద్దవారి కేకలతోను ముక్కుకి, చెవికి, కంటికి దుర్భరంగా వుంది. ఆ కళాకారుడు అద్దెకివుంటున్న మేడమీదిగదికి, క్రిందవున్న నివాసమంతా శ్రమైకజీవుల కుటుంబాలతో నిండిపోయివుంది. మధ్య-మధ్య రకరకాల చిన్న- చితక దుకాణాలున్నాయి. ఆ ఘోరమైన గోలమధ్యనుంచి, మెట్లమీదుగా, పైకెక్కి, థియో, వెనుక విన్సెంటు, తలుపుదగ్గర ఆగేరు. థియో తలుపు తట్టగానే ఒకాయన తలుపుతీసి, “గుడీవెనింగ్ , థియోగారూ!” అని సాదరంగా, ప్రశాంతమైన దరహాసంతో అన్నదమ్ములిద్దరినీ లోపలికి ఆహ్వానించి కుర్చీలలో ఆసీనులని చేసేడు. థియో, అన్న విన్సెంటుని, ఆయనకి పరిచయం చేసేడు. ఆయన సాదరంగా విన్నెంటుతో కరచాలనంచేసి, “విన్సెంటు వేంగోగారూ! తమరు నా యందు దయతో ఈ విందుకి విచ్చేయడం ఒక గొప్ప కళాకారుడినుంచి మరొక మంచి కళాకారుడు పొందే విశిష్ట గౌరవంగా నేను భావిస్తున్నాను. మీరు చిత్రించిన డచ్ దేశ గ్రామసంస్కృతిని, అక్కడి కూలివారి చిత్రాలని, మీ తమ్ముడు చూపగా నేను చూసేను. అవి సహజవైశిష్ట్యాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని, ఒక విలక్షణ నైసర్గిక గ్రామీణ జన హృదయసౌందర్యాన్ని వెల్లివిరియజేసే కళాఖండాలుగా నేను వాటిని అనేకపర్యాయాలు దర్శించేను. అవి వేసినందుకు మీరు, చూసినందుకు నేను ధన్యులం.” విన్సెంటు ఆశ్చర్యంతోను, ఆనందంతోను నవ్వుతూ, “మీ విలువైన అభిప్రాయాలకి నా హృత్పూర్వక ధన్యవాదాలు. – – –“, అంటూండగానే, థియో, “అన్నా! వీరిగురిం’చే నేను నీకు ఈ మధ్య, తరచుగా చెపుతున్నాను. వీరే హెన్రి రూసో మహోదయులు” అని శిష్టాచారాన్ననుసరించి, పరిచయం చేసేడు.

ఈలోపుగా, క్రిందనుంచి, మహా కోలాహలంగా ఆడ-మగ కంఠాలతో, ఏవేవో అరుపులూ, కూతలూ, వింత-వింత ధ్వనులూ చేసుకుంటూ, సంగీతవాద్యాల చప్పుళ్ళతో, కేరింతలతో జనాలుమెట్లమీద ధన-ధన సవ్వడులతో పైకి రావడం తెలుస్తోంది. వెంటనే రూసో ఒక్కసారిగా వెనక్కితిరిగి గుమ్మందగ్గర నిలబడి “మిత్రమండలికంతటికీ నా హృదయపూర్వక ఘనస్వాగతం. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా హార్దిక కృతజ్ఞతలు – – -” అని ఆయన అంటూ వుండగానే ఆడా-మగా, పిన్నా-పెద్దా అందరూ బిల బిలమంటూవచ్చి, కరచాలనాలు, సాయంకాలపు పలకరింపులూ చేసుకుని కుర్చీలలో కూర్చున్నారు. ఖరీదైన-ౘవకబారు పరిమళద్రవ్యాల కలగాపులగం గుబాళింపులు, క్రిందనుంచి వచ్చే రకరకాల వాసనలతో కలిసిపోయి ఒక వింత గంధం అక్కడంతా అలముకుంది. వచ్చినవారిలో ముఖ్యులని రూసో అందరికీ పరిచయంచేసేడు. ఇంతలో కొందరు ముఖ్యులు, దీని తరవాత మరొక విందుకి వెళ్ళాలనిచెప్పి, దీనిని వీలైనంత తొందరలో ముగించమని రూసోని కోరేరు. వెంటనే రూసో తనచేతిలోకి వయొలిను తీసుకుని తాను కూర్చిన సంగీతరచనని, నలుగురు శిష్యుల వయొలిన్ల సహకారంతో, పియానో వాదనతో, పూర్తిచేసేడు. “ఆహా! అద్భుతం! సంగీత చరిత్రలోనే అపూర్వం! ఇది వినడానికి బాక్ , మొత్సార్ట్ , బీథోవెన్లు బ్రతికిలేకపోవడం వారి దురదృష్టం!” అని ఒకరన్నారు. “అది నిజానికి వారి అదృష్టమేమో!” అని అరుపులు, కేరింతల మధ్య మరొకరు అన్నారు. “అసలు ఇదంతా మన దురదృష్టమేమో మరి, మీరెవరూ ఆలోచించడంలేదు” అని ఇంకొకరంటూంటే అందరూ గొల్లున గగ్గోలుపెట్టేరు. ఇంతలో మరొక ముఖ్య అతిథి, “మీరు ఇటీవల రచించిన పాటకాని, పద్యంకాని పాడుతూ వాయిస్తే, అదివిని ఈ పూటకి తరించి, సెలవుతీసుకుంటాం” అన్నారు. “మీరు కోరిన పని చెయ్యడమే నేను చేయవలసిన అతిథి మర్యాద” అంటూ, రూసో, తాను క్రొత్తగా కూర్చిన పద్యాన్ని పియానోపైన వాయిస్తూ పాడేడు. అది వింటూనే అందరూ ఈలలూ-ఊళలూ వేస్తూ నానా భీభత్సంచేసేరు. ఆ గందరగోళం అలాగ జరుగుతూండగానే, రూసో తన పద్యాన్ని, పియానో వాదనకి అనువుగాపాడి పూర్తి చేసేడు. వెంటనే ౘవకబారు కప్పులలో కాఫీ, బన్ రొట్టెల విందు జరిగింది. ఆ పైన, రూసో వేసిన క్రొత్త వర్ణచిత్రాలని చూపాలని ముఖ్య అతిథులు కోరేరు. రూసో రకరకాల క్రొత్త చిత్తరువులని చూపించేడు. వేళాకోళాలు-వెటకారాలు చేస్తూ వాటి ధరవరల వివరాలు అడిగి కొన్ని బొమ్మలని కొందరు కొని తీసుకెళ్ళేరు. అందరూ వెళ్ళిపోగానే అంతా సద్దు మణిగింది. థియో బయలుదేరడానికి లేచేడు. విన్సెంటు రూసోతో కొంతసేపు గడిపి వస్తానన్నాడు. థియో, రూసోవద్ద సెలవుతీసుకుని వెళ్ళిపోయేడు. విన్సెంటు, తలుపు గడియవేసి తిరిగివచ్చి రూసోని పరీక్షగా గమనిస్తున్నాడు. మనషి పొట్టిగా దృఢంగావున్నాడు. నలుచదరపుతల. సగంనెరిసిన ఒత్తైన జుట్టు. ౘక్కని మీసకట్టు. పొట్టివేళ్ళున్న చేతులు. ప్రశాంతమైన ముఖం. ఎప్పుడూ ముఖమంతానిండుగా అమాయకమైన చిరునవ్వు. కాంతివంతమైన కళ్ళలో స్వాప్నికభావమయ సత్త్వగుణస్ఫూర్తి. ‘ఏమిటీ వింత మనిషి? అంతటి గందరగోళంలోను, అన్ని అపహాస్యాలమధ్య, అంతటి అమర్యాదల నడుమ దేనితోను సంబంధంలేకండా తన ధోరణిలో తనపనిని హాయిగా అలాగ ఎలాగ చేసుకుపోతున్నాడు? ఆ డబ్బులు, చిల్లర నాణేలు కూడా అలాగే లెక్క పెట్టుకుంటున్నాడు. ఇదంతా అలవాటుచేసుకున్న ౘక్కని నటనాకకౌశలమేమో!’, అని అనుకుంటూండగానే రూసో లెక్క పూర్తిచేసుకుని, మళ్ళీ, పూర్వంలాగే హాయిగా పసివాడిగా నవ్వుతూ, “105 ఫ్రాంకులు వచ్చేయి. కొన్నాళ్ళపాటు, మళ్ళీ కాస్తంత ధనవంతుణ్ణే!”అన్నాడు.

“అందరూ వెళ్ళిపోయేరుగా? ఇంకా ఎందుకా ‘అమాయకం నవ్వు ముఖం ముసుగు’? అదింక తీసెయ్యండి. మనం మామూలుగా మాట్లాడుకోవచ్చు” అన్నాడు.

“రండి! మీకు నా కళాఖండాలు చూపిస్తాను” అన్నాడు రూసో అంతే హాయిగానూ, అమాయకంగాను, ముగ్ధమనోహరంగాను నవ్వుతూ.

“అక్కరలేదు. అవన్నీ నేను చూసేసేను. అన్నీ ౘాలాభాగం ఆకుపచ్చని ప్రకృతికి, అరణ్యాలకి సంబంధించిన వర్ణచిత్రాలే! సామాన్యజనజీవనానికి సంబంధించిన చిత్తరువులు అరుదుగా కనిపించేయి. అవన్నీ అమాయకపు పసిపిల్లల మొహాల్లాగ, మనతో మాట్లాడగలిగిన మానవ సంవేదనలున్నవేమో అనిపించే అడవిజంతువులతోను, మన ఆత్మీయమిత్రులేమో అనతగ్గ మహావృక్షాలతోను అన్నింటినీమించి మన నిత్యనిరంతర జీవనయానానికి మూలధాతువువంటి, అనేకమైన చాయలలో మెరిసిపోతున్న కేన్వాసులని తనలో ఇముడ్చుకుందేమో అనిపించే అనంత, అమాయక హరితవర్ణం, అంటే పొంగి పొరలే ఆకుపచ్చదనంతో నన్ను పూర్తిగా ఆకట్టుకున్నాయి. ఐతే, అవన్నీ, చిత్రరచన అంటే ఏమీ తెలియని ఒక అమాయకపు అల్లరి పిల్లవాడు వేసిన బొమ్మల్లాగ అని పిస్తున్నాయి. కాని ఆ బొమ్మలన్నింటిలో నా హృదయాన్నిదోచుకున్న అనిర్వచనీయశోభ ఏదోవుంది. వాటిలో కొన్నింటిని కొని పట్టుకెడుతున్నవారితోసహా అందరూ వాటిని, “పిచ్చి బొమ్మలు” అని, మిమ్మలిని “పిచ్చి చిత్రకారుడు” అని గేలిచేస్తూనే వెళ్ళిపోయేరు. మీ కవిత్వం మీ ఫ్రెంచిభాషలోవున్నందున, నాకేమీ అర్థం కాలేదు. సంగీతం నాకేమీ తెలియదు. మీరు పాటలు, పద్యాలతోపాటు నాటకాలుకూడారాస్తారని, పిల్లలకి సంగీతం, సాహిత్యం, చిత్రరచన, ఫ్రెంచిభాష ౘదవడం, వ్రాయడం నేర్పుతారని, మీకు రాని విద్యలేదని, మీరొక మహామేధావి అనీ చెప్పలేనంత వెటకారంగా వారిలో కొందరు మాట్లాడుతూండడం నేను గమనించేను. చిట్టచివరికి వారంతా మిమ్మల్ని, “పిచ్చివాడు, వెర్రిబాగులవాడు” అని తేల్చేసేరు. వారితో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరో పిచ్చిమాలోకం, కాదంటే, అమాయకచక్రవర్తి!” అని తేల్చేసేడు, విన్సెంటు, నవ్వుతూనే!

“నాకు తెలుసు. కాని మిమ్మల్నికూడా దిహేగ్ నగరవాసులు పిచ్చివాడని అంటారని నేను విన్నాను.ఏది ఏమైనా రాబోయే కాలంలో, లక్జంబర్గు చిత్రప్రదర్శనశాల గోడలని నా కళాఖండాలు కొన్ని తప్పక అలంకరిస్తాయి.” అన్నాడు ముగ్ధమనోహరంగాను, అమాయకంగానూ నవ్వుతూ!

“అవును. మనిద్దరమూ పిచ్చివాళ్ళమే! నా కళాఖండాలుకూడా, పారిస్ మహానగరంలోని, విశ్వవిఖ్యాతమైన “లూవ్ర్ ” చిత్రప్రదర్శనశాలలోని గోడల శోభాగౌరవాన్ని ఇనుమడింపజేస్తాయి” అని అంతే ధీమాతో విన్సెంటుకూడా నవ్వుతూ అన్నాడు.

ఆ ఇద్దరు కళాకారులు హాయిగా బిగ్గరగా నవ్వుకుని, కరచాలనాలుచేసుకుని, పరస్పరం, వీడ్కోలుతీసుకున్నారు.

— — — — — — — — — — — — — — — —

1844వ సంవత్సరంలో మే నెలలో 21వ తేదీన ఫ్రాన్సుదేశం, వాయవ్య భూభాగంలోని ‘లావాల్ ‘ అనేవూరిలో, ఒక పేద కుటుంబంలో హెన్రి రూసో పుట్టేడు. తండ్రి జూలియన్ రూసో అక్కడే ఇనుము సామానుల అంగడిని నడిపేవాడు. కొంతకాలానికి ఆ వ్యాపారం దివాలాతీసింది. హెన్రి తలిదండ్రుల కుటుంబాలలో చిత్రకళకి చిరునామాయేలేదు. హెన్రి ౘదువులో ఏమీ రాణింౘలేదు. చిన్నతనంలో ౘదువుమీద మనసులేని హెన్రి, సంగీతం, కవిత్వం, బొమ్మలు గియ్యడం అంటే ప్రాణం పెట్టేవాడు. 19 ఏళ్ళ ప్రాయంనుంచి జీవితంలో స్థిరపడే ప్రయత్నంలో ఒక చిన్న ఉద్యోగంచేసి, దానిలో చేదు అనుభవాన్ని రుచిచూసి, తగిన గుణపాఠం నేర్చుకుని, ఇంచుమించు, ఐదారేళ్ళపాటు, ఫ్రాన్సుదేశం సైన్యంలో పదాతిదళంలో పనిచేసేడు. 1868లో సైన్యం విడిచిపెట్టి, పారిస్ చేరుకున్నాడు. 1869లో క్లిమెన్స్ ని, పెళ్ళిచేసుకున్నాడు. 1871లో, పారిస్ లోని, కస్టంస్ ప్రభుత్వకార్యాలయంలోచేరి, కస్టంసు ప్రవేశమార్గాలవద్ద ప్రవేశం పన్నులు వసూలు చేసేవాడు. 44 ఏళ్ళవయస్సులో భార్యమరణించింది. 49 ఏళ్ళవయస్సులో కేవలం చిత్రరచన చేసుకోవడానికి, ముందస్తు ఉద్యోగ విరమణ తీసుకుని, స్వల్పమైన ఉద్యోగవిరమణ భృతితోను, చిత్తరువులు అమ్మడంద్వారాను, చిల్లరపనులు చేస్తూను జీవితం కొనసాగించేడు. పుట్టిన పిల్లలు దక్కలేదు. 55 ఏళ్ళ వయస్సులో జోసఫిన్ నౌరీని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. నాలుగేళ్ళతరవాత ఆమె మరణించడంతో మళ్ళీ ఏకాకి ఐపోయేడు.

ఎందరో పురుషులు, స్త్రీలు స్నేహితులమనిచెప్పుకుంటూ, ఆయన అమాయకతని ఆసరాగాతీసుకుని ఆయనని అనేకప్రమాదాలకి గురిచేసి, ఆయన జీవితంతో ఆడుకున్నారు. అరవైమూడేళ్ళవయస్సులో ఆయనని ఒక మోసం కేసులో ఇరికించి, జైలు పాలు చెయ్యబోతే, కోర్టువారు, ఆయన వేసిన అమాయక వర్ణచిత్రాలని చూసి, నిర్దోషిగా భావించి, వారిని విడుదలచేసేరు.

ఒక సందర్భంలో ఆయన ఇష్టపడే ఒక స్త్రీ ఆయనని ప్రేమించినట్లుగా ప్రేమలేఖని సృష్టించి, వారిద్దరి పెళ్ళికి తేదీని, స్థలాన్నికూడా ఖరారుచేసి, ఆ జరగనిపెళ్ళికి వేంచేసిన ‘పెద్దలే’ ఆయనని గేలిచేసి వెళ్ళిపోయేరు. మరొకసారి ఫ్రాన్సుదేశచక్రవర్తి ‘ఆహ్వానం’ సృష్టించి, ఆయనని అవమానించేరు. అవధులెరుగని ఆయన అమాయకత్వం, హద్దులులేని అవమానాల పాలయ్యింది. అరాచకమైన, ఆటవికమైన మానవక్రౌర్యం కోరలతో నిర్మల నిష్కపట మానవ నైజాన్ని అమితంగా హింసించింది. అలౌకిక పూర్ణప్రజ్ఞ, అనుపమాన అమాయకత్వ రూపం ధరించి హెన్రి రూసోగా మానవప్రపంచానికి వ్యక్తమయ్యింది. భౌతికమైన మానవక్రౌర్యరూపమైన శిలువపైన జీసస్ ప్రభువు ఎలాగ భాసిస్తున్నాడో, అదేవిధంగా పరిమితమైన కళాప్రపంచంలో, మానవ వికృతభావరూపమైన శిలువమీద హెన్రి రూసో హింసలపాలయ్యేడని చరిత్ర చెపుతోంది. కాని వారిద్దరూ మహనీయమూర్తులై మనందరిముందు నిలిచిపోయేరు. ఒకరు అమిత కారుణ్యంతోనూ, మరొకరు అనంత అమాయకనైజంతోనూను!

హెన్రి రూసో అరవైఆరు సంవత్సరాలు జీవించేరు. నలభై ఐదు ఏళ్ళ పైన అత్యద్భుతమైన అన్నిరకాల వర్ణచిత్రాలు ౘాలా చిత్రించేరు. ఆయన ఎవరివద్దా ఏమీ నేర్చుకోలేదు. ఆయన చిత్రకళలో అనేక అంశాలున్నా, ప్రధానమైనవి, అద్భుతమైన అనంత హరితవర్ణమయ వృక్షలోక మహావైభవం మొదటిదైతే, అభూతకల్పనాశక్తి చైతన్యం మరొకటి. ఆయనే ఒకసారి, వారి మిత్రుడితో ఇలాగ అన్నారు:

ప్రకృతిని ధ్యానించి, ఆధ్యాన ధ్యాసలో నా అనుభవంలోకివచ్చే ఆ ‘ధ్యాత ప్రకృతి’ ని చిత్తరువుగా వ్యక్తంచెయ్యడంకన్న ఆనందదాయకమైనది ఏదీ నాకు లేదు.నీవు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. నేను, మనదేశం అంతరాంతరాలలోకి పయనించే సమయంలో, ఆ సూర్యుడిని, ఆ ఆకుపచ్చదనాన్ని, ఆ అనంత సుమసంచయాన్ని దర్శిస్తూన్నప్పుడు, ‘ఈ అద్భుతమహాసంపద అంతా నాదే! ఔను నాదే!’అనుకుంటాను” అని సంపూర్ణ తాదాత్మ్యంతో చెప్పేరు. ఆ సందర్భంలో, ఆయన, హరితవర్ణమయ సవికల్ప సమాధి భావంలోకి వెళ్ళిపోయేవారు.

William Wordsworth, తన “Lines Composed A Few Miles Above Tintern Abbey – – – – -” లో, తన సవికల్ప సమాధి అనుభవాన్ని పొందుపరిచిన ఈ దిగువ పద్యభాగంలోని భావానికి, హెన్రి రూసోగారి అనుభవం కొంత సన్నిహితంగావుంటుంది.

“- – – – – – – – – And I have felt
A presence that disturbs me with the joy
Of elevated thoughts; a sense sublime
Of something far more deeply interfused,
Whose dwelling is the light of setting suns,
And the round ocean and the living air,
And the blue sky, and in the mind of man;
A motion and a spirit, that impels
All thinking things, all objects of all thought,
And rolls through all things. Therefore am I still
A lover of the meadows and the woods,
And mountains; – – – – – – – – – – – “

హెన్రి రూసోకి 64 ఏళ్ళ వయస్సుండగా, ఆయనని చిత్రకారునిగా గౌరవిస్తూ, ఆధునిక చిత్రకళాప్రపంచంలో దైవంగా భావించబడే పికాసో, ఆయనకి విందునిచ్చి సభాముఖంగా సమ్మానించడంజరిగింది. ఆ సభలో పాలు పంచుకున్న Weber, Braque, Vlamick మొదలైన కళాకారులు ఆయనని మతిమాలినవాడుకాడని, ఆనాటి కళాకారులందరిలో ఆయనే most original కళాకారులలో ఒకరని కొనియాడేరు.

02—09—1910వ తేదీన ఆయన మరణించేరు. పారిస్ లోని నిరుపేదల సమాధులమధ్య వారి భౌతిక కాయం ఖననం చెయ్యబడింది.

శారదా పుత్రుడైన ఆ నిరంతర చిత్రకళాతపస్వికి ఘననివాళిగా దండవత్ , ప్రణామం సమర్పించుకుందాం.

స్వస్తి||

You may also like...

8 Responses

  1. వ.వెం.కృష్ణరావు says:

    హెన్రి రూసో ఉపయోగించినన్ని ఆకుపచ్చ రంగులోని
    వేరు-వేరు చాయలని మరే ఇతర చిత్రకిరుడూ వినియోగించలేదని చిత్రకళాశాస్త్రవిమర్శకుల అభిప్రాయం.
    ఒకరి అంౘనా ప్రకారం ఆయన సుమారు రెండువందల
    రకాల చాయలున్న భిన్న-విభిన్న హరితవర్ణ శోభని
    హెన్రి రూసో తన ప్రాకృతికవనవైభవాన్ని ఉద్దీపింపజేసే
    కళాఖండాలలో పొందుపరిచేరని అంటారు.

    • వ.వెం.కృష్ణరావు says:

      రెండవ లైను చివరలో, “చిత్రకారుడు” అని సవరించి ౘదువుకోవాలి. స్ఖాలిత్యానికి మన్నించాలి.

  2. Dr nishanth says:

    Apt word to describe him is NATURAL. It is as if nature itself took a human form to demonstrate its own traits. Sublimity in thought, beauty in expression, inherent innocence and total selflessness in action. A pratahsmaraneeyaKoti Koti Pranams to HM for bringing into this imperfect world, such a perfect man and to you for painting a vibrant and lively And intensely inspiring picture with your words.

    • V.V.Krishna Rao says:

      U brought out,in pithy and perfect diction, the quintessence of the defining and definitive message of
      the sage-like life of Sri Henri Rousseau, the chosen
      innocent and incorruptible child of H.M. Henri is unmistakably the precise embodiment that demonstrates how a person of spirituality is supposed
      to conduct one’s own self in this unnecessarily annoying and wantonly hurting or humiliating human world
      with abominable and aimless cruelty. In spite of Ur
      very tight and tough daily demanding schedule, both professionally and domestically alike,U could find some time not only to read the article but also to share a few of Ur profound observations for the benefit of the members of our cultural fraternity. Kudos to U, Dr.Nisant!

  3. Dr nishanth says:

    On this bhanu sapthami day we are blessed with the darshan of a man in whose hand colors resided

  4. సి.యస్ says:

    భగవంతుడిలోనూ , పసిపిల్లలలోనూ మాత్రమే చూడగలిగిన
    నిష్కాపట్యము, నైర్మల్యము, అంతటి స్వచ్ఛమైన అంతరంగము
    హెన్రీ రూసో లో కనిపించింది. పరిపూర్ణమైన కళాకారుడు
    కనకనే, ఈ లౌకిక విలువలకి అతీతంగా, రాగద్వేష
    రహితుడై అంత ద్వంద్వాతీతంగా జీవించగలిగాడు.
    ” రాగద్వేషాలతో సతమతమయ్యే జీవితం కళాత్మకాత్మను పొందలేదు”
    అని చిన్నప్పుడు నీ దగ్గర చదివిన గుర్తు. అది ఇన్నాళ్ళకి సోదాహరణ
    పూర్వకంగా అర్థమైంది.
    చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రూసో చేసిన నిష్కల్మషమైన స్నేహం ,
    వాళ్ళు ఇతన్ని ఆటపట్టిస్తూన్నా పట్టించుకోని ఒక అమాయకత్వం…
    అలాగే వేంగోతో జరిపిన సంభాషణ — అతని గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుతున్నాయి.
    ఇంతవరకూ నేను చదివిన మహా మనీషుల జీవన చిత్రాల్లో, వేళ్ళమీద
    లెక్కబెట్టవలసిన వాటిల్లో వీరిది కూడా ఒకటి. పరిచయం చేసిన నీకు
    ధన్యవాదాలు.

  5. Devi says:

    This episode on the French renowned artist and painter Henry Rousseau is very interesting and heart touching in many aspects. His life full of hardships and trials, his innocence exploited by people and many other negative factors didn’t stop him from being a world class artist. It’s interesting that He used almost 200 different shades of green in his paintings which gives us a picture of a unique nature artist . May we all pay respects to this EVERGREEN wonderful atist of all times.

  6. వ.వెం.కృష్ణరావు says:

    హెన్రి రూసో చేసే విందులకి పిలిచిన అతిథులవెంట పిలవని అతిథులుకూడా వచ్చేవారు. అంతేకాదు. వారు
    ఉంటున్న మురికివాడలోని నిరుపేద పిల్లలుకూడా చొరవగా వచ్చేసేవారు. అందరికి ఒకే ఆదరభావంతో
    ఆయన విందునిచ్చేవారు. ఆకలిబాధ తెలిసిన ఆత్మీయ
    మనస్వి ఆయన. హ్యూమన్ డిగ్నిటీ నిరపేక్ష ఔన్నత్యం
    తెలిసినవారు ఆయన. అన్నింటినీమించి శ్రీశారదాదత్త
    అమృత హృదయమూర్తి ఆయన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *