సాహిత్యము-సౌహిత్యము – 50 : రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?

శ్రీశారదాదేవ్యై నమోనమః|

21—04—2018;  శనివారము|

శ్రీశారదా దయా చంద్రికా|

“సాహిత్యము—సౌహిత్యము~50″|

ఈ వారంకూడా ఛందస్సుకి సంబంధించిన సాంకేతికాంశం ‘సమస్య’లో చేర్చబడింది. ముందు సమస్యని పరిశీలిద్దాం!

“రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?”|

“రాక్షసులని నిర్మూలిస్తున్న దశరథకుమారుడైన రాముడిని విశేషంగా కీర్తించడం తగిన పనేనా?” అని ఈ సమస్యకి అర్థం.

ఈ సమస్య ఉత్పలమాలవృత్తపాదం. అంతా బాగానేవుంది కాని, పద్యపాదంలో యతిమైత్రికి భంగం కలిగింది. దీనిలో ఇమిడ్చిన సాంకేతిక సమస్య కూడా ఇదే! అందువలన సమస్యాపూరణం చేస్తూనే, ఈ దోషాన్ని తొలగించి యతిమైత్రిని కూర్చాలి. ఇప్పుడు పద్యపూరణాన్ని చూద్దాం!

“ఏమి విభీషణా! దనుజులేమయినన్ మరి నీకు చింత లే

దా? మన చెల్లెలిన్ చెరచినాతని పెండ్లము తెచ్చినాడ, త

ప్పా? మనుజుండు గొప్ప? పలు పల్కులు మానుము, సిగ్గులేని త

ద్రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటొప్పునే?”||

పద్యభావాన్ని పరిచయం చేసుకుందాం!

“ఏమయ్యా, విభీషణా! నీకు మన జాతివారైన రాక్షసులకి ఎంతటి హాని కలిగినా ఏమీ బాధలేదా? మన ఇంటి ఆడపడుచు శూర్పణఖ ముక్కు-చెవులు కోసి ఆమె అందౘందాలన్నీ పాడుచేసినవాడి భార్యని నేను తీసుకువచ్చేను. అతడు చేసినది తప్పుకాదుకాని, నేను చేసినదే తప్పా? మానవుడే గొప్పా? రాక్షసుడు అధముడా? ౘాలా మాటలు అంటున్నావు. అది విరమించుకో!  అసహాయ ఐన మన చెల్లెలికి హానిచెయ్యడానికి అతడికి సిగ్గు-సంకోచము లేవు. రాక్షసలోకానికి కీడుచేసే అటువంటి దశరథపుత్త్రుడైన రాముడిని కీర్తించడం తగిన పనేనా? చెప్పు, విభీషణా!”

రామాయణంలోని ఈ ఘట్టానికి సంబంధించిన కథ మనకి సుపరిచితమైనదే! సీతాదేవిని చెరపట్టడం తప్పని, రామచంద్రుడు సకలసుగుణాభిరాముడని, ధర్మస్వరూపుడని, ఆయన భార్యని సగౌరవంగా ఆయనకి అప్పగించడమే న్యాయమని, విభీషణుడు, అన్నగారైన రావణాసురుడికి కర్తవ్యబోధచేసిన సందర్భంలో, రావణుడు, విభీషణునితో అన్నమాటలని కవిగారు ఈ సమస్యా పూరణపద్యంగా మనముందువుంచేరు.

శ్రీ సి.వి.సుబ్బన్నశతావధానిగారిశతావధాన ప్రబంధం – ద్వితీయఖండం“లో ఈ పద్యం ఉదహరించబడింది.

తెలుగులో ‘ఆ రాముడు‘ అనడానికి, సంస్కృతంలో, “తత్ + రాముడు =  తద్రాముడు” అని అంటాం! అప్పుడు పద్యపాదం మొదట్లోవున్న “ద్రా” కి, 10వ అక్షరం, ‘దాశరథిన్ ‘ అనే మాటలోని  “దా” కి యతిమైత్రి కుదిరింది. ఆ విధంగా పద్యపూరణసమస్య, యతిమైత్రికూర్పు సమస్య – రెండూకూడాౘక్కగా పరిష్కరించబడ్డాయి.

స్వస్తి||

You may also like...

8 Responses

  1. వ.వెం.కృష్ణరావు says:

    రాముని, పూర్ణసత్త్వగుణ రాజితమౌనిజనోత్తమోల్లసత్ |

    శ్రీమహనీయ హృన్నిలయ చిన్మయచారుదయాస్వభావునిన్ |

    భూమిసతామనోరము, ప్రపూర్వగు వీడుచు, ఉగ్రయోద్ధ, త

    ద్రాముని, రాక్షసాంతకుని, దాశరథిన్ వినుతించుటొప్పునే||

    • వ.వెం.కృష్ణరావు says:

      సవరణ:—
      మూడవ పాదంలో “భూమిసుతా” అని సవరించుకుని
      ౘదువుకోవాలి. తప్పుకి మన్నించండి.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    యతిమైత్రి లేని దుస్సం
    గతి నన్వయ మెసగ యుక్తిగా నించిన స
    న్మతులగు మీ ఇరువురి సం
    భృతి వంద్యము వక్కలంక వెంకటకృష్ణా!

  3. సి.యస్ says:

    ఈ వారం అందించిన పద్యం బాగానే ఉంది. సమస్యా పూరణం చేసిన
    కవిగారి పేరు తెలియలేదు. తెలుగు పౌరాణిక నాటకాలలోని పాత్రలు
    చదివే పద్యాల తీరుని తలపించింది — ముఖ్యంగా సంబోధన చేస్తూ
    సంభాషిస్తూన్నట్టుండడం వల్ల.
    ఇక అదే సమస్యని తీసుకుని, శ్రీరాముని సుగుణాలను వర్ణిస్తూ
    నువ్వు పూరణ చేసిన పద్యం–రమ్యమైన పదాల కూర్పుతోనూ,
    చక్కని నడకతోనూ కమనీయంగా ఉంది.

    • వ.వెం.కృష్ణరావు says:

      అసలు పద్యపూరణం, శ్రీ సి,వి.సుబ్బన్నశతావధానిగారిది.
      “వర్జనదోషం”(error of omission) క్షంతవ్యం.

  4. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    నీమము ధర్మమున్ మనకు నేర్పగ డిందె నుదాహృతమ్ముగా
    భూమిని పూరుషోత్తముడు, పూజలనందగకాదు; సద్గుణ
    ప్రేములు తత్పథమ్మున చరించుట మానుకు ధర్మమూర్తిమ
    ద్రాముని రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించుటప్పునే?

    • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

      చివరి పదం ‘టొప్పునే” అని చదవగలరు. అచ్చు ‘టప్పు’ కి మన్నించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *