శారదా సంతతి — 33 : స్వర సామ్రాజ్య మహారాజ్ఞి ~ ‘సుర్ శ్రీ’ కేసర్ బాయి కేర్కర్

శ్రీశారదా వాత్సల్య జ్యోత్స్న :—
25—02—2018; ఆదిత్యవారము.

“శారదా సంతతి~33” ~ “స్వర సామ్రాజ్య మహారాజ్ఞి ~ ‘సుర్ శ్రీ’ కేసర్ బాయి కేర్కర్ “| (1892 — 1977)

అది 1920, డిసెంబరునెల. బొంబాయి మహానగరంలో, పేరుప్రఖ్యాతులున్న, సంపన్నుడైన సేఠ్ విఠ్ఠలదాస్ ద్వారకాదాస్ నివాసభవనం. ఎప్పటిలాగే ఇల్లంతా కలకలలాడుతూ, పనివారల పర్యవేక్షణలో, మంచి సందడిగావుంది. భవనంముందు ఆగిన వాహనంలోనుంచి విలువైన మంచి దుస్తులలోవున్న ఒక ఆజానుబాహువు, మహాతేజస్వి ఐన వ్యక్తి దిగి భవనంవైపుకివస్తూండగా, వాహనంలోని ఆయనపెట్టెని, యితరసామగ్రిని భవనపరిచారకుడు వారివెనకేవుండి లోపలికి తెస్తున్నాడు. ఆరడుగులపైన ఎత్తు, సుసౌష్ఠవమైన శరీరం, బంగారపు మిసిమి చాయతో మెరిసిపోతున్న దేహకాంతి, మహనీయ వ్యక్తిత్వాన్ని సూచించే స్ఫుటమైన ముఖకవళికలు, గుండ్రని నల్ల ఫ్రేమున్న కళ్ళద్దాలవెనుక విశాలమూ, తీక్ష్ణమూ అయిన తేటైనకళ్ళు, పట్టుదలని ప్రకటించే అందమైనముక్కు, పెద్ద చెవులు మొదలైన లక్షణాలతో, చూడగానే ఎదుటివారిలో అపారగౌరవాన్ని కలిగించే స్ఫురద్రూపంతో ఆయన భవన ప్రవేశ ప్రాంగణంలోంచి నడిచి వస్తూంటే ఏ గంధర్వుడో దివినుంచి భువికి దిగివస్తున్నాడేమో అనిపించేలాగ వారు ఉన్నారు. వారు లోపల హాలులోకి ప్రవేశిస్తూండగానే ద్వారకాదాసు ఎదురువచ్చి,  ఒక్కసారిగా వారిని ఆలింగనంచేసుకుని, “ఇలాచేస్తేనేకాని మీరు వెంటనే బయలుదేరిరారని ఆ టెలిగ్రాం పింపించినందుకు, మీరు నన్ను తప్పక మన్నింౘాలి,ఖాన్సాహబ్ ” అన్నారు. ఆయన తన కోపాన్ని ఏమాత్రమూ దాచుకోకుండా, “ఇదేమిపని ద్వారకాదాస్జీ! ఎంత గాఢస్నేహమైనా ఇవేమి అనుచితమైన పనులు? దేనికైనా ఒక మర్యాదవుండదా? నేను ఇక్కడికిచేరి మిమ్మల్ని కళ్ళతో స్వయంగాచూసేవరకూ ఎంత ఆందోళనపడ్డానోతెలుసా? అరవై ఐదేళ్ళు పైబడ్డ పెద్దవాడిననైనా ఆలోచించలేదేమీరు! ఇటువంటి చిలిపితనం పెద్దమనిషితరహాకి భంగమైనదేకాదు; ఒకొక్కసారి ప్రమాదింౘవచ్చు కూడాను” అని కంఠంలో తీవ్రతని ధ్వనింపచేస్తూ అన్నారు. “మీరు ౘాలా శ్రమపడి నామీద ఎంతో ప్రేమతోవచ్చేరు. ఈ పూటకి మీరు మీరెప్పుడూ బసచేసేగదిలో స్నానాదికాలుముగించుకుని విశ్రాంతితీసుకోండి. నేను చేసిన ఈ పని ౘాలా పొరబాటే! కాని వెన్నవంటి ఖాన్సాహబ్ మనసు నేనుచేసిన ఎన్నోతప్పులని ఇంతకిముందు మన్నించింది. ఈ చివరి తప్పును కూడా మన్నిస్తుంది” అంటూ ద్వారకాదాసుగారు నమస్కరించేరు.ఆయన ఏమీ మారుమాట్లాడకుండా తాము బసచేసేగదిలోకి వెళ్ళిపోయేరు. ‘అమ్మయ్య! ఒకగండంగడిచింది దేవుడా! ఇంక ఎలాగో ఒకలాగ సాయంత్రం, చౌపట్టీలో ఈవినింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు, తాను అనుకున్నమాటకి ఆయనని ఒప్పించేస్తే పూర్తిగా ముంబయి మహాలక్ష్మి దయ తనమీద ప్రసరించినట్లే’! అని సేఠ్ ద్వారకాదాస్ మనసులో అనుకున్నారు.

ఊరినుంచివచ్చిన ఆ పెద్దాయనపేరు, ఉస్తాద్ ఖాన్ సాహెబ్ అల్లాదియాఖాన్ . ఖాన్జీ, దాస్జీ ౘాలాకాలంగా బాగా సన్నిహితులైన మిత్రులు. ఖాన్జీ ఎవరిమాటనైనా లక్ష్యపెట్టడం ౘాలా అరుదు. కాని, దాస్జీ మాటనిమాత్రం కాదనడం అంతకన్నా అరుదైన విషయం అనిచెప్పవలసిందే! అందువల్లనే ఈ విచిత్రమైన సమస్య వచ్చిపడింది. దాస్జీకి కేసరిబాయి కేర్కర్ అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకి పాతికేళ్ళుదాటిపోయేయి. సుమారు గత ఇరవై సంవత్సరాలుగా అనేకగురువులవద్ద ఉత్తరభారతశాస్త్రీయ సంగీతంలో గాత్రసంగీతవిద్యని నేర్చుకుంటోందికాని, ఆ అభ్యాసానికి అతి-గతి, దారి-తెన్ను దరిదాపులలో కనిపించడంలేదు. అంత అత్యద్భుతమైన గాత్రమాధుర్యం, అలాగ మూడు సప్తకాల(three octaves)లోను సహజసిద్ధంగానే సంచరించగలిగిన సామర్థ్యం, రాగభావాలకి వన్నెలుకూర్చే సౌలభ్యం, స్వరరంజకత్వానికి వెన్నెలల విలాసాన్ని అద్దగలిగిన సౌకుమార్యం, సాహిత్యపదభావలాలిత్యానికి హరివిల్లులోని అన్నిరంగులని అవసరమైనమేరకి అలంకరించగలిగిన సౌహృద్యం మొదలైన అనేక సద్గుణాలెన్నోవున్న కేసర్బాయికి సరయిన గొప్ప గురువు లభించి, అటువంటి గురువుయొక్క సృజనాత్మక పర్యవేక్షణలో, ఆమె సక్రమమైన నిరంతర ఏకోన్ముఖసాధన(singularly focussed and disciplined practice)ని చేయగలిగితే, ఈ లోకానికి సంగీతరంగంలో ఒక మహనీయ శారదాతనయ సంప్రాప్తమైనట్లే! ఐతే, ఆ అమ్మాయి ఇంక సంగీతవిద్యని కొనసాగించాలంటే, కేవలం ఉస్తాద్ అల్లాదియాఖాన్జీ వద్దతప్ప అన్యులెవ్వరివద్ద నేర్చుకోనని భీష్మించుకుని కూర్చుంది. ఎలాగైనా ఆ ముచ్చటని తీర్చాలని ద్వారకాదాస్జీ కంకణం కట్టుకున్నారు. ఎందువల్లంటే, కేసర్బాయి జీవితానికి ప్రాణభూతమైన సంగీతవిద్యారాధనకి సంబంధించిన నిరంతర సాధనలోని ఒడిదుడుకులన్నీ దాస్జీకి పూర్తిగాతెలుసు. అంతకిముందు కేసర్బాయి దాస్జీద్వారానేకాక, ఇంకా ౘాలామంది పెద్దవారిద్వారాకూడా ఖాన్జీకి ఎన్నివిధాల కబుర్లుపంపి ప్రయత్నించినా ఖాన్జీ కనికరించలేదు. కారణం తెలియదుకాని, ఆమెని శిష్యురాలిగా స్వీకరించడానికి ఆయన అంగీకరించడంలేదు.ఎలాగైనా ఆయనకి ఏదోవిధంగా నచ్చజెప్పి ఆయన ఒప్పుకునేలాగ చెయ్యడమే దాస్జీ కర్తవ్యం. దాస్జీ, తన దైనిక కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించుకుంటూనే, ఈ విషయాలన్నింటిగురించి తనలోతాను తర్జనభర్జనలు పడుతుండగానే, ఆ రోజు సాయంత్రం కావస్తోంది. ఖాన్జీ, దాస్జీ సాయంకాల ఫలాహారమూ, అల్పాహారమూ ముగించి, టీ సేవించి సాయంకాలపు నడకకి బయటకి బయలుదేరేరు. దగ్గరలోని సువిశాల ఉద్యానవనంలోకి ప్రవేశించి, జనసమ్మర్దంలేనిచోట నడుస్తున్నారు.
ఆ మాటా – ఈ మాటా ఐనతరవాత వారి సంభాషణ ఇలాగ కొనసాగింది.

ఖాన్జీ :— అన్ని విషయాలూ బాగానేవున్నాయి. ఇంతకీ ఇంతటి నాటకానికి మీరు ఎందుకు పూనుకున్నట్టూ?

దాస్జీ :— ౘల్లకివచ్చి ముంతని దాచిపెట్టగలనా ఖాన్ సాహెబ్ ?

ఖాన్జీ :— ౘల్లకి మీరు రాలేదు దాస్జీ! నన్ను రప్పించుకునిమరీ మీరు ౘల్లగా ౘల్లని అడగబోతున్నారు. అది ఇక్కడ వచ్చిన అసలు చిక్కు! మీ మధురమైన స్నేహం నన్ను కట్టిపడవేసినమాట నిజమే! అందువల్ల మీ పనికోసం, మీరు  నా దగ్గరకివచ్చినా, నేను మీ వద్దకివచ్చినా ఒకటే! మీరు అనారోగ్యకారణం కాకుండా మరేమి వ్రాసినా నేను వచ్చివుండేవాడినికాదు! అదీ నిజమే! ఎందుకంటే మరి నా సందేహం నాకు వుంటుందికదా?

దాస్జీ :— ఖాన్ సాహబ్ ! మీతో స్నేహం అంటే అల్లాః కృప. మీ మిత్ర ప్రేమ నా అదృష్టం! ఐతే నేను చెప్పబోయేవిషయంలో, అల్లాః అపార కరుణవుంది అని నా నమ్మకం. మీరుకూడా పెద్దమనస్సుచేసుకుని దయదలిస్తే సంగీత రసజ్ఞ లోకానికి శాశ్వత సుకృతం సిద్ధిస్తుంది. మీరు అంగీకరిస్తే, నా మనసులోని కోరికని మీకు విన్నవిస్తాను. నాయందు దయతో మీరు నా మాటని కాదనకూడదు. ఈ విషయంలో మీరు ఏమి అడిగినా నేను కాదనను. అంతే కాదు. ఇకముందు మీకు ఇటువంటి ఇబ్బందిని ఏమాత్రమూ కలిగింౘను.

ఖాన్జీ :— అంటే మీరు మళ్ళీ ఆ కేసర్బాయి విషయం ప్రస్తావిస్తారన్నమాట! ఆ కేసర్బాయికి ఇంక లోకంలో వేరే గురువులే లేరా? నన్ను, మిమ్మల్నీ ఎందుకింత ఇబ్బందిపెడుతోంది? ఇంతకిముందు కలకత్తాకి చెందిన నా ఆప్తమిత్రులు, సేఠ్ దునీచంద్ గారిద్వారాను, ఇంకా ఎంతోమంది పెద్దల ద్వారాను ఆమె నన్ను ఒప్పించడానికి విశ్వప్రయత్నం చేసింది. నేను అణువంతైనా కూడా బెసగలేదు. మీరుకూడా ఇంతకిముందు ఈ విషయం నా దగ్గర ప్రస్తావించేరు. నేను ఖరాఖండీగా నాకు వీలుపడదు అని మీకూ చెప్పేసేను కదా! మళ్ళీ మీరు ఆ విషయంకోసమే ఐతే నన్ను ఇలాగ ఇబ్బందిపెట్టడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి దాస్జీ?

దాస్జీ :— మీ మాటలనిబట్టి నేను రెండు విషయాలకి మీకు సంజాయిషీ ఇవ్వాలి. మొదటిది, లోకంలో ఎందరో గురువులుండగా, కేస్రీబాయి మిమ్మల్నే గురువుగా ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్నకి నాసమాధానం యిది. వాల్మీకి మహర్షి “గగనం గగనాకారం, సాగరః సాగరోపమః” అన్నాడు. ఆకాశంతో పోల్చదగిన అటువంటి మరొక వస్తువు సృష్టిమొత్తంమీద మరొకటి లేనేలేదు. అలాగే సముద్రమూను! వాటికి అవే సాటి. అలాగే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ ని ఒకేఒక్కడిని అల్లాః సృష్టించేడు. పరమేశ్వరుడు పరమలుబ్ధుడు. ఆయన మీవంటి సమాన ప్రతిభావంతుడిని మాత్రమేకాదు, మీ ప్రతిభలో కనీసం సగమైనావున్నవాడినికూడా సృజించనేలేదు. అలాగ జరిగివుంటే కేస్రీబాయిని మీ జోలికి రాకుండా ఏదోవిధంగా ఒప్పించగలిగేవాడినేమో! ఇంక రెండోవిషయానికి సంజాయిషీ ఇవ్వాలంటే, ముందు మీరు నా సందేహాన్ని తీర్చాలి. వయస్సులో మనకన్న ౘాలా చిన్నదైన ఆ అమ్మాయి పట్టుదల సరే! మనం పెద్దవాళ్ళంకదా? అలా పట్టుదలకిపోవడం తప్పనిచెపుతూనే మనం అంతకిమించి పట్టుదలగావుండడం సమంజసమా? పైగా మీరు ఈ విషయంలో ఎందుకింత గట్టిపట్టుదలతోవున్నారో నాకుతెలియడంలేదు. ఇలాంటి మీ పట్టుదలకి కారణం నేను తెలుసుకోవచ్చా, ఖాన్ సాహెబ్ ?

ఖాన్జీ :— నిరభ్యంతరంగా చెపుతాను దాస్జీ. ఎనిమిదేళ్ళక్రితం, ఆమె నావద్ద మూడునెలలపాటు నేర్చుకుంది. ఆమెకి నా సంగీతంలో ఒక్కస్వరం ఒంటబడితే ఒట్టు! హే అల్లాః! ఏమికంఠం అది? ఏవిధంగాచూసినా నా సంగీతానికి సరిపడదు. పైగా నేను సరయిన గురువునికాదనికూడా ఆమె అందరితోనూ అంటోందిటకదా!

దాస్జీ :— మళ్ళా మీ అభ్యంతరంలో రెండు విషయాలని మీరు ప్రస్తావించేరు. వాటికి నేను సరయిన సమాధానం చెప్పాలి. మొదట ఆమె కంఠంయొక్క సంగీతసామర్థ్యంగురించి మీకుచెపుతున్నాను. ఇప్పుడు మీరు ఆమె కంఠధ్వనిని వింటే అబ్బురపడడమేకాక ముచ్చట పడతారుకూడాను. మీరు చెప్పిన వయస్సులో కంఠం ఏ సంగీతానికైనా పూర్తిగా తయారవ్వదు. అంతేకాక దేహదృఢత్వంకూడా తగినంత ఉండని వయస్సుకనుక గాత్రగాంభీర్యంకూడా పూర్తిగా స్థిరపడదు. రెండవవిషయానికివస్తే, మన ఈ సంగీతప్రపంచం మీకూకొత్తకాదు, నాకూ తెలియనిదికాదు. ఈర్ష్యతోను, అసూయతోను అంతా కలుషితమైపోయి ఉంది. ప్రచారంలోవున్న ఆ మాటలే నిజమైతే కేసర్బాయి తనకి మీరుతప్ప మరొక గురువు ఎవ్వరూ వద్దు అనేటంత దృఢదీక్షతోవుంటుందా? మీరే చెపుతున్నారు, ఈ మధ్యకాలంలో, నా ద్వారామాత్రమేకాక, ౘాలామంది హేమాహేమీలద్వారాకూడా మీరు తనని శిష్యురాలిగా అంగీకరించవలసినదిగా మిమ్మల్ని అభ్యర్థిస్తోందని! అటువంటి అమ్మాయి మీ గురించి అంత తక్కువగా భావించడంకాని, అంత చులకనగా మాట్లాడడంకాని అసంభవంకదా? ఏది ఏమైనా మీరు నా మాటని కాదంటే, మన స్నేహమనే అమృతపాత్రలోమీ తిరస్కారమనే విషబిందువుని విదిలించినట్టే! ఇంతకన్న నేనేమీ ఈ విషయంలో చెప్పదలుచుకోలేదు. మిగిలినది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను.

ఖాన్జీ :— వ్యక్తిగతంగా మీకు ఈ విషయం అంత ముఖ్యమని మీరు అంటూంటే నేను చెప్పగలిగేది ఏమీలేదు. మీ సంతోషమే నాకు ప్రధానం. అనేకసంవత్సరాల మన మిత్రబంధానికి నావలన కళంకం రాకూడదు. అందుకని తప్పక నేను ఆమెను మీకోసం శిష్యురాలిగా స్వీకరిస్తాను. ఐతే అలా జరగాలంటే నేను కొన్ని షరతులు పెడుతున్నాను. ఆమె వాటికి కట్టుబడివుంటానంటేనే, నేను అంటున్న ఈ ఒడంబడిక చెల్లుతుంది.

దాస్జీ :— ఇదంతా నాయందు అల్లాః అపార కృపా కటాక్షం! కేసర్బాయియందు మీ అమిత శిష్యవాత్సల్యంకూడాను. ఆమె జీవితం పైనుంచి ఈశ్వరానుగ్రహంవల్ల, ఇక్కడ మీ విద్యాప్రదాన ఆశీర్వచనంవలన, పూర్ణ ఫలవంతం కాబోతోంది. మీ షరతులు చెప్పండి. ఇక్కడ జనమెవ్వరూలేరుకనక, ఈ సిమెంటుచీడీమీద కూర్చుందాం. నేను నా పోకెట్ డైరీలో వ్రాసుకుంటాను.

ఖాన్జీ :— ఐతే వ్రాసుకోండి.
1) నేను కోరిన దక్షిణని ఇచ్చి, ఆమె నా “గండా బంధన్ ” శిష్యురాలుగా ఉండాలి.
2) నెలవారీవేతనం నేను చెప్పిన విధంగా ఇవ్వాలి.
3) పది సంవత్సరాలపాటు నిరాఘాటంగా, ఏకాగ్రదీక్షతో శిక్షణని పొందాలి.
4) నా పనులమీదకాని, అనారోగ్యకారణంగాకాని ఊరువెళ్ళవలసివస్తే, నా వేతనం పూర్తిగా ఇవ్వాలి. ఏమీ తగ్గించకూడదు.
5) నా ఆరోగ్యానికి బొంబాయివాతావరణం సరిపడకపోతే, నేను వైద్యచికిత్స కోసం వేరే ప్రాంతాలకి దీర్ఘకాలం వెళ్ళవలసిరావచ్చు. అటువంటి సందర్భాలలో కేసర్బాయి నాతోబాటువచ్చి తన సంగీతవిద్యాభ్యాసాన్ని కొనసాగించవలసి వస్తుంది.

దాస్జీ :— అన్నీ యథాతథంగా వ్రాసుకున్నాను. కేసర్బాయికి చెప్పి మీకు, ఆమె అంగీకారాన్ని తెలియజేస్తాను.

ఖాన్జీ :— ఆ అమ్మాయి ఈ కఠిననియమాలన్నింటినీ ఒప్పుకుంటుందని మీ ఉద్దేశ్యమన్నమాట!

దాస్జీ :— ఇలాంటి కఠిననియమాలద్వారా ఆమె దృఢదీక్షని నీరుకార్చేలాగ చెయ్యడమే మీ లక్ష్యమైతే, నా ఉద్దేశ్యం అదే!

ఇద్దరూ ౘాలా గట్టిగా నవ్వుకున్నారు.

మొత్తంమీద కేసర్బాయి సంగీతవిద్యాసాధన కొనసాగడానికి, ఇంతటి నాటకీయ సంఘటనలు సంభవించేయి అని చరిత్ర చెపుతోంది. అసలు మౌలికవిషయాలు తెలుసుకుందాం! 1892, ఆగస్టు, 13న, కేరి(గోవా)లో కేసర్బాయి సంపన్నకుటుంబంలో పుట్టింది. చిన్నప్పటినుంచి ౘక్కని కంఠంతో పాటలు పాడగలిగేది. ఐదవ ఏట దేవుడి భజనలు, కీర్తనలు ఊరి దేవాలయ పూజారులవద్ద నేర్చుకుంది. ఆ తరవాత, ఆమెకి ఎనిమిదేళ్ళవయస్సులో, వారికుటుంబం
కొల్హాపుర్ వెళ్ళింది. అక్కడ ఆమె కుటుంబసభ్యులు కేసరీబాయికి సంగీతం నేర్పించాలని నిర్ణయించుకున్నారు.అప్పుడు, ఆ ఊరిలోవున్న ప్రఖ్యాత కిరానాఘరానా గాయకులు, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాcసాహెబ్ వద్ద ఉత్తరభారత శాస్త్రీయసంగీతంలో శిక్షణ అంటే “తాలీం” కోసం ఆమెని చేర్పించేరు. ఒక ఏడాదిలోపుకే ఆ శిక్షణ నిలిచిపోయింది. ఆమె కుటుంబం గోవాకి తిరిగిరావలసివచ్చింది. ఆ తరవాత ఏడెనిమిది ఏళ్ళపాటు, ఒక క్రమమూ, కాలనిబద్ధతాలేకండా, పండిత రామకృష్ణబువా వఝే వద్ద కొంత సంగీత శిక్షణ జరిగింది. ఆమెకి పదహారేళ్ళవయస్సు దాటేసరికి, వారికుటుంబం బొంబాయిచేరింది. అక్కడ ప్రముఖ సితార్ వాద్యవిద్వాంసుడు బర్ఖతుల్లాఖాcసాహబ్ వద్ద కొంతకాలం విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తరవాత సుమారు ఐదునెలలపాటు పండిత భాస్కరబువా బాఖ్లే వద్ద శిక్షణ జరిగింది. భాస్కరబువా పూణేకి మకాం మార్చేయడంవలన అది అర్థాంతరంగా ఆగిపోయింది. 28 సంవత్సరాల పరిణత వయస్సులో కేసరీబాయి ఖాcసాహెబ్ అల్లాదియాఖాcసాహెబ్ వద్ద శిష్యురాలిగా దీక్షని స్వీకరించి 26 సంవత్సరాలు అంటే, 1920 నుంచి 1946లో ఖాన్జీ మరణపర్యంతమూ వారికి శిష్యురాలిగా ఏకైక దీక్షలోవుండిపోయింది. ఆ ఇరవై ఆరు సంవత్సరాలూ, రోజుకి, సుమారు ఎనిమిది నుంచి పదిగంటలు, నిత్య తపస్సువంటి అమోఘ అభ్యాసంచేసి, గురువుగారి ఆశీస్సులతో, సంగీతశారదాదేవి అతులిత అనుగ్రహాన్ని సంపాదించి మహాస్వరసామ్రాజ్ఞిగా చరిత్రపుటలని పునీతమొనర్చింది.

అట్రౌలీ – జయపూర్ “, లేక, “జయపూర్ – అట్రౌలీ“, లేక, “జయపూర్ “, లేక, “అల్లాదియా గాయకీ” గా పిలవబడే ఈ “ఘరానా” ౘాలా విశిష్టమూ, విలక్షణమూ ఐనది. ఈ పద్ధతిలో స్వర-లయలకి, రాగ-తాళాలకి కూర్చబడే మధురమైన సంగీతబద్ధ సంవిధానం(intricate melodic structuring of the atomic components of time-cycle with the musical phrases of the raga) ఇతర పద్ధతి “ఘరానా”లలో లభించదు.

సుర్ శ్రీ” కేసర్బాయి కేర్కర్ కంఠంలో మధురంగా పలకని సంగీతకణలేశం ఏదీలేదు. ఆమె పూర్ణగాత్రం(full-throated round voice), త్రిస్థాయీ సంచారసౌలభ్యం కలిగిన గాత్రదీప్తికి, శ్రోతృపర్వమైన రాగభావస్ఫూర్తికి, తాళగతి బద్ధమైన కాలప్రమాణమూర్తికి, అటువంటి ఎన్నో గొప్ప సంగీతలక్షణాలకి నిత్యనివాసస్థానం. వారు రెండు దశాబ్దాలకాలంలో దేశవ్యాప్తంగా లెక్కకి మిక్కుటమైన సంగీతప్రియులకి ఎనలేని ఆనందం కలిగించేరు. వారి గానం “యూ-ట్యూబు”లో వినవచ్చు.

“బిహాగడా”, “నంద్ “, “మారుబేహాగ్ “, “బసంతీకేదార్ “, “బిభాస్ “, “లలిత్ “, “తోడి”, “దేశి”, “ముల్తానీ”, “దుర్గ”, “లలిత గౌరి”, “మాల్కౌcస్ “ మొదలైన అనేక రాగాలు ఆమె కంఠంలో కొత్త సొగసులు దిద్దుకున్నాయి.

శ్రీమతి ధోందూతాయి కులకర్ణి ఆమె ప్రధాన శిష్యురాలు.

ఆమెని అనేక బిరుదులు వరించేయి. “ఆలిండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ – కలకత్తా” వారు, ఆమెకి “సుర్ శ్రీ” అనే బిరుదు ఇచ్చేరు. 1959లో భారతప్రభుత్వంవారు, “పద్మభూషణ్ ” బిరుదుతో ఆమెని సమ్మానించేరు. 1969లో మహారాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన గాయకురాలిగా గౌరవంపొందేరు.

“నేను ఏడు దశాబ్దాలు పరమాత్మ ప్రసన్నం అవ్వడంకోసం సంగీతం పాడుకున్నాను. ఆ గానం విని సాటి మానవులుకూడా సంతోషించివుంటే, నా జీవితం రెండింతలు ధన్యమైనట్లు నేను భావిస్తాను” అని కేసరిబాయి ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

విశ్వకవి రవీంద్రులు, 1938లో, కేసరబాయి ప్రత్యేక సంగీతగోష్ఠిలో ఆమె గానంవిని, తన దినచర్యపుస్తకంలో ఇలాగ వ్రాసుకున్నారుట:— “మంత్రముగ్ధమైన ఆమె గాత్రం వాగతీత మధురస్వర ప్రకంపనల వైవిధ్యంతో, బుద్ధిజన్య యాంత్రిక స్వర-లయల ప్రయోగవైదుష్యంలో కాక, జన్మసిద్ధ కళాభినివేశ దివ్యదీప్తివిభవంలో అతిశయించివుంది“.

1977వ సంవత్సరం, సెప్టెంబర్ , 16వ తేదీన ఆమె, తమ పార్థివదేహం విడిచి, సంగీతశారదలో ఐక్యం అయ్యేరు.

ఆ మహాగాయనికి నతమస్తకులమై నమస్కరిద్దాం!

స్వస్తి||

You may also like...

1 Response

  1. సి. యస్ says:

    శ్రీమతి “కేసరిబాయి కేర్కర్ “లో ముచ్చటైన అంశాలు
    ఉన్నాయి. ఆమె గొప్ప సంగీత విదుషీమణిగా ఎలా తీర్చి
    దిద్దబడింది అనే అంశంతో పాటు ద్వారకా దాస్ , అల్లాదియాఖాన్ల
    మధ్యనున్న హద్దులు లేని అవ్యాజ స్నేహ సంబంధాలు
    అద్భుతంగా ఆవిష్కరింపబడ్డాయి. ఖాన్జీని రప్పించడం కోసం/
    ఒప్పించడం కోసం దాస్ పన్నిన యుక్తి లాంటిది ఏదో కథల్లో
    చూస్తాం తప్పితే, ఇలా నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యమే.

    వర్ధమాన దశలో ఉన్న ఒక కళాకారిణి లోని తపనని నిండు
    మనసుతో అర్థం చేసుకుని, ఆమెను ఎలాగైనా ఖాన్జీ శిష్యురాలిగా
    చేద్దామనుకున్న దాస్ జీ లాంటి వాళ్ళని, అలాగే దాస్ జీ తపనను
    అర్థంచేసుకుని, తనకిష్టంలేకపోయినా కేసరిబాయిని శిష్యురాలిగా
    ఒప్పుకున్న ఖాన్ జీ లాంటి పెద్దమనుషుల్ని మళ్ళీ చూడగలమా?
    ఇక కేసరిబాయి ఏకంగా ఇరవై ఆరు సంవత్సరాలు అంత దీక్షగా
    ఖాన్ వద్ద శిష్యరికం చేసి, ‘ పద్మ భూషణ్ ‘ పురస్కార విజేత
    కాగలిగింది అంటే…వారు ఎంతటి గురుశిష్యులు!
    మానవతా విలువలు, కళాత్మక విలువలు కలగలిసిన కమ్మనైన
    వ్యాసం….ఈ ” సుర్ శ్రీ కేసరిబాయి కేర్కర్.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *