శారదా సంతతి — 29 : ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా ఖాన్ సాహెబ్
ఐంశ్రీశారదాదేవ్యైనమః :—
శ్రీశారదా కరుణా కౌముదీ :—
28—01—2018; ఆదిత్యవాసరము.
“శారదా సంతతి—29″| తబలా వాద్య అనితరసాధ్య కలాతపస్సిద్ధుడు— ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా ఖాన్ సాహెబ్ (1878—1976).
ఒకసారి, ఇరవయ్యవ శతాబ్ది, ప్రథమార్థ పూర్వభాగంలో అని గుర్తు, లక్నో మహానగరంలో, ఎం.ఏ., ౘదువుకున్న పాతికేళ్ళ తబలా వాద్య యువ వీరాభిమాని, ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ యొక్క తబలా వాద్యసభని ఏర్పాటుచేసేడు. అప్పటికి, ఉస్తాద్జీ వయస్సు, సుమారుగా, 45—50 సంవత్సరాలువుండి వుంటుంది. అప్పటికే తబలావాద్యకళలో విశ్వవిఖ్యాతిని సముపార్జించిన ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ , మహా ప్రతిభావంతమైన తన తబలా “సోలో” వాదననైపుణ్యంతో సభాసదులని మైమరిపించేసేరు.
ఆ సభని ఏర్పాటుచేసిన రసికజన సంఘంవారితరఫున ఆ యువాభిమాని, ఉస్తాద్జీకి, పాదాభివందనంచేసి, పారితోషికంవున్న కవరుని వారి చేతులలోపెట్టి, సంఘంవారి రసీదుపైన సంతకం పెట్టడానికి, తిరఖ్వాసాహబ్ కి, కలం అందింౘబోయేడట!
ఉస్తాద్జీ, సంతకంచెయ్యడానికి తాను ౘదువుకోలేదని, వేలిముద్ర వేస్తానని, చెప్పేరుట! వెంటనేయువాభిమాని, ఎంతో నొచ్చుకుంటూ, “అదేమిటి, ఉస్తాద్జీ? ౘదువుకోలేదా? కనీస ప్రాథమిక పాఠశాల విద్యనైనా అభ్యసింౘాలికదా? ఈ కాలంలో ౘదువు లేకపోతే, మనసమాజంలో, లోకువగాచూస్తారు, ఉస్తాద్జీ! సంతకం పెట్టడమైనా నేర్చుకోవలిసింది. మీరు ఏమీ అనుకోకపోతే, నేనే మీ ఇంటికివచ్చి నేర్పుతాను”అని ౘనువుగా అనేసేడుట! వెనువెంటనే, ఉస్తాద్జీ నవ్వేసేరు. ఆ తరవాత, వారిద్దరిమధ్య జరిగిన సంభాషణ ఇలాగ నడిచింది:—
ఉస్తాద్జీ : నాయనా! నీవు బాగా ౘదువుకున్నట్టున్నావు. ఎంత వరకు ౘదువుకున్నావు?
యువకుడు : (కొంచెం అతిశయంతో) ఎం.ఏ., ౘదివేను, ఉస్తాద్జీ!
ఉస్తాద్జీ : (కంఠంలో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, అమాయత్వాన్ని వ్యక్తంచేస్తూ) అంటే, నాకు తెలియక అంటున్నాను, అది ౘాలా పెద్ద ౘదువేనేమో?
యువ : ఉస్తాద్జీ! పెద్దచదువేమిటి? దానికిమించి అసలు చదువేమీలేదు. పాఠశాలలు అన్నింటిలోనూ, విశ్వవిద్యాలయం, పెద్దదీ, గొప్పదీను! అలాగే, విశ్వవిద్యాలయంలో పెద్ద ౘదువు, ఎం.ఏ., అన్నమాట!
ఉస్తాద్జీ : అలాగైతే, ఈ లక్నో నగరంలో ఈ ౘదువు ౘదివినవాళ్ళు ఎంతమంది ఉంటారంటావు?
యువ : ౘలా తక్కువమందేవుంటారు, ఉస్తాద్జీ! మనం, వ్రేళ్ళమీదే లెక్కించవచ్చు!
ఉస్తాద్జీ : మరి మన దేశం మొత్తంమీద ఈ ౘదువు వచ్చినవారు, ఒక వంద మందైనావుంటారా?
యువ : వందమందేమిటి ఉస్తాద్జీ? వేల సంఖ్యలోనేవుంటారు.
ఉస్తాద్జీ : మరి మొత్తం ప్రపంచంలో ఎంతమందివరకు వుండవచ్చు?
యువ : అలాగ లెక్కపెట్టలేము, ఉస్తాద్జీ! లోకం మొత్తంమీద లక్షలలోనే ఉంటారు.
ఉస్తాద్జీ : మరైతే, ప్రపంచం మొత్తంమీద అహ్మద్ జాన్ తిరఖ్వాలు ఎందరు వుంటారంటావు?
యువ : అయ్యబాబోయ్ ! ఉస్తాద్జీ! నాకెంత బాగా బుద్ధి చెప్పేరు? లోకంలో ఇంతకిముందుకాని, ఇప్పుడుకాని, ఇకమీదటకాని మరొక అహ్మద్ జాన్ తిరఖ్వా లేనూలేరు; ఉండనూవుండరు! ఈ ౘదువుతో వచ్చిన నా ఘోర అవివేకానికి మనస్ఫూర్తిగా మన్నించండి.
ఉస్తాద్జీ : వినయంతో వచ్చేదే విద్య నాయనా! కళాకారులమైన మేమంతా అల్లాః విశ్వవిద్యాలయంలో ౘదువుకుంటున్నవాళ్ళం. చివరి శ్వాస వరకూ మా విద్య కొనసాగుతూనేవుంటుంది. మీకులాగ మా విద్యా సముపార్జన మేము జీవించివుండగానే ఐపోదు. ఆ లోకానికి వెళ్ళేక, అల్లాః మాకు స్వయంగా పట్టాప్రదానం చేస్తారు. అందువల్ల, ఆఖరి ఊపిరివరకు అల్లాః అనుగ్రహంకోసం మా సాధన కొనసాగుతూనే వుంటుంది. మా ఈ సాధనాకళయొక్క రసానుభవాన్ని పొందడానికి అల్లాః, మీవంటివారికి, రసహృదయాన్ని ప్రసాదించేరు. ఇదంతా మనందరికీ అల్లాః అనుగ్రహంవలన సంప్రాప్తించింది.
అని రసీదుమీద వేలిముద్రవేసి వెనకకి ఇచ్చివేసేరుట!
ఈ విషయం ఎన్నో దశాబ్దాలవెనుక ఏదో ఆంగ్లదినపత్రికలో ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ ని గురించిన ఒక ప్రత్యేకవ్యాసంలో చదివి గుర్తు.
“తిరఖ్వా” అన్నది వారి అసలుపేరుకాదు. “తిరఖ్నా” అంటే నాట్యపరిభాషలో, ముఖ్యంగా, “కథక్ ” సంప్రదాయనృత్యంలో, “పాదాభినయం“లో చేయబడే సుకుమారమైన కళాత్మక శాస్త్రీయ పదచాలన పాటవాన్ని ప్రదర్శించడం అని అర్థం. అంతటి అపురూపమైన, సుతారమైన కౌశలంతో చేతి వ్రేళ్ళని ఉపయోగిస్తూ తబలానివాయించే సందర్భాన్నికూడా అలాగ అనవచ్చు. అటువంటి ఒక సందర్భంలో మాత్రమే కాకండా ఎల్లప్పుడూ తబలాని అలాగ వాయించగల సమగ్ర సామర్థ్యం కలిగిన “తబలానవాజ్ “, “Tabla-wizard“, మొత్తం తబలా వాదన వైదుష్య చరిత్రలో ఒకేఒక్కడువున్నాడు. ఆయన పేరే “ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా ఖాన్ సాహబ్ “! ఈ “తిరఖ్వా” అనేది ఎవరోఒకరు, వారి ఘనతని గుర్తించి యిచ్చిన బిరుదుకాదు. వారు, తమ బాల్యంలో, మీరట్ నగరంలో, తబలావిద్యలో పండితుడు, మహాకళాకారుడు అయిన ఉస్తాద్ మునీర్ ఖాన్ సాహబ్ గారివద్ద “షాగిర్దీ” అంటే “శుశ్రూష” చేసేసమయంలో, ఆచార్యులవారి తండ్రిగారైన జనాబ్ కాలే ఖాc గారు, బాల అహ్మద్ జాన్ ని, ప్రతిదినమూ, “రియాజ్ “లో గమనించి, తబలాని వాయించే అతడి రెండుచేతుల వ్రేళ్ళ సున్నితమైన, సహజమైన అలవోక కదలికల అపూర్వ లాస్య కౌశలానికి ముగ్ధుడైపోయి, ఆ ఆనందాతిరేకస్థితిలో అన్నమాట, “తిరఖ్వా లేక తిరక్వా” అన్నది అల్లాః సంకల్పమై, వారిజన్మాంతం వరకు ఆయనకి లోకప్రియ ఉపనామంగా ప్రసిద్ధికెక్కింది.
ఆయన 1878లో,మురాదాబాదులో, సంగీతకళాకారుల వంశంలో జన్మించేరు. వారి తండ్రిగారు హుస్సేన్ బక్స్ సారంగీవాద్య కళాకారుడు. ఆయన, తన కుమారుడికి, అహ్మద్ జాన్ అని పేరు పెట్టేరు. ౘాలాచిన్న వయస్సులోనే ఉస్తాద్ మిఠ్ఠూఖాc వద్ద గాత్రసంగీతంలో అహ్మద్ జాన్ మొదటి పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించేరు. అది ఎంతోకాలం కొనసాగలేదు. తరవాత తండ్రి వద్ద సారంగీవాద్యవిద్యని కొంతకాలం నేర్చుకున్నారు. అదికూడా బాగా జరగలేదు. ఇలాగ కొంతకాలం గడిచేక, వారు, ఉస్తాద్ మునీర్ ఖాc గారి తబలా వాదనం వినడం సంభవించింది. అంతే! వారికి, తాను ఎందుకు పుట్టేడో తేటతెల్లమైపోయింది. (ఉన్ కో సమఝ్ గయా కి “మేరా రూహ్ తబ్లా బజానే కీ ఫన్ మేc రహీ“-He discovered that his soul lies in the art of tabla-playing). ఆ తరవాత, ఆయన తమ దగ్గర బంధువులైన షేర్ ఖాc, ఫైయాజ్ ఖాc, బస్వా ఖాc ల వద్ద తబలావిద్యలో ప్రాథమిక శిక్షణని పొందేరు. సుమారు 12 సంవత్సరాల వయస్సులో, వారు మీరట్ నగరానికి చెందిన ప్రఖ్యాత తబలా వాద్యకళాకారులైన ఉస్తాద్ మునీర్ ఖాc వద్ద శిష్యరికం ప్రారంభించి, రోజూ, సుమారు 16 గంటల అభ్యాసం చేసేవారు. రోజుకి, సుమారుగా ఆరుగంటలనిద్ర లభించేది. మిగిలినరెండుగంటలు కాలకృత్యాలకి, భోజనం-అల్పాహారం-గురుసేవ-రోజూ కసరత్తు మొదలైనవాటికి సరిపెట్టుకోవలసిందే! మంచి పోషకవిలువలు కలిగిన ఆహారంతినాలి. విధిగా దేహదృఢత్వంకోసం ఒక్కరోజూవిడవకండా గట్టి కసరత్తు వుండేది.
అహ్మద్ జాన్ పెంపకం, సంరక్షణ, వారి అన్నగారు మియాc జాన్ ఖాcగారి పర్యవేక్షణలో జరిగింది. తమ్ముడికి తబలావిద్యని నేర్పించడంలోను, అతడికి అవసరమైన మంచి పోషకవిలువలు కలిగిన ఖరీదైన ఆహార-క్షీర-బలవర్ధక పదార్థాలని ప్రేమానురాగాలతో ఏర్పాటుచేయడంలోను అన్నగారు అమిత ఆసక్తి, శ్రద్ధ కలిగివుండేవారు. ఇందువల్ల, 98 సంవత్సరాల పూర్ణ ఫలవంతమైన వారి జీవితంలో, వారు ఏ సమస్యలులేని నిండైన ఆరోగ్యము, ౘక్కని శరీర దార్ఢ్యము చిట్టచివరివరకు కలిగివున్నారు.
వారి నిరంతర గాఢ విద్యాసక్తి, శ్రద్ధ గురువుగారైన ఉస్తాద్ మునీర్ ఖాc గారి మనసుని అనతికాలంలోనే దోచుకున్నాయి. ఆయనకివున్న అనేకశిష్యజనులలో, అహ్మద్ జాన్ని గురూజీ ఎప్పుడూ ప్రత్యేక వాత్సల్యంతోను, అభిమానంతోను చూసేవారు. ఐతే వారి ఇతరశిష్యవరిష్ఠులుకూడా లోకంలో, తరవాత కాలంలో, వివిధప్రాంతాలలో, వివిధస్థాయిలలో స్థిరపడి, వారి గురూజీయొక్క, తబలా వాద్యసంప్రదాయమైన ఉస్తాద్ మునీర్ ఖాc ఘరానా కీర్తి-ప్రతిష్ఠలని, దేశం నలుమూలలా ఇనుమడింపజేసేరు.
1. మునీర్ ఖాc సాహబ్ శిష్యపరంపర, తిరఖ్వా సాహబ్ తోబాటు, ఉస్తాద్ అమీర్ హుస్సేన్ (మునీర్జీ యొక్క సన్నిహితబంధువు), గులాం హుస్సేన్ , షంసుద్దీన్ , పి.నాగేశ్కర్ , శ్రీపాద్ నాగేశ్కర్ , నిఖిల్ ఘోష్ , గులాం రసూల్, మొదలైనవారితో కొనసాగి, పేరుపొందింది.
2.ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ యొక్క శిష్యపరంపర, లాల్జీ గోఖలే(ఆకాశవాణి-బొంబాయి); ప్రేంవల్లభ్ & గులాం అహ్మద్ (ఆకాశవాణి-దిల్లీ); ఛోటే గోఖ్లే (ఆకాశవాణి-పూణే); నిఖిల్ ఘోష్ (గురుభాయి & శిష్యుడు, బొంబాయి); లక్నోకిచెందిన అహ్మద్ అలీ, రాంకుమార్ శర్మ మొదలైనవారిద్వారా లోకప్రశస్తి పొందింది.
1894లో, అంటే, అహ్మద్జీకి 16 సంవత్సరాల వయస్సువున్నప్పుడు, వారు, బొంబాయిలోని, ఖేత్బాడీలో ఒక పెద్ద సంగీతశాస్త్రసమావేశంలో మొదటిసారి రంగస్థలప్రవేశం చేసేరు. ఆ సందర్భంలో వారు, తమ తబలా “సోలో” వాద్యం కచేరీని ప్రదర్శించేరు. వారి పరమాద్భుతవాదనప్రతిభకి మహాముగ్ధులైపోయినశ్రోతలు, తమ నిరవధిక కరతాళధ్వనులతో, సభయందులేచినిలబడి, సామూహిక సంమాన భావాన్ని (standing ovation), ప్రదర్శించేరు.
వారు, ఆ చిన్న వయస్సులోనే, అప్పటికే మహారాష్ట్రలో పేరు-ప్రఖ్యాతులు పొందిన “బాలగంధర్వ” నాటకసమాజంలో సభ్యులై, పూణే, బొంబాయి, కోల్హాపురం వంటి అనేక స్థానాలలో బహుజన ప్రేమాదరాలని చూరగొన్నారు. సంగీత, నాటక, చలనచిత్ర రంగాలలో అపార యశస్సు సముపార్జించిన మహారాష్ట్రగానకళాచక్రవర్తి, బాలగంధర్వగారితోను, మరాఠీనాటకరంగంతోను, మహారాష్ట్ర రసజ్ఞులతోను నాలుగు దశాబ్దాల ఉస్తాద్జీ జీవితం పెనవేసుకుపోయి, వారిని బొంబాయినగర సభ్యుడిగా చేసింది.
వారి 58 ఏళ్ళ వయస్సులో, అంటే, 1936లో, వారు “రాంపూర్ ” నవాబ్జీ సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడ్డారు. ఆ తరవాత, 30 సంవత్సరాలు, వారు ఆ పదవిలో కొనసాగేరు.
రాజసంస్థానాలు రద్దు ఐనతరవాత, వారు, లక్నోలోని “పండిత భాత్ఖండే సంగీత కళాశాల“లో, తబలావిద్యాశాఖకి అధిపతిగాను, అధ్యాపకులుగాను పనిచేసేరు. ఉద్యోగవిరమణానంతరంకూడా, అదే కళాశాలలో, “ప్రొఫెసర్ – ఎమెరిటస్ “గా విధులని నిర్వహించేరు. రాంపూర్ ఆస్థాన విద్వాంసులుగాను, కళాశాలాధ్యాపకులుగాను, పదవులు నిర్వహిస్తున్న సమయంలో, వారు, “ఆకాశవాణి-లక్నో“లో ప్రసారకులు(broadcaster)గా శ్రోతలకి చిరపరిచితులు. ఇలావుంటూనే, వారు, దేశవ్యాప్తంగా జరిగే సంగీత సభలు-సమావేశాలు, ఆకాశవాణి సంగీతసభలు, సంగీతసమ్మేళనాలు, మెహఫిల్ గోష్ఠులు, “స్వారీ“లు, ఇలాగ లెక్కకి మిక్కుటమైన సంగీతకార్యక్రమాలలో నిత్యమూ తలమునకలై వుండేవారు.
మరపురాని వారి అత్యద్భుతమైన, చిట్టచివరి తబలావాద్య మహాసంగీత సభ, 1974లోని, రేడియో సంగీత సమ్మేళనంలో, జరిగింది. సంగీతరసికమహోదయులందరికి ఆ సభ పదిలంగా హృదయమందిరంలో ఎప్పటికీ నెలవైవుండిపోయివుంటుంది. అప్పటికి, ఉస్తాద్జీ వయస్సు 96 సంవత్సరాలు. కాని, 16 ఏళ్ళ నవయౌవనంలో, తబలా ముఖతలంపైన వారి చేతివ్రేళ్ళు, ఎంత సులలితంగాను, సుమధురంగాను లాస్యంచేసేయో, అదే రీతిసౌందర్యంతో 96 సంవత్సరాల వయస్సులోకూడా మృదునర్తనం చేసేయి. అటువంటి తబలావాద్య వాదనకళ, “న భూతో, న భవిష్యతి“!
అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ , తమ తబలా వాద్యసహకారం అందించని ఆయనకి ముందుకాలానికిచెందిన, ఆయన సమకాలీనులైన, ఆయన తరవాత యువతరంవారైన వివిధ శాస్త్రీయరంగ మహాకళాకారులెవ్వరూ లేరు. అల్లా బందేఖాc, రజబల్లీ ఖాc, అల్లాదియా ఖాc, వహీద్ ఖాc, ఫైయాజ్ ఖాc, భాస్కరబువా బాఖ్లే, అల్లావుద్దీన్ ఖాc, ముష్తాక్ హుస్సేన్ ఖాc, హఫీజ్ ఆలీ ఖాc, బిస్మిల్లా ఖాc, ఆలీ అక్బర్ ఖాc, బేగం అఖ్తర్ మొదలైనవారు, వారిలో కొందరు.
తబలా వాద్య బాణీలు అనేకంవున్నాయి. “దిల్లీ“, “పూరబ్ “, “ఫరుక్కాబాదీ“, “అజ్రదా” మొదలైన బాణీలన్నింటిలోనూ, ఉస్తాద్జీకి సమాన నైపుణ్యంవుండేది. ఐతే, వారికి, దిల్లీ, ఫరుక్కాబాదీ బాణీలంటే ప్రత్యేకమైన ప్రీతి వుండేది.
వారు సహకారం అందించిన గాయకులందరిలోను, వారికి నచ్చిన గాయకులు ఎవరని అడిగితే, తడుముకోకుండా వారు ముగ్గురు కళాకారుల పేర్లు చెప్పేరు. ఉస్తాద్ ఫైయాజ్ ఖాc, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాc, అబ్దుల్లా ఖాc, ముగ్గురూ, సంగీతంలో, తాళానికి, లయకి అధికప్రాధాన్యాన్ని ఇచ్చే”ఆగ్రా ఘరానా” సంప్రదాయానికి చెందినవారే! ఆగ్రా ఘరానా కళాకారులకి తాళంపైనవుండే ప్రభుత్వప్రకర్ష అంతటి అద్భుతమైనది.
ఉస్తాద్జీకి గల మరొక వైశిష్ట్యం యిక్కడ చెప్పుకోవాలి. 19వ శతాబ్దికి చెందిన ప్రసిద్ధ ఉస్తాద్ ఇందద్ ఖాc గారినుంచి, వారి కుటుంబంలో, నాలుగవ తరానికి చెందిన 1950 దశకంలో పేరుపొందిన ఉస్తాద్ రయిస్ ఖాc వరకు, వరసగా నాలుగుతరాల సితార్ వాద్య కళాకారులకి, తబలా సహకారం అందించిన ఏకైక ప్రశస్తి ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా గారికే చెందుతుంది.
13, జనవరి, 1976; మంగళవారం, ఉదయం, ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్జీ లక్నోనుంచి, బొంబాయి వెళ్ళడానికి, “బొంబాయి మెయిలు”కోసం, రిక్షాలో ప్రయాణమయ్యారు. కాని విధి నిర్ణయంవేరుగావుంది. విధి, రిక్షాలోవున్నఆయనని, భువినుంచి దివికి ఎగరవేసుకుని తీసుకువెళ్ళిపోయి, వారి పార్థివదేహాన్ని వారి స్మారక చిహ్నంగా, ఇక్కడ నిర్జీవంగా విడిచి పెట్టేసింది.
భారతదేశ ప్రభుత్వంవారు, ఉస్తాద్జీని “పద్మ భూషణ“బిరుదు ప్రదానంతో సత్కరించేరు.
శ్రీ జి. ఎన్ . జోషీగారు, వారి మనోహరగ్రంథం, “డౌన్ మెలొడీ లేన్ “లో ఒక ఉత్తమమైన ఉదంతాన్ని మనవంటి రసజ్ఞులకోసం భద్రపరిచేరు. వారు బొంబాయిలోని H.M.V. సంస్థలో ఉన్నతోద్యోగం నిర్వహిస్తున్నారు. తిరఖ్వాసాహబ్ , బడేగులాం సాహబ్ – ఇద్దరు సెలిబ్రిటీలు, బొంబాయిలో ఆయనకి తెలిసినవారింటిలో విడిదిచేసివున్నారనివిని, వారిద్దరికోసం మధ్యాహ్నం వేళలో వెళ్ళేరుట. ఆతిథ్యం యిచ్చినవారి అనుమతితో, లోపలికివెళ్ళి, అతిథికళాకారుల గదిలోకి వెళ్ళేసరికి, వారిద్దరు, వారి-వారిమంచాలమీద గాఢనిద్రలోవున్నారుట! జోషీజీ ఉచితాసనంలోకూర్చుని, విశ్రాంతిని తీసుకుంటున్న మహానుభావులిద్దరినీ, మౌనంగా పరికించేరట! గాఢనిద్రలో రెండుచేతులూ తన ఉదరభాగంలో పెట్టుకుని, తిరఖ్వాసాహబ్ ఒళ్ళుతెలియని నిద్రలోవున్నారట! కాని, ఆశ్చర్యకరంగా వారి రెండుచేతుల వ్రేళ్ళు తబలా వాయిస్తున్నట్లుగా పూర్ణలయాత్మకంగా కదులుతున్నాయిట. బడేగులాం ఆలీ సాహబ్ వైపు చూస్తే, ఆయన వారి స్వప్నంలో బహుశః “యాద్ పియాకి ఆయే” అనే ఠుమ్రీ పాడుతున్నారేమోనని జోషీజీకి అనిపించిందిట! ఆ పాటకి అనుగుణమైన తాళాన్ని, లయని వాయిస్తూన్నట్లు తిరఖ్వాజీ వ్రేళ్ళు లాస్యంచేస్తున్నాయిట! అటువంటి రసపూర్ణకళాకారులయొక్క “నిద్రా సమాధి స్థితిః” కదా! అటువంటి నిద్రలో వుండే “మెలకువ”స్థితిని మహాకళారాధకులైన జోషీజీ, తాము స్వయంగా దర్శించడమేకాక, మనవంటి రసపిపాసువులకోసం గ్రంథస్థం చేసేరు.
H.M.V. వారు ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వాసాహబ్ వాయించిన తబలా “సోలో” రికార్డింగులలో తీన్ తాల్ , ధమార్ – ఏక్ తాల్ , రూపక్ తాల్ మొదలైన అంశాలువున్నాయి. “యూ ట్యూబ్ “లో కూడా కొన్ని ౘక్కని తాళవాద్య అంశాలు ఉన్నాయి. అవి ౘాలా అద్భుతంగావుంటాయి.
అటువంటి తబలా వాద్యకళా పుంభావసరస్వతికి మన హార్ద నమస్సులు అర్పించుకుందాం!
స్వస్తి ||
Thank you very much bava garu for today’s post. I am going to download from YouTube right now
అల్లా నామానికి అల్లాహ్ అనకండా, అల్లాః అని విసర్గ పెట్టడం చాలా బావుంది. మాషా అల్లాః!
సం స్కత భాషలో “అల్లాః” అణ్టే, “అమ్మ” అని అర్థం . అన్దువల్ల
“అల్లాః ” అం టే జగన్మాతృ భావన కలుగుతున్ది నాకు.
నేను జన్మతః శాక్తేయుడిని.
ధన్యోసి! పుట్టిన ప్రతీ జీవీ (జంతువూ) కూడా “మైకే లాల్” లే. అంచేత అల్లాః అన్నా “జన్మాద్యస్య యతః” అన్నా ఒకటే అయింది కదా మరి ఆ లెక్కన. సబ్ “అల్లాః” కే బందే.
సమీచీనముదితం వచః |
ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా ఖాన్ సాహెబ్ గురించి
రాసిన anecdotes అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
వారు అంతటి అపూర్వ సాధన చేసినవారు కనకనే,
సామాన్యుడికి ఒక సాధారణ వాయిద్య పరికరం అనిపించే
తబలా…ఆయన వేళ్ళు తగిలేసరికి రసఝరులు కురిపించింది.
ఎంతమంది ఉస్తాద్జీలు ! వారివారి రంగాలలో ఒక్కొక్కరికీ ఎంత
ప్రావీణ్యత!
కాల యవనిక వాళ్ళందర్నీ కప్పేస్తే, నువ్వు ఆ యవనికని కాస్త
పక్కకి తప్పించి, ఇదిగో చూడండి…. తెలుసుకోండి… ఆనందించండి
అని మాలాంటి వాళ్ళందరికీ వారి కళా స్వరూపాన్ని కళ్ళముందు
నిలిపి, వారి రసమయ జీవిత మాధుర్యాన్ని రమణీయంగా
ఆవిష్కరిస్తున్నావు.
వారి శిష్య పరంపర గురించి కూడా తెలియచేయవలసింది.
మునీర్ ఖాన్జీ, తిరఖ్వాజీల శిష్యపరమ్పరలు రెణ్డిటిని
కలిసిపోయినవాటిని, దేనికిదానిని విడదీసి చూపిఞ్చడము
జరిగిన్ది. సన్దర్భసున్దరమయిన సలహాకి ధన్యవాదము.
Those who are interested can watch a “Documentary” on Ahmad Jan Tirakhwa sahab
in the “you tube”.
Thank U.