శారదా సంతతి — 28 : శ్రీ జగన్నాథబువా పురోహిత్

శ్రీశారదా కారుణ్య కౌముదీ :—

“శారదా సంతతి — 28” |

21—01—2018; ఆదిత్యవారము.

ఆగ్రా ఘరానా గానవైదుష్యవిశిష్టులలోని, ఆచార్య వరిష్ఠులలో ఏకైక ఉత్తమ వాగ్గేయకారులు, ఆదర్శ అధ్యాపకులు, గాన ఋషి, శ్రీ జగన్నాథబువా పురోహిత్ (1904—1968) ||

ఆగ్రా ఘరానా అనగానే, మనకి, మొట్టమొదట మదిలో మెదిలే మహాగాయకుడు, ఉస్తాద్ ఫైయాజ్ ఖాc సాహెబ్ (1886—1950). తరువాత గుర్తుకొచ్చే మహానుభావుడు, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాc సాహెబ్ (1895—1962). ఆ తరువాత చెప్పుకోతగ్గ గొప్ప కళాకారులలో పండిత జగన్నాథబువా పురోహిత్ ఒకరు. జగన్నాథబువాకి ప్రధానగురువు ఉస్తాద్ విలాయత్ ఖాc సాహెబ్ .

పండిత జగన్నాథబువా పురోహిత్ , 12—03—1904వ తేదీన, హైదరాబాదులో జన్మించేరు. తల్లి, తండ్రుల పేర్లు తెలియరాలేదు. వారికి చిన్న వయస్సులోనే మాతృవియోగం కలిగింది. వారికుటుంబం మహారాష్ట్రనుంచి, హైదరాబాదు ఎప్పుడు వలస వచ్చిందోకూడా తెలియదు. వారి బాల్యం, యౌవనం, ఆ పిమ్మటకూడా కొన్ని సంవత్సరాలు హైదరాబాదులోనే గడిచిపోయేయి.

వారి తండ్రిగారు హైదరాబాదులోని ఒక దేవాలయంలో అర్చకత్వం నిర్వహించేవారు. సంప్రదాయబద్ధమైన మహారాష్ట్ర బ్రాహ్మణ పురోహితవంశ పరంపరకి చెందినవారుకావడంవలన, ఆయన తల్లిలేని తన ఏకైకపుత్త్రుడికి తానే తల్లీ-తండ్రి-గురువు అయ్యి జగన్నాథుని పెంచేరు. చిన్నతనంనుంచి అతడికి ఆయన మాతృభాష మరాఠీలోని ప్రాథమిక విద్యని బోధించేరు.

సంగీతంలోకూడా ప్రధాన మౌలిక విషయాలని ఆయన తన బిడ్దకి నేర్పేరు. ఆయనకి సంగీతం అంటే పంచప్రాణాలూను! సంగీతం వారి జన్యువులలోను, రక్తప్రవాహంలోను, హృదయంలోను నిత్యసహవర్తిగావుంది. ఆయన బ్రాహ్మీముహూర్తకాలంలోనే లేచి, సంధ్యావందనాది నిత్యవిధులని నిర్వర్తించుకుని, సకాలంలో దేవాలయంలో వేంచేసివున్న దైవానికి ఆగమోక్త అర్చనాదులని నిర్వహించి, దైవదర్శనార్థం వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలనిచ్చి, ఆ తరవాత గృహబాధ్యతలనిపూర్తిచేసుకుని, కొడుకుకి కావలసిన – ప్రాథమిక విద్యని, సంగీతవిద్యని తానే తనకి చేతనైనమేరకి నేర్పుకుంటూ, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడిపేవారు.

ప్రతిదినము,ఉత్తరభారత సంగీత సభలకి, సాయంసమయంలో, కొడుకుని చెయ్యిపట్టుకుని తీసుకునివెళ్ళేవారు. గాయకులుపాడే వివిధ రాగాలు, తాళాలు, లయగతులు,మొదలైన వివరాలు వివరించేవారు. వేరు-వేరు ఘరానాల సంగీతరీతులగురించి చెప్పేవారు. సుమారు పదేళ్ళ వయస్సులో బాల జగన్నాథుడికి పితృవియోగం కలిగింది. లోకంలో “నా” అన్నవారు ఎవ్వరూలేకపోవడంవల్ల, వారికి, సంగీతసరస్వతీదేవి, వారి జీవితాంతం వరకు, తల్లి-తండ్రి-గురువు-బాంధవి-సఖి- నిత్యారాధనీయ దేవత-ఈ విధంగా వారి జీవన స్థితి, గతులనన్నీ, అంతటా పెనవేసుకుపోయిన వారి “ఉనికి-మనికి” అయిపోయింది.

ఆ వయస్సులోనే, సికిందరాబాదులోని ఉస్తాద్ మొహమద్ అలీఖాc సాహబ్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆ తరవాత, తన్రస్ ఘరానాకిచెందిన ఉమ్రావ్ ఖాc, సర్దార్ ఖాc, గుడియానా ఘరానాకిచెందిన షబ్బూఖాc, బషీర్ ఖాc, తిల్వాండి ఘరానాకిచెందిన ఘులాంఖాcల వద్ద చాలా కాలం శుశ్రూషచేసి వైవిధ్యభరితమైన సంగీతవిద్యని అభ్యసించేరు.

ఐతే, వారి వయస్సు, సుమారు 20 సంవత్సరాలువుండగా వారి జీవితంలో, సంగీతవిద్యాశారద అపార అనుగ్రహ రూపమైన ఒక మహావిద్వాంసుడి సంగీతం వినడం తటస్థించింది. ఆ మహా విద్వాంసుడే ఆగ్రా ఘరానా గానకళాసంప్రదాయంలో సుప్రతిష్ఠిత ఖ్యాతి కలిగిన ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాc సాహబ్ ! ఆ గురు-శిష్య సంప్రదాయం, వశిష్ఠ—శ్రీరామచంద్రులు, సాందీపని—శ్రీకృష్ణులు, ద్రోణాచార్య—అర్జునులు వంటి పౌరాణిక పరంపరతో పోల్చతగిన పరమ పావనమయమైన అనుబంధంతో కూడినది. ఈ విషయంగురించి తరువాత కొంత విపులంగా ప్రస్తావించుకుందాం!

జగన్నాథబువా వివాహం చేసుకోలేదు. తమ జీవితాన్నంతా సంగీతం నేర్చుకోవడానికి, అవిరళ సాధనాతపస్సుకి, ఆ తపస్సులో అంతర్భాగమైన అనితర కరణీయమైన గురుసేవకి, ఆగ్రా ఘరానా సంగీత బోధన-శిక్షణలకి, ఆగామిశిష్యపరంరాభివృద్ధికి, అపార శిష్య వాత్సల్యానికి అంకితం చేసుకున్న ఆదర్శ పురుషులు వారు.

ఆదర్శ శిష్యుడు—ఆదర్శ గాయకుడు—ఆదర్శ గురువు- ఆదర్శ స్నేహశీలి-ఆదర్శ మానవతామూర్తి వంటి అనేక మానవ జీవన విభిన్న పార్శ్వాలని తన వ్యక్తిత్వంలో ఏకీకృతమొనర్చుకోగలిగిన ఒకేఒక పూర్ణవిభూతి స్వరూపంగా సంగీతజగత్తులో ప్రకాశిస్తూన్న విలక్షణ వ్యక్తిత్వానికి ఆయనే లక్షణమూ, లక్ష్యమూను!

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తబలా నవాజ్ ఉస్తాద్ అహ్మద్ జాన్ తిరఖ్వా సాహబ్ వద్ద తబలా తాళవాద్యంలో ౘక్కని శిక్షణని గ్రహించిన జగన్నాథబువాకి, తరవాత కాలంలో, తబలావాద్యకారుడిగా మహారాష్ట్రలో పేరుపొందిన భాయీ గైటోండే, శిష్యుడే!

బువాజీ మొదటినుంచి ముస్లిం ఉస్తాదులవద్దనే గొప్ప శుశ్రూషచేసి, గురువాత్సల్యాన్ని సంపాదించుకుని, తమ సంగీతవిద్యాగ్రహణసామర్ధ్యాన్ని పూర్ణఫలవంతం చేసుకున్నారు. వారి గురువుల దుస్తులు శుభ్రంచెయ్యడం, గృహవిధులన్నింటిని ౘక్కగానిర్వహించడం, రకరకాల మత్స్యమాంసాదులని బజారునుంచితెచ్చి, రుచికరంగా వాటిని వండి వడ్డించడం, వారి మద్యపానాదికాలని సమయానుసారంగా సిద్ధంచెయ్యడం, గురుగృహానికి విచ్చేసిన ఆగంతకులకి, అతిథి-అభ్యాగతులకి చెయ్యవలసిన మర్యాదలని, సేవలని భక్తితో చేయడం, ఈ విధంగా లెక్కకి మిక్కుటమైన బాధ్యతలనన్నింటినీ గురుకరుణా పాత్రతకి అనుగుణంగా నిర్వహించడంలో ఆయనకి ఆయనేసాటి! అంతేకాదు. వీటినన్నింటినీ పులుసుగిన్నెలోని గరిటెలాగ వారు నిర్వహించడంలోనే వారి స్వధర్మపాలనా నిరతి నిబిడీకృతమైవుంది. వారికి కనీసం వక్కపలుకు వేసుకోవడంకూడా అలవాటులేదు. ఐతే శాకాహార, మాంసాహార పాకకళలో ఆయన సాధించిన నైపుణ్యం, వారి అపార సంగీతవిద్యావైదుష్యానికి తక్కువైనది కాదు. ఆ పాకకళాపారీణత వారి జీవితంలో చరమాంకం వరకు కొనసాగింది. తన శిష్యులకి, మిత్రులకి వారు అత్యద్భుతమైన తన వైవిధ్యభరితమైన వంటతో గొప్ప విందు భోజనాలని, అల్పాహారాలని చేసి, వారందరిచేత కడుపార ఆరగింపచేసి ఆనందభరితులై పోయేవారు. శిష్యులకి విద్యనేర్పడంలో ఆయన ఆదర్శవంతమైన పితృస్వరూపం. వారికి ఇష్టమైన ఆహారపదార్థాలని వండి, వడ్డించి, తినిపించడంలో పరిపూర్ణమైన అన్నపూర్ణాదేవి అవతారం.

ఏళ్ళతరబడి ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాc సాహబ్ శుశ్రూషలో ఆయన ఆగ్రా ఘరానా గానకళలో కూలంకష కోవిదులయ్యేరు. గురువుగారి అనుజ్ఞమేరకి స్వయంగా సంగీతసభలలో పాడడం, విద్యార్థులకి గానకళని బోధించడం ప్రారంభించేరు.

ఉత్తరభారత సంగీత సంప్రదాయంలోకాని, దక్షిణభారత సంగీత సంప్రదాయంలోకాని మహానుభావులైన, చరిత్ర ప్రసిద్ధి పొందిన సంగీతవిద్వాంసులు చాలామందివున్నారు. ఐతే అనుపమాన యశస్సుపొందిన గాయకులు లేక వాదనులు అయిన మహాకళాకారులు కొందరైతే, నిరుపమాన కీర్తిగడించిన మహావిద్వాంసులైన గాన-వాదన సంగీతవిద్యలో సంపూర్ణ నైపుణ్యాన్ని సాధించిన ఆచార్యవరిష్ఠులు మరికొందరు చరిత్రలో మనకి దర్శనం ఇస్తారు. కాని extraordinary perfomer గాను, exemplary teacher గాను, ఈ రెండు రంగాలలోను లోకపూజ్యులైన మహానుభావులు ఎక్కువగావుండరు. అటువంటి అపురూపమైన పరంపరకి చెందినవారే పండిత జగన్నాథ బువా పురోహిత్ ! అంతేకాదు. వివిధ ఘరానాలకి చెందిన తమ సమకాలీన మహాకళాకారులతో ఆయనకి ౘక్కని స్నేహసంబంధాలుండేవి. బి.ఆర్ . దేవధర్ , ఎస్ .ఎన్ . రతన్ ఝంకార్ , కుమార గంధర్వ, భీంసేన్ జోషి, సురేశ్ హల్దాంకర్ మొదలైన మహావిద్వాంసులు ఆయన సమకాలికులేకాక, ఆయనకి మిత్రులుకూడాను. అలాగే సంగీతరంగంతో కళాకారులుగా సంబంధంలేకండా, కేవలం సంగీతప్రేమికులైన వేరు-వేరు రంగాలకి చెందిన ప్రముఖులతోకూడా ఆయనకి సన్నిహిత సంబంధాలుండేవి. ప్రముఖ రచయిత పి.ఎల్ . దేశ్ పాండే, ప్రముఖ పాత్రికేయుడు హెచ్ . ఆర్ . మహాజని, ఆ కాలంలో మహారాష్ట్ర గృహమంత్రి బాలాసాహబ్ దేశాయ్ , కొల్హాపూరులోని ఆనాటి వాణిజ్య ధురంధరుడు లోహియా, కవి విందా కరండికర్ , చలనచిత్ర ప్రముఖులు సులోచన, శరద్ తల్వాల్కర్ , వైద్యరంగ ప్రముఖులు డా. బావదేకర్ , డా. ఫల్నీకర్ మొదలైనవారు ఆయన సంగీత గానానికి ముగ్ధులైపోయిన అభిమానులు. ఆయన సంగీతసభలలో వీరందరూ తప్పనిసరి శ్రోతలు.

మొదట ఆయన కొల్హాపూరులో సంగీతవిద్యార్థులకి సంగీతం నేర్పేవారు. ఆ తరవాత, పూణేలో పాఠాలు చెప్పేవారు. వారి జీవితంలో ఇంచుమించు చివరి దశాబ్దం అంతా ముంబైలోనే గడిచిపోయింది. విశ్వవిఖ్యాతిపొందిన వివిధ ఘరానా సంప్రదాయాలకి చెందిన వారి శిష్యగణాన్ని గమనిస్తే, ఉత్తరభారత సంగీత సంప్రదాయ శారదాదేవికి వారు చేసిన సేవకి ఆశ్చర్యమూ, ఆనందమూ కలుగుతాయి. రాం మరాఠే, సురేశ్ హల్దాంకర్ , జితేంద్ర అభిషేకి, సి. ఆర్ . వ్యాస్ , మానిక్ వర్మ, మాలతి పాండే, పూర్ణిమా తల్వాల్కర్ , యశ్వంత్ జోషి, బాలకరాం జాదవ్ , త్ర్యంబక జాదవ్ , G.N.జోషి(H.M.V. సంస్థలో ఉన్నతాధికారి, గొప్పగాయకులు) మొదలైన ప్రముఖులందరూ వారి శిష్యకోటిలోనివారే! వారి శిష్యపరంపరకి చెందగలగడం ఒక ప్రత్యేకమైన గొప్ప గౌరవంగాను, విశిష్ట యశః ప్రదాయక అంశంగాను, ఇంకా చెప్పాలంటే, “బ్రాండ్ నేమ్ “గా, అంటే “ప్రతిష్ఠా చిహ్నం“గా ఈనాటికీ పరిగణింపబడుతోంది.

ఆయన శిష్యవాత్సల్యం ఎంత అపారమైనదో, ఆయన గురుభక్తి అంతకి మించిన ఉదాత్తతని కలిగినది. వారి శిష్యులకి సంగీతవిద్య నేర్పడంలో అమిత వాత్సల్యమూ, కఠోర క్రమశిక్షణ నిండివుండేవి. ఆయనవద్ద అపార సంగీత కృతిరచనల మహా నిధి వుండేది. ఇంచుమించు 150 కి మించిన వారి స్వంత కృతులు అద్భుత వైవిధ్యభరితమైన రాగాలలోను, తాళాలలోను, స్వరప్రయోగాలతోను, లయగతులతోను సంగీతసభాగానానికి, సంగీతవిద్యాబోధనకి మన త్యాగరాజకృతులలాగ అన్నివిధాలా, అనువుగావుంటాయి.

ఆయన విలక్షణ వ్యక్తిత్వ శోభలో అనేకమైన అద్భుత అంశాలు ఇమిడివున్నాయి. అటువంటివాటిని అన్నీ ఒకే వ్యక్తిలో ఏర్చి కూర్చడం శ్రీశారదామాతయొక్క అమేయ అనుగ్రహ ప్రదానం అని భావించాలి. వారిలో ఉన్న ఆ గొప్పగుణాలన్నింటిలోను ప్రస్ఫుట ప్రకాశంతో విలసిల్లే పూర్ణపుణ్యమయలక్షణం ఒకటి ఉంది. అది వారి అపరిమిత గురుభక్తి. ఆ గురుభక్తి, కృష్ణయజుర్వేదాంతర్గత “శ్వేతాశ్వతరోపనిషత్తు” లోని, VI వ అధ్యాయంలోని, 23వ మంత్ర ఉపదేశానికి ఉపపత్తి(demonstration or proof) వంటిది.

మంత్రం:— “యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ |

తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః” ||

పరమేశ్వరునియందు, ఆ విధమైన పరమేశ్వర భావంతోనే తన గురువుయందు, పరాభక్తి కలిగిన మహాత్ముడికి ఈ గ్రంథగత తత్త్వబోధలన్నీ పరిపూర్ణ ఫలవంతమై ప్రకాశిస్తాయి“.

ఈ మాటలు సనాతన భారతీయ విద్యలన్నింటి విషయంలోను వర్తిస్తాయి. సంగీతవిద్యకూడా అటువంటిదే! ఈ ఉత్కృష్ట సంప్రదాయ అనుయాయి అయిన జగన్నాథబువా పురోహిత్ తన ఇష్ట దైవాన్ని, తన సంగీత ఉపాసనా దీక్షాగురువైన ఆగ్రాఘరానాకిచెందిన ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాన్ సాహబ్ ని, పరిపూర్ణ అభేద దృష్టి యుక్తమైన పరాభక్తితో అర్చించి, రెండు రూపాలుకలిగిన ఒకేఒక మహాదైవంగా ఆరాధించేరు. ప్రతి సంవత్సరము గురుపూర్ణిమా పర్వదినాన్ని ఒక మహోత్సవంగా వారు నిర్వహించేవారు. తన శిష్యులందరిచేత పరమగురువుయందు పరాభక్తితో తమ సంగీతవిద్యని సంపూర్ణ సమర్పణభావంతో ప్రత్యేక సంగీత సభయందు పాడుతూ, తమ గానాన్ని ఉస్తాద్జీకి అంకితంచేసేరీతిలో ఆ మహోత్సవం ఆద్యంతమూ వెల్లివిరిసేలాగ జరిపించేవారు.

అటువంటి గురు-శిష్యులని, అటువంటి పరస్పర వాత్సల్యపూర్ణ — భక్తిమయ పవిత్ర భావాలని, ఇతిహాస-పురాణాలలో మాత్రమే మనం దర్శించగలం. ఆ పవిత్ర గ్రంథాలలోని అటువంటి దివ్యగాథలని, ఇటువంటి మహోన్నతమనస్కుల చరిత్రలని ౘదివినప్పుడు, అవి పుక్కిటపురాణాలుకావు, పూర్తిగా నిజం అని గ్రహించుకుని, మన మనస్సులకి రూఢిపరచగలం.

గురు-శిష్యుల ఉత్తర-ప్రత్యుత్తరాలలో ఏ మాత్రం జాప్యమైనా ఇద్దరికిద్దరిలో, భరించలేని ఆందోళనకలిగి, ఆ అలజడి ఒక సజీవ కృతికి, శాశ్వత ప్రాణవంతమైన ఒక “బందిష్ “కి జన్మినిచ్చేది. గురువుగారికి ఏమాత్రం అస్వస్థత కలిగినా శిష్యుడు తన భరించలేని ఆర్తితో ఒక ప్రత్యేక కృతిని రచించి, పాడుకుని, భగవత్ప్రార్థన చేసి, ఆ కృతిని గురువుగారికి కన్నీటితో కైంకర్యం చేసేవారు. దానిని తపాలాద్వారా అందుకున్న గురువర్యులు కరిగి కన్నీటి మిన్నేరై, తన ఆత్మీయ స్పందనని మరొక అద్భుతకృతిలో పొందుపరిచి, శిష్యుడికి పంపించేవారు. ఇటువంటి గురుశిష్య సంబంధమైన పరమ రమణీయ కృతి-ప్రతికృతుల ఆదాన-ప్రదానాలు ప్రపంచ సంగీత ఇతిహాసంలోనే లోకోత్తరవిషయాలు అని చెప్పాలి. ఉత్తరభారతసంగీతంలో, పూర్ణశాస్త్రీయ సంగీతకృతిని, “బందిష్ “(Bandish) అంటారు.

ఉదాహరణగా, గురు-శిష్యుల పరస్పర ప్రేమభరిత సంవాదాత్మక సంగీతబధ్ధ గీతాలని, రెండింటిని, ఇప్పుడు ౘవిచూద్దాం! (musical and lyrical dialogues):

అహీర్ భైరవ్ రాగం—ఏకతాళం—బువాజీ బందిష్ .

స్థాయి(పల్లవి) ||

బేగ బేగ ఆవో మందిర్ |
బహుత్ దినన బీతే ||

అంతరా(చరణం) ||

సూఝత్ కఛు నహిc మోహె
నిస దిన ఘడి పల ఛిన
“గుణిదాస్ ” కొ దరస్ దీజె
ఓ “ప్రాణ్ పియా” || బేగ ||

ఇది బువాజీ, ఉస్తాద్జీకి అనారోగ్యం కలిగినప్పుడు, ఆ వ్యధతో రచించినది. దీనిలో “గుణిదాస్ “, బువాజీ ముద్రని తెలియజేసే వారియొక్క “కలంపేరు”. అదేవిధంగా, ఉస్తాద్జీ కలంపేరు, “ప్రాణ్ పియా“.

“వేవేగ రావోయి విమల మందిరమునకు
వేసరిల్లక రోజులెన్నియొ ఆశతో గడుపుచుంటిని ||

రేయి, పవలు, నిముసమ్ము, క్షణమును,
రోగముక్తుడవైన నీకై ఎదురుచూతును ఎల్లవేళల
ఓ నా ప్రాణప్రియా! కలతపడు నీ
గుణిదాసుకై, కరుణతో దర్శనము నొసగుము! ||వేవేగ||”
(స్వేచ్ఛానువాదము).

ప్రియశిష్యుడు, బువాజీయొక్క, ఈ బందిష్ కి స్పందించిన గురువుగారు, ఉస్తాద్జీ పంపిన “బందిష్ ” లోనే సమాధానం:

పఠదీప్ రాగం, ఏక్ తాళనిబద్ధితం, మధ్యలయలో.

స్థాయి(పల్లవి):—

సాచ్ గురుననకీ సేవా
కరత్ వొహి పావే సమాధాన్ ||

అంతరా(చరణం):—

ప్రేమభక్త “ప్రాణ్ ” కహత్
సున్ హో “గుణిదాస్ “
యా దోవు జగమె ప్రభు
తోహె దేతా బఢో నాం ||

“గురుసేవా నిరత వ్రతము
పరిహరించు సంకటముల ||

ప్రేమభక్త ప్రాణప్రియుని
పలుకు వినుము గుణిదాస!
గురుసేవయె నీ తపమై
కూర్చగలుగు ఇహ-పరముల || గురు ||”
(స్వేచ్ఛానువాదము)

 

ఈ విధంగా ఎన్నో బందిష్ లు, వారిద్దరిమధ్య కొనసాగేయి. ఉస్తాద్జీ బువాజీని తన పుత్రులకన్న ఎక్కువగా ప్రేమించేరు. ఎందుకంటే, ఉస్తాద్జీ తమ పుత్రులనుంచి పొందలేని పూజ్యత, ఆదరము, గౌరవము బువాజీనుంచి పొందగలిగేనని చెప్పేరు. ఇంక బువాజీకి వారే తల్లి, తండ్రి, ఆచార్యులు, గురువు, దైవమూను. ఇటువంటి అపూర్వ అనుబంధాన్ని మనం మరెక్కడా చూడలేము. అదిసత్యం.

ఒకసారి ఉస్తాద్జీ అనారోగ్యంతో మంౘంపట్టేరు. వైద్యులు ఇంక ఆయన శేషజీవితం మంౘానికే పరితమైపోతుందని చెప్పేరు. ఈ విషయం, బువాజీకి కొన్ని నెలలు గడిచిన తరవాత తెలిసింది. తెలిసిన వెంటనే బువాజీ గురువు గారిని చూడడానికి వెళ్ళేరు. శిష్యుణ్ణి చూసిన వెంటనే ఉస్తాద్జీ పరమ ఆనందంతో తనంతతానే మంచంనుంచి లేచి శిష్యుణ్ణి గట్టిగా ఆలింగనంచేసుకుని, “నా పిల్లలు కూడా నన్నింత భక్తి-ప్రపత్తులతో చూడలేరు” అంటూ ౘంటిపిల్లవాడిలాగ వెక్కి, వెక్కి ఏడ్చేసేరు.

ఉస్తాద్జీ మరణానంతరం, జగన్నాథబువా ౘంటిపిల్ల వాడికన్నా ఎక్కువగా విలపించేరు. చాలాకాలం మామూలు మనిషి కాలేకపోయేరు.

బువాజీ జీవితంలో కొన్ని పార్శ్వాలని మనం ఇంతవరకు స్పృశించేం. ఒక్క లవలేశం వారి సంగీతంగురించికూడా పరిచయం చేసుకుందాం. వారి రాగ ఆలాపనలు, ఖయాల్ గానకౌశలమూ, బోల్ ఆలాప్ లు, బోల్ తాన్ లు, ఇటువంటి ఆగ్రాఘరానా గాయకీకి చెందిన అంశాలన్నీ ఆయా సందర్భాలననుసరించి ౘాలా పరిమితమైన మోతాదులోనేవుంటాయి. ఇంకొంచెం ఆయా అంశాలని విస్తరించివుంటే మనకి మరింతబాగుండివుండేదేమో, అనిపించేలాగ అవన్నీవుంటాయి. నిజజీవితంలోని వారి పొదుపు మనస్తత్వం ఇక్కడికికూడా ప్రసరించిందేమో, అనిపించేలాంటి అద్భుతగానం వారిది. మళ్ళీ, మళ్ళీ వినాలనిపించే, మరెక్కడా లభ్యంకాని గాయనకళ వారికి స్వంతం! అపూర్వరాగాలంటే వారికి మక్కువ ౘాలా ఎక్కువ! జోగ్ కౌcస్ , శివమత్ భైరవ్ , స్వానంది, జౌన్ భైరవ్ మొదలైన అరుదైన రాగాలలోని వారికృతులు వర్ణనాతీతమైన కళాకారుల, పండితుల మన్ననలని, ప్రజాగౌరవాన్ని చూరగొన్నాయి. ఇంక “అహీర్ భైరవ” రాగంలోని వారి బందిషులకి కరిగి ప్రవహించని రసికహృదయాలు వుండవు.

గొప్పశాస్త్రీయ సంగీతగాయకుడు, విద్వాంసుడు, డా. V.H.దేశ్ పాండే, తమ గ్రంథం, “Between Two Tanpuras” లో, బువాజీ-తాను పాల్గొన్న ఒక సంగీత సభలోని విశేషాంశాన్ని , యిలాగ ముచ్చటించేరు:— “గోవిందరావు తెంబెగారు, మొదట, కొల్హాపూరులోని ఒక సంగీతసభలో, మా ఇద్దరికీ పరిచయం చేసేరు. సభలో పాడడానికి నాకు, మొదటి అవకాశంవచ్చింది. “జైతశ్రీ” రాగంలో నేను ౘక్కని గానాన్నిసభాసదులకి అందించేను. నా తరవాత బువా పాడడానికి సభముందు సంసిద్ధమయ్యేడు. నా గానం స్థాయికి తగినట్లుగా ఈయన ఏంపాడగలుగుతాడులే అన్నట్టుగా అప్పటి నా మనోభావంవుంది. ఆయన ఎత్తుకున్న “మారు బేహాగ్ ” రాగం, మొట్టమొదటి తాళ ఆవృత్తిలోనే, నేను నా ఊహారోదసిలోంచి నేలమీదికి పూర్తిగా దిగిపోయేను. వారు పాడిన కృతిలోని ఆ అద్భుతనిర్మాణం నా మనస్సుని దోచుకుంది. వారి కృతిప్రయోగంలోని కళాత్మక ఔజ్జ్వల్యం, బోల్ ఆలాప్ , బోల్ తాన్ , లలోని సహజచాలన చాతుర్యం ఇప్పటికీ నన్ను మంత్రముగ్ధులని చేస్తాయి“. అని వర్ణిస్తూ, ఎన్నో సూక్ష్మ సాంకేతికాంశాలు బువాజీ గానంలో ఇమిడివున్నాయని సంగీతప్రియుల కోసం, వాటిని, గ్రంథబద్ధం చేసేరు.

బువాజీ, గోవిందరావు తెంబేజీతో, మైసూరు మహారాజా వారి ఆస్థానవిద్వాంసులందరతోకలిసి, ఇంగ్లండు, ఫ్రాంసు మొదలైన ఐరోపాదేశాలని సందర్శించేరు. తెంబేజీకి, సహాయక సంగీత దర్శకునిగా, బువాజీ ఛత్రపతి సినిటోన్ , హంస పిక్చర్స్ , షాలిని సినిటోన్ , వంటి సంస్థలలో, చలనచిత్రసీమలోకూడా పనిచేసేరు.

1967వ సంవత్సరం, ఉత్తరార్థాంతంలో, నాగపూరులో జగన్నాథబువా పురోహిత్ కి, ఒక గొప్ప పౌరసన్మానం జరిగింది. ఆ సమ్మానానంతరం, బువాజీ రైలుబండిలో ముంబైకి తిరిగి వస్తూండగా, వారి సూట్ కేస్ పోయింది. దాంట్లోవున్నో డబ్బు మొదలైన ఎన్నో విలువైన వస్తువులు పోయినందుకు వారేమీ బాధపడలేదు.

వారు, వారి గురువులనుంచి సేకరించుకున్నవి, తాను రచించినవి అయిన తన జీవిత సంగీత సార సర్వస్వమైన బందిషులు, చీజులు అన్నీ ఒక పుస్తకంలో భద్రపరచుకుని ఎప్పుడూ తనతోనే పెట్టుకునేవారు. ఆ పుస్తకం పోవడంతో ఆయన పూర్తిగా క్రుంగిపోయేరు. ఆ గాఢమైన మానసిక గాయంనుంచి ఆయన కోలుకో లేకపోయేరు. 20—10—1968 వతేదీన వారు తమ భౌతికకాయం విడిచి, సంగీతశారదాదేవిలో లీనమైపోయేరు.

వారి గానం యూట్యూబులో ఉన్నమేరకి విని ధన్యులమౌదాం.

ఆ ఆదర్శ సంగీతమయ జీవన జాహ్నవీ తీర్థ స్వరూపునిముందు మోకరిల్లుదాం.

స్వస్తి ||

You may also like...

7 Responses

  1. సి. యస్ says:

    వ్యక్తిగతంగా సరళమైన జీవనం, దైవంపట్ల అచంచలమైన భక్తి
    విశ్వాసం, గురువుల యెడ అనన్య సామాన్యమైన పూజ్యభావం
    — ఈ లక్షణాలు బాల్యం నుంచే అలవరుచుకుంటే తప్పకుండా
    తమ ఆశయసిద్ధి నెరవేరుతుందని జగన్నాథ బువా వారి జీవితం
    ద్వారా తేటతెల్లమవుతోంది.
    వారి జీవిత గాథ చదివితే,… దుఃఖమనే భావం కానీ, దేహమనే
    భ్రాంతి కానీ లేకుండా ఋషిలా బతికిన ఆ మనిషి మనకాలంలోనే
    ఉన్నారా అనిపించింది. అదంతా చదివేకా ఒక అవ్యక్త పారవశ్యత
    మనసునావరించింది. కానీ అది అయోమయ స్థితి కాదు. అనుభూతికి
    అతీతమైన తన్మయస్థితి అనవచ్చు.
    మనోదర్పణంలో కదలాడే దృశ్యాలకి, మాటలకందని మహత్తర
    భావాలకి అక్షరరూపం కలిగించి,…వాటిని చదువరుల హృదయాలకి
    హత్తుకునేట్టుగా చేసిన నీ రచనా విన్నాణం అందుకు ముఖ్య కారణం.
    సినిమా సంగీతం లేదా కాస్త లలిత సంగీతం తప్ప శాస్త్రీయ సంగీతం
    పట్ల అవగాహన, ఆసక్తి అంతగాలేని ప్రస్తుతతరానికి ఇటువంటి
    వ్యాసాలు చదవడం స్ఫూర్తిదాయకం.
    ఒక్క కళలో ఉన్నత స్థాయికి చేరాలంటేనే జీవితకాలం సరిపోదు.
    కానీ ఒక్క మనిషి…తన జీవితకాలంలో ఇన్ని కళలలో అత్యుతన్నస్థితికి
    చేరగలగడం సామాన్యమైన విషయం కాదు.
    ప్రాపంచిక విషయాలు ఆయనను బంధింంచ లేదు. జీవితంలో ఒడిదుడుకులు వారికి అడ్డంకి కాలేదు.
    ఎంత విస్తారమైన జీవితం వారిది! ఎంత వైవిధ్య భరితమైనది!
    బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా, వారి దైవచింతన, గురుభక్తి
    ఆయనని ఉద్ధరించిన వైనం చెబుతూ అక్కడ ఉదాహరించిన ‘ శ్వేతా శ్వతరోపనిషత్ ‘ లోని మంత్రం .. అలాగే బువాజీ రాసిన కీర్తనలకి
    చేసిన స్వేచ్ఛానువాదం (ఓ గజల్ లాగ, దేవులపల్లి వారి భావకవిత లాగ)
    అద్భుతం.

  2. Kiran Sundar Balantrapu says:

    ఇక్కడ, పైన,” శ్రీశారదా కారుణ్య కౌముదిః :—” అని ఉంటోంది. “…కౌముదీ” అని కదా ఉండాలి? “కౌముదిః” అని కూడా ప్రథమా విభక్తి ఏకవచనంలో అనొచ్చా?

    • వ.వెం.కృష్ణరావు says:

      నీవు చెప్పినదే సరయినది. “కౌ ము దీ” ‘ఈ’ కారాన్త స్త్రీ లిఙ్గమే!
      పొరబాటున “కౌ ము దః ” మాటలాగ ప్రయోగిఞ్చేను.
      సరిచేసినన్దుకు హార్దధన్యవాదం కిరణ్ !

      • Kiran Sundar Balantrapu says:

        Thank you. అలాగే ఇక్కడ “ప్రయోగిఞ్చేను” అన్న మాటలో సంస్కృత స్పెల్లింగు వాడడం “గమనిఞ్చేను”. ఇది బావుంది. ఈ స్పెల్లింగు టైపు చెయ్యడం నేను కూడా ఇప్పుడు నేర్చుకున్నాను. అసలు తమిళంలో ఇలాగే వ్రాస్తారు – ఏ వర్గానికి ఆ వర్గానునాసికమే వాడుతూను.

        • Kiran Sundar Balantrapu says:

          Sorry, “స్పెల్లింగు” కాదు స్పెల్లిఙ్గు.

          • వ.వెం.కృష్ణరావు says:

            In deed a lot of fun in learning especially all along the life till the last breath.
            తెలుగువారి బద్ధకాన్ని బట్టి అన్ని వర్గాల అనునాసికాలకీ
            సున్నాని వాడేసి, భాషకి సున్నాన్ని పులిమేస్తారు.
            సమ్స్కత భాషలోను, తమిళభాషలోను – లిపిలో
            వర్గానునాసికాల వాడుకద్వారా, లిపిలో వాటి
            ఉనికికివున్న సార్థకాన్ని, వారు గ్రహిఞ్చుకుని,
            భాషాసమ్స్కతియొక్క వారసత్వాన్ని, తమ వారసులకి
            అన్దజేయడము అభినన్దనీయము. అసలు సమస్య
            ఏమిటణ్టే, “comment”లో అనుస్వారాన్ని అన్త
            సులువుగా వాడలేము. ఆ విధముగా మనము
            అనునాసికాలు వాడుకోవడము అలవాటతూన్నది.
            Thank U once again Kiran!

  3. Devi says:

    Jagannath Purohit ji an extra ordinary personality whose music makes one feel as if we are in heavens or some higher worlds, his entire life dedicated to the service of his Guru is a special soul no doubt taken birth exclusively for music. His excellent role as a performer and a teacher is an example and a path way for artists as to how they ought to be. Bandish relationship between Guru and pupil is very interesting. Purohltji’s Raag Hindol and Jaun Bhairav are simply beyond words and they mesmerize the listeners. Thanks to you tube and today’s internet technology.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *