సాహిత్యము సౌహిత్యము – 11 : రాతికి మ్రొక్కగావలయు, రాతికి మ్రొక్కుట నిష్ఫలంబగున్
21–07–2017; శనివారం, 6-00AM.ఈ వారం ఒక తెలుగు సమస్యని చూద్దాం! శ్రీ సి.వి. సుబ్బన్నశతావధానిగారు మన కాలానికిచెందిన గొప్ప అవధానులలో ఒకరు. ఆంధ్ర, సంస్కృతాలలో గట్టిపట్టు వున్న ప్రజ్ఞావంతులు. వారు ఆదిలాబాదులో 3-12-1966 వ తేదీన ఘనంగా నిర్వహించిన “అష్టావధానం”లో ఒక క్లిష్టసమస్య యివ్వబడింది. అది యిది:
“రాతికి మ్రొక్కగావలయు, రాతికి మ్రొక్కుట నిష్ఫలంబగున్ “||
సమస్య అర్థం సులువుగానే తెలుస్తూంది.
“రాతిని పూజించాలి. రాతిని పూజిస్తే వచ్చే ఫలితం ఏమీలేదు” అని ఈ సమస్య భావం.
ఇది అందరికీ అర్థమయ్యేదే! ఐతే ఈ వాక్యం పరస్పరవిరుధ్ధమైన భావంతో వుంది. ఈ వైరుధ్యాన్ని అవధానివర్యులు యెంత అందంగా పరిహరించి, చాలా ముచ్చటైన పద్యాన్ని సభ్యులముందు వుంచేరో రసికహృదయులు గమనించండి.
“శ్రీతరుణీ మనోహరుడు సింధు శయానుడు దిగ్దిగంతర
ద్యోతితకీర్తివైభవుడు ద్యోతటినీజని భూత సత్పదా
బ్జాతుడు వేదవేద్యుడు ప్రసన్నుడు తానెవడట్టి రాక్షసా
రాతికి మ్రొక్కగావలయు, రాతికి మ్రొక్కుట నిష్ఫలంబగున్ “||
అని సమస్యని పూరించేసరికి సభ్యుల జేజేలు మిన్నుముట్టేయి. ఈ పద్యం శ్రీమహావిష్ణువుని వర్ణిస్తూ చెప్పడం జరిగింది. ఈ పద్యం ఉత్తమకావ్యశైలితో భాసిస్తూ, మనోజ్ఞభావదీప్తిని వెదజల్లుతోంది. దీని భావం యిది.
“లక్ష్మీదేవికి భర్త, క్షీరసాగరశయనుడు, సర్వలోకాలలోను ప్రసరించిన కీర్తి వంతుడు, సురనది ఐన గంగాదేవి తన పాదపద్మాలనుంచి పుట్టినవాడు, వేదాలద్వారా తెలియదగినవాడు, సత్వగుణానికి ఆశ్రయస్థానమైనవాడు, (తమోగుణభరితమైన రజోగుణ మయులైన)రాక్షసులకి శత్రువైనవాడు (రాక్షస+అరాతి=రాక్షసుల శత్రువు) ఐన అటువంటి శ్రీమహావిష్ణువుకి పూజచెయ్యాలి. అంతేకాని ఉత్తరాతికి (అది కేవలం రాయి అనే భావంతో) పూజచేస్తే ఫలితం శూన్యమే!”
ఇక్కడ చాలాముఖ్యమైన అంశం ప్రస్తావించబడింది. రాతివిగ్రహాన్ని పై పద్యంలో కవిగారు వర్ణించినట్లు అంత ఉదాత్తభావంతో పూజించాలి. కేవలం రాతిబొమ్మగా భావిస్తే ఆ ఫలమే లభిస్తుంది. దివ్యభావనతో పూజిస్తే దివ్యఫలమే పొందవచ్చు. ఈ విషయంమీద మరొక సందర్భంలో చర్చించుకోవచ్చు.
స్వస్తి|| (సశేషం).