సంగీతం—నాదవేదం—72
13—11—2021; శనివారం.
ॐ
మనం పరిచయం చేసుకున్న 72—మేళకర్త రాగాలలో 32 మేళకర్తలు “వాది(స్వర) మేళకర్తలు” గాను, మిగిలిన 40 మేళకర్తలు “వివాది(స్వర) మేళకర్తలు” గాను దక్షిణభారతసంగీతశాస్త్రజ్ఞుల చేత విభజింపబడ్డాయి. ఇప్పుడు మనం వాదిస్వరాలు, వివాదిస్వరాలు మొదలైన అంశాలగురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. ఒక “OCTAVE” లేక “స్వరసప్తకం” లో ఉన్న స్వరాలయొక్క వినియోగప్రాముఖ్యం, వరుసక్రమంలోని స్వరస్థితి మొదలైన విషయాలపై ఆధారపడి మనం రాగంలోని స్వరాలని, ఆ స్వరాల పరస్పర సంబంధాన్ని ఈ దిగువ విధంగా వివరించవచ్చు:—
ఒకానొక రాగంలోని స్వరాల పరస్పరసంబంధం తెలియజేస్తూ, ఆ సంబంధంద్వారా ఆ రాగంయొక్క స్వరూప-స్వభావాదులు నిర్దేశం చేయడానికి ఆ రాగంలో వినియోగింపబడే స్వరాలని నాలుగు విధాలుగా భారతీయసంగీతశాస్త్రం విభజించింది. అవి యివి:—
(1) వాది స్వరం (Sonant note); (2) సంవాది స్వరం (Consonant note); (3) అనువాది స్వరం (Assonant note); (4) వివాది స్వరం (Dissonant note).
వాది స్వరం:— “వాదీ రాజాsత్ర గీయతే” అని శార్ఙ్గదేవుడు తన “సంగీతరత్నాకరం” గ్రంథంలో వాదిస్వరప్రాముఖ్యం రాగంలో ఎంతటిదో వివరించేడు. అంటే — “రాగంలో వాదిస్వరం రాజు (వంటిది)” అని అర్థం. రాగంలో వాదిస్వరం అనేకపర్యాయాలు ఆ రాగలక్షణాన్ని నిర్వచించడానికి, విశదీకరించడానికి వినియోగింపబడుతుంది. ఇది రాగానికి అత్యంతప్రధానస్వరంగా భావించాలి.
సంవాది స్వరం:— “సంవాదీత్వనుసారిత్వాత్ అస్యామాత్యోsభిధీయతే” అని వివరించబడింది. వాదిస్వరం తరువాత, రాజైన ఆ స్వరాన్ని అనుసరించే ద్వితీయప్రాముఖ్యం కలిగిన స్వరం, రాజుని అనుసరించే మంత్రివలె ఉండే “సంవాది స్వరం” అని సంగీతరత్నాకరం బోధించింది.
ఈ వాది—సంవాది స్వరాల సంబంధం సాధారణంగా రాగంలో 1—4 లేక 1—5 స్వరాలక్రమంలో ఉంటుంది. అంటే ఒక రాగంలో షడ్జం(స) వాదిస్వరమైతే, ఆ రాగంలోని మధ్యమం(మ) లేక పంచమం(ప) సంవాది స్వరంగా ఉంటుందన్నమాట. అంటే ఆ రాగంలోని స్వరసంచారాదులు ఈ రెండు స్వరాలని ఆశ్రయించుకుని వాటి చుట్టూ రాగమాధుర్యవైయక్తికలక్షణాలు, గుణాలు అల్లుకుని ఉంటాయి అని చెప్పవచ్చు.
అనువాది స్వరం:— “నృపామాత్యానుసారిత్వాత్ అనువాదీ తు భృత్యవత్॥”. రాగంలో వాది-సంవాది స్వరానుబంధం ద్వారా ఆవిష్కరింపబడిన రాగలక్షణమైన ప్రత్యేకమాధుర్యం, రాగంలో ఉన్న ఏ ఇతర స్వరాలవలన పోషింపబడి, పరిపుష్టం చేయబడుతుందో అది అనువాది స్వరంగా చెప్పబడుతూంది. రాజుని, మంత్రిని అనుసరించే భృత్యునివంటిది (సేవకునివంటిది) ఈ అనువాది స్వరం.
వివాది స్వరం:— “వివాదీ విపరీతత్వాత్ ధీరైరుక్తో రిపూపమః|”. రాగభావస్వరూపాన్ని విపరీతం చేసే లేక వికృతం చేసే గుణం కలిగిన రాగంలోని స్వరం రాగరస ఆవిష్కరణకి శత్రువు వంటిదిగా సంగీతశాస్త్రజ్ఞులచే పరిగణింప బడింది. ఏ రాగంలోనైనా వివాదిస్వరాన్ని శాస్త్రపరంగా వినియోగించడం నిషిద్ధమైనా అపురూపమైన ప్రజ్ఞ కలిగిన సంగీతకళాకారులు ఆ వివాదిస్వరం యొక్క వివాదిత్వ ధర్మాన్ని పరిహరింపజేసి, అది అందంగా రాగంలో ఒదిగిపోయేటంత రసమయంగా రాగాన్ని రసజ్ఞులని రంజింపజేసేటట్లు ప్రయోగించగలరు. ఆ విధంగానే వివాది(స్వర)రాగాలు సంగీతప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. వరుస క్రమంలో ఉన్న కొన్ని స్వరాలలో ఒక స్వరానికి దాని తరువాత ఉండే స్వరం వివాది స్వరంగా ఉంటుంది. ఉదాహరణకి శుద్ధరిషభానికి, శుద్ధగాంధారం వివాదిస్వరంగా పరిగణింపబడుతుంది.
ఈ విషయాలకి సంబంధించిన ఇతర వివరాలు ఆచార్యసన్నిధిలో నేర్చుకోవాలి.
(సశేషం)7:19 AM