సంగీతం—నాదవేదం—70
30—10—2021; శనివారం.
ॐ
ఇప్పుడు చివరిదైన ద్వాదశ (పన్నెండవ) చక్రం, అంటే, “ఆదిత్య (ద్వాదశ ఆదిత్యులు) చక్రం” లో ఉన్న ఆరు జనక రాగాల గురించి పరిచయం చేసుకొన బోతున్నాం! ఈ చక్రంలో ఉన్న ఆరు మేళకర్తరాగాలలో “రు-గు” స్వరాలతోబాటు, ప్రతిమధ్యమం కూడా ఉండడం ఈ రాగాలయొక్క స్వర ప్రయోగ సామాన్య లక్షణం.
67వ మేళకర్త అయిన “సుచరిత్రరాగం” లో “రు-గు-ధ-న” స్వరసంపుటి ఉంటుంది. సుచరిత్ర రాగం “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. సుచరిత్ర రాగం లో స్వరాల మేళవింపు ఈ దిగువ విధంగా ఉంటుంది:—
మంద్ర స—షట్ శ్ర్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—శుద్ధ ని—తారా స.
సుచరిత్రరాగంలో త్యాగయ్యగారి కృతులు లభ్యం కావడం లేదు.
దీక్షితుల పద్ధతిలో సుచరిత్రరాగాన్ని “సంతానమంజరి రాగం” అని పిలుస్తారు. సంతానమంజరి రాగం “షాడవ(“ని” వర్జ్యం)—షాడవ(“గ” వర్జ్యం)” రాగం. సంతానమంజరిలో దీక్షితస్వామి — “సంతానమంజరీ శంకరీ ~ సంతతం పాతు మాం బృహదీశ్వరీ ॥సంతానమంజరీ॥ (ఆదితాళం)” అనే ఒక కృతిని రచించేరు.
68వ మేళకర్త ఐన “జ్యోతిస్స్వరూపిణి రాగం” లో, “రు-గు-ధ-ని” అనే స్వరాల వినియోగం జరుగుతుంది. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన జ్యోతిస్స్వరూపిణిరాగంలో స్వరాల మేళవింపు ఈ దిగువ విధంగా ఉంటుంది:—
మంద్ర స—షట్ శ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కైశికి ని—తారా స.
జ్యోతిస్స్వరూపిణిరాగంలో త్యాగరాజస్వామి కృతులు లభ్యం కావడం లేదు.
దీక్షితులవారి పద్ధతిలో జ్యోతిస్స్వరూపిణిరాగాన్ని “జ్యోతి రాగం” అంటారు. జ్యోతిరాగం “సంపూర్ణ—షాడవ(“రి” వర్జ్యం)” రాగం. జ్యోతిరాగంలో దీక్షితస్వామి — “పరంజ్యోతిష్మతీ పార్వతీ ~ పరమేశ్వరయువతీ మహాభగవతీ ॥పరంజ్యోతిష్మతీ॥ (ఆదితాళం); రామే భరతపాలితరాజ్యమర్పయామి ~ రాజాధిరాజపూజితచరణం నమామి ॥రామే॥ (ఖండచాపుతాళం)” అనే రెండు కృతులను రచించేరు.
69వ మేళకర్త అయిన “ధాతువర్ధని రాగం” లో, “రు-గు-ధ-ను” అనే స్వరాలు వాడబడతాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన ధాతువర్ధనిరాగంలోని స్వరాల కూర్పు ఈ దిగువ ఉదహరించబడిన విధంగా ఉంటుంది:—
మంద్ర స—షట్ శ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కాకలి ని—తారా స.
ధాతువర్ధనిరాగంలో త్యాగరాజకృతులేవీ లభ్యం కాలేదు.
దీక్షితులవారి పద్ధతిలో ధాతువర్ధనిరాగాన్ని “ధౌతపంచమం రాగం” అంటారు. ధౌతపంచమరాగం “సంపూర్ణ—వక్ర సంపూర్ణ” రాగం. ధౌతపంచమంలో దీక్షితస్వామి —”మాతంగి! మరకతాంగి! ~ మాం పాలయ! కృపాలయే! ॥మాతంగి!॥ (రూపకతాళం)” అనే ఒక కృతిని రచించేరు.
70వ మేళకర్తని “నాసికాభూషణి(ణం) రాగం” అంటారు. నాసికాభూషణిరాగంలో “రు-గు-ధి-ని” స్వరాలని వాడుతారు. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన నాసికాభూషణరాగంలో ఈ దిగువ స్వరాల మేళనం ఉంటుంది.:—
మంద్ర స—షట్ శ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—తారా స.
త్యాగరాజస్వామి నాసికాభూషణిరాగంలో — “మారవైరి రమణీ! ~ మంజుభాషిణి! ॥మారవైరి రమణి!॥ (రూపకతాళం)” అనే ఒక మనోహరకృతిని కూర్పు చేసేరు.
దీక్షితులవారి పద్ధతిలో నాసికాభూషణిరాగాన్ని “నాసామణిరాగం” అని పిలుస్తారు. నాసామణి రాగం “సంపూర్ణ-వక్ర సంపూర్ణ” రాగం. దీక్షితస్వామి నాసామణిరాగంలో — “శ్రీకృష్ణో మాం రక్షతు ~ గురుగుహానందో వరః ॥శ్రీకృష్ణో మాం రక్షతు॥ (రూపకతాళం); శ్రీరమాసరస్వతీసేవితాం ~ శ్రీలలితాం త్వాం భావయే ॥శ్రీరమాసరస్వతీసేవితాం॥ (ఆదితాళం)” అనే రెండు రమణీయకృతులని రచించేరు.
71వ మేళకర్తని “కోసల(ం) రాగం” అని పిలుస్తారు. “రు-గు-ధి-ను” స్వరాలు కోసలరాగంలో ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన కోసలంలో స్వరాల కూర్పు ఈ దిగువ విశదం చేయబడిన పద్ధతిలో ఉంటుంది.:—
మంద్ర స—షట్ శ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.
కోసలంరాగంలో త్యాగరాజకృతులు లభించడంలేదు.
దీక్షితులవారిపద్ధతిలో కోసలరాగాన్ని “కుసుమాకరం రాగం” అని పిలుస్తారు. కుసుమాకరరాగం “సంపూర్ణ-వక్ర సంపూర్ణ” రాగం. కుసుమాకరం రాగంలో దీక్షితస్వామి —”కుసుమాకరశోభిత శ్రీపురగేహం ~ కుంభజ గురుగుహ నతం భావయేsహం ॥కుసుమాకరశోభిత శ్రీపురగేహం॥ (రూపకతాళం)” అనే కృతిని రచించేరు.
72వ మేళకర్తని “రసికప్రియరాగం” అని పిలుస్తారు. రసికప్రియరాగంలో “రు-గు-ధు-ను” అనే స్వరాలు ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన రసికప్రియలో స్వరసంపుటీకరణ ఈ దిగువ విధంగా ఉంటుంది.:—
మంద్ర స—షట్ శ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—షట్ శ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.
రసికప్రియరాగంలో త్యాగరాజస్వామి కృతులు లభించడంలేదు.
దీక్షితులవారిపద్ధతిలో రసికప్రియరాగానికి “రసమంజరి రాగం” అని పేరు. రసమంజరిరాగం “ఉభయవక్ర సంపూర్ణ-సంపూర్ణ” రాగం. దీక్షితస్వామి రసమంజరిరాగంలో — “శృంగార రసమంజరీం శ్రీకామాక్షీం గౌరీం ~ శ్రితజన కల్పవల్లీం చింతయేsహం ॥శృంగారరసమంజరీం॥ (రూపకతాళం)” అనే ఏకైక కృతిని విరచించేరు.
ఇంతటితో “72 మేళకర్త జనక – జన్య రాగాలు” గురించి పరిచయం చేసుకోవడం పూర్తి అయ్యింది.
(సశేషం)