సంగీతం—నాదవేదం—69
23—10—2021; శనివారం.
ॐ
65వ మేళకర్త కల్యాణిరాగజన్యమైన రాగాలలో “సారంగరాగం” సుప్రసిద్ధమైన మనోరంజక రాగం. సారంగరాగం సంపూర్ణ-(వక్ర)సంపూర్ణ రాగం. ఇది ప్రతిమధ్యమ జన్యరాగమైనా, దీనిలో ప్రత్యేక ప్రయోగంలో శుద్ధమధ్యమం కూడా సంప్రదాయసిద్ధంగా ఉంది. అందువలన (అన్యస్వరప్రయోగం వలన) యిది భాషాంగరాగంగా పరిగణింపబడుతూంది.
త్యాగయ్యగారు సారంగరాగంలో — “ఓడను జరిపే ముచ్చట గనరే! ~వనితలార! నేడు ॥ఓడను – – -॥ (ఆదితాళం); ఎంత భాగ్యము! మా పాల గల్గితివి ~ ఎవరీడు ముజ్జగములలో తన ॥కెంత భాగ్యము!॥ (దేశాదితాళం); ఏమి దోవ? పల్కుమా!యికను నే ~ నెందు పోదు? శ్రీరామ! ॥ఏమి దోవ? పల్కుమా!॥ (ఆదితాళం); ఏహి! త్రిజగదీశ! శంభో! మాం ~ పంచనదీశ! ॥ఏహి! త్రిజగదీశ!॥ (మిశ్రచాపుతాళం); కరుణ జూడవయ్య! మా యయ్య! ~ కావేటి రంగయ్య! ॥కరుణ జూడవయ్య!॥ (దేశాదితాళం); నీవాడ నే గాన? నిఖిలలోక నిదాన! ~ నిమిషమోర్వగ గలనా? ॥నీవాడ – – -॥ (ఖండచాపుతాళం); మామవ రఘురామ! ~ మరకతమణిశ్యామ! ॥మామవ రఘురామ!॥ (రూపకతాళం)” అనే కృతులను తీర్చిదిద్దేరు.
దీక్షితస్వామి సారంగరాగంలో — “అరుణాచలనాథం స్మరామి అనిశం ~ అపీత కుచాంబా సమేతమ్ ॥అరుణాచలనాథం॥ (రూపకతాళం); సారంగరాగప్రయే! ~ సంతతం చింతయేsహం ॥సారంగరాగప్రియే!॥ (మిశ్రచాపుతాళం); త్యాగరాజే కృత్యాకృత్యమర్పయామి ~ విదేహకైవల్యం యామి ॥త్యాగరాజే॥ (ఝంపతాళం); వరదరాజముపాస్మహే ~ వనజాసనాదిపూజితం ॥వరదరాజముపాస్మహే॥ (రూపకతాళం)” అనే కృతులను విరచించేరు.
కల్యాణిరాగజన్యమైన మరొక సుందరరాగం “యమునాకల్యాణి (ఉత్తరభారత సంగీతంలో యమన్ కల్యాణ్) రాగం”. యమునాకల్యాణిరాగం సంపూర్ణ-సంపూర్ణ ఉభయవక్ర రాగం. ఈ రాగంలో ప్రతిమధ్యమంతోబాటు, శుద్ధమధ్యమ ప్రయోగం కూడా ఉంటుంది. ఈ అన్యస్వరప్రయోగం వలన ఇది భాషాంగరాగంగా చెప్పబడుతుంది.
త్యాగయ్యగారు యమునాకల్యాణిరాగంలో — “నారాయణ! హరి నారాయణ! హరి ~ నారాయణ! హరి నారాయణ! హరి ॥నారాయణ!॥ (ఆదితాళం); రామ! రామ! రామ! మాం పాహి ~ రామ! రామ! మాం పాహి శ్రీ ॥రామ! రామ!॥ (ఆదితాళం); విధి శక్రాదులకు దొరకునా? ~ ఇటువంటి సన్నిధి వేడుక జూతాము రారే! ॥విధి శక్రాదులకు – – -॥ (రూపకతాళం); సాగరుండు వెడలెనిదో ~ సారెకు గనరారె! ॥సాగరుండు – – -॥ (రూపకతాళం); హరిదాసులు వెడలె ముచ్చటగని ~ ఆనందమాయె దయాళో! ॥హరిదాసులు వెడలె॥ (ఆదితాళం)” అనే సొగసైన కృతులను విరచించి, మనందరికి పంచేరు.
దీక్షితస్వామి యమునాకల్యాణిరాగంలో — “జంబూపతే! మాం పాహి ని-జానందామృతబోధం దేహి ॥జంబూపతే!॥ (రూపకతాళం); నందగోపాల! ముకుంద! గోకుల ~ నందన! యమునాతీర విహార! ॥నందగోపాల!॥ (ఆదితాళం); పరమశివాత్మజం నమామి సతతం ~ పాలితభక్తం సదా భజేsహం ॥పరమశివాత్మజం॥ (ఆదితాళం)” అనే మహనీయమైన కృతులను కూర్పు చేసేరు.
కల్యాణిరాగజన్యమైన మరొక సుకుమారరాగం “హ(అ)మీరుకల్యాణి (రాగ్ హమీర్) రాగం”. ఇదికూడా ఉభయవక్ర సంపూర్ణ-సంపూర్ణ రాగమే! హ(అ)మీరు కల్యాణిరాగంలో కూడా ప్రతిమధ్యమంతోబాటు, శుద్ధమధ్యమంకూడా ప్రయోగించబడడం గమనార్హం. అందువలన అమీరుకల్యాణిరాగం భాషాంగరాగంగా గుర్తించబడుతూంది.
త్యాగయ్యగారు హమీరుకల్యాణిరాగంలో — “నీ దాసానుదాసుడనని పేరే! ~ ఏమిఫలము? ॥నీ దాసానుదాసుడనని పేరే!॥ (దేశాదితాళం); మానము లేదా? ~ తనవాడని అభి-॥మానము లేదా?॥ (ఆదితాళం)” అనే రెండు అసామాన్యమైన అందాలు చిందుతూ వ్యాజనిందాసౌందర్యం విశదంచేసే కృతులను విరచించేరు.
దీక్షితస్వామి హమీర్ కల్యాణి రాగంలో — “పరిమళ రంగనాథం భజేsహం వీరనుతం ~ పరిపాలిత భక్తం పుండరీక వల్లీనాథం ॥పరిమళరంగనాథం॥ (రూపకతాళం); పరిమళరంగనాథం భజేsహం వీరనుతం ~ పరిపాలితభక్తం పుండరీకవల్లీనాథం ॥పరిమళరంగనాథం॥ (రూపకతాళం) {సూచన:— దీక్షితులవారు హమీర్ కల్యాణిరాగంలో ఒకే పల్లవి, తాళం లో విభిన్న చరణాలు కలిగిన రెండు కృతులను రచించేరు); పురహరనందన! రిపుకులభంజన! ~ శిఖీంద్రవాహన! మహేంద్రపాలన! ॥పురహరనందన!॥ (ఆదితాళం)” అనే కృతులను వెలయింపజేసేరు.
త్యాగయ్యగారు 65వ మేళకర్త/జనకరాగం ఐన (మేచ)కల్యాణి రాగజన్యంగా పేర్కొనబడిన ఔడవ-ఔడవ (“రి-ధ” వర్జితస్వరాలు) రాగం “అమృతవర్షిణిరాగం”, ఆదితాళం లో — “సరసీరుహనయనే! సరసిజాసనే! ~ శరదిందునిభవదనే! అంబ! ॥సరసీరుహనయనే!॥” అనే అందమైన కృతిని వెలయించేరు.
(సంగీతప్రపంచంలో సుప్రసిద్ధమైన “మోహనరాగం” కల్యాణిరాగజన్యంగా దీక్షితులవారి పద్ధతియందు పరిగణింపబడుతూంది. కాని ఆధునిక దక్షిణభారత సంగీతశాస్త్ర కోవిదులు మోహనరాగాన్ని, 28వ మేళకర్త అయిన “హరికాంభోజిరాగం” లోకి వర్గీకరించడం జరిగింది. అందువలన హరికాంభోజిరాగజన్యంగా మోహనరాగాన్ని పరిగణించి ఆ సందర్భంలో దీక్షితులవారి మోహనరాగకృతులని ఉదహరించడం జరిగాంది. అందువల్ల వాటిని మరల ఇక్కడ ప్రస్తావించడం పునరుక్తి కనుక అలాగ చేయడంలేదని మనవి.)
పదకొండువదైన “రుద్రచక్రం” లోని చివరి జనకరాగం, అంటే 66వ మేళకర్త “చిత్రాంబరిరాగం”, (దీక్షితులవారి పద్ధతిలో “చతురంగిణిరాగం”) గురించి ఇప్పుడు పరిచయం చేసుకుంటే ఈ చక్రం పూర్తి ఐపోతుంది. చిత్రాంబరిరాగంలో “రి-గు-ధు-ను” అనే నిర్ణాయక స్వరసంపుటి ఉంటుంది. సంపూర్ణ-సంపూర్ణ రాగమైన చిత్రాంబరిరాగంలో ఈ దిగువ ఉదహరించబడిన విధంగా స్వరానుక్రమణిక ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—షచ్ఛ్రుతి ధ—కాకలి ని—తారా స.
చిత్రాంబరిరాగం అప్రచలిత రాగం. దీనిలో త్యాగయ్యగారి కృతులు లభ్యం కావడంలేదు.
దీక్షితులవారు “చతురంగిణిరాగం” లో — “ఏకామ్రనాథేశ్వరేణ ~ సంరక్షితోsహం శ్రీ ॥ఏకామ్రనాథేశ్వరేణ॥ (ఆదితాళం); గురుగుహ భవాంతరంగిణీం ~ చతురంగిణీం విచింతయేsహం ॥గురుగుహ – – -॥ (మిశ్రచాపుతాళం)” అనే కృతులను రచించేరు.
చతురంగిణిరాగజన్యమైన “అమృతవర్షిణిరాగం” ఔడవ-ఔడవ (“రి-ధ” వర్జిత స్వరాలు) రాగమై ఉంది. అమృతవర్షిణిరాగంలో సుప్రసిద్ధమైన కృతి “ఆందామృతాకర్షిణి! ~ అమృతవర్షిణి! హరాదిపూజితే! శివే! భవాని! ॥ఆనందామృతాకర్షిణి!॥ (ఆదితాళం)” మాత్రమేకాక, “హిమగిరికుమారి! ఈశప్రియకరి! ~ హేమాంబరి! పాహి మాం ఈశ్వరి! ॥హిమగిరికుమారి!॥ (ఆదితాళం)” అనే మరొక మహిమాన్వితకృతిని కూడా కూర్చేరు.
ఇంతటితో రుద్రచక్రం పూర్తి అయ్యింది.
(సశేషం)