సంగీతం—నాదవేదం—68
16—10—2021; శనివారము.
ॐ
65వ మేళకర్త “మేచకల్యాణిరాగం”. రాగాలకి అన్నింటికీ రారాణి అయిన కల్యాణిరాగం ఈ రాగ జన్యమే! రాగాలకన్నింటికీ రారాజు “29వ మేళకర్త జన్యరాగమైన శంకరాభరణరాగం”, (శుద్ధమధ్యమరాగం) ఐతే, ఆ రాగానికి ప్రతిమధ్రమరాగమైన (29+36=65వ మేళకర్త—మేచకల్యాణి) కల్యాణిరాగం రారాణి కావడం సంగీతపరమైన అర్ధనారీశ్వరస్వరూపం అని చెప్పవచ్చు. శ్రీవిద్యోపాసకులకి పీయూషప్రాయమైన శ్రీలలితాత్రిశతీస్తోత్రం “కకారరూపా! కల్యాణీ!” అని కల్యాణిరాగాన్ని స్వయంగా శ్రీలలితామహాత్రిపురసుందరి స్వరూపంగానే ప్రస్తావించడం సంగీతవిద్యోపాసకులకి మహామంత్రోపదేశంగా శిరోధార్యమై విలసిల్లడం గమనార్హం!
కల్యాణిరాగలక్షణప్రతిపాద్యమైన స్వర సంపుటి “రి-గు-ధి-ను” గా గ్రహించాలి. సంపూర్ణ-సంపూర్ణ రాగమైన కల్యాణిరాగ నిర్వచనాత్మక స్వరవిన్యాసవిలాసం ఈ విధంగా ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.
త్యాగరాజస్వామివారు కల్యాణిరాగంలో — “అమ్మ! రావమ్మ! తుల – సమ్మ! నను పాలింప ~ వమ్మ! సతతము పదము – లే నమ్మినానమ్మ! ॥అమ్మ! రావమ్మ!॥ (ఖండచాపుతాళం); ఈశ! పాహి మాం జగ ॥దీశ! పాహి మాం॥ (రూపకతాళం); ఎందుకో నీ మనసు కరుగదు! ~ యేమి నేరమో? తెలియ ॥ఎందుకో నీ మనసు॥ (ఆదితాళం); ఏ తావున రా? నిలకడ నీకు! ~ ఎంచి చూడ నగపడవు ఓ రామ! ॥ఏ తావున రా!॥ (ఆదితాళం); ఏ వరమడుగుదు రా? ~ శ్రీరామ! నిన్ ॥నే వరమడుగుదు రా?॥ (రూపకతాళం); కమలభవుడు వెడలె కనుగొనరే! ॥కమలభవుడు – – -॥ (మిశ్రచాపుతాళం); కారు వేల్పులు నీకు సరి ॥కారు వేల్పులు॥ (ఆదితాళం); నమ్మి వచ్చిన నన్ను ~ నయముగ బ్రోవవే! ॥నమ్మి వచ్చిన నన్ను॥ (రూపకతాళం); నిధి చాల సుఖమా? రాముని సన్ ~ న్నిధి సేవ సుఖమా? నిజముగ బల్కు మనసా! ॥నిధి చాల సుఖమా?॥ (మిశ్రచాపుతాళం); నిన్నన వలసినదేమి? రామ! ~ నన్ననవలె గాక! ॥నిన్నన వలసినదేమి? రామ!॥ (మిశ్రచాపుతాళం); భజన సేయవే! మనసా! ~ పరమ భక్తితో ॥భజన సేయవే మనసా!॥ (రూపకతాళం); భజ రే! రఘువీరం శర భరిత దశరథకుమారం ॥భజ రే! రఘువీరం॥ (ఆదితాళం); రామ! నీవాదుకొందువో! కొనవో! ~ తొలి మా నోము ఫలము ఎటులదో? ॥రామ!॥ (ఆదితాళం – త్రిస్రగతి); రామ! రామ! రామ! నాపై నీ దయ ~ రాకయుండవచ్చునా? ఓ రామ! ॥రామ!॥ (మిశ్రచాపుతాళం); వచ్చును హరి నిన్ను జూడ-వచ్చును హరి నిన్ను జూచి ~ మెచ్చును హరి నిన్ను జూచి ॥వచ్చును॥ (ఆదితాళం); వాసుదేవయని వెడలిన యీ దౌ ~ వారికుని గనరే! ॥వాసుదేవయని॥ (ఆదితాళం); శివే! పాహి మాం అంబికే! ~ శ్రితఫలదాయకి! ॥శివే! పాహి మాం॥ (ఆదితాళం); సందేహము యేలరా? నా ~ సామి! నాపై నీకు ॥సందేహము యేలరా?॥ (రూపకతాళం); సుందరి! నీ దివ్య రూపమును ~ జూడ తనకు దొరికెనమ్మ! ఓ మహాత్రిపుర ॥సుందరి!॥ (ఆదితాళం)” అనే సుందర కృతులను సమకూర్చేరు.
దీక్షితస్వామివారు కల్యాణిరాగంలో — “అభయాంబా జగదంబా రక్షతు ~ ఆత్మరూప ప్రతిబింబా మదంబా ॥అభయాంబా॥ (ఆదితాళం); భజ రే! రే! చిత్త! బాలాంబికాం ~ భజ రే! రే! చిత్త! భక్తకల్పలతికాం ॥భజ! రే!॥ (మిశ్రచాపుతాళం); బ్రహ్మవిద్యాంబికే! శ్రీశ్వేతారణ్యేశ నాయికే! ~ శ్రీశివే! సంరక్ష! మాం శ్రీ ॥బ్రహ్మవిద్యాంబికే!॥ (ఆదితాళం); జ్ఞానప్రసూనాంబికే! ~ మామవ జగదంబికే! ॥జ్ణానప్రసూనాంబికే!॥ (రూపకతాళం); కమలాంబాం భజ ! రే! మానస! ~ కల్పితమాయాకార్యం త్యజ! రే! ॥కమలాంబాం॥ (ఆదితాళం); కామాక్షీం కల్యాణీం ~ భజేsహం! భజే! ॥కామాక్షీం॥ (రూపకతాళం); కుంభేశ్వరాయ నమస్తే శ్రీ ~ మంగళాంబాసమేతాయ నమస్తే నమస్తే ॥కుంభేశ్వరాయ॥ (మిశ్రచాపుతాళం); కుంభేశ్వరేణ సంరక్షితోsహం ~ కుంభజాది మునిపుంగవ వరేణ ॥కుంభేశ్వరేణ॥ (ఆదితాళం); శివకామేశ్వరీం చింతయేsహం ~ శృంగార రస సంపూర్ణకరీం ॥శివకామేశ్వరీం॥ (ఆదితాళం); శ్రీమధురాంబికే! శ్రీశివే! అవావ! ॥శ్రీమధురాంబికే!॥ (ఖండచాపు తాళం); శ్రీమంగళాంబికే! శ్రీవాంఛీశనాయికే! ~ చింతితార్థదాయికే! శ్రీశివే! సంరక్ష! మాం ॥శ్రీమంగళాంబికే!॥ (త్రిపుటతాళం)” అనే వివిధ విశేష కృతులను రచించేరు.
శ్యామాస్త్రివరేణ్యులు కల్యాణిరాగంలో — “బిరాన వరాలిచ్చి బ్రో-వుము నిను నెర నమ్మితి ॥బిరాన॥ (రూపకతాళం); దేవీ! నన్ను బ్రోవవమ్మా! ఇపు-డే మంచి సమయమమ్మా! ॥దేవీ!॥ (ఝంపతాళం); హిమాద్రిసుతే! పాహి మాం ~ వరదే! పరదేవతే! ॥హిమాద్రిసుతే!॥ (రూపకతాళం); పరాఙ్ముఖమేనమ్మా? ~ పార్వతియమ్మా! (తమిళంలో) ॥పరాఙ్ముఖమేనమ్మా?॥ (త్రిపుటతాళం); రావే! పర్వతరాజకుమారీ! ~ దేవీ! నన్ను బ్రోచుటకు వే వేగమే ॥రావే! – – -॥ (ఝంపతాళం); శంకరి! శంకరి! కరుణాకరి! రాజరాజేశ్వరి! ~ సుందరి! పరాత్పరి! గౌరి! అంబ! ॥శంకరి!॥ (అటతాళం); శ్రీకామాక్షీ! కావవే నను కరుణాకటాక్షి! ~ శ్రీకాంతిమతీ! శ్రీకాంచీపురవాసిని! ॥శ్రీకామాక్షీ!॥ (ఆదితాళం); తల్లి! నిన్ను నెర ~ నమ్మినాను వినవే! ॥తల్లి!॥ (మిశ్రచాపుతాళం)” అనే వివిధ కృతులని, “నీవే గతియని నెరనమ్మినాను జగదంబా! ~ నీవనాథరక్షకి మాయమ్మా! ॥నీవే గతియని॥ (త్రిస్రమఠ్యతాళం)” అనే ఒక వర్ణాన్ని రచించి సంగీతప్రపంచాన్ని అలంకరించేరు.
(సశేషము)