సంగీతం—నాదవేదం—67
09—10—2021; శనివారము.
ॐ
ఇప్పుడు ఏకాదశ (పదకొండవ) చక్రమైన “రుద్రచక్రం” లోని ఆరు రాగాల పరిచయం చేసుకుందాం! రుద్రచక్రంలోని ఆరురాగాలు “రి-గు” స్వరాల సామాన్య లక్షణం కలిగి ఉంటాయి. ఈ చక్రంలో మొదటి మేళకర్త రాగం, అంటే, మొత్తంమీద 61వ జనకరాగం పేరు: “కాంతామణిరాగం”. (దీనిని దీక్షితులవారి పద్ధతిలో “కుంతలరాగం” అంటారు). కాంతామణిరాగంలో “రి-గు-ధ-న” స్వరాలు ఉంటాయి. ఇప్పుడు కాంతామణిరాగంలో ఉండే స్వరప్రణాళికని పరిశీలిద్దాం:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—శుద్ధ ని—తారా స.
త్యాగయ్యగారు కాంతామణిరాగం, దేశాదితాళం లో — “పాలింతువో! పాలింపవో! ~ బాగైన బల్కు బల్కి నను ॥పాలింతువో! పాలింపవో!॥” అనే భక్తిభావగర్భితమైన కృతిని రచించేరు. 61వ మేళకర్త జన్యమైన “శ్రుతిరంజనిరాగం” యొక్క ఆరోహణ ~ అవరోహణ కాంతామణిరాగ ఆరోహణ ~ అవరోహణలని పోలి ఉంటాయి. అందువలన శ్రుతిరంజనిరాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. త్యాగయ్యగారు శ్రుతిరంజనిరాగం, దేశాదితాళం లో — “ఏ దారి సంచరింతు రా? ~ యిక బల్క రా! ॥ఏ దారి సంచరింతు రా?॥” అనే ఒక కృతిని కూర్చేరు.
దీక్షితులవారి పద్ధతిలో 61వ మేళకర్త పేరు “కుంతల(ం) రాగం”. కుంతలరాగం, రూపకతాళం లో దీక్షితస్వామి —”శ్రీసుగంధికుంతలాంబికే! జగదంబికే! ~ హృది చింతయేsహమనిశం త్వామ్ ॥శ్రీసుగంధకుంతలాంబికే!॥” అనే ఏకైక కృతిని రచించేరు.
62వ మేళకర్త అయిన “రిషభప్రియరాగం” లో ఉండే కీలకమైన స్వరాల సముదాయం “రి-గు-ధ-ని” గా గ్రహించాలి. రిషభప్రియరాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం (దీనిని దీక్షితులవారి పద్ధతిలో “రతిప్రియరాగం” అంటారు). రిషభప్రియరాగంలో స్వరవిన్యాసం ఈ దిగువ ఉదహరించిన కూర్పులో ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కైశికి ని—తారా స.
త్యాగయ్యగారు రిషభప్రియరాగం, దేశాదితాళం లో — “మహిమదక్కించుకోవయ్య! ~ మహిని సత్యస్వరూపుడను మహరాజ రాజేశ్వర! నీ ॥మహిమ – – -॥” అనే ఒక కృతిని రచించేరు.
రతిప్రియరాగం కూడా సంపూర్ణ-సంపూర్ణ రాగమే! దీక్షితస్వామి రతిప్రియరాగం, ఆదితాళం లో — “మారరతిప్రియం భక్తప్రియం ~ మంగళదేవతేశం భావయే ॥మారరతిప్రియం॥” అనే కృతిని రచించేరు.
63వ మేళకర్త ఐన “లతాంగిరాగం” యొక్క లక్షణస్వరసంపుటి “రి-గు-ధ-ను”. (దీనిని దీక్షితులవారి పద్ధతిలో “గీతప్రియరాగం” అంటారు). లతాంగిరాగం సంపూర్ణ-సంపూర్ణ రాగం. ఈ రాగంలో ఈ దిగువ వివరించబడిన స్వరవిన్యాసం ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతరగ—ప్రతి మ—ప—శుద్ధ ధ—కాకలి ని—తారా స.
త్యాగరాజస్వామి లతాంగిరాగం, మిశ్రచాపుతాళం లో — “దినమే సుదినము ~ ఈశ్వరీ! నన్ను కృపజూడ ॥దినమే సుదినము॥” అనే ఒక కృతిని రచించేరు.
దీక్షితస్వామి గీతప్రియరాగం, త్రిపుటతాళం లో — “సాధుజనవినుతం గురుగుహం ~ సంగీతప్రియం భజేsహం ॥సాధుజనవినుతం॥” అనే కృతిని రచించేరు.
64వ మేళకర్త పేరు “వాచస్పతిరాగం”. (దీక్షితులవారి పద్ధతిలో “భూషావతిరాగం” ). వాచస్పతి రాగం లో “రి-గు-ధి-ని” కీలకమైన స్వరాలు. వాచస్పతి సంపూర్ణ-సంపూర్ణ రాగం. వాచస్పతిరాగ స్వరచాలనం ఈ దిగువ వివరించబడుతూంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—అంతర గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—తారా స.
త్యాగరాజస్వామి వాచస్పతిరాగం, దేశాదితాళం లో —”కంటజూడుమీ! ఒక పారి ~ క్రీ ॥గంటజూడుమీ!॥” అనే మనోరమమైన కృతిని వెలయింపజేసేరు.
దీక్షితస్వామి భూషావతిరాగంలో — “అభిరామీం అఖిలభువన ~ రక్షకీమాశ్రయే! ॥అభిరామీం॥ (రూపకతాళం); భూషాపతిం మంజు ~ భాషాపతిం భజేsహం ॥భూషాపతిం॥ (రూపకతాళం); భూషావతీం మంజు ~ భాషావతీం భజేsహం ॥భూషావతీం॥ (రూపకతాళం); పార్వతీశ్వరేణ రక్షితోsహం ~ పరమార్థతత్వ బోధిత శివేన ॥పార్వతీశ్వరేణ॥ (రూపకతాళం)” అనే నాలుగు కమనీయ కృతులను కూర్పు చేసేరు.
వాచస్పతిరాగజన్యమైన సరస్వతిరాగం (ఔడవ{“గ-ని” వర్జితస్వరాలు} ~ షాడవ{“గ” వర్జ్యం}) లో త్యాగయ్యగారు “అనురాగములేని ~ మనసునసుజ్ఞానము రాదు ॥అనురాగములేని – – -॥ (రూపకతాళం)” అనే కృతిని కూర్చేరు.
వాచస్పతిరాగజన్యమైన మరొక “షాడవ(“ని” వర్జ్యం) – సంపూర్ణ” రాగమైన “భూషావళిరాగం” లో, దేశాదితాళంలో, “తనమీదనే జెప్పుకొనవలె గా – కను నిన్నాడ పనిలేదురా! ॥తనమీదనే॥” అనే కృతిని రచించేరు.
(సశేషము)