సంగీతం—నాదవేదం—66
02—10—2021; శనివారము.
ॐ
58వ మేళకర్త పేరు “హేమవతిరాగం”. హేమవతిరాగం 22వ మేళకర్త అయిన (శుద్ధమధ్యమంతో కూడిన) ఖరహరప్రియరాగానికి, (శుద్ధమధ్యమ రహిత) ప్రతిమధ్యమ యుత రాగం అన్నమాట! ఈ హేమవతిరాగంలో “రి-గి-ధి-ని” స్వరాలు ఉంటాయి. “సంపూర్ణ-సంపూర్ణ” రాగమైన హేమవతి (దీక్షితులవారి పద్ధతిలో “దేశిసింహారవం రాగం) రాగంలోని స్వరచలనక్రమం ఈ దిగువ రీతిలో ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కైశికి ని—తారా స.
త్యాగయ్య గారు హేమవతిరాగం, ఆదితాళం లో — “నీ సరిసాటి ఎవ్వరు లేరనుచు ~నిరతము నే నీ పదముల దలచితి ॥నీ సరిసాటి॥” అనే ఒక మధురమైన కృతిని మలచేరు.
హేమవతిరాగజన్యమైన “షాడవ(నిషాదస్వర వర్జితం)—సంపూర్ణ” రాగమైన “హంసభ్రమరిరాగం” లో త్యాగయ్యగారు — “పరిపూర్ణకామ! సరిలేని వాడ! ~ దరిజూపవే గిరిరాజధర! ॥పరిపూర్ణకామ!॥ (దేశాదితాళం)” అనే ఒక కృతిని కూర్పు చేసేరు.
దీక్షితులవారి పద్ధతిలోని “దేశిసింహారవరాగం” యొక్క స్వరచలనాన్ని గురుముఖంగా నేర్చుకోవాలి. దీక్షితస్వామి దేశిసింహారవరాగంలో — “హరియువతీం హైమవతీం ఆరాధయామి సతతం ~ అఖిలలోక జననీం శ్రీ ॥హరియువతీం॥ (రూపకతాళం); మధురాంబికాయాం సదా ~ భక్తిం కరోమి శ్రీ ॥మధురాంబికాయాం॥ (రూపకతాళం); శ్రీకాంతిమతీం శంకరయువతీం ~ శ్రీగురుగుహ జననీం వందేsహం ॥ (ఆదితాళం)” అనే అద్భుతమైన దివ్యకృతులని తీర్చిదిద్దేరు.
59వ మేళకర్త పేరు “ధర్మవతిరాగం” (దీక్షితులవారి పద్ధతిలో “ధామవతిరాగం” అని అంటారు). ధర్మవతిరాగంలో “రి-గి-ధి-ను” స్వరాలు ఉంటాయి. ధర్మవతిరాగంలో స్వరచలనం ఈ దిగువ విధంగా ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—చతుశ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.ధర్మవతిరాగంలో త్యాగయ్యగారి కృతులు లభించడం లేదు.
ధర్మవతిరాగజన్యమైన రంజనిరాగం “ఔడవ-షాడవ” రాగం. ఆరోహణలో “ప-ని”, అవరోహణలో “ప” వర్జిత స్వరాలు. అవరోహణలో వక్రసంచారం ఉంటుంది. రంజనిరాగం, రూపకతాళం లో త్యాగయ్యగారు “దుర్మార్గచరాధములను ~ దొర! నీవనజాలరా! ॥దుర్మార్గచరాధములను॥” అనే ఒక కృతిని కూర్చేరు.
దీక్షితులవారి పద్ధతిలోని ధామవతిరాగంకూడా సంపూర్ణ-సంపూర్ణ రాగమే! ధామవతిరాగంలో దీక్షితస్వామి — “పరంధామవతీ జయతి ~ పార్వతీ పరమేశ యువతీ ॥పరంధామవతీ॥ (రూపకతాళం); రామచంద్రస్య దాసోsహం శ్రీ ~ సీతానానాయకస్య గురుగుహ హితస్య ॥రామచంద్రస్య॥ (ఆదితాళం)” అనే రెండు కృతులని రచించేరు.
60వ మేళకర్త పేరు “నీతిమతిరాగం”, (దీక్షితులవారి పద్ధతిలో దీనిని “నిషధ రాగం” అంటారు). నీతిమతిరాగంలో “రి-గి-ధు-ను” స్వరాలు ఉంటాయి. ఇది “సంపూర్ణ-సంపూర్ణ” రాగం. నీతిమతి రాగ స్వరచాలనవైఖరి ఈ దిగువ విధంగా ఉంటుంది:—
మంద్ర స—చతుశ్శ్రుతి రి—సాధారణ గ—ప్రతి మ—ప—షట్ శ్శ్రుతి ధ—కాకలి ని—తారా స.
నీతిమతిరాగంలో త్యాగయ్యగారి కృతులు లభించడంలేదు. నీతిమతిరాగజన్యమైన కైకవశిరాగం, “సంపూర్ణ-షాడవ” రాగం. అవరోహణలో “ధ” వర్జితస్వరం. కైకవశిరాగం, దేశాదితాళం లో త్యాగయ్యగారు “వాచామగోచరమే మనసా! ~ వర్ణింప తరమే? రామ! మహిమ ॥వాచామగోచరమే॥” అనే కుృతిని రచించేరు. మరొక నీతిమతిజన్యరాగమైన “హంసనాదం రాగం” ఔడవ-ఔడవ రాగం. హంసనాదరాగంలోని ఆరోహణ-అవరోహణలలో “గ-ధ” స్వరాలు వర్జితమై ఉంటాయి. హంసనాదరాగం, దేశాదితాళం లో త్యాగరాజస్వామి సుప్రసిద్ధమైన తమ ఉత్తమకృతి ఒకటి ఐన “బంటురీతి కొలు-వీయవయ్య రామ! ॥బంటురీతి – – -॥” అనే కృతిని రసికజనులకి శ్రవణానందకరంగా ఉండేవిధంగా రచించి, ప్రసాదించేరు.
దీక్షితులవారి పద్ధతిలోని నిషధరాగం “సంపూర్ణ – షాడవ (ధైవతస్వరం వర్జితం)”, మిశ్రచాపుతాళం లో “నిషధాది దేశాధిపతినుత ~ నీలకంఠేశ! పాలయ మాం ॥నిషధాది – – -॥” అనే కృతిని కూర్చేరు.
దీనితో దశమ (పదవ) చక్రమైన దిక్చక్ర రాగాల పరిచయం పూర్తి చేసుకోవడం జరిగింది.
(సశేషము)